24, మార్చి 2010, బుధవారం
ఏడాదిలో వెయ్యి కోట్లు...
చిట్.. లోక్లాస్ నుంచి హైక్లాస్ దాకా.. ప్రతీ ఒక్కరి పెట్టుబడి మార్గం. తాహతును బట్టి చిట్టీ వేయడం.. అవసరం కోసం డబ్బు కూడబెట్టుకోవడం.. మనవాళ్లు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ.. చిట్‌ఫండ్ కంపెనీలను నమ్మి డబ్బు కడుతుంటే.. జనం నెత్తిన అవి కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఈ ఏడాది కనీసం.. వెయ్యి కోట్లకు పైగా చిట్టీలు కట్టి జనం నష్టపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిట్ ఎందుకు?
ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది.. అవసరానికి మాత్రం వేలల్లో డబ్బు కావాల్సి వస్తుంది. వడ్డీ దొరుకుతుందో లేదో తెలియదు.. ఒకవేళ దొరికినా.. వడ్డీ కట్టగలమో లేదో తెలియదు. సామాన్యులను ఎక్కువగా వేధించే సమస్య ఇది. వీటన్నింటికీ పరిష్కారం.. చిట్టీ. నెలసరి సులభ వాయిదాలు.. ఆకర్షణీయమైన మొత్తాలు.. చిట్స్ కట్టేలా అందరినీ ప్రేరేపిస్తున్నాయి. ముందు పాడుకున్న వారికి.. తక్కువ వడ్డీకే డబ్బు అందుతుండగా.. చివరివరకూ ఉన్నవారికి.. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువే వస్తుంది. అందుకే.. చిట్టీలు కడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సర్వేలో.. రిజిస్టర్ చిట్‌ఫండ్స్‌లో చిట్స్ వేస్తున్న వారి సంఖ్య మన రాష్ట్రంలోనే అత్యధికం. 14 లక్షల కుటుంబాలు.. నిత్యం చిట్స్ కడుతున్నట్లు అంచనా. వీరు కడుతున్న మొత్తం 7200 కోట్ల రూపాయలు. అంటే భారీ వ్యాపారమన్నమాట. ఇదంతా అధికారికంగా జరుగుతున్నదే. ఇవికాక.. నోటిమాటమీద కట్టుకునే చిట్టీలకు లెక్కేలేదు. ప్రతీ వీధిలోనూ.. ఎవరో ఒకరు ఈ తరహా చిట్టీలు వేస్తూనే ఉంటారు. అధికారికంగా జరిగే వ్యాపారంతో పోల్చితే.. ఈ అన్‌ఆథరైజ్‌డ్... బిజినెస్ దాదాపు రెట్టింపు.
ఇళ్ల మధ్య జరిగే చిట్‌ఫండ్ మోసాలే చాలా ఎక్కువ. నమ్మకంగా జనం నుంచి డబ్బులు కట్టించుకునే చిట్‌ఫండ్ యజమానులు.. పెద్దమొత్తంలో చేతికందగానే ఉడాయిస్తున్నారు. ప్రతీరోజు రాష్ట్రంలో ఏదో ఓ మూల ఇలాంటి మోసం వెలుగుచూస్తూనే ఉంది. చిట్ కాలవ్యవధి ముగిసిన తర్వాత.. కొంతమంది మా దగ్గర డబ్బు లేదంటూ చేతులెత్తేస్తున్నారు. విశాఖలో తాజాగా ఓ మహిళ.. కోటి రూపాయలకు పైనే జనాన్ని ముంచేసింది. సీబీఎం కాంపౌండ్ ప్రాంతానికి చెందిన అప్పలనరసమ్మ కొంతకాలంగా చిట్టీలు వేస్తోంది. మామూలు చిట్టీలతో పాటు దసరా స్కీం పేరుతో ప్రత్యేకంగా చిట్టీలు నిర్వహిస్తోంది. చిట్టీలు పాడుకుంటున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో జనం ఆమెను నిలదీశారు. అంతే.. నా దగ్గర డబ్బులు లేవంటూ చేతులెత్తేసింది. అందరికీ కలిపి కోటి రూపాయలకు పైగా ఇవాల్సి ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్ము.. చేతికందకపోవడంతో.. చిట్ కట్టినవాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
బోర్డు తిప్పిన ఉమా
చిట్ వేయడమే పాప మయ్యింది... లక్షలాది రూపాయలు డిపాజిట్ చేయడం మహా నేరమయ్యింది. కష్టపడి కట్టిన సొమ్ములో ఒక్క పైసా అన్నా అందుతుందో లేదోనన్న సంశయం ఇప్పుడు వెంటాడుతోంది. విజయవాడ ఉమాచిట్స్ స్కీముల్లో చేరిన వారి పరిస్థితి ఇది. ఒకటీ రెండూ కాదు.. ఇప్పటివరకూ బయటపడ్డ మొత్తాలే 84 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. పూర్తి వివరాలు తేలితే.. వందకోట్ల రూపాయలకు పైనే తేలవచ్చు.
ఈ జనవరి నుంచి.. ఉమా చిట్స్ డిపాజిట్ దారులకు వడ్డీలను చెల్లించడం మానేసింది. చిట్స్ కట్టిన వారికీ చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో ఒక్కొక్కరుగా వత్తిడి తెచ్చే సరికి.. యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో.. కస్టమర్లంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులే మూడు వందలకు పైగా ఉన్నాయి. ఉమాచిట్స్ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. చట్టాలను ఉల్లంఘించి మరీ ఈ సంస్థ డిపాజిట్లు సేకరించింది. పేరుకు డిపాజిట్లని చెప్పినప్పటికీ.. కస్టమర్లకు మాత్రం... ఉమా చిట్స్ డైరెక్టర్.. ఉమామహేశ్వరుడు అప్పు తీసుకుంటున్నట్లుగా ప్రామిసరీ నోట్లు మాత్రమే రాసి ఇచ్చారు. దీంతో.. వీటిని వ్యక్తిగత అప్పుగానే పరిగణించాల్సి వస్తోంది. దీనికి తోడు.. కొంతకాలం క్రితమే ఆయన ఐపీ పెట్టడానికీ ప్రయత్నించినట్లు సమాచారం. ఉమామహేశ్వరుడి చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువమంది వృద్ధులు ఉండడం కలవర పరుస్తోంది. జీవిత చరమాంకంలో పనికివస్తాయన్న డబ్బును కొల్లగొట్టిన ఉమామహేశ్వరుడిపై... జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెజవాడలోనే ఎక్కువ
సాయిలత చిట్ ఫండ్... వంద కోట్ల రూపాయలు..
ఉమా చిట్స్.. 84 కోట్ల రూపాయలు..
వసుధ చిట్స్... 60 కోట్ల రూపాయలు
అనుపమ చిట్స్.. 30 కోట్ల రూపాయలు..
ఈ లెక్కలు చిట్‌ఫండ్ కంపెనీల టర్నోవర్ కాదు. ఏడాది కాలంలో విజయవాడలో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీలే ఇవన్నీ. పైగా ఇవన్నీ సత్యనారాయణ పురంలోనే ప్రధానంగా వ్యాపారాలను నిర్వహించడం విశేషం. ఎటు చూసినా గుళ్లు గోపురాలతో కనిపించే ఈ ప్రాంతాన్నే చిట్‌ఫండ్ యజమానులు తమ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకోవడం చూస్తుంటే.. మోసాల వెనక ఎంతో ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తుంది. పొదుపు చేసే వాళ్లు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడంతో వారి లక్షణాన్నే తమ వ్యాపారంగా మార్చుకున్నారు చిట్ ఫండ్ కంపెనీల యజమానులు. కేవలం చిట్టీలు మాత్రమే కాదు.. అత్యధిక వడ్డీ ఆశచూపి మరీ.. కోట్లు కొల్లగొట్టారు. వీరిని నమ్మి జీవితాంతం సంపాదించింది వడ్డీకిస్తే చివరకు మిగిలింది ప్రామిసరీ నోటే..
నమ్మించి డిపాజిట్లు సేకరించడం.. ఆ తర్వాత నట్టేట ముంచడంలో విజయవాడ చిట్ కంపెనీలు ఆరితేరిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోని సాయిలత చిట్‌ఫండ్ విజయవాడలో మూతపడింది. ఈ కంపెనీ యజమాని రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. సడన్‌గా మూతపడింది. ఇందులో చిట్స్, డిపాజిట్లు కట్టిన వారంతా ఆందోళన చేయడంతో.. పోలీసులు మిగిలిన నిర్వహాకులను అరెస్ట్ చేశారు. ఇందులో వందకోట్లకు పైగానే జనం డబ్బు నష్టపోయారు. ఇక ఆ తర్వాత వసుధ చిట్స్.. 60 కోట్ల రూపాయలకు.. అనుపమ చిట్స్.. 30 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టాయి. ఇవి కాక.. కాలనీల్లో మూసేసిన వ్యాపారాలకు లెక్కేలేదు. ఏరకంగా చూసినా ఈ సంస్థలన్నీ కలిపి 300 కోట్ల రూపాయలకు పైగానే జనాన్ని ముంచేశాయి.
సేఫ్టీ ఎలా?
అన్ రిజిస్టర్డ్ చిట్ సంస్థల్లో చేరితేనే మోసం జరుగుతుందనుకుంటే పొరపాటే. ఇప్పుడు రిజిస్టర్ సంస్థల్లోనూ చిట్‌లకు గ్యారెంటీ లేదన్న విషయం.. వరసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే తేలిపోతోంది. చిన్నమొత్తాల పొదుపునకు ప్రత్యామ్నయంగా మారిన చిట్.. ఇప్పుడు చీటింగ్‌కు మారుపేరయ్యింది. చిట్టీల వ్యాపారులంతా ఛీటర్‌లుగా అవతారమెత్తుతున్నారు. ఏళ్ళ తరబడి నమ్మకంగా ఉంటూ ఒక్కసారిగా సబ్ స్క్రైబర్‌లను బురిడి కొట్టిస్తున్నారు. అందుకే చిట్ నిర్వాహకులను గుడ్డిగా నమ్మకూడదు. చీటి వేసేటప్పుడే ఆ సంస్థ బ్యాక్ గ్రౌండ్ తోపాటు అందులో ఉండే సభ్యుల వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వాయిదాలను ఏజెంట్లకు కాకుండా.. నేరుగా ఆఫీసుకు వెళ్లి కడితే మంచిది. ఇదే సమయంలో సంస్థ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆరా తీస్తుండాలి. కంపెనీ మూతపడుతుందన్న సమాచారం రాగానే... కొంతమంది తమవరకూ న్యాయం జరిగితే చాలనుకుంటూ సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తారు. మిగిలిన వారికి విషయాన్ని తెలియనివ్వరు. ఈ పద్దతి సరికాదు.
అయితే.. ఇళ్లదగ్గరో.. తెలిసినవాళ్లో చిట్టీలు వేస్తున్నారు కదా అని కడితే అది మరింత ప్రమాదం. వారు ఎప్పుడు మాయమవుతారో ఎవరికీ తెలియదు. పైగా.. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మాత్రం ఈ డబ్బును వాడేసుకునే ప్రమాదముంది. పైగా రిజిస్టర్ చిట్స్ అయితే.. వారి ఆస్తులను జప్తు చేసైనా.. ఎంతో కొంత దక్కించుకునే అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కాని వాటి విషయంలో ఇలా చేసే అవకాశమే ఉండదు.
చిట్‌ఫండ్ కంపెనీల విషయాల్లో విధివిధానాలు అమలు చేయాలని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి. పేరున్న సంస్థలే మోసం చేయడంపై.. ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నాయి. ఇక డిపాజిట్ల విషయంలోనూ ఇంతే.. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని అత్యాశకు పోవద్దు. లేదంటే.. అసలుకే ఎసరు రావచ్చు.
చట్టాలెక్కడ?
మన రాష్ట్రంలో చిట్‌ఫండ్ మోసాలు కొత్తేమీ కాదు... ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నవే. దేశవ్యాప్తంగా చిట్స్ వేసే విషయంలో మొదటిస్థానంలో ఉన్న మనం.. చిట్స్ మోసాల విషయంలోనూ అదేస్థానంలో ఉన్నాం. ఎంతోమంది ప్రజల జీవితాలను ముఖ్యంగా సామాన్యులను ప్రభావితం చేస్తున్న ఈ చిట్స్‌ను నియంత్రించడంలో మాత్రం మన ప్రభుత్వం విఫలమయ్యిందనే చెప్పాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కడికక్కడ చిట్స్ నిర్వహిస్తున్నా.. ఎవరికీ పట్టదు. కేంద్రస్థాయిలో చిట్స్ నిర్వహణపై పకడ్బందీ చట్టం ఉంది. చిట్ వేసే మొత్తానికి సమానమైన ష్యూరిటీని బ్యాంక్‌నుంచి నిర్వాహకులు చూపించాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్టప్రభుత్వానిదే. కానీ... మన సర్కార్ మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. నియమనిబంధనలను ఉల్లంగిస్తూ.. డిపాజిట్లు సేకరిస్తున్నా పట్టించుకోవడం లేదు.
చిట్స్ అనేది ఓ బెట్‌లా మారిపోయింది. వీలైనంతవరకూ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను ఎంచుకుంటే మేలు. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు.. తమ సొమ్మును ప్రైవేటు చిట్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టే కన్నా వడ్డీ కాస్త తక్కువైనా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేస్తే మేలు. సొమ్ముకు భద్రత ఉండడంతో పాటు రాబడి కూడా కచ్చితంగా వస్తుంది.
చిట్ వేసే ముందు.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి. చిట్ కంపెనీ చెప్పే మాయమాటలకు మోసపోకండి. సొమ్ము తక్షణం అవసరం ఉండదనుకుంటే.. రికరింగ్ డిపాజిట్స్ రూపంలో మదుపు చేసుకోండి. అసలుకే ఎసరు వచ్చే కన్నా.. తక్కువ వడ్డీ రావడమే మేలు కదా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి