4, మార్చి 2011, శుక్రవారం
మల్లెపువ్వంటే భయపడుతున్న చైనా
Categories :
ప్రపంచంలోనే మహాశక్తి చైనా. ఆర్థికంగా, సైనికంగా అన్నిదేశాల్లోకి బలమైన దేశంగా ఎదిగింది చైనా. చెప్పాలంటే.. ప్రపంచ పోలీస్ అమెరికాను ఎదిరించి నిలువగల శక్తి ఒక్క చైనాకు మాత్రమే ఉంది. కానీ.. ఈ కమ్యూనిస్ట్ రాజ్యం కూడా ఇప్పుడు ఓ దానికి భయపడుతోంది. తమ ప్రభుత్వానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని కలవరపడుతోంది.. అదే మల్లెపువ్వు.. అసలీ మల్లెపువ్వు ఏమిటి..? దానివెనుకున్న స్టోరీ ఏమిటి?
అరుణదేశం భయపడుతోంది... నిజమే.. మంచుకురుస్తున్న కాలంలోనూ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. బలీయమైన సైనికశక్తి .. అమేయమైన సాయుధ సంపత్తి ఉన్నప్పటికీ, వచ్చి పడేముప్పును ఎలా ఎదుర్కోవాలో.. చైనా ప్రభుత్వానికి అర్థం కావడం లేదు.. ఇంతకాలం సాగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి గండిపడేలా ఉంది. చైనాకు ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.. అగ్రరాజ్యం అమెరికా కాదు. చైనాలోని కొన్ని ప్రావిన్స్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఛాందసవాదులూ కాదు. పోనీ.. ఐటీ, ఇతర రంగాల్లో పోటీ ఇస్తున్న మనదేశమూ కాదు.. మరి.. చైనాను భయపెడుతోంది ఎవరు..? చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది ఎవరు..?
చైనా భయానికి కారణం.. మనుషులూ కాదు... దేశాలు కాదు.. జీవం లేని ఇంటర్నెట్. అవును, ఆ ఇంటర్నెట్టే ఇప్పుడు చైనా సర్కార్‌కు ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టబోతోంది. చైనా ప్రభుత్వాన్ని కంగారు పెడుతోంది. జనంపై ఆంక్షలు విధించేలా చేస్తోంది.. ముఖ్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను తలుచుకుంటేనే చైనా పాలకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు.. ఎక్కడ ఊతమిస్తాయో అన్నభయం చైనాది. పైగా, నెట్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశం.. చైనాలో చాలా పట్టణాల్లో జనాన్ని రోడ్లపైకి తెచ్చింది. వారి చేతుల్లో గన్నులు లేవు.. రాడ్స్ లేవు.. కనీసం కర్రలు కూడా లేవు. వారి చేతుల్లో ఉన్నదల్లా ఓ మొక్కమాత్రమే. అదీ మల్లె మొక్క. సువాసనలు వెదజల్లే ఆ మల్లె.. చైనా ప్రభుత్వానికి మాత్రం తలనొప్పిని తెచ్చింది.
ఇంటర్నెట్‌లో ఎవరో ఇచ్చిన పిలుపు... వేలాది మందిని కదిలించింది. ప్రభుత్వ నిర్భంధం ఎక్కువగా ఉన్నప్పటికీ నిరసనలకు దిగేలా చేసింది. ఉద్యమం బాట పట్టిన వారందరినీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి మరీ జైళ్లలో పడేశారు. మల్లెమొక్క పట్టుకున్నా.. మల్లెమొగ్గలతో కనిపించినా అరెస్ట్ చేసి పడేస్తున్నారు.
ప్రతీ చోటా చైనా ప్రభుత్వం నిఘాను పెంచేసింది. ఇంటర్నెట్ వాడుతున్నవారిని నిశితంగా గమనిస్తోంది..? ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తోంది. మల్లెపూలను, మల్లెమొక్కలనూ కనిపించకుండా చేస్తోంది.. ఈ ఇంటర్నెట్‌కు.. మల్లెపూలకు.. చైనా ప్రభుత్వానికి మధ్య సాగుతున్న వ్యవహారం ఏమిటి? చైనా ప్రభుత్వం ఇంతగా ఎందుకు భయపడుతోంది... ? అసలు అంతగా భయపడాల్సిన అవసరం ఉందా..?
మల్లెపువ్వు ముప్పు
మల్లెపూవు ముప్పు నుంచి తప్పించుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఈ మల్లెపూవు గురించి చైనా ఇంతగా భయపడడానికి కారణం.. అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవమే. టునీషియాలో మొదలై.. ఇతర దేశాలకు పాకిన ఈ విప్లవానికి పెట్టిన పేరే.. జాస్మిన్ రెవల్యూషన్. అది చైనాకు కూడా ఎక్కడ వ్యాపిస్తుందో అన్నది అక్కడి పాలకుల భయం. అందుకే.. దాన్ని మొగ్గలోనే తుడిమేయాలనుకుంటున్నారు. ఆందోళన చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జాస్మిన్ రెవల్యూషన్ అన్న పేరే చైనీయులకు వినపించకుండా చేస్తోంది హ్యూజింటావో ప్రభుత్వం. ఇంటర్నెట్‌పై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. జాస్మిన్ రెవల్యూషన్ అని సెర్చ్ చేస్తే ఒక్క రిజల్ట్ కూడా రాకుండా చేసింది. దీంతో పాటు విప్లవం చెలరేగిన ట్యునీషియా, ఈజిప్ట్ లాంటి పదాలతో సెర్చ్ చేసినా, రిజల్ట్స్‌ను చూపించకుండా సెన్సార్ చేస్తోంది. ఇక తిరుగుబాటుకు సిద్ధం కమ్మంటూ చైనీయులకు పిలుపిచ్చిన బోక్సన్ న్యూస్ సైట్‌ను కూడా బ్లాక్ చేసింది. చైనాలో ప్రజాపోరాటం గురించి ముందుగా ప్రపంచానికి ఈ సైటే ఫోటోలను అందించింది. దీన్ని బ్లాక్ చేసి ఎవరికీ సమాచారం అందకుండా చేసింది చైనా ప్రభుత్వం.
మోస్ట్ పాపులర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్‌ను చైనా వాసులకు ఇప్పటికే అందుబాటులో లేకుండా చేశారు కమ్యూనిస్ట్ పాలకులు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న లింక్‌డ్‌ఇన్ సర్వీస్‌నూ ఎత్తేసింది. ఇందులో జాస్మిన్ వాయిస్ అంటూ ఓ గ్రూప్ ప్రారంభం కావడమే కారణం. ఇక రెవల్యూషన్‌కు రెడీ కమ్మంటూ పోస్ట్ చేస్తున్న వారిపైనా కొరడా ఝలిపిస్తోంది.
ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఆన్‌లైన్ అస్త్రాన్నే ప్రయోగించారు చైనా పాలకులు. ఒకవేళ చైనాలో ఉద్యమం జరిగితే, అది నెటిజన్ల నుంచే మొదలుకావచ్చని భావిస్తున్న సర్కార్, వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చైనా ప్రధాని వెన్ జియబావో ఆన్‌లైన్‌లో చాట్ చేశారు. చైనా న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన ఆన్‌లైన్ ఫోరంలో రెండుగంటల పాటు పాల్గొన్నారు. దాదాపు ఆరువేల ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తే.. వాటిలోనుంచి 20 ప్రశ్నలను మాత్రం ఎన్నుకొని సమాధానం చెప్పారు. నిత్యావసర ధరల నియంత్రణ, రియల్‌ఎస్టేట్ ధరలకు కళ్లెం వేయడం... ఉద్యోగావకాశాలను మెరుగు పరచడం వంటి అంశాలకే జియబావో పరిమితమయ్యారు. మార్చి 5నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. అయితే.. విప్లవం, తిరుగుబాట్లు, అరబ్‌దేశాల్లో ఉద్యమాలపై మాత్రం ఆయన స్పందించలేదు. వీలైనంతవరకూ ప్రభుత్వం ప్రజలకు మేలైన పాలన అందిస్తుందన్న సంకేతాలనే అందించడానికి జియబావో ప్రయత్నించారు.
ప్రభుత్వ విధానాలపైనా, ప్రభుత్వ పథకాలపైనా ఏమైనా అనుమానాలున్నా, ఫిర్యాదులున్నా చెప్పడానికి ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ ఫోరంను కూడా ఏర్పాటు చేస్తామని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ఇంతలా చైనా ప్రభుత్వం ప్రవర్తించలేదు. ఎవరైనా ఆందోళన చేస్తే వారిని అణిచివేయాలనే చూసిందే తప్ప.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించలేదు. కానీ.. E-ఉద్యమం దెబ్బకు కరడుగట్టిన చైనా పాలకులకూ మనసుమార్చుకోక తప్పలేదు. మొత్తానికి ఆన్‌లైన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్‌నే ఎంచుకుంది చైనా సర్కార్.
చైనాకు భయమెందుకు?
ఎంత పెద్ద పామైనా... చలిచీమల చేతిలో చావాల్సిందే. అరబ్ దేశాల్లో జరుగుతున్నది ఇదే. అధికారం గుప్పిట పెట్టుకుని, సైన్యం అండతో నిరంకుశాన్ని, రాజరికాన్ని కలగలపి దశాబ్దాలుగా దేశాలను ఏలుతున్న నియంతలకు అంతిమగడియలు వచ్చేశాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో అధికారపీఠాలు కూలిపోయాయి. టునీషియా అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే, ఈజిప్ట్ అధ్యక్షుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక లిబియాలో నాలుగుదశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న గడాఫీకి అంతిమ గడియలు సమీపించాయి. జనోద్యమం దాటికి కరడుగట్టిన నియంతలు తలవంచక తప్పడం లేదు.
దశాబ్దాలుగా నియంతృత్వాన్ని అనుభవిస్తున్నా, ప్రజా హక్కులను పాలకులు కాలరాసినా నోరుమెదపని అరబ్ దేశాల ప్రజల్లో ఇంత చైతన్యం ఎలా వచ్చింది.? బతికుంటే చాలనుకుని జీవితాలను వెళ్లదీస్తున్నవారికి.. నియంతలనే ఎదిరించే సాహసం ఎక్కడినుంచి వచ్చింది.? తమను ఇంతకాలం పట్టిపీడించిన చీడపురుగులను తరిమికొట్టాలన్న తలంపు ఎలా కలిగింది..? దీనికంతటికీ కారణం.. ఇంటర్నెట్. అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవానికి కారణం ఇంటర్నెట్. ఎంతో విలువైన టైంను హరించివేస్తున్నాయని అపనిందమోస్తున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లే... నియంతల కాళ్లకింద నలుగుతున్న ప్రజలకు ఊపిరి అందించాయి. నియంతృత్వపు సంకెళ్లను తెంపి.. స్వేచ్ఛావాయువులను పీల్చేలా చేశాయి. ఓ ఫేస్‌బుక్.. మరో ట్విట్టర్.. ఇంకో యూట్యూబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. జాస్మిన్ రివెల్యూషన్‌కు ప్రతీ నెట్‌వర్కింగ్ సైట్ ఎంతో కొంత సాయం చేసింది.
ఇది ఒక్కరోజులో చోటుచేసుకున్న సంఘటన కాదు. ఇంతటి ఉద్యమానికి కారణం డిసెంబర్ 17న టునీషియాలో జరిగిన సంఘటన. వీధుల్లో పళ్లమ్ముకుంటూ జీవించే, మహమ్మద్ బౌజిజి అనే 26 ఏళ్ల యువకుడిని మున్సిపల్ మహిళా అధికారి తీవ్రంగా దూషించింది. మొహంపై ఉమ్మేసింది. ఫైన్ కడతానన్నా ఊరుకోకుండా అవమానించింది. దీన్ని తట్టుకోలేక.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు బౌజిజి. ఈ విషయం వెంటనే ఆన్‌లైన్‌లోకి చేరిపోయింది. ట్విట్టర్‌లో ట్వీట్స్ మొదలయ్యాయి. సిద్దిబుజిది అనే ట్యాగ్‌తో ఇవి దర్శనమిచ్చాయి. అధికారుల దౌర్జనాన్ని ఈ ట్వీట్స్ ఎండగట్టాయి.
వందలాది ఫోటోలు, వీడియోలు.. ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు.. పోలీసుల ఫైరింగ్.. ఒక్కటేమిటి టునీషియాలో ఏమి జరిగినా.. నెట్‌లోకి ఎక్కేసింది. ప్రతీ చిన్న విషయం నెట్ ద్వారా అందరికీ చేరిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వీటిని చూస్తున్న వారు.. ఆందోళనకారులకు మద్దతుగా ట్వీట్స్, మెసేజెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రపంచ మీడియా కూడా టునీషియా పరిణామాలను తెలుసుకోవడానికి.. పూర్తిగా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్‌పైనే ఆధారపడిందంటే.. ఇవి ఎంత క్రియాశీల పాత్ర పోషించాయో అర్థం చేసుకోవచ్చు.
టునీషియా ప్రభుత్వం ఈ సమయంలో చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో... అనానిమస్ పేరుతో ఆందోళనకారులు ట్వీట్స్‌ను మొదలుపెట్టారు. అంతేకాదు.. ఆపరేషన్ టునీషియా పేరుతో వీరు తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రెసిడెంట్, మినిస్టర్స్, స్టాక్ మార్కెట్ వెబ్‌సైట్స్‌ను స్తంభింపచేశారు. సైబర్‌వార్ సర్వైవల్ గైడ్‌ను అందిరికీ అందుబాటులోకి తెచ్చారు. ఉద్యమం ఎలా చేయాలో సలహాలను నెట్‌లో పెట్టారు. వీటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. చివరకు విజయం విప్లవకారులను వరించింది. టునీషియాలో ప్రజాప్రభుత్వానికి మార్గం సుగమమయ్యింది. అప్పటివరకూ అధికారాన్ని అనుభవించిన బెన్ అలీ దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది.
టునీషియా విప్లవ ఫలితం ఈజిప్ట్ వాసులను మేల్కొలిపింది. ఇతర అరబ్ దేశాలకు స్పూర్తిగా నిలిచింది. ఈజిప్ట్‌లో ముబారక్ పాలనను నిరసిస్తూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కామెంట్లు మొదలయ్యాయి. ఈజిప్ట్‌లోనూ తిరుగుబాటు చేయాల్సిందేనంటూ పిలుపు మొదల్యయింది. జనవరి 25న ఈజిప్ట్‌లో పోరాటం మొదలయ్యింది. శాంతియుతంగా చేసిన ధర్నాపై పోలీసుల అరాచకత్వాన్ని ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి చూపించింది. వీడియోలు నెట్‌లోకి ఎక్కాయి. కామెంట్లు వెబ్‌సైట్లలో కనిపించాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ అన్నింటిపైనా ముబారక్ నిషేధం విధించాడు. కానీ, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
పోరాటానికే సిద్దమైన వారు.. ట్విట్టర్‌ను యాక్సెస్ చేయడానికి మారుమార్గాలను వెతికి ప్టటుకున్నారు. ప్రోక్సీలను సంపాదించి.. వాటి ద్వారా ట్విట్టర్‌ను యాక్సెస్ చేశారు. ట్వీట్స్‌ను పంపించారు. తెలియనివారికోసం లింకులనూ నెట్‌లో ఉంచారు. దీంతో, సైట్‌లను బ్యాన్‌చేసినా, సందేశాలు మాత్రం జనంలోకి వెళ్లిపోయాయి..
ఈజిప్ట్‌లోనూ ప్రజాతిరుగుబాటుకు నియంత తలవంచక తప్పలేదు. రాజీనామా చేసేదే లేదంటూ భీష్మించిన ముబారక్ ఫిబ్రవరి 11న పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మిలటరీ అధికారాన్ని అందుకొంది. త్వరలోనే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు లిబియాలోనూ ఇదే పరిస్థితి. పోలీసుల అరాచకాలు.. దాడులు, గడాఫీ సైన్యం చేస్తున్న దురాగతాలు యూట్యూబ్‌కు ఎక్కుతున్నాయి. ఎంతోమందిలో ఉద్యమకాంక్షను రగిలిస్తున్నాయి. అక్కడా ప్రభుత్వ అనుకూల వ్యతిరేక సేనల మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది.
లిబియాలోనూ త్వరలోనే నియంత పాలనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఇంత విప్లవం వచ్చిందంటే దానికి ఓ రకంగా కారణం సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లే. ఈ సైట్లే లేకపోతే, సమాచారం ఎక్కువమందికి తెలిసి ఉండేది కాదు. కొంతమంది పోరాటం చేస్తే.. వారిని అణగదొక్కడం నిరంకుశ ప్రభుత్వాలకు సులువయ్యేది. కానీ,లక్షలాది మందిని ఒక్కతాటిపైకి తెచ్చి, ప్రజా వ్యతిరేక పాలన అంతమయ్యేలా చూశాయి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్.
చైనాలో ఉద్యమం తప్పదా?
ఏక పార్టీ స్వామ్యం... జాతీయ స్థాయిలో చైనా రాజకీయ విధానం. అధికారం ఎప్పుడూ ఒక పార్టీదే. లీడర్లు మారతారు తప్ప పార్టీ మారదు. పార్టీ సిద్ధాంతమూ మారదు. ఓ రకంగా చైనా అభివృద్ధికి, ప్రపంచ శక్తిగా ఎదగడానికీ ఇదే కారణం. కానీ, ఇదే సమయంలో దేశంలో నిరంకుశత్వం పెరగడానికి, మానవహక్కులు హరించుకుపోవడానికీ ఈ విధానమే కారణం.
చైనా పద్దతి మారాలని, రాజకీయ విధానం మార్చుకోవాలని ప్రపంచ దేశాలు ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ, వేటినీ చైనా లెక్కచేయడం లేదు. పైగా, రోజురోజుకూ శక్తిని పెంచుకుంటూ అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఇక చైనాలోనూ ప్రభుత్వ పాలసీలను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ, వీరందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసే అవకాశాలు ఇంతవరకూ లేవు. కొన్ని సంఘటనలు జరిగినా, వాటిని తన బలంతో అణగదొక్కేయగలిగింది చైనా ప్రభుత్వం. పైగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా చిన్న ఆందోళన జరిగినా తీవ్రంగానే స్పందింస్తోంది.
పాశ్చాత్యదేశాల ఆలోచనల ప్రభావం చైనా వాసులపైన పడకుండానే చాలా జాగ్రత్తలు తీసుకొంది చైనా సర్కార్. ముఖ్యంగా మీడియాను పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. సమాచారాన్ని క్షణాల్లో విశ్వవ్యాపింతం చేసే ఇంటర్నెట్‌ను కూడా తన నియంత్రణలో పెట్టుకుంది. చైనా ప్రభుత్వానికి అనుకూల సమాచారం ఇచ్చే వెబ్‌సైట్లు తప్ప, వ్యతిరేక సమాచారం ఇచ్చే సైట్లు చైనాలో ఓపెన్ కావు. అందుకే.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సైట్లను చైనీయులకు దూరం చేసింది.
ఇప్పుడు అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవానికి సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా చైనా వాసులకు తెలియదు. దానిగురించి ఇంటర్నెట్‌లో తెలుసుకునే మార్గం కూడా లేదు. అంతేకాదు.. విప్లవానికి సిద్ధం కమ్మని ఓ సైట్‌లో సమాచారం వచ్చిన వెంటనే... పోలీసు బలగాలను వీధుల్లో మోహరించింది. అరబ్ దేశాలతో పోల్చితే, ఇలా ఆన్‌లైన్ పిలుపునకు స్పందించినవారు తక్కువ మందే. అలా వచ్చినవారినీ ప్రభుత్వం అరెస్ట్ చేసేసింది. ఇక ఉద్యమానికి రెచ్చగొట్టే మెసేజ్‌లను ఇంటర్నెట్‌లో పెట్టిన వారికోసం గాలిస్తోంది. వీలైనంతవరకూ అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవం చైనాలో రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇప్పటికే చేసేసింది.
చైనా జనాభాలో ఇప్పుడు యువతరం శాతం పెరుగుతోంది. వీరిలో చాలామంది ఇంటర్నెట్ సేవీస్. పైగా ప్రజాస్వామ్య విలువలను కోరుకొనే వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. నియంతృత్వ పాలనకు బదులు.. ప్రజాహక్కులు కావాలన్న డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. వీరివల్ల ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ, సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ అందుబాటులో లేకపోవడం, టెక్నాలజీపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉండడం వల్ల, సంఘటితం అయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
అరబ్ దేశాల పరిస్థితికి చైనా పరిస్థితికి ఎంతో తేడా ఉంది. అరబ్ దేశాల్లో అవినీతి, అక్రమాలు భారీగా సాగుతున్నాయి. ప్రజల జీవన సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీనికి వ్యతిరేకంగానే ప్రజాగ్రహం పెల్లుబుకింది. కానీ, చైనాలో పరిస్థితి వేరు. అన్నిదేశాల్లో ఉన్నట్లే సమస్యలు ఉన్నప్పటికీ, అరబ్ దేశాలంత దారుణమైన స్థితిగతులు లేవు. చైనాలో విప్లవం వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అరబ్ దేశాల్లో ఉద్యమకారుల వైపు సైన్యం నిలబడడమూ.. నియంతృత్వపాలనకు తెరపడడానికి కారణంగా కనిపిస్తుంది. కానీ, చైనాలో మాత్రం సైన్యం ప్రభుత్వ పక్షమే ఉంటుంది. ఆందోళనకు దిగినవారిని పూర్తిగా అణిచివేసే శక్తి చైనా ప్రభుత్వానికి ఉంది. పైగా, దీనికి సంబంధించిన చిన్నవార్తను కూడా బయటకు రాకుండా చేయగలదు. ప్రభుత్వం శక్తేమిటో తెలుసు కాబట్టి, చైనీయులు అంత సాహాసానికి ఒడిగట్టకపోవచ్చు.
కాకపోతే, ఇప్పుడున్నట్లే కొనసాగితే, భవిష్యత్తులోనైనా ముప్పు రాక తప్పదన్నది చైనా పాలకుల అభిప్రాయం. పైగా, ఇటీవలికాలంలో ధరలు పెరగడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువతరం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. వీరిలో అసంతృప్తి పెచ్చుమీరితే అది తిరుగుబాటుకు బీజం వేసే అవకాశాలున్నాయి. అందుకే, వీరిని ప్రసన్నం చేసుకోవడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవి ఎంతవరకూ విజయం సాధిస్తాయన్నదానిపైనే.. చైనాలో విప్లవం వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుంది. మరి మనదేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందా? అన్నది నెటిజన్లే తేల్చాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో పీపుల్సు విప్లవమా! అసంభవం, హాస్యాస్పదము. ఇది ప్రజావ్యతిరేక భూస్వామ్య, బూర్జువా, పెట్టుబడిదారులు, వర్గశత్రువుల కుట్రే గాని మరొక్కటి కాదు. చైనా భూతల స్వర్గం. :P