30, ఆగస్టు 2011, మంగళవారం
సమ్మె వాయిదా..!
సకల జనుల సమ్మెకు సవాలక్ష అవాంతరాలు ఎదురవుతున్నాయి. రంజాన్ కారణంగా ఇప్పటికే వాయిదా పడ్డ సమ్మెకు.. .వినాయకుడి విఘ్నం ఎదురుకాబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేయడంతో ఉద్యమాన్ని తీవ్రం చేద్దామనుకుంటున్న జేఏసీకి కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి. సకల జనుల సమ్మెను ప్రతిష్ణాత్మకంగా తీసుకున్న జేఏసీ దాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బంధీ వ్యూహాన్నే రచించింది. అయితే సహాయ నిరాకరణ సమయంలో ఉద్యోగుల మాత్రమే ఆందోళనలో భాగం కావడం...రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగస్తులు మాత్రమే సహాయనిరాకరణలో పాల్గొన్నారు. ఇక సకల జనుల సమ్మెకు సంబంధించి ఉద్యోగులు సమ్మెకు నోటీసులు ఇచ్చినా...సహాయ నిరాకరణ అనుభవంతో రాజకీయ నేతలే ముందుండి నడిపించాలని డిమాండ్ చేశారు. దీనికి రంజాన్ మాసం కూడా తోడవడంతో సమ్మె 20 రోజులు వాయిదా పడింది. వచ్చేనెల ఆరో తేదీ నుంచి సమ్మెను ప్రారంభమవుతుందనుకున్న దశలో గణేష్ వేడుకలు సకల జనుల సమ్మెపై ప్రభావం చూపనున్నాయి. ఉత్సవాలు జరిగే పదకొండు రోజులు సమ్మెనుంచి విరామం ఇవ్వాలని ఉత్సవ కమిటీల నేతలు జేఏసీకి సూచిస్తున్నారు. దీనితో సమ్మె తేదీపై మళ్లీ జేఏసీ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల ఐదో తేదీన కరీంనగర్లో జేఏసీ బహిరంగ సభను నిర్వహించి ఆ మరుసటి రోజు నుంచే సమ్మెకు పిలుపు ఇస్తామని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. దీంతో రెండు మూడు రోజుల్లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. కానీ, గణేశ్ నవరాత్రులు పూర్తయ్యేవరకూ సమ్మె వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి