22, మార్చి 2010, సోమవారం
నీటి పోరాటం
మార్చి 22.. వరల్డ్ వాటర్ డే. పరిశుభ్రమైన తాగునీటిని అందరికీ అందిచాలన్నది ఈ ఏడాది ఆశయంగా.. ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. సమితి సూచనలను అన్ని దేశాలు పాటించి.. ప్రజలకు శుభ్రమైన తాగునీరు దొరికేలా చూడాలి. కానీ.. మన దగ్గర శుభ్రమైన నీటి సంగతి అటుంచితే.. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి..
వేసవి ఇప్పుడే మొదలయ్యింది. మెల్లమెల్లగా ఎండలు మండుతున్నాయి. మే కాదు కదా.. ఏప్రిల్ కూడా ఇంకా రాలేదు. అయినా.. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పట్టణాలు.. గ్రామాలు అన్న తేడా లేదు.. ఎక్కడ చూసినా ఒకటే సమస్య. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మే నెల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో.. ఊహించుకోవచ్చు.
హైదరాబాద్, విశాఖ నగరాల్లోనూ ప్రజలకూ తాగునీటి ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి. విశాఖలో ఈనెల మొదటి రోజు నుంచే.. రెండు రోజులకోసారి నీటి సరఫరా మొదలుపెట్టారు. కొన్ని కాలనీల్లోకి మంచినీళ్లే రావడం లేదు. హైదరాబాద్ సంగతి సరేసరి.. రాజధాని మొత్తానికి 400 MGD నీరు అవసరం కాగా.. వాటర్‌బోర్డు మాత్రం.. కేవలం 290 MGD నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే రిజర్వారయర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో.. నల్లాల ద్వారా అందిచాల్సిన కోటాకు వాటర్‌బోర్డు కోత పెడుతోంది. నీటిని సరఫరా చేసే సమయాన్ని కూడా తగ్గించింది. ఇక ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే కాలనీల్లో.. నీటికోసం పడిగాపులు తప్పడం లేదు.
చెలమలే దిక్కు..
నీటికోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం.. ఏ వాగులోనో వంకలోనే గుంతలు తవ్వి వచ్చే కొద్దిపాటి నీటిని తోడుకోవడం.. ఏ చెలమ దగ్గరకో చేరుకొని.. ఒక్కోబొట్టూ జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడం.. ఇవన్నీ ఎడారి జీవితాల్లో కనిపించే దృశ్యాలు.. కానీ.. ఇప్పుడు మన రాష్ట్రం కూడా వీటికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్రామాలకు గ్రామాలే... ఎడారులుగా మారుతుంటే.. గంగమ్మను అందుకోవడం కోసం జనం.. భగీరథ ప్రయత్నాలనే చేయాల్సి వస్తోంది.
కడపజిల్లా రాయచోటి మండలంలోని కాటినేనివాండ్ల పల్లి గ్రామంలో ఏర్పడ్డ నీటి ఎద్దడి.. రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుంది. గ్రామంలో ఉన్న పంపులు పాడయ్యాయి. దీంతో.. మంచినీటి కోసం మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. పోనీ అక్కడైనా.. పరిశుభ్రమైన నీరు దొరుకుందా అంటే అదీ లేదు. కొండ కింద ఉన్న ఓ చిన్న ఊటే ఇప్పుడు ఈ గ్రామానికి నీరందిస్తోంది. అక్కడ ఉబికే నీళ్లలోనే దిగి.. ఆ నీరే తోడుకుంటారు. ఈ చెలిమిలో నీరు తాగడం సురక్షితం కాకున్నా.. ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే.. తప్పడం లేదంటారు గ్రామస్తులు.
ఇక నిజామాబాద్ జిల్లాలోని.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. జుక్కల్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గొంతు తడుపుకోవాలంటే.. ఉదయాన్నే బిందెపట్టుకుని వాగుల్లోకి పరుగులు తీయాల్సిందే. వాగుల్లో గుంతలు తవ్వి.. అందులో వచ్చే నీటిని పట్టుకోవాలి. ఎన్నికల సమయంలో రక్షితమంచినీటి కోసం హామీల మీద హామీలు ఇచ్చే నాయకులు.. ఎండాకాలంలో మాత్రం తమవైపు చూడరంటూ.. జనం గోడు వెళ్లబోసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్‌లో పరిస్థితి మరీదారుణం. గ్రామాల్లో నీటిపంపులు పనిచేయకపోవడంతో.. పొలాల్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ నీరు తాగితే రోగాలు వస్తాయని తెలిసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సి వస్తోందంటున్నారు. ఓ గ్రామంలో నీటి సమస్య కారణంగా.. ఆ గ్రామానికి చెందిన అబ్బాయితో నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి ఆపేశాడు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన అమ్మాయి తండ్రి.
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నా..
రాష్ట్రంలోని ప్రజలందరికీ.. విద్య, ఉపాధి, ఆవాసం కల్పించినా.. కల్పించకపోయినా.. సురక్షితమైన మంచినీటిని అందించడం మాత్రం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. వేసవి వచ్చిందంటే రాష్ట్రంలో నీటి సమస్య ఎక్కువవుతుందని ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకూ... ఇలా అందరికీ తెలుసు. అయినా.. ప్రతీఏటా ఈ సమస్య పెరుగుతోందే తప్ప... పరిష్కారమయ్యింది మాత్రం లేదు. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా.. మేలో రావాల్సిన నీటి ఇబ్బందులు.. ఈ సారి మార్చి నెలలోనే తలెత్తాయి...
ప్రభుత్వానికి ప్రతీ గ్రామమూ ఇంపార్టెంటే. అందుకే.. రక్షితమంచి నీటి సరఫరాకోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ మన రాష్ట్రంలో ఎప్పుడో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం ఈ మంత్రి పదవిని పి. విశ్వరూప్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సమస్య లేకుండా చూడడం.. అందరికీ సురక్షితమైన నీరు అందేలా చర్యలు తీసుకోవడం ఈయన బాధ్యత. బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నా.. జిల్లాలకు నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్నా.. వాస్తవంగా జరుగుతున్నది మాత్రం వేరు. ఎక్కడికక్కడ కరువు పరిస్థితులే.
మార్చి మొదలైనప్పటి నుంచీ రాష్ట్రంలో మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. చివరకు ముఖ్యమంత్రి కూడా నీటి ఎద్దడి ఉందని సభా ముఖంగా ఒప్పుకున్నారు.కానీ, సమస్య పరిష్కారానికి మాత్రం తీసుకున్న చర్యలు ఒక్కటీ కనిపించవు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు పెద్దవారికి పట్టవు. ఇక ప్రత్యేక మినిస్టీ ఉండి ఏం లాభం.. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఏం ఉపయోగం.. ఇప్పుడు జిల్లాకో కోటి రూపాయలు ఇస్తామంటున్నారు. ఇవన్నా చేరి జనానికి నీళ్లు దొరికితే అదే మేలు.
నడుం కట్టాలి
మన భూమిపై మూడింట రెండొంతులు నీరే ఉన్నా.. తాగడానికి మాత్రం సామాన్యుడికి శుభ్రమైన నీరే దొరకడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న నీటితో పాటు.. కలుషిత నీటిని తాగడం వల్ల ఎంతోమంది ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై.. వాటర్ డాట్ ఓఆర్‌జి అనే సంస్థ రీసెర్చ్ చేసి ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. ప్రపంచంలో 634 కోట్లమందికి పైగా జనాభా ఉంటే.. వీరిలో దాదాపు 36 లక్షల మంది... నీటి సంబంధ వ్యాధులతో చనిపోవచ్చని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో 40 శాతం డయేరియా కేసులే ఉంటాయి. ఇక చిన్నపిల్లలే ఎక్కువగా రోగాలబారిన పడనున్నారు. వాటర్ డాట్ ఓఆర్‌జి లెక్కల ప్రకారం 84 శాతం చిన్నారులు ఈ సమస్యను ఎదుర్కోనున్నారు. సునామీ వచ్చినప్పుడు చనిపోయిన వారితో.. ఈ సంఖ్య దాదాపు సమానం. సునామీకి అంతులేని ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వాలు.. మంచినీటి విషయంలో ఇవ్వడం లేదు.
వాగులపైనో.. చెలమలపైనో ఆధారపడుతున్నారని ప్రభుత్వం.. ప్రజలను పట్టించుకోకుండా వదిలేస్తోంది. కానీ.. ఇంతకన్నా పెద్దతప్పు మరొకటి ఉండదు. సురక్షితమైన నీరు తాగకపోవడం వల్ల.. రకరకాల రోగాలకు వీరంతా గురయ్యే ప్రమాదముంది. ఈ విషయంలో.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలందరికీ సురక్షితమైన నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యింది సరే.. కానీ.. ఇందులో ప్రతీ ఒక్కరి తప్పు కూడా ఉంది. నీరనగానే.. మనకు ఎక్కడలేని చిన్నచూపు. వృథా చేయడంలో మనమే నెంబర్ వన్. అందుకే.. భూగర్భ జలాలు ఇప్పుడు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. నీటి వృథాను అరికట్టాలని ఎంతో ప్రచారం చేస్తున్నా.. మార్పు మాత్రం రావడం లేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే.. మన భవిష్యత్ తరాలకు వర్షాకాలంలో నీరు దొరకడమూ గగనే అవుతుంది.
అందుకే.. ప్రతీఒక్కరూ నీటి ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. నీటిని పొదుపుగా వాడడమే కాదు.. వర్షం పడినప్పుడు భూమిలోపలికి వెళ్లాలా కూడా చూడాలి. దీనికోసం ఎవరూ మీ వెనక పడరు.. మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను ఉపయోగించుకుంటే.. మనకు మరో ఎండాకాలం ఈ తరహా సమస్యరాదు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి