8, మార్చి 2011, మంగళవారం
మేధోమథనం
Categories :
రాష్ట్రం విడిపోవడం ఖాయమేనా..?
ఆంధ్రా తెలంగాణ మేధావులకు ఈ విషయంపై స్పష్టమైన హామీ లభించిందా..?
ఆస్తి పంపకాలు తేల్చుకోబోతున్నారా..?
హైదరాబాద్‌ను ఏం చేయబోతున్నారు..?
సీమాంధ్ర రాజధాని పరిస్థితి ఏమిటి?
రాజకీయతేర పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయా..?
ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తే అవకాశాలున్నాయి. దీనికి కారణం.. ఆంధ్రా-తెలంగాణ మేధావుల మధ్య రహస్య చర్చలు.
"భోగోళికంగా విడిపోయి.. మానసికంగా కలిసుందాం.. అపోహలకు తొలగించుకుందాం. అనిశ్చితికి తెరదించుదాం".. అంటూ సీమాంధ్ర మేధావులు.. తెలంగాణ మేధావులు చేయీచేయీ కలిపారు. సమస్య పరిష్కారానికి మార్గం వెదికే పనిలో పడ్డారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో చేరోపక్షం చేరిన మేధావులు ఇంతవరకూ కలహించుకోవడమే చూశాం. కానీ, ఇప్పుడు మాత్రం మేధావుల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఇరు ప్రాంతాల విద్యావంతులు కలిసికూర్చుని చర్చలు జరుపుతున్నారు. కీలక అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాదే కీలకం
ఆంధ్రాతెలంగాణ మేధావుల మధ్య రాష్ట్ర విభజనకు సంబంధించి ఎన్నో కీలకవిషయాలు చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ గురించే. రాష్ట్ర విభజన అంశం హైదరాబాద్ చుట్టూ చాలాకాలంగా తిరుగుతూనే ఉంది. రాష్ట్ర రాజధానిపై బిగుసుకున్న ముడి విడిపోతే, రాష్ట్ర విభజనకు మార్గం సుగమం అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. అందుకే, హైదరాబాద్‌ను కేంద్రపాలితప్రాంతం చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ మేధావుల మధ్య చర్చల ఎజెండాలోను హైదరాబాద్ చోటుచేసుకుంది. దీనిపై ఆసక్తికరమైన చర్చకూడా సాగింది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడే వరకూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని ఆ ప్రాంత మేధావులు కోరారు.
ఈ ప్రతిపాదనపై మాత్రం తెలంగాణ మేధావులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైదారాబాద్‌కు సంబంధించి మరికొన్ని డిమాండ్లనూ సీమాంధ్ర నేతలు ఉంచారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత, రాజధానిలోనే ఉండాలనుకునే ఉద్యోగులకు పదేళ్లపాటు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అంతేకాదు.. రాష్ట్ర విభజనపై తమకున్న అనుమానాలు, తమకు కావాల్సిన హామీలపై ఓ పత్రాన్ని తయారుచేసి సీమాంధ్ర మేధావులు.. తెలంగాణ మేధావులకు అందించారు. హైదరాబాద్‌పై మాత్రం మరోసారి కూర్చుని చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. మేధావుల తీరుచూస్తుంటే.. రాష్ట్ర విభజన ఖాయంగానే కనిపిస్తోంది.
చర్చలెందుకోసం..?
రాష్ట్రంలో పోరాటాల కాలం నడుస్తోంది. ఎటు చూసినా ఉద్యమాలే. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటారు. ఓ ప్రాంతం తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. మరో ప్రాంతం సమైక్యరాష్ట్రం కోసం పట్టుబడుతోంది. రాజకీయనేతలూ.. పోటాపోటీగా సవాళ్లను విసుకోవడంతో.. రాష్ట్ర భవిష్యత్తు గందరగోళంలో పడింది. అసలు రాష్ట్రం సమైక్యంగా కొనసాగుతుందో.. రెండుగా విడిపోతుందో తేల్చుకోలేని పరిస్థితి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వమూ కాలయాపన చేస్తూ.. సమస్యను మరింత జటిలం చేస్తోంది. రాష్ట్రంలోని పార్టీలపై కేంద్రం నెపాన్ని నెట్టేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందరిదీ ముసుగులో గుద్దులాటే. ఇలా ఇంకెంత కాలం గడపాలి. ఇంకెంత కాలం పోరాడాలి. ఇంకెంతకాలం.. రాష్ట్రాన్ని సంక్షోభంలోనే ఉంచాలి..? ఇలా అయితే.. మన భవిష్యత్తు ఏమవుతుంది..? అందుకే.. మేధావులు ముందుకు కదిలారు. విమర్శలు, ఆరోపణలు మానేసి.. మాటలతో పరిష్కారం వెదకాలనుకుంటున్నారు. అందులో భాగమే ఈ చర్చలు.
రాష్ట్రం విడిపోతే.. ఆంధ్రా తెలంగాణ మధ్య భవిష్యత్తులో ఏర్పడే ఇబ్బందులపై ప్రధానంగా మేధావులు దృష్టిపెట్టారు. హైదరాబాద్ అంశాన్ని తేల్చుకోవడం కష్టమైనప్పటికీ, భవిష్యత్తులో అంతా ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి తోడు మరో ప్రధాన సమస్యగా మారే నీటిపంపిణీపైనా చర్చలు జరిగాయి. ఆంధ్రా అభివృద్ధికి సాగునీరే కీలకం కాబట్టి.. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ నేతలు అడ్డుకోవద్దని ఆ ప్రాంత మేధావులు కోరారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే తమ ప్రాంత హక్కులను కాపాడుకోవడం కోసం ఆంధ్రా మేధావులు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఎక్కడా ఒక్క సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇంకా ఎన్నో రంగాల్లో వెనుకబడిన ఈ ప్రాంతాభివృద్ధికి పాటుపడాల్సిందేనంటున్నారు. సమైక్యంగా ఉండడం వల్లే చాలా అన్యాయానికి ఆంధ్ర ప్రాంతం గురవుతుందన్న భావన వారిలోవ్యక్తమవుతోంది. అందుకే, విభజన జరిగే సమయంలో ప్రత్యేకంగా 2 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా ప్రాంతానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తొలి సమావేశంలో కొంతమందే పాల్గొన్నప్పటికీ, తదుపరి సమావేశాల్లో రెండు ప్రాంతాలకు సంబంధించి మరింతమందిని భాగస్వాములను చేయాలని మేధావులు భావిస్తున్నారు.
మేధావులకు మద్దతుందా?
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడం రాజకీయ నేతల వల్ల కావడం లేదు.. వారి తీరు చూస్తుంటే భవిష్యత్తులోనూ ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఏదో ఓ అంశాన్ని పట్టుకొని లాక్కొని పీక్కుని.. తన్నుకుంటున్నారే తప్ప.. దాన్ని ఎలా పరిష్కరించాలన్నదానికి సీమాంధ్ర నేతలు, తెలంగాణ నేతలు ప్రయత్నించడం లేదు. పోరాటం చేస్తే వచ్చేస్తుందని ఒకరు.. రాజకీయంగా అలజడి సృష్టిస్తే ఆగిపోతుందని మరొకరు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతూ గడిపేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మేధావులు ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. చర్చలు చేపట్టారు.
అయితే.. ఈ మేధావుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా మేధావులను టార్గెట్ చేసుకున్నారు సీమాంధ్ర నేతలు. ఓ వైపు రాజకీయసంక్షోభం కొనసాగుతున్న సమయంలో, తమ ప్రతినిధులుగా చర్చలు జరపడానికి మీరెవరంటూ ఆంధ్రామేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తున్నారు. కేవలం గడ్డం పెంచి, భుజాన శాలువా వేసుకుంటే మేధావి అయిపోతారా అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్.
అటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లోనూ మేధావుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయనేతలను పక్కన పెట్టి, తమంతట తామే చర్చలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఈ చర్చలు జరపడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఈ మేధావులంతా పగటివేషగాళ్లంటూ విమర్శించారు కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగిరమేశ్.
ఆంధ్రా మేధావుల వేదిక తీరుపై సీమాంధ్ర జేఏసీ కూడా మండిపడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సీమాంధ్ర ప్రజలు.. రాష్ట్ర విభజన కోరుకోనప్పుడు.. ఏ విధంగా చర్చలు జరుపుతారని నిలదీస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికే సీమాంధ్ర జేఏసీ కట్టుబడి ఉందని, విభజనపై ఎలాంటి చర్చలు జరపమంటూ ప్రకటిస్తోంది. పైగా, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చలసాని శ్రీనివాస్ కుమ్మక్కయారంటూ విమర్శిస్తోంది.
తెలంగాణ మేధావుల విషయంలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ఉద్యమాన్ని నడిపిస్తున్నవారే చర్చల్లో పాల్గొనడంతో ఆ సమస్య లేదు. కానీ, ఆంధ్రా మేధావుల వేదిక పరిస్థితి వేరు. సొంతప్రాంతంలోనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి వీటిని ఆంధ్రా మేధావులు ఎదుర్కోగలరా..?
చర్చల్లో ఎవరు ఉండాలి?
తెలంగాణ.. ఆంధ్రా మేధావుల మధ్య జరుగుతున్న చర్చలు ఆశించిన ఫలితాన్ని అందిస్తాయా..? రాష్ట్ర విభజనకు మార్గనిర్దేశం చేస్తాయా..? చర్చలు సానుకూలంగానే జరిగినా, భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగవచ్చని భావిస్తున్నా.. ఫలితం ఆశించడం మాత్రం అత్యాశే కావచ్చు. కారణం.. ఆంధ్రా మేధావులుగా చర్చల్లో పాల్గొన్న వారిపై సీమాంధ్రలో ఉన్న వ్యతిరేకతే. ఆంధ్రా మేధావుల వేదికపై సీమాంధ్ర నేతలకు సరైన అభిప్రాయం లేదు. చలసాని నాయకత్వాన్ని ఎవరూ సమర్ధించడం లేదు. అందుకే, ఈ చర్చలను సీమాంధ్రలో ఎవరూ స్వాగతించలేదు. పైగా, ఈ చర్చల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి రాజకీయ భాగస్వామ్యం లేదు. ఇదే ప్రధాన లోపం. మేధావుల మధ్య జరిగే చర్చల ద్వారా.. రాష్ట్రాన్ని విభజించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఏమాత్రం లేదు.
ఉద్యమాలతో రెండు ప్రాంతాల మధ్య సామరస్య వాతావరణం దెబ్బ తిన్న సమయంలో చర్చలకు అడుగు పడడం ఆహ్వానించ దగిందే. దీనివల్ల ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని తీర్చుకోవచ్చు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు సాగించవచ్చు.
అయితే.. ఈ చర్చలను రహస్యంగా జరపడం వల్ల ఎన్నో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చర్చలో కీలకమైన వర్గం పాల్గొనకపోవడం. ప్రస్తుతం చర్చల్లో పాల్గొన్నవారంతా తెలంగాణ మేధావులు, జైఆంధ్రా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నవారే. వీరిద్దరూ చర్చించడం వల్ల ఉపయోగం ఉంటుందా..?
తెలంగాణ, ఆంధ్రా మేధావుల మధ్య జరిగిన చర్చలు మంచివే. అయితే.. ఇవి జైఆంధ్రా, తెలంగాణ మేధావులకే పరిమితమైతే ఉపయోగం ఉండదు. వీటిలో సీమాంధ్ర మేధావులకు భాగస్వామ్యం కల్పించాలి. అందరికీ ఒకే వేదికపైకి తెచ్చి, సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇక రాజకీయ పక్షాలు కూడా ఈ చర్చల్లో పాలుపంచుకొన్నప్పుడే కచ్చితమైన ఫలితం వస్తుంది. మేధావులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి