7, మే 2010, శుక్రవారం
చిరంజీవి కొత్త వేషం..
ఈ ఫోటోలు చూశారా.. చిరంజీవి తాజా ప్రజా ఉద్యమం పోలవరం ప్రాజెక్టు సాధన కోసం తీయించుకున్న ఫొటోలు. ఉద్యమానికి ప్రచారం కల్పించడానికి ప్రజారాజ్యం పార్టీ ప్రచురించిన పోస్టర్లు. పీఆర్పీ అధినేత పర్యటించే వాడవాడలా ఈ పోస్టర్లను అతింకించారు. తలకు పాగా చుట్టి ఓ పోస్టర్‌లో కనిపించే చిరంజీవి.. మరో పోస్టర్‌లో భుజాన నాగలి కూడా మోస్తున్నారు. అంతేనా.. సినిమాల్లో తప్ప జనం మధ్యకు ఎప్పుడూ పంచెకట్టుతో రాని మెగాస్టార్.. ఇప్పుడు కండువాతో సహా.. పెద్దమనిషి అవతారం ఎత్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుబిడ్డలా మారిపోయారు. ఈ హాడావిడి.. ఈ గెటప్‌లు ఎందుకంటారా.. పోలవరం ప్రాజెక్టు ఒక్కదాని కోసమే కాదు.. మెగాస్టార్ మైండ్‌లో మరో మాస్టర్ ప్లాన్ ఉంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం చిరంజీవిని కలవరపెట్టింది. పైగా.. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇమ్మంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రోశయ్య సర్కార్ కూడా ప్రస్తుతం ప్రధానిపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తేలేకపోతోంది. పైగా మంత్రులు కూడా పూటకోమాట మాట్లాడుతుండడంతో.. పోలవరం ప్రాజెక్టును సాధిద్దామంటూ చిరంజీవి మహాయాత్రను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఉపయోగాలను.. అది నిర్మిస్తే రైతులకు కలిగే మేలును వివరించాలన్నది చిరంజీవి ఉద్దేశం. అందుకే.. పోలవరం వల్ల లబ్ది కలిగే ఆరు జిల్లాల్లో 17 రోజుల పాటు పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం నాడు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదినుంచి ఆయన పోలవరం యాత్రను ప్రారంభించారు. ప్రధానగ్రామ కూడళ్లలో ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ పోలవరం సాధన యాత్రకు భారీ పబ్లిసిటీ రావాలంటే.. సమ్‌థింగ్ ఢిఫరెంట్‌గా ఉండాలనుకున్న చిరంజీవి.. సరికొత్త గెటప్‌లతో ఫోజులు ఇచ్చారు. ఇప్పటికే ఈ పోస్టర్లు పబ్లిక్‌ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా కనిపిస్తున్న చిరంజీవిని చూసి జనం కూడా ముచ్చట పడుతున్నారు.
వైఎస్ రూట్లో చిరు
చిరంజీవి పోలికలను చూస్తుంటే.. ఏమనిపిస్తోంది? ఎవరినో అనుకరిస్తున్నట్లు లేదూ.. అవును.. రాష్ట్రరాజకీయాల నుంచి అకస్మాత్తుగా కనుమరుగైన ఓ మహానేత స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు చిరంజీవి. ఆయనలా కనిపిస్తూ.. ఆయనలా తయారవుతూ.. ఆయనలానే జనం గుండెల్లో గూడు కట్టుకోవాలనుకుంటున్నారు.. ఇంతకీ చిరంజీవి అనుకరిస్తుంది ఎవరిని? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డినే..
ఒకప్పుడు వైఎస్ ఛర్మిష్మా పెరగడానికి కారణమైన వస్త్రాలంకరణనే ఇప్పుడు చిరంజీవి అనుకరిస్తున్నారు. ఆయనలా తలపాగా కట్టారు. వైఎస్ తరహాలోనే ఫుల్‌సైజ్ పంచెకట్టుతో పోస్టర్లలో దర్శనమిచ్చారు. అంటే వైఎస్‌ను చిరంజీవి ఫాలో అవుతున్నారా? చిరంజీవి ప్రయత్నాలు చూస్తుంటే.. వైఎస్‌ను వందశాతం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం మద్దతు తేవడం కోసం రైతు అవతారం ఎత్తడానికి ప్రత్యేక కారణం ఉంది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువ లబ్ది కలిగేది రైతులకే. ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతోంది కూడా వారే. పైగా.. చిరంజీవి పర్యటించే ఆరు జిల్లాల పరిధిలో రైతుల సంఖ్య చాలా ఎక్కువ. వీరందరినీ ఆకట్టుకోవాలంటే... వారిలానే తయారవ్వాలి. అందులోనూ సినీటెక్నిక్‌లు బాగా తెలిసిన చిరంజీవికి ఈ తరహా ఫార్ములాలు బాగా తెలుసు. పైగా.. తెలుగుపంచెకట్టుతో వైఎస్ సృష్టించిన సునామీ అంతా ఇంతాకాదు. ఏరకంగా చూసినా.. తలపాగా.. పంచెకట్టు బాగా కలిసి వస్తాయని నమ్ముతున్నారు చిరంజీవి. అందుకే.. ఈ గెటప్ వేశారు.
వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. సమైక్య, ప్రత్యేక ఆందోళనలతో అభివృద్ధి ఆగిపోయింది. ప్రాజెక్టుల పనులూ పెండింగ్‌లో పడ్డాయి. ఈ సమయంలో రైతుల పక్షాన ఉండే నాయకులు కరువయ్యారు. రైతులతో కలిసి వారికోసం పోరాడే నేతలు ఎవరూ లేరన్న విషయం గుర్తించిన చిరంజీవి.. ఆ స్పేస్‌ను కవర్ చేస్తున్నారు. పార్టీ పెట్టినప్పుడు యువతే ప్రధాన బలం, వారే ఓటుబ్యాంక్ అనుకున్న చిరంజీవికి.. రైతులు.. రైతుకుటుంబాలు.. సామాన్యుల ఓట్లు ఎంత అవసరమో ఆలస్యంగా తెలిసి వచ్చింది. అందుకే.. ఇప్పుడు రైతుల పంచన చేరాలనుకుంటున్నారు. దానికోసమే... వేషం మార్చారు..గమ్యాన్ని కూడా మార్చుకున్నారు. మొత్తంమీద చూస్తుంటే... వైఎస్ ఛరిష్మాను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంటున్నారు చిరంజీవి. పోలవరం యాత్రతోనే అందుకు శ్రీకారం చుట్టారు.
నాడు వైఎస్.. నేడు చిరంజీవి
వైఎస్ రాజశేఖరరెడ్డి.. రాష్ట్ర పరిపాలనను కొత్త పుంతలు తొక్కించిన ముఖ్యమంత్రి. హైటెక్ మాటలను పక్కనపెట్టి.. సామాన్యుడి సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యమన్న వ్యక్తి. చెరగని చిరునవ్వుతో.. ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ చేరువయ్యారు వైఎస్ రాజశేఖరరెడ్డి. అయితే.. ఈ స్థాయికి చేరడం వెనక వైఎస్ శ్రమ ఎంతో ఉంది. ప్రతిపక్షంలో ఉండగానే.. మండుటెండల్లో పాదయాత్ర చేశారు వైఎస్సార్. రాష్ట్రం నలుమూలలా తిరిగి.. రైతు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పంచె.. తలపాగాతో జనం దృష్టిలో తమవాడిగా ముద్రవేయించుకున్నారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండే హామీలన్నీ వైఎస్ చలువే. పాదయాత్ర సమయంలో రైతు సమస్యలను స్వయంగా చూసిన రాజశేఖరరెడ్డి.. ఉచిత విద్యుత్, జలయజ్ఞం తప్పనిసరని నిర్ణయించుకున్నారు. అధికారంలోకి రాగానే పనులు మొదలుపెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో.. 32 మేజర్ ప్రాజెక్టులు, 17 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. తను ఉన్నంతకాలమూ బడ్జెట్‌లో సింహభాగాన్ని జలయజ్ఞానికే కేటాయించారు. కానీ.. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనుమతుల కోసం ప్రభుత్వం నామమాత్రంగా ప్రయత్సిస్తుండడం.. ఆరేళ్లైనా పూర్తిస్థాయిలో ఒక్కపెద్ద ప్రాజెక్టూ సిద్ధం కాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు చిరంజీవి. మెగాస్టార్ పోషిస్తున్న ఈ కొత్త పాత్రపై.. ఆయన అభిమానులూ హ్యాపీగానే ఉన్నారు. వైఎస్ లోటు తీర్చేది కూడా చిరంజీవే అంటున్నారు.
జలయజ్ఞం ద్వారానే వైఎస్ పాపులారిటీ పెరిగిందని గుర్తించిన మెగాస్టార్.. ఆ ప్రాజెక్టులు తనద్వారానే సాకారం కావాలనుకుంటున్నారు. అందుకే.. జలయజ్ఞంలో అతిపెద్ద ప్రాజెక్టైన పోలవరంపై ఉద్యమం మొదలుపెట్టారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు ఉన్న క్రెడిట్.. జలయజ్ఞమే. పైగా.. సమైక్య, ప్రత్యేకాంధ్రల విషయంలో పార్టీ రెండుగా చీలిపోయి ఉంది. ఈ నేపథ్యంలో సమైక్యరాష్ట్రానికి మాత్రమే మద్దతు పలుకుతున్న చిరంజీవికి పార్టీపరంగానూ ఈ యాత్ర మేలు చేయనుంది. ప్రజల్లోకి వెళ్లడం మొదటి ఉద్దేశమైతే.. రైతుల్లో, గ్రామాల్లో పార్టీ పునాదులను పటిష్టం చేయాలనుకోవడం రెండోది. అయితే.. రాజకీయ ఎదుగుదల కోసమే ఉద్యమం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మాత్రం చిరంజీవి ఖండిస్తున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చే విషయం ఎలాగూ ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. ఒకవేళ ఇచ్చినా.. తన ఉద్యమం వల్లే అని చిరంజీవి గర్వంగా చాటుకోవచ్చు. లేదంటే.. మళ్లీ మళ్లీ పోరాటం చేయడానికి ఎలాగూ అవకాశాలుంటాయి. అందుకే పీఆర్పీ అధినేత ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. అయితే.. వైఎస్‌లా గెటప్‌ను మాత్రం జనంలో వేసుకోవడంలేదు.. ప్రస్తుతానికి పోస్టర్లకే పరిమితం చేశారు. తొడలు కొట్టడాలు.. మీసం మెలేయడాలకు బదులు తలపాగా మాత్రం వీలున్న చోట్లల్లా కడుతున్నారు. కొన్నాళ్లకు పూర్తి పంచెకట్టులోనే చూడొచ్చేమో..
పోలీకే లేదు...
అయితే.. చిరంజీవికీ.. వైఎస్‌కూ పోలికా? అంత సీన్ లేదంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. తలపాగా చుట్టి.. పంచె కట్టినంత మాత్రాన వైఎస్ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయలేరంటున్నారు. చిరంజీవికి.. వైఎస్‌కు చాలా తేడా ఉందంటున్నారు.
ఇక చిరంజీవి వేషధారణతో పీఆర్పీకీ మేలే ఎక్కువ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా.. పంచెకట్టు, తలపాగా అనేవి తెలుగు సంప్రదాయం కావడంతో.. రైతుల్లోకి సులువుగా వెళ్లే అవకాశం ఉంటుంది. చిరంజీవికి ఉన్న మరో అడ్వాంటేజ్.. ఏ వేషం వేసినా నప్పడం. వైఎస్‌లా పంచెకట్టి తలపాగా చుట్టి.. చంద్రబాబు జనంలోకి వెళ్లలేరు. ఆయన స్టైల్ వేరు. ఇతర ఇతర నేతలు ఎవరూ కూడా ఆ తరహాలో జనంలో కలిసి తిరగలేరు. ఇప్పుడు అవకాశం ఉన్నది ఒక్క చిరంజీవికి మాత్రమే. అయితే.. వేషానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రజాసమస్యలపైనా, రైతుఉద్యమాలపైనా దృష్టిపెడితే.. దానివల్ల చాలా లాభాలను పీఆర్పీ పొందే అవకాశం ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నదులు లేని చోట వంతెనలు కట్టేవాడు రాజకీయ నాయకుడు అని అన్నారు. సూటు, బూటు విప్పి పగటి వేషాలు వేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులే.
దానిదేముందిలే ప్రవీణు, వంతెన కట్టాలంటే నదే వుండాలా? మామూలుగా దాటడానికి వీలు కాని లోయలుంటే కట్టకూడదా చెప్పు?
rajakeeyule kadu. raja neetignulu unnaru.
nenu pedda natudini.kavuna ee vesham. nammakandi