17, డిసెంబర్ 2010, శుక్రవారం
నీచానంద
Categories :
నిత్యానందస్వామి..
ఈ పేరు తెలియనివారు బహుశా ఉండరేమో...
కొన్నాళ్లుగా మీడియాలో ఎక్కువగా కనిపించిన స్వాముల్లో నిత్యానందుడిదే అగ్రస్థానం.. మీడియాలో ఫోకస్ అవడానికి ఆయన మహత్కార్యాలను చేయలేదు.. అంతకన్నా ఘనకార్యాలను వెలగబెట్టారు. అవే తన భక్తులతో రాసలీలలు. తమిళ నటీమణులతో సెక్స్‌టేపుల్లో కనిపించి సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడ్డ నిత్యానంద .. ఆ తర్వాత, ఆత్మపరిశుద్ధ యాగాన్ని కూడా చేశారు. అశ్లీల కార్యక్రమాలతో వచ్చిన చెడ్డపేరును ఇలా తుడిచేసుకోవాలనుకున్నారు. కానీ ఈ యాగం చేసినా ఆయనపై మచ్చలు తొలిగిపోలేదు సరికదా.. మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆధ్యాత్మిక గురువు ముసుగులో నిత్యానంద ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
దీవిపై నిత్యానంద కన్ను
హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాల్లో ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాట్ కొనాలంటేనే లక్షల్లో ధార పోయాలి. అలాంటి అమెరికాలో ఫ్లాట్ కొనాలంటే.. కోట్లల్లోనే వెచ్చించాలి. ఫ్లాట్లు, ఇళ్లు కాకుండా.. ఏకంగా ఓ దీవినే కొనాలంటే.. వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే.. యూఎస్‌లో ఖరీదైన ప్రాంతమైన లాస్‌ఏంజిల్స్‌కు చేరువలోని ఓ దీవిని ఇలానే కొనాలనుకున్నారు... నిత్యానందస్వామి.
ఓ పెద్ద దీవిని.. అదీ అమెరికాలో.. నిత్యానంద కొనాలనుకున్నారంటే.. ఆయన స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా నమ్మతారా.. నిత్యానందుడు పైకి కనిపిస్తున్నంత సాధారణ స్వామీజీ కాదని.. కోట్లకు పడగలెత్తిన కుబేరబాబా అని.
దీవిలో ఏం చేస్తారు..?
సాధువుగా జీవిస్తున్నా... లగ్జరీ లైఫ్ అనుభవించడమంటే నిత్యానందకు మహా ఇష్టం. నిత్యం ఆనందంగా ఉండాలన్నదే నిత్యానంద సిద్ధాంతం. అది మానసికంగా కావచ్చు.. శారీరంకగా కావచ్చు. అందుకే.. సాధువైనప్పటికీ సకలభోగాలను అనుభవిస్తుంటారు. అమెరికాలో దీవిని కొనుగోలు చేయాలనుకోవడానికి కారణం కూడా ఇదే.
లాస్ ఏంజిల్స్ తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ దీవిలో అతిపెద్ద ఆశ్రమాన్ని నిర్మించాలని నిత్యానంద భావించారు. చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన ధ్యానపీఠ భక్తి సామ్రాజ్యానికి ఈ దీవిని ప్రధానకేంద్రం చేయాలనుకున్నారు. అక్కడినుంచే తన కార్యకలపాలను కొనసాగించాలనుకున్నారు. ఈ ఆశ్రమం కొనాలన్న ఆలోచన నిత్యానందకు రావడానికీ ప్రత్యేక కారణం ఉంది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, స్కాట్లాండ్ సమీపంలో ఓ దీవిని కొంతకాలం క్రితం కొనుగోలు చేశారు. దాన్ని యోగాకేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయం ఓ భక్తుడి ద్వారా తెలుసుకున్న నిత్యానంద తనకూ ఓ దీవి ఉండాలని ఉబలాటపడ్డారు. అంతే, ఆయన కన్ను లాస్‌ఏంజిల్స్ సమీపంలోని దీవిపై పడింది.
నిత్యానంద తలుచుకుంటే దీవిని కొనడం కష్టమా... అందుకే, చకచకా అడుగులు పడ్డాయి. డీల్ కుదిరిపోయింది. దీవి కొనుగోలుకు రంగం సిద్ధమయ్యింది. దీవిని కొనేసి, మకాంను అక్కడికి మార్చేయాలనీ నిత్యానంద ప్రిపేర్ అయిపోయారు. సరిగ్గా... అక్కడే, ఆయన ఆశలు అడియాశలు అయిపోయాయి. కారణం.. నిత్యానందుడి రాసలీలల వీడియో టేపులు బయటకు పొక్కడమే. టేపులు బయటకు రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నిత్యానంద, హిమాచల్ ప్రదేశ్‌కు చేరుకొని రహస్య జీవితాన్ని గడిపారు. అక్కడి నుంచే అమెరికాకు వెళ్లిపోదామనుకున్నారు. కానీ, స్వామి ఘనకార్యం తెలియడంతో దీవిని అమ్మాలకున్న వారు వెనక్కి తగ్గారు. విశాలమైన దీవికి అధిపతి కావాలనుకున్న నిత్యానంద.. జైలు గోడల మధ్య ఖైదు అయ్యారు. లాస్‌ఏంజిల్స్ సముద్రంలో సర్వభోగాలు అనుభవించాలనుకున్న నిత్యానంద చివరకు చిప్పకూడు తినాల్సి వచ్చింది..
విస్తృత సామ్రాజ్యం
భక్తులతో రాసలీలలు సాగిస్తూ కెమెరాకు దొరికిపోయి.. పరువు పోగొట్టుకున్న నిత్యానంద సామ్రాజ్యం చాలా పెద్దది. కర్నాటకలో నిత్యానంద ప్రధాన ఆశ్రమం ఉంది. బెంగళూరుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని బిడాడీలో ఈ ఆశ్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు. చిన్నగా ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు ఎంతో విస్తరించింది. నిత్యానంద చేసే యాగాలు అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. భక్తులకు ఉపదేశాలు కూడా బిడాడీలోనే ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి.
కర్నాటకలోని బిడాడీ కాక దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ఉత్తర భారతాన నిత్యానంద ఆశ్రమాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. భారతదేశంలో పేరుప్రఖ్యాతులు రావడంతో, స్వామి ప్రభ విదేశాలకూ వ్యాపించింది. దక్షిణాసియా నుంచి దక్షిణ అమెరికా వరకూ ఆశ్రమాలను ఏర్పాటయ్యాయి. 2003లో లైఫ్ బ్లిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించడంతో నిత్యానందుడు కార్యకలాపాలు మరింత వేగవంతమయ్యాయి. అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బ్రెజిల్‌లో ముఖ్య కేంద్రాలను ఈయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 33 దేశాల్లో వెయ్యి కేంద్రాలు నిత్యానందుడి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. యోగ, వ్యక్తిత్వ వికాసమంటూ ప్రత్యేక తరగతులను ఆయన నిర్వహిస్తుంటారు. వీటికి హాజరయ్యే వారిలో ఎక్కువమంది విదేశీయులే. ఒక్క అమెరికాలోనే ధ్యానపీఠానికి నాలుగు ఆశ్రమాలున్నాయి. వీటిలో లాస్‌ఏంజిల్స్‌లో వందెకరాల విస్త్రీర్ణంలో సువిశాల ఆశ్రమం ఉంది. కర్నాటక ఆశ్రమం తర్వాత, నిత్యానంద ఎక్కువగా ఉండేది ఈ ఆశ్రమంలోనే. విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడి నిత్యానంద చేరుకుంటారు. భక్తులతో నిత్యానందుడు సాగించిన రాసలీలల బయటపడిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో వ్యవహారాలు స్తంభించిపోయాయి. కొన్నింటిలో నామమాత్రంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. పూర్తిగా పనిచేస్తున్నది లాస్‌ఏంజిల్స్, కర్నాటకలోని ఆశ్రమాలు మాత్రమే.
కుబేర బాబా
నిత్యానంద చాలా కాస్ట్‌లీ స్వామీజీ. ఏ చిన్న పని చేయాలన్నా ఆయనకు చెల్లించుకోవాల్సిన ఫీజు వేలు, లక్షల్లోనే ఉంటుంది. కాస్ట్‌లీ భక్తులకు మాత్రమే ఎక్కువగా దర్శనం ఇచ్చే స్వామీజీ వారి నుంచి డబ్బులను కూడా అదే స్థాయిలో వసూలు చేస్తాడు. ఎక్కువగా విదేశాల నుంచే డబ్బు నిత్యానందకు చేరుతోంది. ఇవన్నీ ఊకదంపుడుగా చెబుతున్నవి కాదు.. సీఐడీ దర్యాప్తులో స్వయంగా నిత్యానంద వెల్లడించిన వాస్తవాలివి. అంతేకాదు.. లెక్కలన్నీ తేల్చి చూస్తే.. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అధిపతన్న విషయం ఈ ఇన్వెస్టిగేషన్‌లోనే బయటపడింది. మనదేశంలో బడాబడా కార్పొరేట్ల చాలామందికి లేనన్ని ఆస్తులు.. సన్యాసైన నిత్యానందకు ఉన్నాయి. ఈ డబ్బులో నుంచే, కొంత మొత్తాన్ని దీవిని కొనడానికి వెచ్చించాలని భావించారు.
ఇక్కడే అందరూ తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది. డబ్బుతో కొన్నప్పటికీ దాన్ని విరాళంగా తీసుకున్నట్లుగానే డాక్యుమెంట్లను సృష్టించాలని నిత్యానంద టీం భావించింది. విరాళంగా వచ్చిందని చెబితే ఎవరికీ అనుమానం రాదన్న అంచనా వారిది. పైగా పన్నులు కూడా ఎగ్గొట్టొచ్చు. అంతేకాదు.. నిత్యానంద ఇప్పటివరకూ కొన్నవాటిలో చాలావరకూ విరాళాలుగానే చూపించారని సీఐడీ తన నివేదికలో పేర్కొంది. కర్నాటకలోని ఆశ్రమంలో కూడా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
బయటపడుతున్న వాస్తవాలు
నిత్యానంద రాసలీలల పై దర్యాప్తు జరిపిన సీఐడీ 430 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది. నవంబర్ 27న ఈ రిపోర్ట్‌ను రామ్‌నగర్ జిల్లా కోర్టులో సమర్పించింది. నిత్యానందతో పాటు అతని నలుగురు అనుచరులపైన ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ రిపోర్ట్‌లోనే నిత్యానంద పాల్పడ్డ ఎన్నో అక్రమాల గురించి సీఐడీ ప్రస్తావించింది.
నీవు పార్వతివి.. .నేను శివుడిని.. ఇది నిత్యానంద తరచుగా తన భక్తురాళ్లతో చెప్పే మాట. ఏకాంత సేవలను ఎక్కువగా కోరుకునే ఈ స్వామీజీ భక్తురాళ్లపై వలవేయడానికి ఎన్నుకున్న మార్గమిది. తనతో గడపడానికి ఒప్పించడంలో భాగంగానే శివుడు-పార్వతిల ప్రస్తావన తెస్తాడట. అంతేకాదు.. నీవు రాధవు.. నేను కృష్ణుడినంటూ అవసరాన్ని బట్టి పేర్లు కూడా మారుస్తాడు. పైగా, తాము చేసేది పవిత్రకార్యమని, దానికి సిగ్గుపడకూడదనీ ఉపదేశిస్తాడట. అంతేకాదు.. తనతో గడిపితే మోక్షం లభిస్తుందనీ నమ్మబలుకుతాడు. ఇలానే ఎంతోమందితో రాసలీలలు గడిపినట్లు సీఐడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
తరచూ సమాధిలోకి వెళ్లిపోవడం నిత్యానందుడి స్పెషాలిటీ. దేవుడి ప్రతిరూపాన్నని చెప్పుకునే నిత్యానంద.. ఈ సమాధిస్థితి నుంచి బయటకు రావాలంటే కొన్ని ప్రత్యేక సపర్యలు చేయాల్సి ఉంటుంది. అవేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే ఏకాంత సేవ. అలా సేవిస్తే.. ఆయన శరీరం తిరిగి ఉత్తేజితమవుతుందని భక్తులకు చెబుతుంటారు. తనను సమాధ స్థితినుంచి బయటకు తెచ్చి... ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నారంటూ, కోర్కెలు తీర్చిన భక్తురాళ్లను అదేపనిగా పొగుడుతుంటారనీ దర్యాప్తులో తేలింది.
నిత్యానంద పుట్టినరోజు జనవరి 1. అయితే.. డిసెంబర్‌లోనే ఆయన జన్మదినోత్సవాలు ప్రారంభమవుతాయి. చాలా రోజుల పాటు ప్రత్యేకంగా సంబరాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో నిత్యానందుడు మరింత ఉత్సాహంగా ఉంటారట.
సిగ్గు.. సిగ్గు
అవతారం.. ఆధ్యాత్మికం..
చేసేది మాత్రం.. చీకటి వ్యాపారం..
నిత్యానందుడి గురించి బయటపడుతున్న విషయాలు వింటే ఎవరికైనా అనిపించేది ఇదే. అమెరికాకు, ఇండియాకు మధ్య ఎక్కువగా తిరిగే సెక్స్‌స్వామీజీ స్వచ్ఛమైన బంగారాన్ని స్మగుల్ చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. మనదేశం నుంచి వెళ్లేటప్పుడు బంగారాన్ని పోలినట్లుండే వస్తువులను తీసుకువెళ్లే నిత్యానంద.. తిరిగి వచ్చే టప్పుడు మాత్రం 24 కేరెట్ల స్వచ్చమైన బంగారంతో చేసిన అలాంటి వస్తువులనే తెస్తున్నారంట. ఇలా తెస్తూ.. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్‌లను ఎగ్గొడుతున్నారన్నమాట.
అమెరికా వెళితే నిత్యానందుడి రూపమే మారిపోతుంది. ఆశ్రమంలో ఉన్నంతవరకూ ఎంతో సంప్రదాయ వస్త్రాలతో కనిపించే స్వామీజీ, చీకటి పడితే అవతారం మార్చేస్తారు. తరచుగా పబ్‌లకు, నైట్ పార్టీలకు అటెండ్ అవుతారన్న ప్రచారం ఉంది. జీన్స్, టీ షర్ట్‌లు వేసుకొని స్ట్రిప్ క్లబ్స్‌కు వెళతారన్న వార్తలూ ఉన్నాయి. 2006లో లాస్‌వెగాస్‌లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఇలాంటి పార్టీల్లో నిత్యానంద దర్శనమిచ్చారట. ఆ సమయంలో ల్యాప్ డ్యాన్స్‌లను బాగా ఎంజాయ్ చేశారంట. ఆ తర్వాత తన ఆశ్రమంలో కూడా కొంతమంది భక్తులతో ఇలాంటి ప్రయోగాలు చేశారన్నవార్తలూ బయటకు పొక్కాయి. ఇక అమెరికాలో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ఓ భక్తుడినుంచి దాదాపు 4 లక్షల రూపాయలను నిత్యానంద వసూలు చేశారట. ప్రత్యేక యాగం చేసిన సమయంలో మారిజోనా లాంటి మాదకద్రవ్యాలను, వాడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపైనా దర్యాప్తు జరుగుతుంది.
నిత్యానందకు సంబంధించిన మరో వికృత విషయాన్ని మిడ్‌డే పత్రిక బయటకు తెచ్చింది. తన జన్మదినోత్సవాల సమయంలో ఓ రోజున దేవీ అవతారాన్ని నిత్యానంద ధరిస్తారట. ఆ రోజు కొంతమందికి మాత్రమే ఆయన దర్శనం దొరుకుతుంది. రెండేళ్ల క్రితం ఇలానే దర్శనమిచ్చినప్పుడు... ఓ భక్తుడిని తనతో ఓరల్ సెక్స్ చేయమని ఆహ్వానించాడట. తాను అతనికోసమే వచ్చిన దేవినంటూ, నీ ఏకాంతసేవ కావాలంటూ గొడవపెట్టారట.
వన్యప్రాణి చట్టాలను నిత్యానంద యధేచ్చగా ఉల్లంఘించారు. ఆయన ఆశ్రమంలో సోదాలు జరిపిన సీఐడీ బృందానికి ఓ కీలకమైన సీడీ దొరికింది. పులి తల చిరుతపులి చర్మాన్ని నిత్యానంద వాడుతున్నట్లున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల అభియోగాలను సీఐడీ నిత్యానందపై తయారు చేసింది. వీటన్నింటినుంచి బయటపడడం నిత్యానందుడుకి అంత సులువేమీ కాదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి