4, నవంబర్ 2009, బుధవారం
ఉప్పల్‌లో టీం ఇండియాకు వాస్తు సమస్య?
ఉప్పల్‌లో టీండియా వరసగా ఎందుకు ఓడిపోతోంది.. హోంటీం.. డెక్కన్ ఛార్జర్స్‌కూ ఇదే సమస్య ఎందుకు ఎదురవుతోంది. హోం గ్రౌండ్ అనగానే విరుచుకుపడాల్సిన మన టీమ్స్.. డీలా పడిపోవడానికి కారణం ఏమిటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించిన.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకూ ఇదే డౌట్ వచ్చింది.. అందుకే నష్ట నివారణ చర్యల్లో తలమునకల్యయారు.
భారీ ఖర్చుతో.. ఎన్నో హంగులతో నిర్మించిన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటేనే టీంఇండియా భయపడే పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ స్టేడియాన్ని తలపించే రీతిలో తయారైన.. ఈ స్టేడియాన్ని తలదన్నేది దేశంలో మరొకటి లేదు. అయినా.. భారత క్రికెట్ టీం ఇక్కడ ఆడుతుందంటే.. అభిమానుల్లో ఎంతో కలవరం. కారణం.. హోం టీంలు ఇక్కడ విజయం సాధించవన్న అపప్రధ మూటగట్టుకోవడమే. టీం ఇండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. 2004లో ప్రారంభమైన ఈ స్టేడియంలో తొలిమ్యాచ్.. నవంబర్ 15, 2005న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. యువరాజ్ సెంచరీ చేయడంతో 249 పరుగులు సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 48.5 ఓవర్లలో 252 పరుగులు చేసి విజయాన్ని అందుకొంది. రెండోమ్యాచ్ అక్టోబర్ 5, 2007న భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగింది. ఈసారి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి.. 290 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన టీంఇండియా 47.4 ఓవర్లలో 243 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ యువరాజ్ సెంచరీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
దీనికి తోడు.. ఐపీఎల్‌లో లోకల్ టీం డెక్కన్‌ఛార్జర్స్ కూడా పరాజయం పాలవ్వడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కవన్న అనుమానంతో.. హెచ్‌సీఏ కారణాలను అన్వేషించే పనిలో పడింది. జ్యోతిష్య విద్వాంసులతో సంప్రదిస్తే.. వాస్తుదోషమే అసలు కారణమని తేలింది. వాస్తు ప్రకారం చూస్తే. . స్టేడియం నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైరుతిలో స్విమ్మింగ్‌పూల్ ఉండడం... ఈశాన్యంలో నిర్మించిన సంప్ ఎత్తు ఎక్కువగా ఉండడం.. స్టేడియం లోపల డ్రెస్సింగ్ రూంల నిర్మాణాల వల్లే టీంఇండియాకు కలిసిరాలేదని జ్యోతిష్య పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు.. స్టేడియం పూర్తి గుండ్రంగా ఉండడం.. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు కూడా గుండ్రంగానే ఉండడం వల్ల.. వాస్తు ప్రభావం హోంటీంలపై ఎక్కువగా ఉంటోందని హెచ్‌సీఏ పెద్దలకు తెలియజేశారు. తాజాగా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య మళ్లీ మ్యాచ్ జరుగుతుండడంతో.. ఈ వాస్తు ప్రభావం ఎంతవరకూ ఉంటుందోనని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంగారు పడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా భారతజట్టు ఓడిపోతే.. ఇక తప్పకుండా.. వాస్తు ప్రకారం మరమ్మతులు చేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యింది హెచ్‌సిఏ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అవునవును మిగతా వాళ్ళందరూ గెలవడానికి కేవలం సామర్ధ్యం వుంటే సరిపోతుంది. మనం గెలవాలంటే మాత్రం వాస్తు, సాముద్రికం, గ్రహ తారా బలాలు వగైరా వగైరాలు ఇక చివరగా సామర్ధ్యం కావాలి. మనం మాత్రం దేనికీ కారణంకాము సరికదా తప్పంతా పైవాడిదే.
ఇంకా నయం. పల్లెటూరివాళ్ళలాగ స్టేడియం ముందు దృష్టి తియ్యించి బూడిద గుమ్మడి కాయలు కట్టలేదు.