14, డిసెంబర్ 2010, మంగళవారం
రైతు రాజకీయం
రాష్ట్ర రాజధానికి.. ఏసీ గదులకు ఎప్పుడూ పరిమితమయ్యే మన రాజకీయ నేతలు ఈ మధ్య జనం బాట పడుతున్నారు. రాజధానిలో మాయమై రైతుల మధ్య ప్రత్యక్షమవుతున్నారు. అందరిదీ రైతుమంత్రమే.. అందరి దృష్టీ రైతు సమస్యలపైనే.. అందరి టార్గెట్టూ.. రాష్ట సర్కారే..
టీడీపీ అధినేత చంద్రబాబు
పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి..
కొత్తపార్టీ పెట్టబోతున్న యువనేత జగన్..
పార్టీ ఏదైనా, పేరేదైనా..రాజకీయ నేతల వాహనాలు రైతుల దగ్గరకు పరుగులు తీస్తున్నాయి. రాజధానిలో మాయమై రైతుల మధ్య నేతలు ప్రత్యక్షమవుతున్నారు. రైతుల్లో రైతుల్లా మారిపోతున్నారు. రైతు కష్టాలను తమ కష్టాలనుకుంటున్నారు. కార్లు దిగి పొలాల్లోకి పయనమవుతున్నారు. ఎండాచలి నేతలకు అడ్డుకాలేకపోతున్నాయి. రైతును పరామర్శించడానికి రాజకీయ నేతలు ఆరాటపడుతున్నారు. పంచె కట్టి బురదలోకి అడుగు పెడుతున్నారు. నీటిలో నానిపోయిన ధాన్యాన్ని చూసి కదిలిపోతున్నారు. రైతు కష్టాలను తీర్చుతామని అభయహస్తం చూపిస్తున్నారు. అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శల అస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి విలయాలు... వరదలు, తుపానులు మనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు పర్యటనలు చేసినా, రైతుల సమస్యలపై అంతా ఇంత తీవ్రంగా స్పందించడం మాత్రం ఇదే తొలిసారి. మన నేతల్లో ఇంత కదలిక ఎందుకు వచ్చింది..?
బాబు ముందంజ
అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల తరపున పోరాటం మొదలుపెట్టారు చంద్రబాబునాయుడు. వర్షాల దాటికి నీట మునిగిన పంటపొలాలను సందర్శించి.. ప్రత్యక్షంగా నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. నీటమునిగిన పంట పొలాలను సందర్శిస్తూనే, ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు చంద్రబాబు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. రైతుల సందర్శన ముగిసిన తర్వాత చంద్రబాబు, రాజధానిలో తన పోరాటాన్ని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వచ్చి రైతు సమస్యను అందరి దృష్టికీ తేవాలనుకున్నారు. అందుకు వామపక్షాలతో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోనూ రైతు సమస్యలపై గళమెత్తారు. అయితే.. ప్రభుత్వానికి, అఖిలపక్ష నేతలకు విజ్ఞప్తి చేయడానికి వచ్చిన రైతుసంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో, చంద్రబాబు తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు. రైతు నేతలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ రోడ్డెక్కారు.
రైతునేతలు, ఎమ్మెల్యేల అరెస్ట్‌ను నిరసిస్తూ ధర్నాకు దిగారు చంద్రబాబు.దీంతో ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు. గోషామహల్ స్టేడియంలో రాత్రంతా గడిపి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు చంద్రబాబు. అక్కడి నుంచే అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సారి అసెంబ్లీలో మరింతగా రైతు సమస్యలపై తన గళాన్ని వినిపించారు టీడీపీ అధినేత. రాష్ట్రంలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది కాబట్టి.. తక్షణం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సభలో ప్రభుత్వాన్ని కోరారు. చెప్పాలంటే రైతు సమస్యలపై తీవ్రంగానే పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా అధికార పార్టీ ప్రాబల్యాన్ని కూడా తగ్గించే పనిలో ఉన్నారు.
జగన్ జగడం
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన అనంతరం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు జగన్. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కొత్త పార్టీ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటున్న యువనేత... తన పోరాటాన్ని రైతు సమస్యలతోనే మొదలుపెట్టనున్నారు. ఈనెల 21న విజయవాడలో 48 గంటల పాటు నిరాహారదీక్ష చేస్తానంటున్నారు. జగన్ ప్రకటనకు అనూహ్య స్పందనే వచ్చింది. వర్షాలకు నష్టపోయిన రైతులను కొన్ని రోజులుగా జగన్ పరామర్శిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆయన పర్యటన సాగింది. జనం మధ్యకు దూసుకువెళ్లిన జగన్, రైతు సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కొన్నిచోట్ల నేరుగా పొలాల్లోకి వెళ్లిపోయారు. రైతులను ఓదార్చారు. తన తండ్రి పాలనను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టారు..
చిరుస్టైలే వేరు
ఇక ప్రజారాజ్యం అధినేత చిరంజీవిది మరో స్టైల్. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన తన గెటప్ మార్చేశారు. పొలాల్లోకి వెళ్లడానికి వీలుగా లుంగీతో ప్రత్యక్షమయ్యారు. వద్దన్నా వినకుండా బురదమయమైన పొలాల్లో అడుగు పెట్టారు. రైతుల కష్టాలను స్వయంగా చూశారు. నష్టతీవ్రతను అంచనా వేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. రైతు సమస్యలు తీర్చే సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆపగలదా అని నిలదీశారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని నిర్ధారించారు.
మౌనపాటి
ఇక మరో నేత లగడపాటి. అధికారపక్షానికి చెందిన లగడపాటికి జగడపాటి అని పైరు. రైతు సమస్యలపై ఈసారి ఆయన వినూత్నమైన ఎత్తును వేశారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజు మౌనవ్రతం చేశారు. సభ ముగిసినా.. తన సీట్లోనే కదలకుండా కూర్చున్నారు. చివరకు స్పీకర్ మీరాకుమార్ హామీ ఇవ్వడంతో మౌనాన్ని వీడారు. వీరు మాత్రమే కాదు.. మిగిలిన రాజకీయ నేతలదీ ఇదే రూటు. రైతు సమస్యలనే ప్రతీ చోటా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వంపై వాడివేడిగా విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ పోరాటం చివరి వరకూ సాగుతుందా.. లేక ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు, మరో ఇష్యూ అందగానే మన నేతలు వదిలేస్తారా.. అన్నదే అనుమానం.
అంతా రాజకీయమేనా..?
రైతు సమస్యలను అస్త్రంగా చేసుకొని ప్రభుత్వంపై ఉద్యమించారు నారాచంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అన్ని రకాలగా ఆదుకోవాలన్న ఆయన.. వ్యవసాయరంగంలో సంస్కరణలు అమలు చేయకపోవడం వల్లే ఇన్ని సమస్యలని తేల్చి చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా శాసనసభలో సూచించారు. అంతటితోనే ఆగలేదు, రైతులను మచ్చిక చేసుకోవడం కోసం, తన పార్టీ మేనిఫెస్టోలోనూ వీటిని పొందుపరుస్తామని సభాముఖంగా ప్రకటించారు.
జిల్లాల్లో పర్యటనలో, రాజధానిలో పాదయాత్రలు, అసెంబ్లీలో వాగ్వాదాలు... అన్నీ రైతు సమస్యలపై చంద్రబాబు వైఖరిని స్పష్టం చేసేలానే కనిపిస్తాయి. రైతుల తరపున ఎన్నిసార్లైనా అరెస్ట్ అవుతానంటూ ప్రకటించడం ద్వారా, తన ఇమేజ్‌ను పెంచుకోవాలనుకున్నారు బాబు. కానీ, చంద్రబాబు పోరాటం నిజం కాదన్న విమర్శలూ ఉన్నాయి. చంద్రబాబుపై లగడపాటి విమర్శలు కురిపిస్తే.. ఆయన చేస్తున్న పోరాటంపై టీడీపీ విరుచుకుపడింది. లగడపాటికి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తోంది. పార్లమెంట్‌లో మౌనవ్రతం పాటించడం వల్ల ఉపయోగం ఏమీ లేదని దెప్పిపొడిచింది.
డిసెంబర్ 20 వరకూ జగన్ డెడ్‌లైన్ పెడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగడుగులు ముందుకేశారు. సర్కార్‌కు 16 సాయంత్రం వరకే గడువు విధించారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈలోగా స్పందించకపోతే.. ఆమరణదీక్షకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ అస్థిరతల కారణంగా, కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గాని మధ్యంతర ఎన్నికలు రావచ్చన్నఅంచనా రాజకీయ పార్టీలది. అయితే, నేరుగా ఈ విషయాన్ని మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఎన్నికల్లో గెలవాలంటే రైతు ఓటుబ్యాంకు ఎంత కీలకమే నేతలకు తెలియంది కాదు. పైగా, కొత్తగా పార్టీ పెడుతున్న జగన్‌కు రైతన్నల మద్దతు చాలా కీలకం. అందుకే, ఇంత హడావిడి చేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు కూడా ప్రతిపక్షాల బలాన్ని పెంచుతున్నట్లుగానే కనిపిస్తోంది. రైతు నాయకులను కలిసినా, సాయం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా పరిస్థితి మరోలా ఉండేది. ఇక అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి, మంత్రులు దీటుగా ఎదుర్కోలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తోందంతా రాజకీయమంటూ, రైతులను నిజంగా ఆదుకునేది తమ ప్రభుత్వం మాత్రమే నని చాటి చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరు ఎలా చెబుతున్నా.. అందరూ చేస్తోంది రాజకీయమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి