16, ఆగస్టు 2009, ఆదివారం
హీలియం మామ
Categories :
చందమామపై ప్రయోగాలు ఆసక్తికర ఫలితాలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యాల తర్వాత.. జాబిల్లిపై ప్రయోగాలు చేపట్టిన ఆసియా ఖండ దిగ్గజం.. చైనా.. ఓ అద్భుత ఫలితాన్ని అందుకొంది. చందమామ భూభాగాన్ని అణువణువూ శోధించిన చైనా.. భవిష్యత్ మానవజాతికి అవసరమైన ఇంధన నిక్షేపాలు భారీగా ఉన్నాయంటోంది. భారత్ చంద్రయాన్ మొదలుపెట్టడానికి ముందే.. మూన్‌మిషన్ ప్రారంభించింది చైనా. సరిగ్గా పద్దెనిమిది నెలల క్రితం.. చందమామపై పరిశోధనలకు చాంగే వన్ ఉపగ్రహాన్ని పంపించింది. చంద్రుడికి సంబంధించి నాలుగు లక్ష్యాలను విధించుకొంది. అందులో ఒకటి.. చంద్రుడిపై మనవజాతికి అవసరమైన ఇంధన నిల్వలు కనిపెట్టడం. భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్న హీలియం.. చంద్రుడిపై భారీమొత్తంలో ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అంచనా వేస్తూ వచ్చారు. సరిగ్గా ఈ కోణంలోనే పరిశోధనలు మొదలుపెట్టిన చైనా.. చందమామపై హీలియం త్రీ నిక్షేపాలను గుర్తించింది. కోట్లాది టన్నుల అణుశక్తిని దీనిద్వారా సాధించుకోవచ్చని చైనా భావిస్తోంది.
చైనా పంపించిన ఉపగ్రహం.. చాంగే వన్.. చంద్రుడి పొరలను పరిశీలిస్తుండగా.. ఈ హీలియం త్రీ విషయం బయటపడింది. మైక్రోవేవ్ టెక్నాలజీ ద్వారా.. చంద్రుడిపై ఉన్న మట్టి పొరల లోతును ఉపగ్రహం విశ్లేషించింది. చంద్రుడి ఉపరితలాన్ని మూడు లేజర్ బీమ్స్‌తో స్కాన్ చేసింది చైనా ఉపగ్రహం. ఇంతవరకూ రష్యాగానీ.. అమెరికా గానీ ఈ తరహా పరిశోధనలను చేయలేదు. అయితే.. కచ్చితంగా ఎంతమొత్తంలో హీలియం ఉంటుందన్నది మాత్రం చైనా అంచనా వేయలేకపోయింది. భూమిపొరల్లో ఉన్న సహజవాయు నిక్షేపాలు మరో శతాబ్ధంలోగా అడుగంటిపోతాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో చైనా ఆవిష్కరణ కొత్త దారిని చూపించనుంది. ఈ హీలియం త్రీని అణుఇంధనంగా మార్చుకోవాలంటే మాత్రం.. మన టెక్నాలజీని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. చంద్రుడికి సంబంధించిన 2D,3D మ్యాపులను తయారు చేయడానికి కూడా చైనా సిద్ధమయ్యింది. చాంగే వన్ ఉపగ్రహం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ మ్యాపులను సిద్ధం చేస్తామని చైనా ప్రకటించింది. ఇవి కూడా సిద్ధమైతే.. చందమామ అణువణువునూ చూసే అవకాశం అందరికీ లభిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి