17, మే 2010, సోమవారం
అరచేతిలో అంతర్యుద్ధం
ఎంతమార్పు.. ఎంతమార్పు.. ఏడాది కిందటికి ఇప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే. కాంగ్రెస్ వరసగా రెండోసారి ఘన విజయం సాధించి అప్పుడే ఏడాదయ్యింది. 1983 తర్వాత వరసగా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం అదే తొలిసారి. ఉత్సాహంగా, ఉల్లాసంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఏడాదికే ఇలా ఉంటే. .మరి మరో నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి?
గుంటూరు నుంచి మొదలు..
స్విచ్ ఒకచోట వేస్తే..., లైట్ ఇంకోచోట వెలుగుతుంది... అది సైన్స్... నిప్పు ఒక దగ్గర రాజేస్తే... అగ్గి మరో చోట అంటుకుంటుంది... ఇది పొలిటికల్ సైన్స్. వర్గరాజకీయాలకు.. అధిపత్య పోరుకు.. నేతల కుమ్ములాటకు ప్రసిద్ధి చెందిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. చాపకింద నీరులా సాగుతున్న విభేదాలను తెరపైకి తెచ్చారు గుంటూరు ఎంపీ రాయపాటి. దీంతో.. మళ్లీ కాంగ్రెస్ పరిస్థితి మొదటికొచ్చింది. గుంటూరులో రాజుకున్న అవినీతి నిప్పురవ్వ...హైదరాబాద్‌లో మండుతూ... ఢిల్లీదాకా ఇప్పుడు జ్వాలల్ని ఎగజిమ్ముతోంది. తెరచాటున గుంభనంగా సాగుతున్న గ్రూపు తగాదాలను గుంటూరు ఎంపీ రాయపాటి తెరపైకి తెచ్చారు. రోశయ్య మంత్రివర్గంలో మధుకోడాలున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టించారు. కాంగ్రెస్ వ్యవహారాలు దగ్గరనుంచి చూసే ప్రతీ ఒక్కరికి.. రాయపాటి టార్గెట్ ఎవరో తెలుసు. ఆయనే రాష్ట్రమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. మంత్రిగా వందలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పార్టీ అధినేత్రికి రాయపాటి ఫిర్యాదు చేశారు.
ఇక అక్కడి నుంచి గుంటూరు రాజకీయం అనూహ్య మలుపులు తిరిగింది. కన్నా లక్ష్మీనారాయణ నేరుగా రంగంలోకి వచ్చారు. రాయపాటి రాసిన లేఖంటూ.. ఓ లెటర్ మీడియాకు చిక్కింది. కన్నా సహా, ఎంతోమంది పేర్లు అందులో ఉన్నాయి. కానీ, అది ఒరిజినల్ కాదని తేల్చేశారు రాయపాటి. తన సంతాకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసు కూడా పెట్టారు.
రాయపాటికి, కన్నాకు మధ్య విభేదాలు తలెత్తడానికి చాలా కారణాలున్నాయి. గుంటూరును తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇద్దరు నేతలూ చేస్తున్నప్రయత్నాలే ఈ వార్కు ప్రధాన కారణం. తొలినుంచీ గుంటూర్ కాంగ్రెస్‌లో ఆధిపత్యం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. జిల్లాలో రెండు బలమైన సామాజిక వర్గాలకు వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతివిషయంలోనూ ఢీ అంటే ఢీ అనే మనస్తత్వమే ఇద్దరిది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సామాజిక సమీకరణల్లో కన్నాను మంత్రి పదవి వరించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న కన్నా.. వైఎస్‌కు మరింత చేరువయ్యారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వర్గపోరును మరింతగా పెంచాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో కన్నా కుమారుడు నాగరాజు, రాయపాటి సోదరుని కుమారుడు మోహన్‌సాయి కృష్ణ మేయర్ పదవికి పోటీపడ్డారు. అప్పడే వైఎస్ఆరే ఇరువర్గాలు చెరో రెండున్నరేళ్ల పాటు పదవిలో ఉండేట్టు రాజీ కుదిర్చారు. అక్కడితో సమసిపోవాల్సిన వివాదం.. వైఎస్ మరణం తర్వాత లావాలా ఎగజిమ్మింది. రాయపాటి, కన్నాల విభేదాలు ఇప్పుడు వారి వారసులకూ అంటుకున్నాయి.
వైఎస్‌ఆర్ హఠాన్మరణం, రోశయ్య సీఎం కావడంతోనే గుంటూరు రాజకీయాలు మారిపోయాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగొచ్చన్న సంకేతాలు రావడంతో.. తన సోదరుడికి అనుకూలంగా రాయపాటి పావులు కదుపుతున్నారు. విస్తరణలో కన్నా అవుట్ అయితే, రాయపాటి సోదరుడు, ఎమ్మెల్సీ, శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అవుతుంది. జిల్లాపై ఆయన పట్టు పెరుగుతుంది. అందుకే.. కన్నాపై అవినీతి అస్త్రాన్ని సంధించారు. ఈ వివాదం ఎవరో ఒకరికి లబ్ది చేకూర్చవచ్చేమో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం చేసేదే.
కర్నూలు కోట్లాట..
గుంటూరుకు దీటుగా కర్నూలు రాజకీయం సాగుతోంది. జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన అస్త్రాలకు పదును పెట్టారు. గృహనిర్మాణ శాఖ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆరోపణలు సంధిస్తున్నారు. పైగా.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికే శిల్పామోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రాలయం ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసి రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు శిల్పా కుట్ర పన్నారని ఆరోపించారు. చివరకు అధిష్టానానికీ ఫిర్యాదు చేస్తానంటున్నారు.
తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మంత్రి శిల్పామోహన్‌రెడ్డి.. కర్నూలు కాంగ్రెస్‌లో ఇటీవల పట్టు పెంచుకుంటున్నారు. వైఎస్ హయాంలో కోట్ల కుటుంబాన్ని పక్కనపెట్టి... ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చారు. తొలివిడతలో మార్పెప్పకి, మలివిడతలో శిల్పామోహన్‌రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న శిల్పామోహన్‌రెడ్డి.. జిల్లాలో పర్యటిస్తూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాంగ్రెస్ దగ్గరై మంత్రితో సత్సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే.. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా టీడీపీ వారికే మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కోట్ల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్‌ను ఎదుర్కోలేక ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న సూర్యప్రకాశ్‌రెడ్డి.. ఇప్పుడిప్పుడే తన రూట్ మార్చారు. అందుకే.. నేరుగా మంత్రిపై విమర్శలు. అయితే.. శిల్పామోహన్‌రెడ్డి కూడా కోట్లకు చెక్ చెప్పడానికే సిద్ధమవుతున్నారు.
వీరిద్దరిమధ్యా వివాదంలోకి ఇప్పుడు మాజీమంత్రి మారెప్ప కూడా దూరారు. కోట్ల కుటుంబంపై తీవ్రస్థాయిలో మారెప్ప విరుచుకుపడుతున్నారు. ఆధిపత్యం పోతుందన్న భయంతోనే అనవసర విమర్శలకు దిగుతున్నారంటూ కోట్ల వ్యవహారశైలిని దుయ్యబట్టారు. కర్నూలు పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికివారే తన్నుకునేలా కనిపిస్తోంది. వైఎస్ హయాంలో ప్రాధాన్యం దక్కనివారంతా, ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తునారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వ్యూహం కూడా ఇదే.
జిల్లా జిల్లాలోనూ.. ఇదే సీన్..
ఓ గుంటూరో... మరో కర్నూలుకో ఈ గొడవలు పరిమితం కాలేదు. ఏ జిల్లాకు వెళ్లినా కాంగ్రెస్ నేతలకు ఒకరికొకరు పడడం లేదు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం వేస్తున్న ఎత్తులు..జిత్తులతో పార్టీ రోజురోజుకూ బలహీనమవుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని విభేదాలున్నా కలిసికట్టుగా పనిచేసిన నేతలు.. ఇప్పుడు మాత్రం ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే పదేళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.
పార్టీని ముందుండి నడిపించాల్సిన పీసీసీ ప్రెసిడెంట్ సొంత జిల్లాలోనే గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రతీవిషయంలోనూ మాజీమంత్రి షబ్బీర్ అలీ, డీఎస్‌తో పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్యా తీవ్రస్థాయిలోనే వివాదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్ల కోసం ముఖాముఖీనే తలపడ్డారు. ఇక కోస్తాంధ్రలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. విజయవాడ ఎంపీ రాజ్‌గోపాల్‌కు, మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూకు ఒక్కక్షణం కూడా పడదు. రాజ్‌గోపాల్ రాజకీయ ప్రవేశం తర్వాత నెహ్రూ హవా కాస్త తగ్గడం ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పశ్చిమ గోదావరిలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త ప్రశాంతంగానే ఉన్నా.. పక్కనే ఉన్న తూర్పు గోదావరిలో మాత్రం విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ హర్షకుమార్‌కు, మంత్రి విశ్వరూప్‌కు మధ్య యుద్ధమే జరుగుతోంది. విశాఖలో కాంగ్రెస్ పరిస్థితి తాటికాయ పీచులా మారింది. చాలామంది లీడర్లుండడంతో అందరి ప్రయత్నాలు ఆధిపత్యం కోసమే సాగుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సబ్బం హరికి, మాజీ మంత్రి కొణతాలకు ఒక్కక్షణం కూడా పడదు. అంతేకాదు.. విశాఖ జిల్లాకు చెందిన ఏ నేతతోనూ సబ్బం హరికి సన్నిహిత సంబంధాలు లేవు. విజయనగరం జిల్లాలో మాత్రం మంత్రి బొత్సకు ఎదురులేదు. తొలినాళ్లలో శత్రుచర్లకు ఆయనకూ మధ్య వైరం సాగినా.. 2009 ఎన్నికలకు శ్రీకాకుళానికి శత్రుచర్ల మకాం మార్చడంతో బొత్స ఏక ఛత్రాధిపత్యమే కొనసాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోనూ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి ధర్మానకు, ఎంపీ కిల్లి కృపారాణి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.
ప్రకాశం జిల్లాలోనూ ఇదే సీన్. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పడదు. ఆధిపత్యం కోసం ఇద్దరూ నిరంతరం ప్రయత్నిస్తుంటారు. నెల్లూరు గొడవల సంగతి అందరికీ తెలిసిందే. ఆనం వర్గానికి నేదురుమల్లి వర్గానికీ ఎప్పటి నుంచో పడదు. ఇప్పుడు ఎంపీ పనబాక లక్ష్మికి, నేదురుమల్లికీ పడడం లేదు. చిత్తూరులో ఎంపీ చింతామోహన్‌కు, మంత్రి రాంచెంద్రారెడ్డికీ పడదు. అదే సమయంలో చింతామోహన్‌తో సి.కె.బాబు వైరం కూడా కొనసాగుతూనే ఉంది. అనంతపురంలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతోంది. జిల్లాలో రెండు పవర్‌సెంటర్స్ కొనసాగుతున్నాయి. మంత్రి రఘువీరాకూ.. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈసారి మంత్రి పదవిని దక్కించుకోవడం కోసం జేసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ సొంత జిల్లా కడపలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇంతకాలం మౌనం వహించిన వైఎస్ వ్యతిరేకవర్గం ఇప్పుడు చకచకా పావులు కదుపుతోంది. ముఖ్యంగా కడప ఎంపీ జగన్‌కు, మైదుకూరు ఎమ్మెల్యే డి.ఎల్.రవీందర్‌రెడ్డికి ఏమాత్రం సత్సంబంధాలు లేవు. జిల్లాను పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటే.. దానికి గండికొట్టడానికి డీఎల్ వర్గం వ్యూహాలు పన్నుతోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కుమ్ములాటలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఎవరికి వారే నాయకులు. మంత్రి దానం నాగేందర్‌కు, ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డికి ఎక్కడా పడదు. ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. ఇక సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తోనూ దానంకు ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డిలో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి, మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్షారెడ్డికి మధ్య పెద్దఎత్తునే వార్ జరుగుతోంది. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డికి, మాజీ మంత్రి జానారెడ్డికి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. ఈమధ్య కాలంలో అవి మరింత ఎక్కువయ్యాయి. మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, మంత్రి దామోదర్ రాజనర్సింహకూ విభేదాలున్నాయి. ఇదే సమయంలో ఇటు గీతారెడ్డి, అటు రాజనర్సింహా ఇద్దరూ జిల్లాపై పట్టుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌రెడ్డికి, ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌కూ గొడవలు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్‌బాబుకు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. వరంగల్‌లో ఎమ్మెల్సీ కొండా మురళికీ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తీవ్రస్థాయిలో వర్గపోరు సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఎవరిగోల వారిదే. రేణుకాచౌదరికి, పొంగులేటి సుధాకర్‌రెడ్డికి ఎక్కడా సరిపడదు. ఇలా జిల్లా జిల్లాకో స్టోరీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చెప్పేందుకేముంది? స్వార్ధ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో తెలియజెప్పే మరో ఉదంతం ఇది. కాంగ్రెస్సే కాదు, తేదేపా, తెరాసా, బీజేపీ లాంటి అన్ని పార్తీలూ ఇలాగే తగలడ్డాయి. ఆలొచిస్తే ఒకటి మాత్రం బోధపడుతుంది. వీళ్ళ ద్రుష్టి పదవుల మీద, పట్టు మీదా, అధికారం మీదా వుందే కానీ ప్రజల మీదా, వాళ్ళ కస్టాల మీదా లేదు. దీనిక్కారణం ప్రజలే. ప్రజల ద్రుష్టి పార్టీల, వాటి అభ్యర్ధుల మంచితనం మీద కాక, వాళ్ళు ఇచే డబ్బు మీద, సారా మీద, కులం మీద, ప్రాంతం మీద ఉండబట్టే ఈ రొజు నాయకులు ఇలా తయారయ్యారు. మనల్ని మనమే నిందించుకోవాలి. నాయకులలో మార్పు రావాలంతే ఈ ప్రశ్నలను వేసుకోవాలి. వోటు వెయ్యడానికి డబ్బెందుకు తీసుకుంటారు? సారా పాకెట్లు తీసుకున్నాకా మంచి పార్టీలకి వోటు వెయ్యాలనిపిస్తుందా? చీరలూ, క్రికెట్టు కిట్లూ, వెండి భరిణెలూ, ఇతర బహుమతు తీస్కుని వోటుని అమ్మెస్కున్నాకా నాయకులలో మార్పు మంచితనం ఆసించగలమా? చదువుకున్న వాళ్ళు మాత్రం వెలగబెట్టిందేమిటీ? పోలింగు రోజు సెలవు ఎందుకు ఎంజాయ్ చేస్తారు? నూటికి నలభయ్ మందికి పైగా వోటు ఎందుకు వెయ్యట్లేదు? వోటు వెయ్యటానికి కుంటి సాకులు ఎందుకు చెప్తారు? వోటరు లిస్టు లో పేరుందో లెదో ముందే చూసుకోకుండా, పోలింగ్ రోజు నాడే టీవీ కెమేరాల ముందు ఏకరువు ఎందుకు పెడతారు? మంచి పార్టిలకి, అభ్యర్ధులకీ వోటు వెయ్యమంటే వేస్టవుందేమో అని ఎందుకనిపిస్తుంది? వోటు డబ్బుకీ, సారాకీ, బహుమతులకీ, కులానికీ, ప్రాంతానికీ, హీరోలకీ వేసి, ఎన్నికాలయ్యాకా మాత్రం భవిష్యత్తు ఎందుకు గుర్తుకొస్తుంది? వోటు బలహీనతలకి వేసాకా భవిష్యత్తు యెలా బావుంటుంది? వోతు వేసేటప్పుడు గుర్తుకు రాని భవిష్యత్తు, ఎన్నికలయ్యాకా గుర్తుకొస్తే ఎం లాభం? మనమిన్ని తప్పులు చేస్తూ, పార్తీలు, నాయకులూ మాత్రం నిజాతీగా యెలావుటారనుకుంటం? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పుకుంటేనే రాజకీయాలు, ఆపై మన భవిష్యత్తూ మారేది.