28, ఫిబ్రవరి 2012, మంగళవారం
హోబర్ట్ లో విరాటపర్వం
Categories :
CRICKET . lanka vs india . sports . super innings . TOP . virat kohli
శ్రీలంకకు తన విశ్వరూపం చూపించాడు విరాట్ కోహ్లీ. 320 పరుగులు సాధించి విజయంపై లంక పెంచుకున్న నమ్మకాన్ని.. తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో పటాపంచలు చేశాడు. హోబర్ట్ లో జరిగిన మ్యాచ్ లో లంకపై భారత్ బోనస్ పాయింట్ సాధించి ఘనవిజయాన్ని అందుకుందంటే దానికి కారణం కోహ్లీ. ఎంతో సమయోచితంగా, మరెంతో బాధ్యతగా.. అంతే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ తనకు మరెవరూ సాటిలేరని నిరూపించుకున్నాడు. కేవలం 86 బంతుల్లో 133 పరుగులు చేసి.. భారత్ కు విజయాన్ని అందించడమే కాదు..భారత భవిష్యత్ క్రికెట్ స్టార్ నని చాటి చెప్పాడు. 40 ఓవర్లలో లక్ష్యం చేధించడం కష్టమని భారత క్రికెట్ అభిమానులు అనుకున్నా.. తన బ్యాటింగ్ తో అందరిలోనూ ఆశలు పెంచాడు. అయినా.. చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగుతుందనుకున్న తరుణంలో.. మరింత విజృంభించి మ్యాచ్ రూపాన్నే మార్చేశాడు. ఆటను భారత్ వైపుకు తిప్పేశాడు. మలింగ వేసిన 34వ ఓవర్లో.. కోహ్లీ తన బ్యాట్ పవర్ ను చాటి చెప్పాడు. అప్పటికి భారత్ బోనస్ పాయింట్ విజయానికి 6 ఓవర్లలో 42 పరుగులు చేయాలి. తొలి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత బంతిని సిక్స్ గా మలిచాడు. అంతటితో అయిపోలేదు.. మూడో బంతిని ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి మళ్లీ ఫోర్, ఐదో బంతికి మరో ఫోర్.. ఆరో బంతికి ఇంకో ఫోర్.. ఒకే ఓవర్లో 24 పరుగులు. అంతే ... మ్యాచ్ రూపం మారిపోయింది. 5 ఓవర్లలో చేయాల్సిన లక్ష్యం.. కేవలం 18 పరుగులకు పడిపోయింది. మ్యాచ్ తొలినుంచి ధాటిగానే ఆడిన కోహ్లీ చివర్లో మాత్రం మరింత రెచ్చిపోయాడు. చివరి 30 బంతుల్లోనే మొత్తం 74 (ఇందులో నాలుగు పరుగులు లెగ్ బైస్) సాధించాడు. అందుకే.. ఇది భారత్ మ్యాచ్ కాదు.. కోహ్లీ మ్యాచ్..
కోహ్లీ చివరి 30 బంతుల్లో చేసిన పరుగులు (70 + 4 లెగ్ బైస్)
4 1 1 1 4 1 4lb 4 4 4 . 1 4 1 1 2 . 1 1 2 6 4 4 4 4 1 1 1 4 4
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి