14, మే 2010, శుక్రవారం
వైఎస్‌కు వీడ్కోలు..
Categories :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య సర్కార్ వీడ్కోలు చెబుతోంది. పాలనపై వైఎస్ ముద్రను పూర్తిగా చెరిపేసే పనిలో పడింది. వైఎస్ రూపొందించిన పథకాలకు.. ప్రస్తుత సీఎం రోశయ్య చరమగీతం పాడుతున్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ అమలు చేసిన పథకాలు.. ప్రభుత్వ ఖజానాపై భారంగా మారుతుండడంతో వాటన్నింటికీ ఉప్పుపాతర వేయడానికి రోశయ్య సిద్ధమవుతున్నారు. ఇందులో ఎక్కువ పథకాలు సామాన్యులపై ఎఫెక్ట్ చూపించేవే..
సామాన్యుడిపై గ్యాస్ పిడుగు
గ్యాస్ ధరకు మళ్లీ రెక్కలు రావొచ్చు...
సిలెండర్ ధర పాతిక రూపాయలు పెరగవచ్చు..
సామాన్యులపై గ్యాస్ దెబ్బ...
ప్రస్తుతం గ్యాస్ సిలెండర్ ధర 305.88 రూపాయలు. రెండేళ్ల క్రితం కూడా గ్యాస్ సిలెండర్‌ది దాదాపు ఇంతే ధర. జూన్,2008లో సిలెండర్‌పై 50 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో గ్యాస్ ధర కాస్తా.. 356 రూపాయలకు చేరుకుంది. దీనికి నిరసనగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు జరగడంతో పాటు.. సామాన్యులు ఈ భారం మోయలేరని భావించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆ యాభై రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని ప్రకటించారు. దీంతో.. సిలెండర్ ధర మళ్లీ 305కు దిగి వచ్చింది. దీనికోసం నెలకు దాదాపు 26 కోట్ల రూపాయలను గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించింది. కానీ.. జనవరి 28, 2009న సిలెండర్ ధరలో 25 రూపాయలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం తన సబ్సిడీని యాభై నుంచి 25 రూపాయలకే పరిమితం చేసింది.
ఇలా సిలెండర్లపై ఇస్తున్న పాతిక రూపాయల సబ్సిడీకి గానూ.. ఖజానాపై నెలకు 13 కోట్ల భారం పడుతోంది. అంటే ఏడాదికి 156 కోట్ల రూపాయలన్నమాట. దీన్ని అదనపు భారంగా భావించిన ముఖ్యమంత్రి త్వరలోనే కట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. లోటు బడ్జెట్‌తో ఇబ్బంది పడుతున్న సీఎం.. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే గ్యాస్ సబ్సిడీని కట్ చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఈ భారాన్ని తగ్గించుకునే యత్నంలో భాగంగానే.. గ్యాస్ సిలెండర్ల పంపిణీ ఆలస్యమవుతున్నా ప్రభుత్వం చూస్తూనే ఊరుకుంటోంది తప్ప.. గ్యాస్ కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదు. అందరికీ గ్యాస్‌ను అందుబాటులోకి కూడా తేవడం లేదు. దాదాపు 3.5 లక్షల దీపం కనెక్షన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక సిలెండర్లపై సబ్సిడీ ఎత్తివేస్తే.. ఆ నిధులను ఇతర పథకాలకు వాడుకోవచ్చన్న ఆలోచన సీఎంది.
సంక్షేమానికి చెక్..
గ్యాస్‌తో పాటు.. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పుడు పెండింగ్‌లో పడనున్నాయి. పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత.. ఖజానాపై భారాన్ని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సీఎం రోశయ్య.. సంక్షేమ పథకాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. అందులో భాగంగానే బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో అడుగడుగునా ఎన్నో సమస్యలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా పావలావడ్డీ రుణాలు ఆరునెలలుగా అందడం లేదని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. పనులు చేసిన వారు డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటే జనం అప్పు చేసి కట్టాల్సి వస్తోంది.
హామీలపై ఉలుకు లేదు
ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ఎన్నో గొప్పలను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొంది. ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని, రెండు రూపాయల కిలో బియ్యాన్ని మనిషికి 4 నుంచి 6 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఫించన్ల విషయంలోనూ ఉదారంగానే స్పందించింది. మహిళా స్వయం సహాయక బృందాల్లో 60 ఏళ్ల పైబడిన వారికి 500 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి అభయహస్తం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ.. వాస్తవంలోకి వస్తే, ఈ హామీలను నెరవేర్చిందే లేదు. 9 గంటల ఉచిత విద్యుత్‌ను పక్కన పెడితే.. 7 గంటల కరెంటుకూ దిక్కేలేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పేదల కోసమంటూ అమల్లోకి తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యానిదీ ఇదే పరిస్థితి. బియ్యం పంపిణీ పూర్తిస్థాయిలో జరగదు. అంతేకాదు.. మనిషికి ఆరు కిలోలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ కూడా అమలు కావడంలేదు. ఇప్పటికీ నాలుగు కిలోలే అందుతున్నాయి.
ముందు జాగ్రత్తలు
ఓ వైపు బరువు.. మరో వైపు పరువు... స్థూలంగా చెప్పాలంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. అటు వైఎస్ ప్రారంభించిన పథకాలను కొనసాగించలేక.. ఇటు పథకాలనూ పూర్తిగా ఎత్తేయలేక ముఖ్యమంత్రి రోశయ్య నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో.. ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. సైలెంట్‌గా పనికానిద్దానమనుకుంటే.. కార్పొరేట్ స్కాలర్‌షిప్‌ల జీవో కాస్తా లీకై.. మేకై కూర్చోంది. వైఎస్ పథకాలకు గండి కొడుతున్నారన్న వార్తలు రాష్ట్ర ప్రజల్లో గుబులు పుట్టించడంతో.. ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా సీఎం రక్షణ చర్యలు చేపట్టారు. మంత్రులందరితోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్ పథకాలన్నీ కొనసాగిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందులున్నాయన్న విషయాన్ని మంత్రులు బాహటంగానే అంగీకరిస్తున్నారు. నిధుల సమస్య వల్లే బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయని ఒప్పుకుంటున్నారు. అయితే.. సంక్షేమానికి మాత్రం లోటు రాదని అభయమిస్తున్నారు.
వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని కొనసాగిస్తామని రోశయ్య మంత్రుల ద్వారా సంకేతాలు పంపించారు. ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లే..మిగిలిన పథకాలూ కంటిన్యూ అవుతాయని ప్రకటిస్తున్నారు. అయితే.. ట్రాన్సపరెన్సీ పేరుతో... అర్హులకు మాత్రమే అన్న నిబంధనతో.. భారాన్ని మాత్రం గణనీయంగా తగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు.
విద్యపై వెనుకడుగు
రాష్ట్రంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివే పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లను ఆపివేస్తున్నట్లు జీవో 162ను బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఆందోళనలు వెల్లువెత్తడంతో.. కొన్ని గంటల్లోనే... జీవోను మార్చారు. ప్రజాందోళనతో కలవరపడ్డ సర్కార్.. ఈ కార్పొరేట్ విద్యాపథకాన్ని ఎట్టకేలకు కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై.. అధికారులు, మంత్రులు తోనూ రోశయ్య సమావేశమై.. ప్రభుత్వ కాలేజీలనూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీన్ని ఎంతవరకూ అమలు చేస్తారన్నది అనుమానమే. కేవలం 150 కోట్లు ఇవ్వలేక.. 3వేల త్రిపుల్ ఐటీ సీట్లను వదులుకున్న ప్రభుత్వం.. ప్రభుత్వకాలేజీలను మెరుగు పర్చడానికి నిధులిస్తుందా?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ జీవో జారీ వెనుక హస్తం ఎవరిది? ప్రభుత్వ పెద్దలదా లేక అధికారులదా... ఈ విషయంలో మాత్రం సర్కార్ దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈ జీవోను జారీ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నాయి బీసీ సంఘాలు... అదే ఫీజుల రీఎంబర్స్‌మెంట్ ఎత్తివేత..
ఫీజుల రీఎంబర్స్ మెంట్ విషయానికి వస్తే.. ఎంబీయే, ఎంసీఏ, ఇంజనీరింగ్, మెడిసిన్ .... ఇలా వృత్తివిద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు చెల్లించాలని వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో సర్కారు ఈ పథకాన్ని రూపొందించింది. ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందన్న ఆశతో.. ఎంతో మంది పేద, గ్రామీణ విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరారు. వీరి సంఖ్య ఈ విద్యాసంవత్సరం 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరందరి ఫీజుల కోసం 1500 కోట్ల రూపాయలు అవసరం. కానీ పరీక్షలు రాసే సమయం వస్తున్నా సర్కారు పూర్తిగా నిధులు మంజూరు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 40 శాతం నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగతా బకాయిల విషయం తేల్చకుండా.. విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. పరీక్ష ఫీజు చెల్లించే టైం కావటంతో ప్రైవేటు కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తీవ్రం చేస్తున్నాయి. పరీక్షలు రాయాలంటే కాలేజ్ ఫీజు చెల్లించాల్సిందేనని హుకూం జారీ చేశాయి. దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు.
తేడా ఎక్కడ?
సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా పాలన సాగించారు. జలయజ్ఞంపై దృష్టి పెడుతూనే పేదప్రజలకు చేరువవ్వడానికి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆ సమయానికి రాష్ట్ర ఆదాయం చాలా ఎక్కువ. కానీ.. ఆర్థికమాంద్యం దెబ్బకు పరిస్థితి తిరగబడింది. నిధులు కరిగి.. ఖజానా ఖాళీ అయ్యింది. పన్ను వసూళ్లు లక్ష్యాలను అందుకోవడం లేదు. ఎక్సైజ్ ఆధాయం సరిపోవడం లేదు. సంక్షేమపథకాలకోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో రోశయ్య సర్కార్ లేదు. ఉన్న నిధులతోనే పాలన సాగించాలి కాబట్టి.. వీలైనంత వరకూ పథకాల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. పైగా వైఎస్ పరువు ప్రతిష్టల కోసం పాకులాడేవారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పాకులాడేవారు. కానీ, రోశయ్య పరిస్థితి భిన్నం. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత ఆయనదే. అందుకే.. ఈ కోతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
enka enta kaalam...
leave him.... YS is no more....
ha ha ha hello mastaaru., sankshema padhakalaku mana rastra khajana lo dabbu ledu., kaani mana rajakeeya nayakulu, mana IAS/IPS officers dochukovadaniki mathram khajana ninda dabbe dabbu. paapam pedalaku mathram dabbu bhaaram. hello roshaiah garu jimmikkulu maani kaastha aalochinchandi sir kaamedilu cheyyakandi . janam tharimi kodathaaru.