9, నవంబర్ 2009, సోమవారం
కన్నడనాట తెలుగుగాలి
కర్నాటక సంక్షోభం సమసిపోయింది. రాకరాక దక్షిణాదిన తొలిసారి ఓ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపీ ప్రభుత్వం.. పద్దెనిమిది నెలలకే కూలిపోతుందేమోనన్నంతగా అందరినీ కలవరపెట్టిన రెబల్స్.. ఎట్టకేలకు మెట్టుదిగారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా తన పట్టు విడిచారు. మొత్తంమీద అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా.. కర్నాటకం ముగిసిపోయిందని ప్రకటించగలిగింది బిజేపీ అధిష్టానం. కర్నాటకలో బిజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్ఫష్టం చేసింది. ఈ సంక్షోభం ముగిసిపోవడానికి వెనుక ...
ఎన్నో నాటకీయ పరిణామాలు. పార్టీ చీల్చడానికి సిద్ధమన్నంత వరకూ వెళ్లారు.. పర్యాటకశాఖమంత్రి గాలి జనార్దనరెడ్డి నేతృత్వంలోని అసమ్మతి వాదులు. హైదరాబాద్‌లో క్యాంప్ వేసి.. కన్నడనాట సెగలు పుట్టించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటు చేసిన.. గాలి సోదరులు.. రాష్ట్రంలో అధికారాన్ని మార్చాల్సిందేనంటూ.. డిమాండ్ చేశారు. తొలుత చిన్న సమస్యగానే అనుకున్న బిజేపీ నేతలకు.. వారం రోజులు దాటినా అసమ్మతివాదుల డిమాండ్ మారకపోయేసరికి పరిస్థితి చేదాటుతోందన్న విషయం మాత్రం అర్థమయ్యింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. అటు యడ్యూరప్పవర్గాన్ని.. ఇటు గాలి వర్గాన్ని బుజ్జగిస్తూనే.. తమ దారికి తెచ్చుకున్నారు. దీంతో రెండు వారాలుగా కర్నాటక బిజేపీ సర్కార్‌పై కమ్ముకున్న నీలినీడలు తొలిగిపోయాయి
పచ్చగడ్డివేస్తేనే భగ్గుమంటున్న ఈ రెండు వైరివర్గాల మధ్య.. సయోధ్య కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఘనత బిజేపీ మహిళానేత సుష్మాస్వరాజ్‌ది. చాకచక్యంగా వ్యవహరించిన ఆమె.. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి.. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఒకరిమొహం మరొకరు చూడడానికే ఇష్టపడని గాలి జనార్జనరెడ్డిని, యడ్యూరప్పను తనఇంటిలోనే రాజీ కుదర్చగలిగారు సుష్మాస్వరాజ్. మొత్తంమీద ఎటుపోతుందో అనుకున్న సంక్షోభం సులువుగానే పరిష్కారం కావడంతో.. బిజేపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి సమాలోచనలు జరుపుతున్నారు.
విజయం ఎవరిది?
ఇంతకీ విజయం ఎవరిది.. ముఖ్యమంత్రి యడ్యూరప్పదా లేక.. బళ్లారి లీడర్ గాలి జనార్దనరెడ్డిదా.. వాస్తవానికి ఇద్దరిదీ కాదనే చెప్పాలి. ఇద్దరిమధ్యా రాజీ కుదర్చి.. ప్రస్తుతానికి చక్కబెట్టగలగింది కేంద్రనాయకత్వం. కాకపోతే.. మొగ్గుమాత్రం జనార్దనరెడ్డి వైపే ఉంది. ఢిల్లీలో జరిగిన కీలకచర్చల్లో అసమ్మతి నేతల డిమాండ్లను చాలావరకూ యడ్యూరప్ప అంగీకరించాల్సి వచ్చింది. ముఖ్యంగా.. గాలి సోదరులు ఒత్తిడి మేరకు.. ఆయన ముఖ్య కార్యదర్శి వి.పి.బళిగారను ఇప్పటికే బదిలీ చేశారు. దీంతోపాటు... అసమ్మతి నేతలు టార్గెట్ చేసుకున్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రి శోభా కరంద్లాజేను మంత్రివర్గం నుంచి తొలగించడానికీ సమ్మతించారు. కేబినెట్‌లో యడ్యూరప్ప తర్వాత.. కీలకంగా వ్యవహరిస్తున్న శోభాపై.. బళ్లారి వర్గం ఎప్పటినుంచో గుర్రుగా ఉంది. ఇటీవల వరదల సమయంలోనూ.. ముఖ్యమంత్రి వెన్నంటి ఉండడం.. రెవన్యూ మంత్రి.. గాలి జనార్దనరెడ్డి సోదరుడు కరుణాకర్‌రెడ్డిని విస్మరించి.. పనులు చక్కబెట్టడం.. అసమ్మతి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అందుకే.. మంత్రివర్గం నుంచి శోభను తొలగించాలని డిమాండ్ చేసిన గాలి కుంపటి.. ఎట్టకేలకు దాన్ని సాధించుకోగలిగింది. రెండువర్గాల మధ్య ఒప్పందం అమల్లోకి వచ్చిందనడానికి సూచికగా.. శోభా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. కర్ణాటకలో యడ్యూరప్ప ఏకఛత్రాధిపత్యానికి తెరదించడంలోనూ బళ్లారి నేతలు విజయం సాధించగలిగారు. రెబల్స్ డిమాండ్‌కు తలొగ్గిన బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రవ్యవహారాలను చక్కపెట్టడానికి ఏడుగురు సభ్యుల సమన్వయకమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. సుష్మాస్వరాజ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. యడ్యూరప్ప, గాలికరుణాకర్‌రెడ్డిలతో పాటు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ, సీనియర్ నేత అనంత్‌కుమార్‌లు ఉంటారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏ నిర్ణయమైనా.. ఈ కమిటీ ఆమోదించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఎమ్మెల్యేలను, మంత్రిమండలిని ఏమాత్రం పట్టించుకోకుండా.. యధేచ్చగా నిర్ణయాలు తీసుకున్నముఖ్యమంత్రికి దీంతో కళ్లెంపడింది..
తెలుగు ఆధిపత్యం
మొత్తంమీద చూస్తే.. కర్ణాటక ప్రభుత్వంలో తెలుగువారి ఆధిపత్యం పెరుగుతోందనే చెప్పాలి. ముఖ్యంగా గాలి సోదరులు, ఆరోగ్యశాఖమంత్రి శ్రీరాములు .. కన్నడనాట చక్రం తిప్పగలుగుతున్నారు. ముఖ్యమంత్రిపైనే తిరుగుబాటు బావుటా ఎగరవేశారంటే.. కర్ణాటక బీజేపీలో వీరు ఎంతబలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. యడ్యూరప్పను తొలగించి.. తమకు అనుకూలమైన జగదీష్ శెట్టర్‌ను సీఎంను చేయడానికి ఈ తెలుగులాబీ తీవ్రంగానే ప్రయత్నించింది. సీఎంను మార్చే విషయంలోనూ పాక్షిక విజయం గాలి సోదరులకు దక్కింది. వచ్చే మార్చి తర్వాత పదవినుంచి వైదొలుగుతానని.. యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. కన్నడనేతలపై తెలుగునేతలు పైచేయి సాధించారు. కొన్నాళ్లు పోతే.. అక్కడి ప్రభుత్వం పూర్తిగా బళ్లారి లాబీ కనుసన్నల్లోనూ కొనసాగినా ఆశ్చర్యం లేదు. ఇది లేనిపోని తలనెప్పులు తేవడంతో పాటు.. ప్రాంతీయ విభేదాలు సృష్టించవచ్చని భావిస్తున్న బీజేపీనేతలు ఆందోళన చెందుతున్నారు.
అసమ్మతి ఎందుకు?
ముఖ్యమంత్రి పనితీరుమీదా.. మంత్రులపైనా గాలి శిబిరం లేవనెత్తిన ప్రశ్నలు ఎన్నైనా ఉండొచ్చుగానీ.. అసమ్మతి రాజేయడానికి మాత్రం అసలు కారణం వేరు. ఇనుపఖనిజాన్ని రవాణా చేస్తున్న లారీలపై.. వెయ్యి రూపాయల సెస్ విధించాలని కర్ణాటక సీఎం నిర్ణయించడమే ప్రధాన కారణం. ఈ లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని.. ఈ సెస్ వసూలు చేయడం ద్వారా వాటిని బాగుచేయడంతోపాటు.. ప్రజోపయోగ కార్యక్రమాలను ఉపయోగించవచ్చన్నది యడ్యూరప్ప అభిప్రాయం. దీంతోపాటు.. కన్నడ రాజకీయాల్లో ఎదుగుతున్న గాలిసోదరులను కట్టడి చేయడమనూ ఈ ప్రణాళికలో భాగమే. ఈ నిర్ణయం వెలువడగానే.. గాలి సోదరుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఈ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని యడ్యూరప్ప, దానికి కేబినెట్ అంగీకార ముద్రనూ వేయించారు. ఇక అక్కడి నుంచి రాజుకొంది.. అసలు వివాదం. ముఖ్యమంత్రినే మార్చేయాలన్న డిమాండ్‌తో అసమ్మతిని ఎగదోశారు గాలి జనార్దరనరెడ్డి. బీజేపీ అగ్రనేతల చర్చల్లోనూ దీనిపై రాజీపడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అండదండలు
1999కు ముందు గాలి సోదరుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బళ్లారి నుంచి సోనియాగాంధీ పోటీ చేయడం.. ఆమెపై సుష్మాస్వరాజ్‌ను బిజేపీ బరిలోకి దింపడం.. గాలి సోదరులకు కలిసొచ్చింది. సుష్మాస్వరాజ్‌కు మద్దతుగా వారు ప్రచారం చేసి రాజకీయంగా తొలి అడుగు వేశారు. సుష్మాస్వరాజ్ ఆ తర్వాత వారికి సహకరంచడంతో 2006లో జనార్దనరెడ్డికి MLC పదవి దక్కింది. 2008 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి.. తన వారందరినీ గెలుపించుకోవడంతో.. రాష్ట్ర బీజేపీలో బలం పెరిగింది. ఆ బలమే.. ముఖ్యమంత్రిపై అసమ్మతి అస్త్రాన్ని సంధించేలా చేసింది. రాజకీయ సంక్షోభాన్ని ఏదోలా పరిష్కరించిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. కర్ణాటకలో తెలగువారికి, కన్నడవారికి మధ్య జగడం మొదలయ్యే ప్రమాదం ఉంది. గాలి సోదరుల కారణంగా పదవి వదులుకోవాల్సి వచ్చిన మాజీమంత్రి శోభ.. ఈ విషయాన్ని ఊరికే వదలకపోవచ్చు. యడ్యూరప్ప కూడా పదవినుంచి దిగిన తర్వాత.. ఈ అంశాన్ని పట్టుకొని తన బలాన్ని పెంచుకునే ప్రయత్నమూ చేయొచ్చు. మొత్తంమీద కన్నడలో వీస్తున్న తెలుగుగాలి.. భారతీయ జనతాపార్టీపైనా ప్రభావం చూపొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి