13, డిసెంబర్ 2010, సోమవారం
జగన్ జోరు
Categories :
కాంగ్రెస్‌తో అసలైన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఒక్కో అడుగు వేస్తున్న జగన్ అత్యంత తెలివిగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్లను ఒక్కొక్కరినే తన బుట్టలో వేసుకుంటున్నారు.
ఆకర్షణ మంత్రం
జగన్ కొత్త మంత్రం జపిస్తున్నారు. అదే.. ఆకర్షణ మంత్రం. జగన్కిదే ఇప్పుడు తారకమంత్రం. కాంగ్రెస్ నేతలను తనవైపు ఆకర్షించుకోవడమే ఈ మంత్రం లక్ష్యం. దీన్ని ప్రయోగిస్తున్న జగన్‌కు ఇప్పుడు ఆశాజనకమైన ఫలితాలే అందుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటపడిన వెంటనే కొంతమంది నేతలు జగన్ పక్షాన చేరినా.. ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం దూరంగానే ఉన్నారు. కానీ, ఆ లోటు కూడా ఇప్పుడు తీరిపోయేలానే కనిపిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. జగన్‌తో జట్టు కడతానని ప్రకటించడమే.. పరిస్థితి మారుతోందనడానికి సంకేతం.
కాంగ్రెస్ పార్టీలో ఉండాలా.. లేక జగన్ వైపు జంప్ అవ్వాలా అని తర్జనభర్జన పడ్డ మచిలీపట్నం ఎమ్మెల్యే చివరకు కార్యకర్తల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. అంతా జగన్‌కే జై కొట్టడంతో, నాని నిర్ణయం తీసేసుకున్నారు. కృష్ణాజిల్లాలో జగన్ చేస్తున్న రైతు పరామర్శ యాత్రలో పాల్గొంటున్నట్లు నాని ప్రకటించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని పుట్టించింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా... కాంగ్రెస్‌ను వదిలి సొంతపార్టీ ఏర్పాట్లలో ఉన్న జగన్‌తో కలిసి నడుస్తాననడం మాత్రం స్పష్టమైన సంకేతాలనే పంపించింది.
ఓ వైపు కృష్ణా కాంగ్రెస్‌లో అలజడి మొదలవుతూనే, విశాఖలో సునామీ పుట్టింది. కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి, తానూ కూడా జగన్ వెంటే ఉంటానంటూ అనౌన్స్ చేయడం కాంగ్రెస్ నేతలను నివ్వెర పరిచింది. పైగా, తన ప్రధాన శత్రువైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ కోరితే ఎంపీ పదవికీ రాజీనామా చేస్తానంటూ సబ్బంహరి ప్రకటించడమూ సంచలనం సృష్టించింది. జనవరి మూడు నుంచి విశాఖలో ఓదార్పు యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో సబ్బం హరి నిర్ణయం జగన్ బలాన్ని పెంచుతుందనే చెప్పొచ్చు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఓదార్పు యాత్రతో తన బలాన్ని చాటుకోవాలనుకున్నారు జగన్. కానీ, అంతకన్నా ముందే ప్రకృతి ఆయనకు మరో అవకాశాన్ని అందించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జనంలోకి దూసుకువెళ్తున్నారు జగన్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు వెల్లువెత్తిన జనస్పందన ఇది. కొత్తపార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత జగన్ చేస్తున్న తొలి పర్యటన ఇది. చెప్పాలంటే రైతు ఓదార్పు యాత్ర ఇది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి రాజకీయ పర్యటన కావడంతో, జగన్ వర్గం ఎన్నో జాగ్రత్తలు తీసుకొంది. తమ బలాన్ని ప్రదర్శించడానికి ఈ యాత్రనే వేదిక చేసుకొంది. దానికి తగ్గట్లే.. అడుగడుగునా అనూహ్య స్పందన కనిపించింది.
కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకున్న జగన్, రైతుల కష్టాలను అస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యిందంటూ ఆరోపించారు. నీటిలో మునిగిన పంటను పరిశీలించిన జగన్, ప్రభుత్వంపై తీవ్రంగానే ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ రైతులను పరామర్శిస్తూ, వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతానంటూ అభయమిచ్చారు. ఓ రకంగా వైఎస్ లానే తానూ రైతు బాంధవుడినని చాటుకునే ప్రయత్నం చేశారు జగన్. రైతుల అభిమానాన్ని సంపాదించుకుంటే, తన రాజకీయ జీవితానికి ఇక ఢోకా ఉండదన్నది జగన్ అభిప్రాయం కావచ్చు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా, కొంతకాలం పాటు మౌనంగానే ఉన్న జగన్, ఒక్కసారిగా ఇలా జనంమధ్యకు రావడం అధికారపార్టీకి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. పైగా, జగన్ టార్గెట్ అంతా కిరణ్ సర్కారే కావడమూ కలవరపెడుతోంది. అడుగడుగునా వైఎస్ పాలనతో పోల్చతూ ముందుకు సాగుతున్న జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కంగారు పడుతోంది. పార్టీ ప్రకటించిన తర్వాత జనంలోకి వెళ్లడం కన్నా.. ముందుగానే వెళ్లాలన్న జగన్ ప్రయత్నం విజయవంతమయ్యింది. సొంతపార్టీని అనౌన్స్ చేయడానికి కావల్సినంత ఎనర్జీని అందించింది. ఇప్పుడున్న ఊపు చూస్తుంటే వీలైనంత త్వరలోనే జగన్ పార్టీ తెరపైకి రావచ్చు.
అభయహస్తం
కాంగ్రెస్‌ను దెబ్బతీసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్‌లోని కీలక నేతలను తనవైపు ఆకర్షించే పనిలో పడ్డారు. జగన్ గూటికి అనకాపల్లి ఎంపీ, మచిలీపట్నం ఎమ్మెల్యేలు చేరిపోయారు. మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నారు. నేతలను ఆకర్షించడానికి జగన్ ప్రత్యేక మార్గాలను అనుసరిస్తున్నారు.
ఓదార్పులు, పరామర్శలతో తాను బిజీగా ఉంటూనే, తనవారికి మాత్రం నేతలను ఆకర్షించే పనిని అప్పజెప్పారు. కిరణ్ సర్కార్‌లో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారిని, కిరణ్ వ్యతిరేకులను, గతంలో ఎన్నికల్లో ఓడిపోయినవారిని జగన్ జట్టులోకి ఆహ్వానించే కార్యక్రమం అత్యంత రహస్యంగా సాగుతోంది. జన బలం ఎక్కువగా ఉన్న నేతలకు, కాంగ్రెస్ పార్టీలో పట్టుపెంచుకున్నవారినే జగన్ శిబిరం టార్గెట్ చేసుకుంది. ఎవరిని పడితే వారిని ఆకర్షించకుండా... సెలెక్టెడ్ లీడర్స్ పైనే కన్నేసింది.
జగన్ తరపును వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా సాగుతోంది. జగన్‌కు కీలక మద్దతుదారులైన భూమన కరుణాకర్‌రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాఖజిల్లాలో కాంగ్రెస్‌లోనే పరస్పరం కత్తులు దూసుకునే కొణతాల రామకృష్ణ, సబ్బం హరిలను ఒక్కతాటిపైకి వీరిద్దరూ తీసుకువచ్చారంటే, ఎంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నేతలను జిల్లాల వారీగా జగన్ టీం గుర్తించే పనిలో మునిగితేలుతోంది. వారితో రహస్య మంతనాలను సాగిస్తోంది. జగన్‌తో చేయి కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తోంది. అన్నిరకాలకు ఆదుకుంటామన్న హామీ కూడా వారికి అందుతోంది. ఈ డీల్‌కు ఏమాత్రం మొగ్గు చూపినా, జగన్ నుంచే నేరుగా కాల్ వెళుతోంది.
సోనియాకు రాసిన లెటర్లో ప్రభుత్వాన్ని పడగొట్టనని జగన్ చెప్పడంతో, కాంగ్రెస్ నేతలంతా గుండెలపై చేతులు వేసుకొని పడుకొన్నారు. 2014 వరకూ జగన్‌తో వచ్చే ఇబ్బందేమీ లేదనుకున్నారు. జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని సీఎం సైతం స్పష్టం చేశారు. కానీ, పేర్ని నాని, సబ్బం హరిల దెబ్బతో ఒక్కసారిగా సీఎంకు షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జగన్‌వైపు జంప్ చేస్తారని ఆయన అసలు ఊహించలేదు. అందుకే, నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు. మంత్రి పార్థసారధి, విజయవాడ ఎంపీ లగడపాటిని రంగంలోకి దించి పేర్నినానిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. నాని దెబ్బతో ఇతర జిల్లాల్లో అసంతృప్తులను చేజారకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
జిల్లాల వారీగా జగన్ బలం
పార్టీ పెట్టాక బలపడడం కాదు.. బలపడిన తర్వాతే పార్టీ పెట్టాలి.. ఇదే జగన్ సిద్ధాంతం. అందుకే, రాజీనామా చేసిన వెంటనే పార్టీని అనౌన్స్ చేయలేదు. పార్టీ పేరు ప్రకటించడానికి కూడా మరికొంత సమయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇటీవలే కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జగన్ లెక్క ప్రకారం సంక్రాంతి సమయంలో పార్టీని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పటికల్లా విశాఖ జిల్లాలో ఓదార్పు కూడా పూర్తవుతుంది. జగన్ ఆకర్షణ యాగం కూడా అప్పటికి పూర్తికావచ్చు. తన వెంట ఉండే వారితో, ఘనంగా పార్టీని ప్రారంభించే సూచనలు ఉన్నాయి.
కృష్ణాజిల్లాలో పేర్ని నానితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. మాజీమంత్రి, గుడివాడ నేత కఠారి ఈశ్వరకుమార్, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, మైలవరం మాజీ ఎమ్మెల్యే జేష్ట్య రమేశ్, విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌లు జగన్ యాత్రలో పాల్గొంటున్నారు. వీరంతా కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీలోకి జంప్ అయినట్లే. కొత్త ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణులు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
విశాఖలో సబ్బంహరి, కొణతాలలు మాత్రమే జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఓదార్పు యాత్ర మొదలైతే మరికొంతమంది జగన్‌వైపు రావచ్చు. విజయనగరంలో పెనుమత్స సాంబశివరాజు, శ్రీకాకుళంలో ఎంపీ కృపారాణి జగన్‌కు మద్దతు లభించవచ్చు. తూర్పుగోదావరిపై మాత్రం జగన్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండనుంది. మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి భాస్కర్‌రెడ్డిలు జగన్‌కు మద్దతు పలికారు. ముద్రగడ పద్మనాభం, వడ్డె వీరభద్రరావులు జగన్‌కు అనుకూలంగా ఉన్నారు. పశ్చిమగోదావరిలో ఆళ్లనాని, వట్టి వసంతకుమార్, బాలరాజులు జగన్‌వైపు కదలొచ్చు. గుంటూరులో మంత్రి కాసు కృష్టారెడ్డి తనయుడు మహేశ్‌రెడ్డి జగన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఎర్రా వెంకటేశ్వర్లు జగన్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. రాయపాటి కూడా జగన్‌కు మద్దతు ప్రకటించవచ్చు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నెల్లూరులో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు జగన్ వర్గంలోనే ఉన్నారు. చిత్తూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతపురంలో ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రరారెడ్డిలు జగన్‌వెంటే వెళ్తామని బహిరంగంగా ప్రకటించారు. కడపలో శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆదినారాయణ, కమలమ్మలు పార్టీ మారే అవకాశాలున్నాయి. కర్నూలు నుంచి శోభానాగిరెడ్డి దంపతులు, కాటసాని రాంరెడ్డి, బాలనాగిరెడ్డిలు కొత్తపార్టీలోకి రావచ్చు.
తెలంగాణ జిల్లాల్లోనూ జగన్‌కు కాంగ్రెస్ నేతలు మద్దతు పలుకుతున్నారు. హైదరాబాద్‌లో సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి, భిక్షపతియాదవ్లు, నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్‌లో కొండా సురేఖ దంపతులు జగన్మోహన్రెడ్డికి జై కొడుతున్నారు. అయితే, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లోనూ జగన్‌కు మద్దతు పెద్ద ఎత్తునే ఉండవచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
జనవరిదాకా ఆగడానికి కారణం అదే..
జగన్,విజయమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఇప్పుడు ఉపఎన్నికలు తప్పనిసరి. వీటిని తనకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారు జగన్. రెండుచోట్లా అఖండ మెజార్టీతో గెలిచి, తన సత్తా చాటాలనుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం వీటిని మరింత సీరియస్‌గా తీసుకొంటోంది. ఎన్నికల భాధ్యతను జగన్ బాబాయ్ వివేకానందరెడ్డికి, వైఎస్ వ్యతిరేకి డీఎల్ రవీంద్రారెడ్డికి అప్పజెప్పింది. కడప జిల్లాలో జగన్‌కు మద్దతు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. జగన్‌కు సెమీఫైనల్స్ అయితే, తమకు ఫైనల్స్ అంటున్నారు వివేకానంద.
ఉప ఎన్నికల నాటికి జగన్ పార్టీని ప్రకటించవచ్చు. మరికొంత బలాన్ని కూడగట్టుకోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలే ఆయన పార్టీ భవితవ్యాన్ని చాలావరకూ తేల్చిచెప్పేస్తాయి. 2014లో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చో ఊహలకు అందిస్తాయి. అయితే దానికన్నా ముందుగానే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా జగన్ శిబిరం ప్రకటనలు చేస్తోంది. కొండా సురేఖ లేఖైనా, జగన్ ప్రకటనలైనా, రైతు పరామర్శలైనా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రకటనలైనా.. ఇందులో భాగమే.
కాంగ్రెస్‌ను బలహీన పరచడం .. అదే సమయంలో తన బలం పెంచుకోవడమే జగన్ ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే, పార్టీని వీడినప్పుడు తనవర్గాన్ని బయటకు తీసుకురాలేదు. వీరంతా పార్టీలోనే ఉండి, అసమ్మతి స్వరాన్ని వినిపించే అవకాశం ఉంది. జనవరి వరకూ పార్టీ ప్రకటనను వాయిదా వేయడం వెనుకా పక్కా వ్యూహాన్నే జగన్ అమలు చేస్తున్నారు. శ్రీకృష్ణకమిటీ నివేదిక తర్వాత పరిస్థితుల ఆధారంగానే పార్టీ విధివిధానాలను రూపొందించుకోవచ్చు. దాంతో, పార్టీని త్వరగా జనంలోకి తీసుకువెళ్లే అవకాశమూ లభిస్తుంది. జగన్ జోరు చూస్తుంటే, కాంగ్రెస్‌కు కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
me artical chala realistic and imprasive ga vundi