లవణం.. ప్రపంచంలోనే ప్రత్యేకమైన పేరు. పేరుకు తగ్గట్లే అత్యంత అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. నిస్వార్థంతో.. సమాజ హితమే పరమావధిగా చిరకాలం జీవించిన మహనీయుడు ఆయన. నాస్తికుడిగా, హేతువాదిగా ఆయన చాలామందికి నచ్చకపోవచ్చు.. కానీ, మానవతావాదిగా మాత్రం అందరి గుండెల్లోనూ నిలిచిపోయే అసలు సిసలు మనిషి ఆయన. మానవ జీవన పరమార్థాన్ని తన జీవనయానంలో ప్రతీక్షణం చూపించిన మహామనీషి.. లవణం.
85 ఏళ్ల వయస్సులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అభిమానులు, అనుచరులు ఘనంగా ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయన కోరిక మేరకు.. భౌతికకాయాన్ని ఆస్పత్రికి అందించారు. పత్రికలు, వార్తాఛానళ్లు ఆయన గొప్పతనాన్ని ప్రచురించాయి.. ప్రసారం చేశాయి. వీటిని ఎంతమంది చదివారో.. ఎంతమంది చూశారో..తెలియదు. కానీ.. ఆయన చేసిన సేవలకు నిజమైన గుర్తింపు లభించలేదన్నది మాత్రం నాకు తెలిసిన వాస్తవం.
లవణం గారితో ఉన్న పరిచయం.. చిన్నతనం నుంచి ఆయన్ను దగ్గరగా చూసి ఉండడం వల్ల .. ఆయన ఎంత గొప్పవాడన్నది నాకు తెలుసు. వాటిని అందరి ముందు ఉంచడం కూడా నా బాధ్యతని అనుకుంటున్నాను.
లవణం గారి గురించి తెలుగు వారికి, భారతీయులకు తక్కువే తెలుసన్నది నా అభిప్రాయం. కానీ, ఆయన ప్రభావం విదేశాల్లో ఎక్కువగా ఉంది. ఒక్కసారి Lavanam అని టైప్ చేస్తే 48 వేల వెబ్ పేజీలు ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఎక్కువగా విదేశాల్లో ఆయన గురించి రాసినవే. ఆయన చేసే సేవాకార్యక్రమాలకు దేశదేశాల నుంచి ఎంతో మంది నిధులు అందించారు. ఇప్పటికీ ఆయన స్ఫూర్తితో ఆయా దేశాల్లోనే కాక, ప్రపంచమంతటా సేవా కార్యక్రమాలను నడుపుతున్నారు.
పిల్లలు వద్దనుకునే తల్లిదండ్రులు అత్యంత అరుదుగా ఉంటారు. వ్యక్తిగత సమస్యల వల్లో, లేక ఆరోగ్య సమస్యల వల్లో పిల్లలను కనలేని వారే వీరిలో ఎక్కువమంది. లవణం-హేమలతా లవణం దంపతులకూ పిల్లలు లేరు. కాదు.. వారు పిల్లలు వద్దనుకున్నారు. పిల్లలుంటే వారి పెంపకం, వారికి ఆస్తిపాస్తులు సమకూర్చడం.. ఇలా ఎన్నో బాధ్యతలు మీదన పడతాయి. వాటిని నెరవేర్చే క్రమంలో మనిషికి స్వార్థం పెరిగిపోతుంది. దీన్నే ఆయన వద్దనుకున్నారు. సమాజసేవకే ఈ జీవితాన్ని అంకింతం చేయాలనుకున్న లవణం దంపతులు పిల్లల్ని వద్దనుకున్నారు. ఈ సమాజంలో అణగారిన వారంతా తమ పిల్లలే అనుకున్నారు. అందుకే, వారిద్దరినీ అమ్మా-నాన్న అంటూ పిలిచేవాళ్లు ఇవాళ వేలాదిమంది. కరుడుగట్టిన దొంగల సెటిల్మెంట్‌గా పేరుగాంచిన స్టువర్టపురం కావచ్చు.. జోగినీ దురాచారంలో మగ్గిపోయిన నిజామాబాద్ జిల్లాలో కావచ్చు.. లవణం దంపతులు ఎంతో మందికి తల్లిదండ్రులయ్యారు. వారి ఆలనాపాలనా చూశారు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు.
లవణం చేసిన కృషిలో కీలకం జోగినీ దురాచార నిర్మూలనా చట్టం. ఒకప్పుడు తెలంగాణలో... ముఖ్యమంగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో అత్యంత ప్రబలంగా ఉన్న దురాచారం. బలహీన వర్గాల మహిళలను, దేవుడి పేరిట మహిళను జోగినిగా ముద్రవేసి .. సెక్స్ స్లేవ్స్ గా మార్చేసిన మహమ్మారి అది. గ్రామాల్లోని దొరల కుటిలనీతికి నిదర్శనం ఈ దురాచారం. యుక్తవయస్సుకు రాకుండానే బాలికలను దేవతకు సమర్పించి.. వారిని అనుభవించే నీచమైన వ్యవహారం. ఈ దురాచారం చూసి చలించిపోయిన లవణం దంపతులు.. నిజామాబాద్‌కు వచ్చి దశాబ్దాల పాటు సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామగ్రామాన తిరుగుతూ, జోగినీ దురాచారం గురించి అవగాహన కల్పిస్తూ.. జోగినులుగా మారిన వారిని ... సాధారణ మహిళలుగా మార్చేందుకు అలుపెరుగని ప్రయత్నం చేశారు. వర్ని మండలంలో చెల్లినిలయం స్థాపించి .. అప్పటివరకూ జోగినీ అంటూ పిలిచిన మహిళను చెల్లీ అంటూ పిలిచి.. వారికి కొత్త జీవితం అందించారు. జీవనోపాధి లేకపోవడం వల్లే వాళ్లు ఆ మురికి కూపంలో కూరుకుపోతున్నారని గుర్తించి.. వారికి సాగు చేసుకోవడానికి పంటపొలాలను ఇవ్వడమే కాక, వారి పిల్లలను చదివించడానికి ఓ ఆశ్రమ పాఠశాలనూ నిర్వహించారు. తెలంగాణలో జోగినీ దురాచారం పూర్తిగా నిర్మూలన అయ్యిందంటే దానికి కారణం లవణం దంపతులే. ఎన్నో వేల కుటుంబాలు ఇవాళ ఆనందంగా జీవించగలుగుతున్నాయంటే దానికి కారణం లవణం దంపతులే.
మహాత్ముడి సిద్ధాంతాలతో ప్రేరణ పొంది, ఆయన అడుగుజాడల్లో నిస్వార్థంగా బతికిన మహా మనిషి లవణం. సమాజ సేవ పేరుతో నిధుల దోపిడీ జరుగుతున్నకాలంలోనూ తనకంటూ ఒక్క రూపాయిని కూడా దాచుకోకుండా మొత్తం సమాజానికే ఖర్చుపెట్టిన మహనీయుడు ఆయన. విలాసాలకు ఆయన బహుదూరం. నాకు తెలిసి ఆయనకు రెండో మూడో జతల బట్టలు మాత్రమే ఉండేవి. వాటినే చక్కగా ఉతుక్కుని వేసుకునేవారాయన. కానీ, ఆయన కింద పనిచేసిన వాళ్లు మాత్రం.. ఆయన్ను చాలా సార్లు చాలా రకాలుగా మోసం చేశారు. ఆయన కష్టపడి సేకరించిన నిధులను పక్కకు మళ్లించి జల్సాలు చేశారు. ఆయనకు ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం కూడా చేశారు. అయినా.. ఆయన అన్నింటినీ చిరునవ్వుతోనే స్వీకరించారు. ఎంతో పెద్దమనిషి అయినప్పటికీ తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ఆయనది. చివరివరకూ అదే ఆయనకు ఆభరణంగా నిలిచింది.
లవణం చదువుకున్నది కేవలం నాలుగో తరగతే. కానీ, పుస్తకాల కన్నా ఆయన సమాజాన్ని ఎక్కువగా చదివారు. సమాజంలో ఉన్న లోపాలను పూడ్చడానికి తనవంతు ప్రయత్నం చేశారు. రాజకీయనాయకులకు ఆయన అంత సన్నిహితుడు కాదు.. రాజకీయాలు చేయడమూ ఆయనకు రాదు. అవే వస్తే.. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన్ను వరించి ఉండేవి. కానీ.. లవణం ఎప్పుడూ తన వ్యక్తిగత గుర్తింపును కోరుకోలేదు.
నా జీవితాన్ని కూడా మార్చడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారకులు లవణం గారే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. బంధువులున్నా.. ఆర్థికంగా అండగా ఉండే పరిస్థితి ఎవరికీ లేదు. ఆ సమయంలో మా అమ్మకు ఉద్యోగం ఇచ్చారు. నాకు స్కాలర్ షిప్ వచ్చేలా చేశారు. వారి ఆశ్రమ పాఠశాలలో కొన్నాళ్లు ఉండి చదువుకునే అవకాశం కల్పించారు. ఆ స్కూలే నా జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పాలి. కులాలపై, మతాలపై నాకున్న పిచ్చి అవగాహన అక్కడే పోయింది. మానవత్వం అంటే ఏమిటో వారిని చూస్తే అర్థమయ్యింది. ఆ సమయంలో మా కుటుంబాన్ని ఆయన ఆదుకోకపోతే.. నేను ప్రస్తుతం ఈ జీవితాన్ని అనుభవించే వాడిని కాదు. ఏ దినసరి కూలీగానో.. చిన్నా చితకా ఉద్యోగం చేసుకుంటూనే గడిపేసేవాడిని.
కులమతరహిత సమాజాన్ని సృష్టించాలన్నది లవణం గారి ఆకాంక్ష. ఈటీవీ రిపోర్టర్ గా విజయవాడలో పనిచేసినప్పుడు తరచూ ఆయన్ను కలిసే అవకాశం ఉండేది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పెద్దగా కలవలేకపోయాను. కానీ.. నా వివాహానికి ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు నన్ను చూసి ఆయన పడ్డ ఆనందం మర్చిపోలేనిది. కాకపోతే.. పెళ్లికి రాలేననన్నారు. హిందూ వివాహ పద్ధతిని తాను గౌరవించనని, అలాంటి పెళ్లిళ్లకు రానని చెప్పేశారు. కేవలం కులాంతర వివాహాలకు మాత్రమే హాజరవుతానని చెప్పారు. అప్పటి వరకూ ఆయనకు తెలియదు.. ఆయన వల్ల నా మనసు కులాలకు అతీతంగా ఎదిగిందని. నేను చేసుకునేది కులాంతర వివాహం అని చెప్పేసరికి ఆయన మనస్సు ఉప్పొంగిపోయింది. నా వివాహానికి రావడమే కాదు ఆయన కులాంతర వివాహాల పేరుతో ప్రచురించిన పుస్తకంలోనూ నన్ను, నా భార్యను ప్రస్తావించారు. వారి ఆశయాల్లో కొంతవరకైనా నా వివాహం ద్వారా నెరవేర్చానన్న విశ్వాసం నాది.
మా పెళ్లిలో లవణం గారు |
ఉప్పును ఉప్పుగానే చూస్తే దానికి పెద్దగా విలువ ఇవ్వం. కానీ.. ఉప్పులేని కూర తిన్నప్పుడే దాని విలువ అందరికీ అర్థమవుతుంది. లవణం గారు కూడా అంతే. లవణంను లవణంగానే చూస్తే.. ఆయనో నాస్తికవాది అంటూ తీసి పారేసేవాళ్లు ఎక్కువ. కానీ.. సమాజంలో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, తీసుకొచ్చిన మార్పులను చూస్తే మాత్రం.. ఆ లవణం విలువ అందరికీ అర్థమవుతుంది.
లవణంగారు మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన ఆశయాలు బతికే ఉన్నాయి. ఆయన తీసుకురావాలనుకున్న మార్పులు ఇంకా ఎన్నోఉన్నాయి. ఆ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఆయన కల నెరవేర్చడానికి ఆయన వల్ల బాగుపడిన ప్రతీ ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది.
- సతీశ్ దేవళ్ల
కామెంట్‌ను పోస్ట్ చేయండి