23, నవంబర్ 2009, సోమవారం
బాబ్రీ ప్రకంపనలు
ప్రశాతంగా ఉన్న దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన ఐటెం. బాబ్రీ మసీదు విధ్వంసంలో.. బిజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ప్రధానపాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. బాబ్రీ కూల్చివేతపై సుదీర్ఘకాలంపాటు విచారణ జరిపి.. హోమంత్రికి.. జస్టిస్ లిబర్హాన్ కమిషన్ అందించిన రిపోర్ట్‌ను బయటపెట్టింది. హోంమంత్రిత్వ శాఖలోని కీలక సోర్సుల ద్వారా సమాచారం అందిందని పేర్కొన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బిజేపీ నేతలను టార్గెట్ చేసుకొని కథనాన్ని ప్రచురించింది. చలికాలం మంచు తెరలు తొలగకుండానే.. బిజేపీలో సెగలు పుట్టించిందీ కథనం. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ వద్ద సురక్షితంగా ఉండాల్సిన రిపోర్ట్.. లీక్ అవ్వడంపై ఆ పార్టీ భగ్గుమంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో.. లిబర్హాన్ నివేదిక.. ప్రతికలో రావడంపై బిజేపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించడానికే.. ఈ రిపోర్ట్‌ను ప్రభుత్వం లీక్ చేసిందని ఆరోపించింది. లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్ లీక్ అవ్వడంపై.. పార్లమెంట్ దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ఇది సభాహక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు. హోంమంత్రిత్వ శాఖ ద్వారానే సమాచారం అందిందని పత్రికాకథనంలో చాలా స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు.. లిబర్హాన్ కమిషన్ ఇచ్చిన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
రిపోర్ట్ సేఫ్?
దీనిపై హోమంత్రి చిదంబరం సూటిగా స్పందించలేదు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిషన్ ఇచ్చిన నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతామని తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తయారు చేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అయితే.. హోంమంత్రిత్వ శాఖ నుంచి మాత్రం రిపోర్ట్ లీకవ్వలేదని... కమిషన్ ఇచ్చిన ఒకే ఒక్క కాపీ.. తమ కస్టడీలో భద్రంగా ఉందన్నారు. అటు రాజ్యసభలోనూ గందరగోళం చెలరేగింది. బిజేపీ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడులు.. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రిపోర్ట్ లీకవ్వడంపై దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇంతకీ పేపర్లో ఏముంది?
లిబర్హాన్ కమిషన్ చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాత్రం.. వాజ్‌పేయి, అద్వానీ, జోషిలు ప్రధాన దోషులంది. ప్రభుత్వానికి లిబర్హాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఉన్నట్లు కొన్ని ప్రస్తావనలను ప్రముఖంగా ప్రచురించింది. సంఘ్ పరివార్ వాదిస్తున్నట్లు.. బాబ్రీ మసీదు విధ్వంసం అనూహ్యంగా జరిగిన సంఘటన కాదని.. పక్కాగా ప్లాన్ చేసిందే అన్నది అందులో మొదటిది. విధ్వంసం తర్వాత దానితో తమకు సంబంధం లేదని బిజేపీ సీనియర్ నేతలు చెప్పినప్పటికీ.. బాబ్రీ విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నట్లు.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. సంఘ్ పరివార్ ప్రముఖ నేతలుగా.. చలామణీ అయిన వాజ్‌పేయి, అద్వానీ, జోషిలకు తెలియకుండా ఈ తరహా నిర్ణయాలు తీసుకోరని కమిషన్ అభిప్రాయపడింది. రామమందిర నిర్మాణం కోసం అద్వానీ, జోషిలు చేసిన రథయాత్రలనూ ప్రస్తావించింది. పైగా రామమందిర నిర్మాణ ఉద్యమంలో ప్రజలెప్పుడూ భాగస్వాములు కాలేదంది. బిజేపీ, వీహెచ్‌పీ.. ఇతర హిందూసంస్థల నేతలు బలవతంగా ప్రజలను ఇందులోకి లాగారని రిపోర్ట్‌లో ఉన్నట్లు.. పత్రికా కథనం. అంతేకాదు... కరసేవకుల కోసం అయోధ్యలో ముందుగానే ఏర్పాట్లు చేశారని తేల్చి చెప్పింది. ఇందుకోసం ప్రజల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల నిధులు.. ఉద్యమ నేతల బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యాయని లిబర్హాన్ కమిషన్ తేల్చినట్లు సమాచారం. అయితే.. వాజ్‌పేయి పేరును ప్రముఖంగా ప్రస్తావించడంపై మాత్రం తీవ్ర దుమారం చెలరేగుతోంది. బాబ్రీ విధ్వంసంలో ఎప్పుడూ అటల్ పేరు బయటకు రానప్పటికీ.. కమిషన్ ఆయన్ను దోషిగా ప్రకటించడంపై బిజేపీ తీవ్రంగా స్పందించింది. అదీ.. రాజకీయాలనుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిపై అభాండాలు వేయడం సరికాదంటూ.. అద్వానీ.. లోక్‌సభలోనే తీవ్రంగా విమర్శించారు.ఇదే సమయంలో ముస్లిం సంస్థల పనితీరునూ కమిషన్ దుయ్యబట్టిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం స్పష్టం చేస్తోంది. బాబ్రీ విధ్వంసాన్ని అడ్డుకోవడం ఇవి విఫలమయ్యాయని లిబర్హాన్ తన నివేదికలో పేర్కొన్న విషయాన్నిఈ పత్రిక బయటపెట్టింది. బిజేపీపైనా, ముస్లిం సంస్థలపైనా ఇంతగా విరుచుకపడ్డ.. లిబర్హాన్ కమిషన్.... కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం.
వివాదాల కమిషన్
డిసెంబర్ 6, 1992... బాబ్రీ మసీదుపై కరసేవకులు విరుచుకుపడ్డారు. దేశం నలుమూలల నుంచీ.. అయోధ్యకు దూసుకువచ్చిన దాదాపు లక్షన్నరమంది కరసేవకులు... మసీదు కూల్చి.. రామమందిర నిర్మాణానికి పునాది వేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్షలాదిమంది కరసేవకులను పోలీసులు చూస్తుండిపోయారే తప్ప.. వీరిని ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరపడానికి కేంద్రప్రభుత్వం... జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబర్హాన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బాబ్రీ విధ్వంసం.. తదనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులెవరన్నది తేల్చడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని జస్టిస్ లిబర్హాన్‌ను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేయలేకపోయిన కమిషన్ గడువును... మొత్తం 48 సార్లు ప్రభుత్వం పెంచింది. మొత్తంమీద చూస్తే.. పూర్తి విచారణకు 17 సంవత్సరాల సమయం పట్టింది. విచారణకు దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. జూన్ 3, 2005 ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ను విచారించడంతో.. కమిషన్ దర్యాప్తును పూర్తి చేసింది. కానీ.. తుది నివేదిక సమర్పించడానికి మరో నాలుగేళ్ల సమయం తీసుకొని.. ఈ ఏడాది జూన్ 30న హోమంత్రికి లిబర్హాన్ నివేదికను అందజేశారు. దీన్ని పరిశీలించి.. దోషులపై చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం ఓ రిపోర్ట్‌ను రూపొందించాల్సి ఉంది. అయితే.. ఈ లోగానే రిపోర్ట్ లీకయ్యింది... మరి దీన్ని లీక్ చేసింది ఎవరు?
హోంమంత్రా?
జస్టిస్ లిబర్హాన్ రిపోర్ట్‌ను నేరుగా హోమంత్రికి అందజేశారు. అది కూడా ఒకే ఒక్క కాపీ ఇచ్చారని, తమ వద్ద అది సురక్షితంగా ఉందని హోమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాత్రం హోంమంత్రిత్వ శాఖనుంచే తమకు సమాచారం అందిందని నేరుగా పత్రికలో ప్రకటించింది. అంటే.. హోంమినిస్టర్ కార్యాలయంలోని వారే లీక్ చేశారా? హోంమంత్రి చేతుల్లో ఉన్న కాపీ బయటకు ఎలా వచ్చింది?
కాంగ్రెస్ పార్టీనా?
ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి.. ప్రభుత్వం వద్ద ఉన్న ఈ నివేదికలోని అంశాలు ఆ పార్టీ నేతలకు కచ్చితంగా తెలిసే ఉంటాయి. అందులోనూ... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ప్రతిపక్ష నేతలే కావడంతో.. ఈ పార్టీ వ్యూహాత్మకంగా ఈ రిపోర్ట్‌ను లీక్ చేసి ఉండొచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ హ్యాండ్‌నూ కాదనలేం...
లిబర్హానా?
ఇక పూర్తి రిపోర్ట్ ఉన్న మరో ఏకైక వ్యక్తి.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసిన జస్టిస్ లిబర్హాన్. హోంమంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ పార్టీ కాకపోతే.. ఈయన దగ్గర నుంచైనా లీక్ అయ్యి ఉండాలి. కానీ ఈ విషయం అడిగితేనే లిబర్హాన్ కస్సు మంటూ ఒంటికాలిపై లేస్తున్నారు. రిపోర్ట్‌ను లీక్ చేయాల్సిన అవసరం తనకు లేదంటున్నారు.
ఎపిసోడ్లు..
ఏదో కొద్దిపాటి సమాచారం మాత్రమే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు లభించినట్లు లేదు. పత్రికా కథనాన్ని చూస్తుంటే.. పూర్తినివేదిక ఆ పేపర్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్‌కు సంబంధించి పార్ట్-వన్‌ను మాత్రమే ప్రచురించినట్లు ప్రకటించింది. ఓ సీరియల్ తరహాలో వరసగా ప్రచురిస్తామని పేర్కొంది.మొత్తంమీద చూస్తుంటే.. ఈ రిపోర్ట్ లీక్ చేయడంపై హోంమంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ పార్టీపైనే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి