28, ఫిబ్రవరి 2012, మంగళవారం
ఆస్ట్రేలియాలో లంకా దహనం
Categories :
CRICKET . india vs lanka . lanka vs india . news . sports . super match . TOP
అభిమానుల తిట్లు.. భారత క్రికెటర్ల నిర్లక్ష్యపు జబ్బును వదిలించాయో... లేక, భారత హాకీ జట్టు విజయవిహారం.. గుణపాఠం నేర్పించిందో గానీ.. అత్యంత కీలకమైన మ్యాచ్ లో భారత జట్టు అనూహ్యంగా చెలరేగింది. అత్యంత కష్టమైన లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించి.. ముక్కోణపు సిరీస్ లో ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఈరోజు లంకాదహనమే జరిగింది.
శ్రీలంకను అతి తక్కువ స్కోర్ కు కట్టడి చేయడం, ఆ లక్ష్యాన్ని 40 ఓవర్లలోపే ఛేదించాలన్న తలంపుతో భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ, తొలిసారి టాస్ గెలిచినా ఫీల్డింగ్ నే ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు బ్యాటింగ్ అవకాశాన్ని అందించాడు. అయితే.. ఇక్కడ ధోనీ ఆశలను ఆవిరిచేస్తూ.. భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆల్ రౌండింగ్ ప్రదర్శన చేస్తున్న ఇర్ఫాన్ ను కాదని జహీర్ ను జట్టులో చేర్చుకున్నా.. లాభం లేకపోయింది.. కేవలం ఒకే ఒక్క వికెట్ ను జహీర్ సాధించగలిగాడు. ఇక దిల్షాన్, సంగర్కరలు రెచ్చిపోయి ఆడడంతో శ్రీలంక 320 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఇంత భారీ లక్ష్యాన్ని చూసిన తర్వాత.. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వారందరికీ.. భారత్ ఇంటికే అనిపించింది. ఎందుకంటే.. 320 పరుగులను 50 ఓవర్లలో ఛేజ్ చేయడమే చాలా కష్టం. అలాంటింది 40 ఓవర్లలో కొట్టేయాలి. అసలే భారత బ్యాట్స్ మెన్ ను వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓవర్ కు 8కు పైగా పరుగులు చేయడం అంటే.. ఊహించడానికి కష్టం.
కానీ.. ధోనీసేన మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఓపెనర్లుగా క్రీజ్లోకి అడుగుపెట్టిన సచిన్, సెహ్వాగ్ లు తమ లక్ష్యం ఏమిటో చాటి చెప్పారు. ఓవర్ కు 8 పరుగులకు పైనే రన్ రేట్ కొనసాగిస్తూ ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. అయితే.. సెహ్వాగ్, సచిన్ లు తక్కువ స్కోర్కే ఔట్ అయినా.. గంభీర్, కోహ్లీలు సందర్భానుసారంగా ఆడుతూ.. స్కోర్ కార్డును పెంచారు. భారత్ స్కోరు 201 పరుగులు చేరగానే గంభీర్ (63) రనౌట్ కావడంతో.. సీన్ మారింది. సురేశ్ రైనా, కోహ్లీకి జతకలిశాడు.. ఇద్దరూ కలిసి విధ్వంసం సృష్టించారు. ఫోర్లతో విరుచుకుపడ్డారు. 40 ఓవర్ల దాకా ఎందుకంటూ... కేవలం 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగించి మ్యాచ్ ఫినిష్ చేశారు. కోహ్లీ 86 బంతుల్లో 133 పరుగులు చేయగా.. సురేశ్ రైనా 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడుతుంటే.. శ్రీలంక క్రికెటర్లు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. లంక స్టార్ బౌలర్ లసిత్ మలింగనైతే.. మన బ్యాట్స్ మెన్ చీల్చి చెండారారనే చెప్పాలి. 7.4 ఓవర్లు వేసిన మలింగ.. ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. చాలాకాలం తర్వాత భారత టాప్ ఆర్డర్ భాద్యతాయుతంగా, భీకరంగా ఆడడంతో.. అత్యంత కష్టమైన లక్ష్యం కూడా.. చిన్నదైపోయింది.. భారత్ కు ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచింది. ఇక ఇప్పుడంతా ఆస్ట్రేలియా చేతిలో ఉంది. ఆస్ట్రేలియా లంకపై గెలిస్తేనే మనకు ఛాన్స్.. లేదంటే.. మనం ఇంటికి.. లంక ఫైనల్ కు..
కొసమెరుపు..: గతంలోనూ దిల్షాన్ 160 పరుగులు చేసినప్పుడు శ్రీలంక మ్యాచ్ ను ఓడిపోయింది.. ఇప్పుడు మరోసారి ఓడింది.. అదే ట్రాజడీ.. పూర్ దిల్షాన్.. కష్టపడ్డా ఫలితం దక్కలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
JOKE....