17, డిసెంబర్ 2010, శుక్రవారం
మాకో వయాగ్రా కావాలి..!
వయసు మళ్లినవారికోసం..
సెక్స్ సామర్థ్యం తగ్గినవారికోసం..
శృంగార సమస్యలతో బాధపడుతున్నవారికోసం..
వయాగ్రా....
కానీ... ఇప్పుడో కుర్రాళ్లకోసమే వయాగ్రా...
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ సెక్స్ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. శృంగారంలో పూర్తి స్థాయి ఆనందం పొందడం కూడా సాధ్యం కాదు.. ఇలాంటి వారికోసం తయారైన దివ్య ఔషధమే - వయాగ్రా. కానీ.. ఇప్పుడు ముసలి వాళ్లకేంటే.. యువతే వయాగ్రా కోసం ఎగబడుతోంది.. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే వయాగ్రా లాంటి ఉత్ర్పేరకాలను వాడుతున్నారు.. కేవలం హైదరాబాద్ నగరంలో నెలకు 30 లక్షలకు రూపాయల విలువచేసే వయాగ్రాలు అమ్ముడవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో సుమారు 8వేల మెడికల్ షాపులున్నాయి.. చిన్నచిన్నగల్లీల్లో ఉన్న మెడికల్ షాపులో కూడా రోజుకు ఒకటో రెండో వయాగ్రాలు అమ్ముడవుతున్నాయి.. ఇక.. ప్రధాన కూడళ్లలో ఉండే షాపుల్లో రోజుకు 50 నుంచి వంద స్ట్రిప్పుల వరకూ ఉత్ర్పేరకాలు సేల్ అవుతున్నాయి. శృంగారానికి దోహదం చేసే ఉత్ర్పేరకాలు మార్కెట్లో 30 వరకూ ఉన్నాయి.. వయాగ్రా, సోహాగ్రా, మ్యాన్‌ఫోర్స్, కవర్టా, ఫిల్గ్రా, సిలిడినాసిల్ సిట్రెట్, అండ్రోజు, పెనిగ్రా వంటి టాబ్లెట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వివిధ రకాల పరిమాణాల్లో లభించే ఈ మందులు.. 50 నుంచి 120 రూపాయల మధ్యలో లభిస్తాయి.
శృంగార సంబంధ ఉత్ర్పేరకాలను కొంటున్నవారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా టీనేజ్‌లో ఉన్నవారిలో సెక్స్ సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. 35-40 ఏళ్ల నుంచి శృంగార సామర్థ్యం తగ్గుతూ వస్తుంది.. మరి సెక్స్ సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉన్న యూత్.. వయాగ్రా లాంటి ఉత్ర్పేరకాలపైన ఎందుకు ఆధారపడుతోంది..?
టెన్షన్స్.. టెన్షన్స్
పదిహేనేళ్లకే పెళ్లి.... ఆ తర్వాతే ఉద్యోగం లేదా వ్యాపారం.. ఇదీ ఒకప్పటి మాట.. టీనేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి కావడంతో.. ఒకప్పుడు సెక్స్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్... పెళ్లి, సంసారం కంటే ముందు లైఫ్‌లో సెటిల్ కావడానికి యువత ప్రాధాన్యమిస్తోంది.. అందుకే.. చదువు సంధ్యల్లో మునిగి తేలుతోంది.. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేసరికి 25 నుంచి 30 ఏళ్లు గడిచిపోతున్నాయ్.. ఆ తర్వాతే పెళ్లి..! పాపం- సగం జీవితాన్ని ఉద్యోగవేటలోనే గడిపేస్తుంటే.. ఇక సంసారం సాఫీగా ఎలా సాగుతుంది..?
పాతికేళ్లకే లక్షలు ఆర్జిస్తుండడంతో.. ఆఫీసుల్లో పని ఒత్తిడి పెరుగుతోంది. టైంకి తిండి లేకపోవడం.. జంక్ ఫుడ్‌కి అలవాటుపడటం.. లాంటి సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఆఫీస్‌లో వదిలేయాల్సిన సమస్యలను ఇంటికి తీసుకొస్తున్నారు. ఇంట్లో జీవిత భాగస్వామికి కూడా తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు...? మానసిత ఒత్తిడితో.. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడంతో పాటు ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోతున్నారు.. చిన్నవయసులోనే పనిభారం ఎక్కువ కావడంతో సమయానికి తిండి కూడా కరవైంది. దీంతో.. పోషకాహార సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనే వారిని ఉత్ర్పేరకాలవైపు మళ్లిస్తోంది..
బ్లూఫిల్మ్‌లు, టీవీల్లో శృంగార సంబంధ కార్యక్రమాలు కూడా యువతను రెచ్చగొడుతున్నాయి.. దీంతో.. శృంగారాన్ని పూర్తిస్థాయిలో ఆనందించాలని యూత్ తెగ తొందరపడుతోంది. అందుకే వయాగ్రాకోసం క్యూ కడుతోంది..ఇక.. శృంగారాన్ని ఎక్కువసేపు చేయాలనే కోరిక మరొకరిది.. శీఘ్రస్కలనంతో బాధపుడుతున్న కొంతమంది యువత.. అలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు మందులు వాడుతున్నారు.
అంగస్తంభన లోపం, నరాల బలహీనత, ఆయాసం.. లాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్యులే కొన్ని మందులను సూచిస్తున్నారు. శృంగార సమస్యలతో వస్తున్నవారిలో పది శాతం మందికి ఇవే కారణాలు. ఒంట్లో అన్నీ బాగానే ఉన్నా.. తాము ఫిట్‌గా లేమనే భయం నేటి యువతను వెంటాడుతోంది. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వివాహితులకు ఈ సమస్య ఎదురవుతోంది. అందుకే.. వారు వయాగ్రాలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇది మంచి పరిణామం కాదంటున్నారు వైద్యులు.
దివ్య ఔషధమేనా..!
వాస్తవానికి వయాగ్రా వండర్ డ్రగ్.. కానీ దానివల్ల పెద్దగా దుష్పరిణామాలు లేవు. కానీ.. వాడిన ప్రతి పదిమందిలో ఒకరికి తీవ్రమైన తలనొప్పి కలిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వయాగ్రా డోస్ పెరిగేకొద్ది తలనొప్పి కూడా ఎక్కువ అవుతుంది. వయాగ్రా వాడినవారిలో 3శాతం మందికి తాత్కాలికంగా కళ్ళు కనబడకపోవడం, మసగబారడం జరుగుతోంది. అంతేకాదు.. వయాగ్రా రక్తపోటును తగ్గిస్తుంది.. బీపీ ఉన్నవారు వయాగ్రా వాడినప్పుడు.. రక్తపోటు మరింత పడిపోయి స్పృహ కోల్పోవడంలాంటివి జరుగుతున్నాయి.
వయాగ్రా వాడితే చాలాసేపు అంగం స్తంభించి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ వయాగ్రా వాడుతున్నవారెవరిలోనూ... అంగం ఎక్కువసేపు నిలబడటం లేదని సర్వేలు చెబుతున్నాయి. శృంగారానికి గంటముందు ఈ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఉపయోగం ఉంటోంది.
సాధారణంగా గుండెజబ్బు, మదుమేహం లాంటి జబ్బులున్నవారిలో అంగస్తంభన సమస్య ఉంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మాత్రమే వయాగ్రాలాంటి ఉత్ర్పేరకాలను వాడాలి.
వయాగ్రా వాడేవారిలో ఎక్కువ శాతం మంది అనవసరంగా భయపడటం, ఒత్తిళ్లకు గురవడమే కారణం.. డ్రగ్స్ మత్తులో పడిన నేటి యువత.. ఆమోజులో పడి శరీరాన్ని గుల్ల చేసుకుంటోంది. దీంతో.. త్వరగా సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతోంది. సమయానికి భోజనం చేయడం, ఫాస్టు ఫుడ్స్‌కు దూరంగా ఉండడం.. పళ్లు, పాలు లాంటి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని.. తద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు..
కొందరు మగవారు తమ భార్యలను సంతృప్తిపరచలేమోనని, తాము తొందరగా ఉత్తేజితులం కావడం లేదనే కారణాలతో వీటిని ఉపయోగిస్తుంటారు. పడక గదిలో సుఖంగా ఉండడానికి కావల్సింది వయాగ్రా కాదు.. జీవిత భాగస్వామితో సఖ్యత, స్నేహభావం..! వీటితోపాటు.. మనసులో గూడుకట్టుకున్న భయం, అపోహలను వదిలించుకోవాలి.. వీలయినంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉండాలి..
రోజుకు ఒక్క వయాగ్రా మాత్ర మాత్రమే వాడాలి. సెక్స్‌లో పాల్గొనే ఒక గంట ముందు దీన్ని తీసుకోవాలి. నోట్లో వేసుకున్న 10 నిమిషాలలో ఇది కరిగిపోతుంది. పూర్తిగా కరిగిన అర్ధగంట తర్వాత ఇది తన ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది కొంచెం లేటుగా ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. వయాగ్రా వాడే సమయంలో ద్రాక్ష పళ్లు లేదా ద్రాక్ష రసాన్ని తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వయగ్రా వాడేముందు ఓ సారి డాక్టర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం..
ప్రేమానురాగానే ఉత్ప్రేరకాలు
సంసారాన్ని సుఖవంతం చేసుకోవడానికి.. శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి భార్యాభర్తలు ప్రయత్నించాలి. ఇందుకోసం మొదట వారిద్దరి మధ్య సఖ్యత అవసరం.. భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన.. వారి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. భార్యాభర్తలు.. తమ బలహీనతలను ఒకరినొకరు పరస్పరం ఎత్తిచూపడం ద్వారా వారి మధ్య మరింత దూరం పెరుగుతుంది. పడకగదిలో అలాంటి మనస్ఫర్థలకు దూరంగా ఉండడం మంచిది..
సంసారమన్నాక చిన్నచిన్న కోపాలు, పట్టింపులు కామన్.. ఇవి సంసారంలో సరిగమల లాంటివి..! ఒకరినొకరు తమ కోపాన్ని అణుచుకోవడం ద్వారా దగ్గరయ్యే అవకాశముంటుంది. భార్యాభర్తల వ్యక్తిగత విషయాల్లో పరాయి వ్యక్తుల ప్రస్తావన లేకుంటే మంచింది. పరాయి వ్యక్తుల ముందు భార్యను అవమానించకుంటే మంచింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు.. మనసును ఆహ్లాదపరుచుకునేందుకు సమయం కేటాయించుకోవాలి. భార్యాభర్తలు పరస్పరం బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా వారి మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడుతాయి..
పడక గదిలో ఒత్తిడికి గురవకుండా.. మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇద్దరూ ఎడమొహం-పెడమొహంలాగా ఉండకుండా.. అన్యోన్యంగా ఉండాలి. అభిప్రాయాలను పంచుకోవాలి. రోమాంటిక్ మాటలు శృంగారాన్ని ప్రేరేపిస్తాయి. జీవిత భాగస్వామి సహకరించేందుకు ఈ మాటలు ఎంతో దోహదపడుతాయి. మనిషికి కెరీర్, సంపాదన ఎంత ముఖ్యమో.. జీవితంలో సంతోషం కూడా అంతే ముఖ్యం. సంతోషం లేనప్పుడు ఎంత సిరిసంపదలు ఉన్నా ఉపయోగం ఉండదు.. భార్యాభర్తలు బిజినెస్ పార్ట్‌నర్స్‌గా వ్యవహరించకూడదు.. తాము లైఫ్ పార్ట్‌నర్స్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి