22, ఏప్రిల్ 2010, గురువారం
ప్రమాదంలో భూగ్రహం
Categories :
సృష్టిలో తీయని పదం అమ్మ. తల్లంటే అందరికీ ఇష్టమే. మరి మన భూమికి కూడా.. అందరికీ తల్లే. అందుకే.. మనం మాతృభూమని కూడా పిలుచుకుంటాం.. కానీ.. మనం మన భూమాతకు.. ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా.. చూడాల్సినంత ఆప్యాయంగా చూసుకుంటున్నామా.. ఒక్కసారి ఆలోచించండి..
గ్రహాలు.. ఉపగ్రహాలు.. అవి తిరిగే నక్షత్రాలు.. సౌర మండలాలు.. ఇలా రకరకాలు నిండిపోయిన విశ్వమంతా ఒకెత్తయితే.. మనం జీవిస్తున్న ఈ భూమండలం మరో ఎత్తు. సూర్యుడిని పోలిన నక్షత్రాలు ఒకటి కాదు.. ఎన్నో ఉన్నాయి.. అంగారకుడిని పోలిన గ్రహాలు ఈ అనంత విశ్వంలో ఎన్నో. సూర్యమండలం లాంటి వ్యవస్థలు మరెన్నో. కానీ.. భూమి లాంటి గ్రహం మరొక్కటైనా ఉందా... ఇప్పటివరకైతే లేదనే చెప్పాలి.. అందుకే.. మన భూమి.. ఈ విశ్వంలోనే విశిష్టమైనదనుకోవాలి.
కోట్లాది జీవరాసుల సంగమమే.. మన భూమండలం. భూమిని నమ్ముకొని.. భూమిని ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిమలు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల జాతుల జీవనానికి భూమి ఆధారమవుతోంది.
భూమండలాన్ని పోలిన గ్రహాన్ని కనుక్కోవడానికి, జీవరాశి ఉన్నగ్రహాలను కనిపెట్టడానికి.. ప్రపంచ ఖగోళశాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంతవరకూ అలాంటి ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రాణకోటి జీవించడానికి అవసరమైన.. నీరు, గాలి మన భూమి మీద మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. జీవరాశులు ప్రాణాలతో ఉండడానికి అవసరమైన వాతావరణం కూడా మన భూమికే సొంతం. సూర్యుడి నుంచి వచ్చే ప్రాణాంతక కిరణాలను అడ్డుకొని.. జీవరాశికి ఎలాంటి హానీ కలగకుండా చూస్తోంది భూవాతావరణం. అందుకే.. కొన్ని కోట్ల సంవత్సరాలుగా జీవరాశి.. భూమిపైన ఉండగలుగుతోంది.
ఈ సృష్టిలోనే అరుదైన ఆలోచనా శక్తిని, అపర మేథస్సునూ కలిగిన మనిషికీ నీడనిచ్చింది భూమి. నడకను, నడతను నేర్పించింది. కానీ.. ఇలా ఎన్నో రకాలుగా అనంత కోటి జీవరాశికి దోహదపడిన ఈ భూమికి ఇప్పుడు పెనుప్రమాదం ముంచుకొస్తోంది. ఓ రకంగా భూమి మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యంది. ఎంతోకాలం మన భూమి ఇలా స్వచ్ఛంగా ఉండకపోవచ్చు. పూర్తిగా విషపూరితం కావచ్చు. అదే జరిగితే.. భూమిపైన జీవరాశే మిగలదు. ఒక్కసారిగా మనుషులూ.. జంతుజాలం లేని భూమి ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఊహించుకోండి...
ఈ ఊహే అత్యంత భయంకరంగా ఉంది కదూ. చూస్తుంటేనే వెన్నులో వణుకుపుడుతోంది కదూ... కానీ.. ఈ పరిస్థితి రావడానికి మరెంతో కాలం పట్టేలా లేదు. త్వరలోనే భూమిపైన ఈ పరిస్థితులు ఏర్పడవచ్చు.
కాలం మారింది
వేసవి మొదలయ్యింది. ఏప్రిల్ నెలలోనే ఎండలు. ఒక్కక్షణం ఎండలోకి వెళితే ప్రాణం పోయినట్లవుతుంది.. మే కూడా రాకుండానే.. ఎండలు ఇంతగా ఎందుకు మండుతున్నాయి?
ఓ వైపు ఎండ బాధలు తట్టుకోలేక పోతుంటే.. మరోవైపు హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు. భారీగాలులతో విరుచుకుపడుతున్న వర్షం మన రాష్ట్రంలో రెండుమూడు రోజులుగా తీరని నష్టాన్నే కలగజేసింది. కోతకు సిద్ధమవుతున్న వరి పొలాలు నేలకొరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొంతకాలం క్రితం వరకూ.. ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. కానీ.. ఈమధ్య కాలంలో తరుచూ ఇలాంటి పకృతి విపత్తులు ఊహించని విధంగా ముంచెత్తుతున్నాయి. అయితే... ఇది ప్రకృతి పొరపాటు ఎంతమాత్రమూ కాదు. మనంతట మనం కొని తెచ్చుపెట్టుకున్నదే. ముఖ్యంగా రెండు శతాబ్దాలుగా మనిషి జీవితంలో చోటు చేసుకున్న మార్పులే ఈ ప్రకృతి ప్రకోపానికి కారణం. అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న మనం.. పర్యావరణానికి.. మాతృభూమికి చేయాల్సిన మేలును మరిచిపోతున్నాం. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న మనం.. ఈ భూమిని, గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాం. పారిశ్రామికంగా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న మనం.. వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే కర్భన ఉద్గారాలను గాల్లోకి పంపిస్తున్నాం. ఓ వైపు పర్యావరణం పాడవుతుందని తెలిసినా... మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇప్పుడు ప్రపంచంలోనూ ఏమూలకు వెళ్లినా కాలుష్యపు నీడలే. ఫ్యాక్టరీ గొట్టాల నుంచి. .మోటరు వాహనాల నుంచి.. నల్లగా వెలువడుతూ.. మానవాళిని కమ్మేస్తున్న పొగలే. ఇవే భూమికి ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు.. ఇళ్లల్లో వాడే ఏసీలు... రిఫ్రిజిరేటర్లు మనల్ని కూల్‌గానే ఉంచుతున్నా.. ఈ భూమిని మాత్రం వేడెక్కిస్తున్నాయి.
వాస్తవానికి పర్యావరణం నిరంతరం మార్పులు చేర్పులకూ లోనవుతూ ఉంటుంది. అయితే... అవన్నీ ప్రకృతి పరంగా జరిగేవే. అలాంటి మార్పులు జరగడం వల్లే.. భూమిపైన జంతుజాలం ఆవిర్భవించింది. కానీ.. మనిషి కారణంగా ఈ విపత్తుల తీవ్రత మరింత పెరుగుతోంది. దీనివల్ల మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడనుంది.
విషవాయువులుగా భావించే వాటిలో ప్రధానమైంది.. కార్బన్ డై ఆక్సైడ్. వాతావరణంలో దీని వాటా పెరిగే కొద్దీ.. మనం ఎదుర్కొనే దుష్పరిణామాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం దీనిస్థాయి.. 390 పీపీఎంను చేరుకొంది. కొన్నేళ్లుగా చూస్తే.. ఈ స్థాయి ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడం... ప్రపంచవ్యాప్తంగా.. పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. దీని స్థాయి.. 350 లోపునకు వస్తే.. భూమి మళ్లీ మామూలు స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. దీనికోసం.. కాలుష్యాన్ని వీలైనంతగా తగ్గించాల్సి ఉంటుంది.
తల్లిలాంటిది భూమి
తల్లి జన్మనిస్తే.. ఆ తల్లితో పాటు.. మనకూ బతుకునిస్తుంది భూదేవి. మనిషికి అవసరమైన అన్ని వనరులనూ భూమి ఉచితంగానే ఇస్తోంది. మనిషి ఆధునికతను నేర్చుకుంటూ.. భూమిపై భారాన్ని మోపుతుంటే.. ఓపికగా వాటినీ భరిస్తూ వచ్చింది. కానీ.. మనిషి ఆశకు హద్దు లేకపోవడంతో.. ఆ భారం ఇప్పుడు ఎక్కువైపోయింది. భూమి భరించలేనంతగా పెరిగిపోయింది. ఓ రకంగా భూమి మనుగడనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి వెళ్లిపోతోంది..
మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం ఇదే. కాలుష్యం పెరుగుతుండడంతో భూవాతావరణం విపరీతంగా వేడెక్కుతోంది. కొన్నేళ్లుగా దీనిపై దృష్టిపెట్టిన ప్రపంచ దేశాలు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఐక్యరాజ్యసమితి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అయితే.. పెద్దదేశాలన్నీ కూడా చిన్నదేశాలపైనే నెపాన్ని నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా విపరీతమైన కాలుష్యాన్ని గగనతలంలోకి పంపించి.. అభివృద్ధి చెందిన దేశాలు.. ఆపనిని అభివృద్ధి చెందుతున్న దేశాలు చేయకూడదంటున్నాయి. అలాగని.. కర్భన ఉద్గారాలను అగ్రరాజ్యాలు తగ్గించుకుంటున్నాయా అంటే అదీ లేదు. ఇదే ఇప్పుడు అసలు సమస్య. ధనికదేశాల తీరుతో... పర్యావరణ పరిరక్షణకు ముందడుగు పడడం లేదు.
భూమిని కాపాడుకుందాం
అడవులు నరికేయడం, కాలుష్యం పెంచడం కారణంగా ఇప్పటికే.. ఎన్నో రకాల జీవజాలం అంతరించిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగితే.. మనిషి ఉనికి కూడా మాయం అవుతుంది.
విపరీతంగా ప్లాస్టిక్‌ను వాడడం.. క్యారిబ్యాగ్‌ల రూపంలో.. పాలథిన్‌ను పడేయడం చేస్తున్నాం. ఈ వ్యర్థాలు మన మాతృభూమికి శత్రువులుగానే భావించాలి. ఇవి భూమిలో కరిగే పదార్థాలు కావు. పైగా మట్టిని విషపూరితం చేస్తాయి. సారాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సింది మనమే.
మనం నిత్యావసరాలనుకుంటున్న వస్తువులే.. పర్యావరణానికి సంకటంగా మారుతున్నాయి. పచ్చని చెట్లతో ఉండే అడవులు మాయమవుతుంటే.. సిమెంట్ కట్టడాలతో కూడుకున్న కాంక్రీట్ జంగిల్స్ విస్తరిస్తున్నాయి. సుఖం కోసం వెంపర్లాడుతున్న మనం.. విద్యుత్‌ను విపరీంతగా వాడుతున్నాం. పగలూ రాత్రీ తేడా లేకుండా కరెంట్‌ను వినియోగిస్తున్నాం. పగటిపూట కూడా సుర్యుడి నుంచి వచ్చే సహజమైన వెలుతురుని వాడుకోలేకపోతున్నాం. దీనివల్లే సమస్యలు.. దీనికి పరిష్కారం ఒక్కటే చెట్లు నాటడం. ఇంట్లోకి వీలైనంతగా వెలుతురు వచ్చేలా ఇళ్లు కట్టుకోవడమూ ఇప్పుడు ముఖ్యమే.
అంతేకాదు.. కర్భన మిశ్రమాలను వాడడం తగ్గించాలి. అవసరం ఉన్నా లేకపోయినా.. టూవీలర్‌నో, ఫోర్ వీలర్‌నో వాడడం మనకు అలవాటైపోయింది. వీటి వాడకాన్ని తగ్గించి.. సైకిల్ వినియోగాన్ని పెంచాల్సి ఉంది. ఇప్పటికే.. దీనికోసం ప్రత్యేకంగా క్లబ్‌లు కూడా పనిచేస్తున్నాయి. సైకిల్ వాడడం వల్ల ఇటు పర్యావరణానికి, అటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
మనం అనుభవిస్తున్నట్లే ఈ భూమిని మన తర్వాతి తరాలు కూడా అనుభవించాలి. అందుకు ప్రతీ ఒక్కరూ నడుంకట్టాలి. ముఖ్యంగా విద్యావ్యవస్థలోనే పర్యావరణ పరిరక్షణను భాగం చేస్తే.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.
భూమిమీద పచ్చదనం క్రమంగా కనుమరుగువుతోంది. దీనికి ఇప్పుడే ఫుల్‌స్టాప్ పడాలి. అందుకే అందరం చేయీ చేయూ కలపాలి. మన మాతృభూమిని రక్షించుకోవడానికి మనమే పాటుపడాలి. చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే.. అంత మేలన్న విషయం మనకు తెలిసిందే. అందుకే.. వీలైనన్ని చెట్లు నాటుదాం.. ఇదొక్కటే మనం మన భూమితల్లికి చేసే మేలు. అసలు గ్లోబల్ వార్మింగ్‌కు కారణాలేంటే.. వార్మింగ్ నిజమా కాదా... అంటూ చర్చలను ఆపేద్దాం.. మొక్కలను నాటుదాం.. ఇది అందరికీ మేలు చేసేదే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి