ఒక చిన్న అడుగు.. భారత దేశ గమ్యాన్ని.. గమనాన్ని మార్చేస్తుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. ఆ అడుగు మన దేశాన్ని ప్రపంచ శక్తుల్లో ఒకటిగా నిలబెడుతుందనీ అనుకోలేదు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రయత్నించాడు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఒప్పించి.. భారత అంతరిక్ష పరిశోధనలకు బీజం వేశాడు. దాన్నుంచి పుట్టిన మొక్కే.. ఇస్రో. ఆ మహామనిషే.. విక్రం సారాభాయ్.. భారత అంతరిక్ష పితామహుడు.. తప్పటడుగులతో అడుగులతో మొదలైన ఇస్రో ప్రస్థానం ఇప్పుడు చందమామను అందుకునే వరకూ చేరిందంటే.. దానికి కారణం సారాభాయే.
నిప్పులు చిమ్ముకుంటూ.. భారత రాకెట్లు ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షంలోకి దూసుకువెళుతుంటే.. ప్రపంచమంచా నిబిడాశ్చర్యంతో చూసింది. మన సత్తాకు సలామ్ చేసింది. అగ్రరాజ్యాలకే పరిమితమైన స్పేస్ రీసెర్చ్‌లో మనకూ ప్రత్యేకస్థానం లభించిందంటే.. దానికి కారణం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. ఎన్నో విజయాలు.. మరెన్నో ప్రణాళికలతో..
భారత కీర్తిపతాకను.. వినువీధుల్లో ఎగరవేస్తోంది ఇస్రో. ఆగస్టు 15తో నలభై వసంతాలను పూర్తి చేసుకొంది ఈ సంస్థ. ఈ నాలుగ దశాబ్దాల్లో.. ఎవరూ ఊహించలేని విజయాలను సొంతం చేసుకొంది. అంతరిక్ష ప్రయోగాల్లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక సంస్థ మన ఇస్రో. ఉపగ్రహాలను విజయవంతగా ప్రయోగించడంలో మనకు మనమే సాటి. ఇస్రోకు అత్యంత నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్.. PSLV ద్వారా మొత్తం 32 ఉప్రగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడితే.. అందులో.. పదహారు ఇతర దేశాలకు చెందినవి కావడమే దీనికి నిదర్శనం. ఇన్ని విజయాలు సాధిస్తున్న ఇస్రో ఏర్పాటు వెనుకున్న ఒకే ఒక వ్యక్తి విక్రం సారాభాయ్. 1957లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించిన వెంటనే.. అంతరిక్ష పరిశోధనలకున్న అవసరాన్ని ఆయన గుర్తించారు. అప్పటి ప్రధాని నెహ్రూను ఒప్పించి.. స్పేస్ రీసెర్చ్ వైపు అడుగులు వేయించారు. భారత అణుశక్తి పితామహుడు హోమీబాబా పర్యవేక్షణలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటయ్యింది. 1969లో ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనల కోసం ఇస్రో రూపుదిద్దుకొంది. చిన్న చిన్న వైఫల్యాలున్నప్పటికీ.. ఇస్రో సాధించిన విజయాలే ఎక్కువ. ప్రస్తుతం రెండు రకాల ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది. మొదటిది.. ఇన్‌శాట్. రెండోది.. ఐఆర్‌ఎస్. చంద్రయాన్ ప్రాజెక్టుతో.. ప్రపంచదేశా దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. త్వరలోనే.. సూర్యుడి పని కూడా పట్టడానికి సిద్ధమవుతోంది.
భారత్‌లో టెలివిజన్ ప్రసారాలు ఇంతగా ఊపందుకున్నాయన్నా... రేడియో ప్రసారాల్లో భారీ మార్పులు వచ్చాయన్నా... మొబైల్స్ సామాన్యుడిదరికి చేరాయన్నా.. దానికి ఓ రకంగా ఇస్రోనే కారణం. ఇస్రో ప్రయోగించిన ఇన్‌శాట్ ఉపగ్రహాలవల్లే నిరంతరాయంగా ఈ ప్రసారాలు జరుగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే.. ఇన్‌సాట్ ఉపగ్రహాలది అతిపెద్ద శ్రేణి. ఇది కూడా మనం మరోదేశంపైన ఆధారపడకుండా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీ. ఇక వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి.. IRS శ్రేణి ఉపగ్రహాలను, దూరవిద్యను అందించడానికి ఎడ్యుశాట్‌ను ప్రయోగించింది ఇస్రో. పైగా.. ఇప్పుడు వ్యాపారమూ చేయగలుగుతోంది. ఇస్రో ద్వారా.. ప్రయోగిస్తే.. కచ్చితంగా కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లతాయన్న నమ్మకం.. ప్రపంచ దేశాలది. అందుకే.. ఇస్రోకు ఆర్డర్లమీద ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.
విజయపరంపర
తొలినాళ్లలో.. కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ వాటిని చాలా వేగంగానే ఇస్రో అధిగమించింది. భారత తొలి ఉపగ్రహ వాహక నౌక.. SLV నాలుగుసార్లు ప్రయోగిస్తే.. రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత.. అభివృద్ధి చేసిన ASLV కూడా నాలుగు సార్లు ప్రయోగిస్తే.. రెండు సార్లు మాత్రమే విజయవంతమయ్యింది. ఈ రెండు ఉపగ్రహ వాహక నౌకల అనుభవంతో.. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్‌ను తయారు చేసింది ఇస్రో. 1993 సెప్టెంబర్ 20న IRS-1Eని మోసుకుని నింగికెగిసిన PSLV-D1 లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కానీ.. ఆ తర్వాత.. వరసగా 14 సార్లు విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి.. తన సత్తా చాటుకొంటి. ఇస్రోకు వాణిజ్య పరంగా ఉపయోగపడుతున్న వాహకనౌక కూడా ఇదే. IRS శ్రేణి ఉపగ్రహాలతో పాటు.. చంద్రయాన్-1ను కూడా ఈ పీఎస్‌ఎల్‌వీనే కక్ష్యలోకి చేర్చింది.
పీఎస్‌ఎల్పీ త్వరాత విజయవంతమైన వాహకనౌక.. జీఎస్‌ఎల్‌వి. ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఉపయోగిస్తారు. ఐదుసార్లు ప్రయోగించగా.. నాలుగుసార్లు విజయం సాధించింది. GSLV త్రీని మరింత ఆధునిక పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేస్తోంది. తాజాగా.. భువన్ పేరుతో.. ఇమేజ్ మ్యాపింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది ఇస్రో. ప్రపంచంలోని ఏమూలైనా చూడగలిగే.. గూగుల్‌ఎర్త్, వీకీ మ్యాపియాలకు పోటీగా ఈ సర్వీస్‌ను అభివృద్ధి చేసింది. గూగుల్ ఎర్త్‌కన్నా.. ఎంతో నాణ్యమైన చిత్రాలను.. రకరకాల ఫీచర్లతో ఈ భువన్‌లో చూడొచ్చు. ఏడాది క్రితం తన శాటిలైట్లద్వారా తీసిన ఫోటోలను భువన్‌లో అందుబాటులో ఉంచింది.. ఇస్రో. టెక్నాలజీని సామాన్యుడి దరికి చేర్చడంలో మరో ముందడుగు వేసింది.
భువన్‌పై ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చింది. అందుకే భవిష్యత్ ప్రాజెక్టుల కోసం.. సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొదటిది.. 2104 కల్లా అంతరిక్షంలోకి మనిషిని పంపించడం. అంగారక గ్రహంతో పాటు.. ఉల్కలపైనా ఇదే సమయంలో పరిశోధనలు చేయాలని భావిస్తోంది ఇస్రో. విక్రం సారాభాయ్ మొదలుకొని.. సతీశ్‌ధావన్, కస్తూరి రంగన్, ఇప్పుడు మాథవన్ నాయర్... ఇస్రోకు సరైన మార్గనిర్దేశం చేస్తుండడంతో.. అంతరిక్షంలో అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలబడగలిగింది భారత్.
16, ఆగస్టు 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి