22, ఏప్రిల్ 2010, గురువారం
అనంత స్వర్ణమయం ఆగుతుందా..?
నిలువెల్లా బంగారు ఆభరణాలతో కొలువైన తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి రెండు కళ్లూ చాలవు. ఇప్పటివరకూ ఉన్న ఆభరణాలు చాలవన్నట్లు.. భక్తులు అర్పించే స్వర్ణాభరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.. శ్రీవారి భాండాగారాన్ని నింపుతూనే ఉన్నాయి. శ్రీవారి వైభోగానికి తగ్గట్లుగానే.. ఆయన ఆలయమూ అత్యద్భుతంగా ఉంటుంది. బంగారు తాపడంతో మిరిమిట్లు గొలిపే స్వర్ణగోపురం కోనేటిరాయుడి సొంతం
ప్రస్తుతం శ్రీవారి కొలువు తీరిన ఆనంద నిలయాన్ని పూర్తిగా బంగారు మయం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే.. అనంతస్వర్ణమయం ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అయితే.. ప్రాజెక్టును టీటీడీ పాలకమండలి ప్రకటించినప్పటినుంచీ వివాదాలు మొదలయ్యాయి. ఇది ఆగమ శాస్త్ర్రాలకు విరుద్ధమంటూ ఎంతోమంది వాదించారు. చివరకు ఈ వివాదం హైకోర్టును కూడా చేరింది. స్వర్ణమయం ప్రాజెక్టును ఆపివేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తాత్కాలికంగా పనులు చేపట్టకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై పూర్తిస్థాయి విచారణ జరిపి.. తుది తీర్పు వెలువరిచేంతవరకూ.. టీటీడీ తీర్మానాలను అమలు చేయకూడదంటూ ఆదేశాలను కూడా హైకోర్ట్ ఇచ్చింది. దీంతో.. అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్.. ప్రస్తుతానికి అటకెక్కింది.
ఆదికేశవులు ప్రయత్నాలు
శ్రీనివాసుని ఆలయ శిఖరం బంగారం పులుముకొంది ఇటీవలి కాదు.. చాలాఏళ్ల క్రితమే జరిగింది. ఎన్నో ఏళ్లుగా టీటీడీ పాలకమండలి ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నా అనంత స్వర్ణమయం చేయాలని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు. అందుకే.. ఆలయ కట్టడాల్లో మార్పులు చేర్పులు చేసినా.. ఎప్పుడూ ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని భావించలేదు. అందుకే.. చెక్కు చెదరకుండా.. ఆలయం అలానే ఉంది..
కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదికేశవులునాయుడు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో అప్పుడే.. స్వర్ణమయం ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. బంగారు గోపురంతో పాటు.. ఆనందనిలయం గోడలనూ స్వర్ణమయం చేయిస్తే తన పేరు చిరకాలం ఉండిపోతుందని ఆయన భావించారు. అందుకే.. ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారు. అనంత స్వర్ణమయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ.. చాలాకాలం క్రితమే.. చెన్నైకి చెందిన ఓ భక్తుడు ఈ అనంత స్వర్ణమయే ప్రాజెక్టు ప్రతిపాదనను టీటీడీ బోర్డు ముందు ఉంచాడు. కానీ.. దీన్ని బోర్డు తోసిపుచ్చింది. మళ్లీ.. ఇప్పుడు అనంత స్వర్ణమయం కోసం ఆదికేశవులు పూనుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మాత్రం, దీన్నిపూర్తిగా ఖండిస్తున్నారు. తాను చేసేది వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదని.. వెంకటేశ్వరుడి కోసమే అంటున్నారు. పైగా ఇదంతా చేయించేది కూడా శ్రీవారే అన్నట్లుగా మాట్లాడుతున్నారు టీటీడీ ఛైర్మన్. ఓ వైపు అనంత స్వర్ణమయం ప్రాజెక్టును వివాదాలు చుట్టుముడుతున్నా వెనక్కితగ్గేలా కనిపించడం లేదు ఆదికేశవులు నాయుడు. చాలాకాలం తర్వాత ఆలయాన్ని బంగారు మయం చేసే పని మొదలయ్యిందని.. ఇది కొనసాగుతుందే తప్ప ఆగదనీ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. భక్తులు కోరుకుంటే.. ఆలయం మొత్తం స్వర్ణమయం అవుతుందంటున్నారు.
రాయలే చేయించలేదు
అనంత స్వర్ణమయం పనులు వేగంగానే సాగుతున్నాయి. బంగారు రేకులు తయారు చేసే కార్యక్రమం ఇప్పటికే మొదలయ్యింది. అక్టోబర్ 1, 2008న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనంత స్వర్ణమయం పనులు ప్రారంభించారు. బంగారాన్ని కరిగించడం.. ఆనంద నిలయం గోడలకు అతికించడానికి వీలుగా రేకులను తిరుమలలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసుడి ఆలయం గోపురం ఇది వరకే స్వర్ణమయం అయ్యింది. కానీ.. ఆలయం అంతా బంగారుతాపడం ఎందుకు చేయించలేదన్న ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే.. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. రాజుల కాలం నుంచే.. శ్రీనివాసునికి బంగారు కానుకలు అందడం మొదలయ్యింది. శ్రీవారి భక్తుల పేర్లు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయులే. శ్రీవారిసేవలో తరించిన ఆయన.. ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం.. 1518 వ సంవత్సరంలో.. ఆలయ శిఖరానికి బంగారు పూత వేయించాడు. ఇలా తొలిసారి శ్రీవారి ఆలయం స్వర్ణమయం అయ్యింది. శ్రీకృష్ణ దేవరాయులు కేవలం శిఖరం వరకే బంగారు పూత వేయించాడు తప్ప.. ఆలయం గోడలకు తాపడం చేయించలేదు. ఒకవేళ చేయించాలని అనుకుంటే అదేమీ పెద్ద విషయమూ కాదు. శిఖరంతో పాటే ఆలయం మొత్తం స్వర్ణమయం అయి ఉండేది. కానీ.. అలా జరగకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆనంద నిలయం గోడలపైన ఎన్నో శాసనాలు ఉన్నాయి. ఆనాటి చరిత్రకు, ఆలయ వైభవానికి ఇవి ప్రతీకలు. బంగారు తాపడం చేయిస్తే.. ఇవన్నీ మరుగున పడిపోతాయన్న ఆలోచన వల్లే.. గోడలను వదిలేశారు.
ఈ వివాదాన్ని ఎదుర్కోవడం కోసం ఆదికేశవులు నాయుడు ముందుగానే సిద్ధమయ్యారు. ఆలయగోడలపై ఉన్న శాసనాలను సీడీల రూపంలో భద్రపరిచారు. వీటిని కొంతకాలం క్రితం ఆదికేశవులు నాయుడే విడుదల చేశారు. కానీ.. ఇవి ఎంతమందికి అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్నార్థకమే. దీనికి తోడు.. ఇప్పుడు బంగారు రేకులతో తాపడం చేయించడమంటే.. ఆలయానికి కొన్ని వేల మేకులను కొట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఆలయ కట్టడానికి ప్రమాదం ఏర్పడవచ్చు. అంతేకాదు.. బంగారు తాపడం చేయడంతోనే పనైపోదు.. దానికి ఎప్పటికప్పుడు మెరుగు పెడుతుండాలి. కొన్నేళ్లకోసారైనా కొత్తగా తాపడం చేయిస్తుండాలి. 1958కి ముందు ఆలయ శిఖరానికి ఏడు సార్లు కొత్తగా తాపడం చేయించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పూర్తిగా ఆలయం అంతటికీ అంటే.. భవిష్యత్తులే నిర్వహణ కూడా కష్టం కావచ్చు. ఇలా ఏ రకంగా చూసినా.. అనంత స్వర్ణమయం చేయడం వల్ల ఆలయానికి ఇబ్బందులే తప్ప.. జరిగేమేలేమి లేదని చాలామంది వాదిస్తున్నారు.
వీఐపీల చుట్టూ ప్రదిక్షణలు
అనంత స్వర్ణమయం ప్రాజెక్టులో భాగంగా.. ఆలయ శిఖరంతోపాటు గోడలకూ.. 18 ద్వారాలకూ బంగారు తాపడం చేయించాలన్నది ఆదికేశవులు నాయుడి ప్రతిపాదన. దీనికోసం 200 నుంచి 250 కిలోల వరకూ బంగారం అవసరమవుతుందని ప్రాథమిక అంచనాలో తేలింది. ఈ మాత్రం బంగారమంటే.. శ్రీవారికి ఒక లెక్కేకాదు. ఆయన భాండాగారంలో ఇప్పటికే 4700 కిలోల బంగారం ఉంది. వీటిలోనుంచి 250 కిలోల బంగారాన్ని తీసుకోవడం ఏమాత్రం కష్టంకాదు. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ అనంత స్వర్ణమయ ప్రాజెక్టు కోసం శ్రీవారి బంగారాన్ని గానీ, నిధులను గానీ వాడుకోకూడదని టీటీడీ బోర్డు తీర్మానించింది. ఈ ప్రాజెక్టు కోసం.. ప్రత్యేకంగా విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఆ క్షణం నుంచి అదే పనిలో మునిగిపోయారు టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు. ఆలయానికి వచ్చే వీఐపీలందరికీ రాచమర్యాదలు చేస్తూ వారి నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.
ఆదికేశవులు ప్రయత్నాలు ఫలించి.. స్వర్ణమయం ప్రాజెక్టుకు భారీగానే విరాళాలు అందుతున్నాయి. తొలి విడతలో ఐదు కోట్ల రూపాయల భూరి విరాళాన్ని అందజేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, మలివిడతగా ఇటీవలే మరో కోటి 13 లక్షలను ఇచ్చారు. ఇక లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో తనకున్న సన్నిహిత సంబంధాలను తెలివిగానే ఉపయోగించుకున్నారు ఆదికేశవులు. 18 ద్వారాలను బంగారుతాపడం చేయించడం కోసం ఆయన్నుంచి 6 కోట్ల రూపాయలను విరాళంగా తీసుకున్నారు. ఇక ఐపీఎల్ చైర్మన్ తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆయన్నూ వదల్లేదు. ప్రత్యేక దర్శనం చేయించి.. రూ.5 కోట్ల రూపాయలను విరాళమిస్తానని ఆయన్నుంచి హామీ పొందారు. ఇందుకోసం వీరందరికీ హైక్లాస్ ట్రీట్మెంట్ను తిరుమలలో ఇచ్చారు.
దీనికి తోడు.. అనంతస్వర్ణమయం కోసం కోటిరూపాయల్లోపు డబ్బును, బంగారాన్ని ఇస్తున్న వారి సంఖ్యకు కొదవే లేదు. ఇప్పటికే 125 కిలోల బంగారం ఈ ప్రాజెక్టు కోసం టీటీడీకి అందింది. ఈ విరాళాలు సేకరించడం, బంగారు తాపడం పనులు అప్పజెప్పడంలో కొన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది. ఈ అనంత స్వర్ణమయం చేసే విషయంలో ఈవోకు, ఛైర్మన్మధ్య ఇప్పటికే యుద్ధం కొనసాగుతోంది.
అయితే.. శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేస్తే తప్పేంటన్న ప్రశ్ననూ కొంతమంది పండితులు వేస్తున్నారు. తిరుమల ఆలయానికి మరింత ఖ్యాతి వచ్చే అవకాశం ఉన్నప్పుడు స్వర్ణమయం చేయాలన్న ఆలోచనే సరైందంటున్నారు. అసలు స్వర్ణమయం కోసం వీఐపీల చుట్టూ టీటీడీ చైర్మన్ ప్రదిక్షణలు చేయడం.. వారికి అంగరంగ వైభవంగా ఆహ్వానం పలకడం.. ఇదంతా సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును చేపట్టే బదులు.. ఆ సొమ్మును భక్తుల కోసం వినియోగించాలని వేదపండితులు కోరుతున్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం హాయిగా కలిగేలా చూడడంమాని.. ఇలాంటి పనులకు టీటీడీ పాలకమండలి పాల్పడడం సరికాదంటున్నారు. మొత్తంమీద హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే.. శ్రీవారి స్వర్ణమయ ప్రాజెక్టు కొనసాగుతుందా లేదా అన్నది అధారపడి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బంగారం ధర ఎందుకు పెరుగుతోందో ఇప్పుడు అర్ధం అయ్యింది. ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి దబ్బులు లేవు, స్రీవారికి మాత్రం అంతా స్వర్ణమయం, ఎవరికోసం?