14, జులై 2010, బుధవారం
అంతమా? ఆరంభమా?
2012 దగ్గర పడుతోంది.. అందరిలోనూ అలజడి కనిపిస్తోంది. యుగాంతంపై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు. ఏమవుతుందో తెలియదు.. ఏం జరుగుతుందో అంతుపట్టదు.. కానీ.. భూమిపైన మనిషి అంతమవుతాడన్న భయం మాత్రం ప్రపంచాన్ని వణికిస్తోంది.. భూమిపై ఉన్న ప్రతీ దేశంలోనూ... ప్రతీ ప్రాంతంలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్...
డిసెంబర్ 21, 2012
ఆకాశం నుంచి అగ్నిగోళాలు విరుచుకుపడతాయి... భూమిని అగ్నిగుండంగా మార్చుతాయి...
సముద్రాలు ఉప్పొంగుతాయి.. నేలను మింగేస్తాయి..
ఖండాలకు ఖండాలు సముద్రంలో కలిసిపోతాయి..
అగ్నిపర్వతాలు బద్దలవుతాయి.
భగభగ మండే లావా జనంపై పడుతుంది
భూమి ముక్కలవుతుంది
పల్లెలు, పట్టణాలు, నగరాలు నాశనం అవుతాయి
వెలుగులు పంచే సూరీడు విరుచుకుపడతాడు..
భూమిపై నిప్పులు కురిపిస్తాడు.. మసి చేస్తాడు..
జనావాసాలు స్మశానంగా మారతాయి..
ఎటు చూసినా మంటలే.. ఎటు చూసినా వినాశనానికి సంబంధించిన ఆనవాళ్లే..
ఒక్కమాటలో చెప్పాలంటే భూమిపై మహాప్రళయం సంభవిస్తుంది. మానవాళి అంతమవుతుంది.
యుగాంతానికి సంబంధించి అందరి మదిలోనూ ఉన్న అనుమానాలివి. డిసెంబర్ 21, 2012 నాడు ప్రపంచమంతా ఇవే దృశ్యాలు కనిపించవచ్చనది చాలా మంది నమ్మకం. డూమ్స్‌డే పేరుతో వచ్చిన సినిమా కూడా.. ఈ భయాలను మరింత పెంచింది. మయన్ క్యాలెండర్ ప్రకారం.. ఆ రోజు యుగాతం సంభవిస్తుందంటూ వస్తున్న వార్తలు గుబులు పుట్టించాయి. చిన్న చిన్న అనుమానాలు కాస్తా.. చిలువలు పలువలుగా మారి మానవాళి అంతమవుతుందన్న వదంతులు ప్రపంచమంతా పాకిపోయాయి. పైగా... మరో ఏడాదిన్నరలోపే ఈ తేదీ ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
డూమ్స్‌డేనే ఎందుకు?
డిసెంబర్ 21, 2012... అదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం కదా అంతా మంచే జరుగుతుందనుకోకండి.. పెద్ద ప్రమాదమే పొంచి ఉంది.. అదే యుగాంతం. పైగా.. ఈ సృష్టికి ఆధారమైన సూర్యుడే.. వినాశనానికి ప్రధమ కారకుడు కావచ్చు. అన్ని రోజుల్లానే ఉదయించినా... ఆ రోజు మాత్రం సూర్యుడి వెలువరిచేవి వెలుగునిచ్చే కిరణాలు కాదు.. మనిషిని మాడ్చేసే ప్రమాదకర కాంతిపుంజాలు.
సరిగ్గా డిసెంబర్ 21, 2012న సూర్యుడు భూమికి మరింత చేరువలోకి వస్తాడు. మన పాలపుంత కేంద్రానికి... భూమికి మధ్యలోకి సూర్యుడు వస్తాడు. చెప్పాలంటే గ్రహణం నాటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే.. ఇది పాలపుంతతో వ్యవహారం కాబట్టి సమస్యలు ఎక్కువగా వస్తాయన్నది చాలామంది అంచనా. సూర్యుడి నుంచి చాలా ఎక్కువ వేడి ఆ రోజును భూమిని తాకుతుంది. భూగోళాన్ని చల్లబరుస్తూ ఉండే వాతావరణంలోని తేమ ఈ వేడికి మాయమవుతుంది. భూమిపై విపరీతంగా వేడిపెరిగిపోయి అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. రద్దీగా ఉండే నగరాల్లోని రోడ్లు కాస్తా.. స్మశానంగా మారిపోతాయి.
బ్లాక్‌హోల్ నుంచి వెలువడే కాస్మోటిక్ ఎనర్జీ ఆధారంగానే మన పాలపుంత జీవితం కొనసాగుతోంది. సూర్యుడి గమనం వల్ల డూమ్స్‌డే రోజున ఈ కాస్మోటిక్ ఎనర్జీ మాయమవ్వొచ్చన్న వదంతులూ వినిపిస్తున్నాయి. ఈ ఊహలు నిజమైతే.. యుగాంతానికి అదే తొలిఅడుగు. 9 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచే ఈ ప్రమాదం మొదలవ్వనుంది. ఇప్పటికే సూర్యుడిపై పెద్ద ఎత్తున విస్పోటనాలు సంభవిస్తున్నాయని నాసా వీడియోల్లో భయటపడడం ఈ అనుమానాలను మరింత పెంచింది. పైగా.. సూర్యుడు ఏ క్షణంలో విరుచుకుపడతాడో తెలియదు. సూర్యుడి నుంచి మన భూమిపైకి కాంతి చేరడానికి దాదాపు 8 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి.. అంతే కాలంలో వినాశన కిరణాలు మనపై దాడి చేయవచ్చు. అంటే మనం తేరుకునే లోగానే.. మాడిపోతామన్నమాట..
సూర్యుడు మూలంగా భూమి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాల్లోనూ ఊహించని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఈ అయస్కాంతక్షేత్రాలే ఇంతవరకూ మనకు రక్షణ కవచాలుగా ఉన్నాయి. రోదసీ నుంచి వచ్చే ప్రమాదకర కిరణాలనుంచి, పదార్థాల నుంచి ఇవే భూమిని నిరంతరం కాపాడుతుంటాయి. కానీ... డూమ్స్‌డే రోజున వచ్చే కిరణాలు మాత్రం.. ఈ అయస్కాంతక్షేత్రాలను వ్యాపింప చేసి... విచ్చిన్నం చేసేస్తాయి. ఆ తర్వాత భూమిని తాకి.. వినాశనం సృష్టిస్తాయి.
విశ్వంలో ఇలాంటి పరిస్థితులు తరుచుగా ఏర్పడుతున్నప్పటికీ.. ఈసారి యుగాంతం అవుతుందని భావించడానికి కారణం.. మయన్ క్యాలెండర్. వేల సంవత్సరాల క్రితం రూపొందించిన మయన్ క్యాలెండర్ డిసెంబర్ 21, 2012 న అంతమవుతుంది. విశ్వంలో అనూహ్య మార్పులు సంభవించే రోజు.. మయన్ క్యాలెండర్ అంతమయ్యే రోజు ఒకటే కావడంతో... ప్రపంచ వినాశనం తప్పదంటూ వాదనలు మొదలయ్యాయి. అవే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలో పడేశాయి.
మయన్లు ఎవరు?
మయన్ సంస్కృతీ సంప్రదాయాలకు... తెలివితేటలకు.. అభివృద్ధికి నిదర్శనం ఈ పాలెంక్. మయన్ నాగరికత వర్దిల్లుతున్న సమయంలో నిర్మించిన అపూర్వకట్టడమిది. ఉత్తర అమెరికా ఖండంలో ప్రస్తుతం మెక్సికో ఉన్న ప్రాంతంలో జీవించారు మయన్ ప్రజలు. ఇతర నాగరికతలు వెలుస్తున్న సమయంలోనే.. ప్రయోగాల బాట పట్టి ఆధిక్యతను చాటుకున్నారు. చివరకు గ్రహ గమనాలను, విశ్వంలోని ఎన్నో రహస్యాలను.. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనే సమయంలోనే ఒడిసిపట్టుకున్నారు. చెప్పాలంటే.. క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే మయన్ నాగరికత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. అప్పట్లోనే.. తమ భాషకు లిపిని అభివృద్ధి చేసుకున్నారు. పైగా.. ఇది రకరకాల బొమ్మలతో ఎంతో అందంగా మరెంతో అద్భుతంగా ఉంటుంది. మయన్ నాగరికత వృద్ధి చెందిన ప్రాంతాల్లో వీటి తాలూకు చారిత్రక ఆధారాలు సజీవంగా ఉన్నాయి. మయన్ చరిత్రకు.. విశ్వరహస్యాలకు, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఎన్నో వివరాలను వీటిల్లో పొందుపరిచారు.
ఖగోళ,గణాంక శాస్త్రాల్లో అపూర్వ పరిజ్ఞానం మయన్లు. ఆసియా, యూరప్ నాగరికతల కన్నా ముందుగానే.. మెసోఅమెరికన్ నాగరికతకు చెందిన మయన్లు కాలవిభజన చేసుకున్నారు. కాలచక్రాన్ని తయారు చేసుకున్నారు. రోజులు, వారాలు, నెలలుగా విభజించారు. అయితే.. సంవత్సరాల గురించి మాత్రం మయన్లు ఎక్కడా ప్రస్తావించలేదు. మయన్లకు సంబంధించి ఎన్నో క్యాలెండర్లు ఉన్నప్పటికీ.. రెండు క్యాలెండర్లు మాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది 260 రోజుల క్యాలెండర్. మరొకటి 365 రోజుల క్యాలెండర్. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే సౌరమానం ఆధారంగా 365 రోజుల క్యాలెండర్‌ను రూపొందించారంటే మయన్ల మేథస్సు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. అప్పట్లోనే అతిపెద్ద క్యాలెండర్‌ను కూడా మయన్లు రూపొందించారు. ఈ క్యాలెండర్ వ్యవధి 5126 సంవత్సరాలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 3114వ సంవత్సరంలో ఈ క్యాలెండర్ మొదలైనట్లు పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే..ఈ క్యాలెండర్ 2012 డిసెంబర్ 21 నాటికి అంతమవుతుంది. మయన్ల కాలచక్రం పొడవు 52 ఏళ్లు. మొత్తం మూడు విభాగాలు ఇందులో ఉంటాయి. ఒకే వరసలో వచ్చిన మూడూ మళ్లీ పునరావృతం కావాలంటే మళ్లీ 52 ఏళ్లు పడుతుంది.
ఇలా మొత్తం 5126 సంవత్సరాలకు సరిపడా క్యాలెండర్‌ను క్రీస్తుపూర్వమే మయన్లు తయారు చేసుకున్నారు. ఇక సౌరమండలంలోని రెండో గ్రహమైన శుక్రుడి పైనా ఎన్నో పరిశోధనలు చేశారు. వీనస్ క్యాలెండర్‌ను కూడా తయారు చేశారు. ఇందులోనే ఓ అతిపెద్ద సంఖ్య పరిశోధకులను ఆకట్టుకుంది. ఇదే సంఖ్య.. మయన్లు జీవించిన పలుప్రాంతాల్లో కనిపిస్తుంది. సృష్టి మొదలైన సంవత్సరానికి ఇది గుర్తు కావచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇతర నాగరికతలతో పోల్చితే.. ఇంత ఆధునికంగా ఉన్నారు కాబట్టే.. మయన్ల క్యాలెండర్‌పై ధర్మసందేహాలు వెంటాడుతున్నాయి.
ఖగోళ విషయాల్లో ఎంతో పరిజ్ఞానం సంపాదించిన మయన్లు తమ క్యాలెండర్‌ను 5126 సంవత్సరాలకే ఎందుకు పరిమితం చేశారు..? భూమికి, పాలపుంత కేంద్రానికి సరిగ్గా మధ్యలోకి సూర్యుడు వచ్చే సమయానికే ఈ క్యాలెండర్ ఎందుకు ముగుస్తోంది. ఐదువేల ఏళ్ల సంవత్సరాల తర్వాత విశ్వంలోజరిగే అరుదైన సంఘటన కనీసం టెలిస్కోప్‌లు కూడా లేని మయన్లకు ఎలా తెలిసింది? సూర్యుడి వల్లే భూమి అంతరించకతప్పదని మయన్లకు ముందే తెలుసా..? ఇలా ఎన్నో ప్రశ్నలు మయన్ క్యాలెండర్ చుట్టూ తిరుగుతున్నాయి. యుగాంతం అవుతుందని తెలియడం వల్లే 5126 సంవత్సరాల వరకే తమ క్యాలెండర్‌ను పరిమితం చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి..
మయన్లు చెప్పిందేమిటి?
మయన్ క్యాలెండర్ చెప్పిందేమిటి? నిజంగా యుగాంతం ఉందా? సృష్టి ప్రారంభం గురించి పదే పదే పేర్కొన్న మయన్లు.. యుగాంతం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా.. ఇవే ప్రశ్నలు పరిశోధకుల మేథస్సును తొలిచాయి. యుగాంతం గురించి పెద్ద ఎత్తున వదంతులు చెలరేగడంతో నిజానిజాలు వెలికితీయడానికి చాలామంది రంగంలోకి దిగారు. మయన్ల చారిత్రక ఆధారాలను, శాసనాలను పరిశీలించారు.
మయన్‌లకు సంబంధించిన దాదాపు 15వేల పత్రాలను పరిశీలించినప్పటికీ ఎక్కడా.. యుగాంతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. సృష్టి అంతమైపోతుందని ఎక్కడా ఆనాటి మయన్లు పేర్కొనలేదు. మెక్సికోలోని ఎన్నో చోట్ల మయన్ల పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ వాటిల్లోనూ దీనికి సంబంధించిన ఆధారాలు చిక్కలేదు. పైగా.. క్యాలెండర్ పూర్తవుతుందే తప్ప.. సృష్టి అంతమవుతుందని ఎక్కడా మయన్లు చెప్పలేదు. అంటే.. యుగాంతం సంభవించదన్నమాట. అంతా ఊహించుకుంటున్నట్లు.. భూమి బద్దలు కావడం.. ఆకాశం నుంచి అగ్నిగోళాలు విరుచుకుపడడం.. అగ్నిపర్వతాలు పేలడం.. సముద్రాలు భూమిని మింగేయడం.. ఇలా అన్నీ కాకమ్మ కబుర్లే అన్నమాట
మయన్ నాగరికత కనుమరుగయ్యిందేమో గానీ.. ఇప్పటికీ మయన్లు జీవించే ఉన్నారు. తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. మయన్ క్యాలెండర్ ప్రకారం యుగాంతం అవుతుందని ప్రపంచమంతా కలవరపడుతున్నప్పుడు.. ఈ మయన్లు ఇంకెంత గాబరాగా ఉండాలి. ప్రపంచం నాశనమవుతుందని ముందుగా వారికే తెలియాలి కదా.. ఈ కోణంలోనూ పరిశోధనలు సాగాయి. గ్యాంటామాలా తదితర ప్రాంతాల్లో ఉన్న మయన్లు పలకరిస్తే... యుగాంతమనేదే లేదన్నారట. ఏ టెన్షనూ లేకుండా వారంతా హాయిగా తమ జీవనం కొనసాగిస్తున్నారు.
మరి యుగాంతం అవుతుందంటూ మయన్లు చెప్పారని పుట్టించింది ఎవరు? పరిశోధకుల లెక్కల ప్రకారం మయన్ల చరిత్రకు సంబంధించిన ఓ రెండు పత్రాలు ఈ గొడవకు కారణమయ్యాయి. ఈ రెండింటిలో మాత్రమే 2012 ప్రస్తావన వచ్చింది. వేల ఏళ్లుగా సాగుతున్న మయన్ కాలచక్రం ఆ ఏడాదితో పూర్తవుతుందని వాటిల్లో పేర్కొన్నారు. దీన్ని పొరపాటుగా అర్థం చేసుకున్న కొంతమంది యుగాంతమవుతుందంటూ వదంతులు పుట్టించారు. దీనికి ఖగోళంలో అనూహ్య మార్పులు రావచ్చన్న అంచనాలూ తోడవడంతో.. సృష్టి వినాశమనమవుతుందంటూ అలజడి రేపారు. ఇదంతా 1970ల నుంచే మొదలయ్యింది. అప్పట్లో మయన్ శాసనాలను.. పురాతన ఆధారాలపై పరిశోధనలు జరిపిన కొంతమంది.. ఈ వాదన లేవనెత్తారని తెలుస్తోంది.
5 వేల ఏళ్లకు పైగా కొనసాగుతున్న తమ కాలచక్రం ముగుస్తున్నా మయన్లకెవరికీ ఏ భయమూ లేదు. ఎందుకంటే... ఆ తర్వాత మళ్లీ మొదటినుంచి ఆ కాలచక్రం కొనసాగుతుంది. అసలైన వారికే యుగాంతంపై ఏ సందేహం లేనప్పుడు... వారి క్యాలెండర్‌ను చూసి లోకమంతా గుబులు చెందడం కరెక్టేనా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి