2, నవంబర్ 2009, సోమవారం
పీఆర్పీతో కాంగ్రెస్ పొత్తెందుకు?
కాంగ్రెస్ పార్టీ.. పీఆర్పీతో పొత్తులు పెట్టుకోవడం వెనక ఆసక్తికరమైన సమీకరణాలే చోటుచేసుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లే.. ఈ దిశలో రెండు పార్టీలనూ ప్రేరేపించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసీటు కూడా దక్కించుకోకపోయినా.. ఓట్లు దక్కించుకోవడంలో పీఆర్పీ సక్సెస్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు.. పొత్తుకు సిద్దమయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కాంగ్రెస్, పీఆర్పీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మొత్తం 150 డివిజన్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో పాగా వేయడానికి మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పుడు తెరపైకి వచ్చిన పొత్తు వ్యవహారం కూడా ఇందులో భాగమే. ఎన్నికలు జరుగుతున్న 150 డివిజన్లలో మొత్తం 54 లక్షల 26 వేల 106 మంది ఓటర్లున్నారు. వీరందరూ ఓట్లేస్తారన్న గ్యారెంటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల విషయం తీసుకుంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో.. సుమారుగా 55 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. గ్రేటర్ పోరులోనూ.. ఇదేస్థాయిలో ఓట్లు పడితే మాత్రం.. ఒకటీ రెండు ఓట్లు కూడా కీలకమవుతాయి. అందుకే.. ప్రతీ ఓటును దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని పదర్శించింది. మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 14 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థే విజయం సాధించడంతో.. అక్కడా... ఆ పార్టీదే ఆధిపత్యమని భావించాల్సి ఉంటుంది. ఇక పాతబస్తీలో ఎప్పటిలానే మజ్లిస్ హవా కొనసాగింది. మొత్తం ఏడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకొంది. మహాకూటమిగా కలిసికట్టుగా పోటీ చేసినా.. టిడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం రెండుస్థానాలను దక్కించుకోగలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పీఆర్పీకి ఒక్కస్థానమూ దక్కకపోవడం .. అధినాయకత్వాన్ని తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పాలి.
అయితే.. ఓట్ల విషయంలో చూస్తే మాత్రం కాంగ్రెస్ సంపాదించిన ఓట్లలో దాదాపు సగం ఓట్లను పీఆర్పీ దక్కించుకోగలిగింది. గ్రేటర్ పరిధిలోని అన్ని స్థానాల్లో కలిపి.. కాంగ్రెస్ పార్టీ 10 లక్షల 39 వేల 646 ఓట్లను దక్కించుకొంది. ప్రజారాజ్యం పార్టీ.. 4 లక్షల 94 వేల 229 ఓట్లు సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో చిరు పార్టీది పదమూడున్నర శాతం వాటా. అందుకే.. ఈ ఓట్లన్నీ తన ఖాతా వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. వైఎస్ అకాలమరణంతో.. ప్రచారం ఉధృతం నిర్వహించగల జనాకర్ష నేత కూడా లేకపోవడంతో.. హస్తం పార్టీ ఈ పొత్తుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా.. చిరంజీవి.. కాంగ్రెస్ అభ్యర్థులందరికీ ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్-పీఆర్పీ జత కలిసి బరిలోకి దిగితే.. టిడీపీ అభ్యర్థులను ఓడించడం సులువనే భావన ఇరు పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది.
ఇక ప్రజారాజ్యం వైపు నుంచి చూస్తే.. మరెన్నో విషయాలు అంతుబడతాయి. ఇప్పటికే పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలు లేకపోవడం.. ఉన్నవాళ్లూ కాంగ్రెస్ నేతలతో సన్నిహితసంబంధాలు కొనసాగిస్తుండడం పీఆర్పీని కలవరపెడుతోంది. ఒంటరిగా బరిలోకి దిగితే.. పక్క పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడం తప్ప.. ఎక్కువమొత్తంలో సీట్లు దక్కించుకునే ఛాన్స్ కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నోకొన్ని సీట్లు దక్కించుకుంటే తప్ప.. పార్టీలో మళ్లీ విశ్వాసం పెరగదు. ఎలాగూ పదమూడు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి కాబట్టి.. కాంగ్రెస్ అండకూడా ఉంటే.. పోటీ చేసిన స్థానాల్లో దాదాపుగా దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌కు చిరంజీవి స్నేహహస్తం చాచడంలో ఆంతర్యం ఇదే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కాంగ్రెస్‌తో జత కట్టే పార్టీలు ఏమౌతాయో చిరంజీవికి తెలీదనుకోవాలి పాపం. రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ ఇక పక్కవాద్యగాడు గానే మిగిలిపోతాడన్న మాట.
ఈ రెండు పార్టీలు ఏకమైతే ప్రతిపక్ష వోటు చీలిక ఆగిపోయి తెదేపా బలపడే అవకాశాలూ ఉన్నాయి. కాంగ్రెస్‌కి ఆ విషయం తెలియదనుకోలేం. అయినా ప్రరాపాతో జట్టు కట్టటం వెనక అసలు కారణం - రేపో మాపో జగన్ తోక ఝాడించి పాతికో ముప్పయోమంది ఎమ్మేల్యేలతో తిరుగుబాటు చేయిస్తే, ప్రరాపాకి ఉన్న పద్దెనిమిది మందినీ అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పడిపోకుండా ఆపే ముందస్తు వ్యూహంలో భాగంగా ప్రరాపావైపు వేసిన మొదటి అడుగు ఇది కావచ్చు.
అబ్రకదబ్ర గారు చెప్పిన కారణానికి ఒప్పుకుంటూనే మరొకటి ఇక్కడ. ఒక సారి కాంగ్రెస్సుకు దగ్గర అవుతున్నట్లు చూపిస్తే ఇక తెలుగుదేశానికి దూరం చేయటానికి కూడా కావచ్చు.