12, నవంబర్ 2010, శుక్రవారం
రౌడీరాజ్యం
నడిరోడ్డుపై పరుగులు పెట్టిస్తారు...
కనికరం లేకుండా చావబాదుతారు..
పక్కాగా స్కెచ్ వేసి అటాక్ చేస్తారు..
ప్రత్యర్థి ప్రాణం తీయడమే లక్ష్యం
అందుకు పట్టపగలైనా... అర్థరాత్రైనా ఒకటే..
ఇవన్నీ సినిమాల్లో కనిపించే దృశ్యాలు. కథను రక్తి కట్టించే సన్నివేశాలు. రౌడీయిజానికి అసలైన ప్రతిరూపాలు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు ఇప్పుడు నడిరోడ్డుపై దర్శనిమస్తున్నాయి. ఒకప్పుడు చీకటిమాటున జరిగే హత్యలు ఇప్పుడు పట్టపగలే చోటుచేసుకుంటున్నాయి. జనమంతా చూస్తుండగానే రౌడీలు తెగబడుతున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అందుకు నిదర్శనం... హైదరాబాద్ నాంపల్లి కోర్టుల సమీపంలోనే జరిగిన రౌడీషీటర్ ఫజల్ దారుణ హత్య.
నాంపల్లి కోర్టులు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఎంతోమంది పోలీసులు అక్కడే ఉంటారు. పైగా నగరంలోని కీలకమైన ప్రాంతం. చిన్నపాటి గొడవపడాలంటేనే సామాన్యుడు భయపడతాడు. కానీ, ఫజల్ ప్రత్యర్థులు మాత్రం ఆ ప్రాంతాన్నే తమ ప్లాన్ ను అమలు చేయడానికి వేదిక చేసుకున్నారు. ఫజల్ కోసం కోర్డు దగ్గరే కాపు కాశారు. ఓ కేసులో కోర్టుకు హాజరైన ఫజల్ తిరిగి వెళుతుండగా వెంటాడారు. ఫజల్ వెళుతున్న బుల్లెట్‌ను సుమోతో ఢీకొట్టించారు. ఫజల్ కూడా రౌడీ షీటర్ కావడంతో మ్యాటర్ అర్ధమైపోయింది. అంతే, బండి వదిలి పరుగు లంకించుకున్నాడు. అతని వెనకాలే.. ప్రత్యర్థులు పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్లిన ఫజల్, ప్రాణాలు దక్కించుకోవడానికి ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ ఇంటిలోకి వెళ్లి కిచెన్‌లో దాక్కున్నాడు. దీన్ని గమనించిన రౌడీలు... అదే కిచెన్‌లో చుట్టుముట్టి కత్తులతో నరికి చంపారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. అసలు రౌడీలకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది.? అందరిముందూ హత్య చేసేంత తెగింపు ఎలా వచ్చింది..?
హత్యల కేంద్రం
హైదరాబాద్... ప్రభుత్వం మొత్తం కొలువై ఉండే ప్రాంతం. డీజీపీ దగ్గర నుంచి పోలీసు పెద్దలంతా నిత్యం విధులు నిర్వహించే నగరం. సిటీ మొత్తాన్ని పర్యవేక్షించడానికి దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బంది.. అందరిపైనా ఓ సూపర్‌బాస్‌గా.. సిటీ పోలీస్కమీషనర్. పైగా.. శివారు ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రత్యేకంగా మరో కమిషనరేట్. అక్కడా పదివేల మంది స్టాఫ్. అయినా... రౌడీల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పైపెచ్చు రోజురోజుకూ వీరి దూకుడు పెరిగిపోతోంది. గుట్టుగా దందాలు చేసే వారు కాస్తా ఇప్పుడు పట్టపగలే దౌర్జన్యాలు చేసే స్థాయికి ఎదిగిపోయారు. చెప్పాలంటే.. నడిరోడ్డుపై అందరిముందూ వెంటాడి వేటాడి చంపేవాళ్లయ్యారు.
వరుసగా మర్డర్లు. ప్రతీరోజూ హత్యలు. చంపడం అన్నది ఇప్పుడు సింపుల్ అయిపోయింది. ప్రాణం తీయడానికి భయపడే రోజులు పోయాయి. ఏమాత్రం తేడా వచ్చినా.. మనుషులమన్న విషయాన్ని మరిచిపోతున్నారు. రాక్షసులుగా మారిపోతున్నారు. పట్టపగలే చంపేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని, చట్టం శిక్షిస్తుందని.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న మాటలు.. హంతకుల చెవులకు వినపడడం లేదు. వాస్తవంలో ఇవి నిజమవుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. చెప్పాలంటే... హంతకులకు, రౌడీలకు, గుండాలకే చట్టం చుట్టమై కూర్చొంది. అందుకే.. నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.
ముంబై మాఫియా తరహాలో హైదరాబాద్‌లో గ్యాంగ్‌వార్ పెరిగిపోతోంది. వరసగా హత్యలకు పాల్పడుతూ రౌడీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. ప్రైవేట్ సెటిల్మెంట్లతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఫజల్ మర్డర్‌కు కోట్లాది రూపాయల విలువైన స్థలమే కారణమన్న అనుమానాలున్నాయి. చర్లపల్లి జైల్లో మొదలైన గొడవ... నాంపల్లిలో మర్డర్ చేసే వరకూ సాగింది. రాజధానిలో బస్తీకొకటి చొప్పున వెలుస్తున్న గుండాగ్యాంగ్లు ఆధిపత్యం కోసం పోరాడుతూ ఎన్నో హత్యలకు తెగబడుతున్నాయి. కొంతకాలం క్రితం బోరబండలోనూ ఇదే తరహాలో హత్య వెలుగుచూసింది. ఆటోలో వెంటాడి ఓ రౌడీషీటర్‌ను హత్య చేశారు. హిమాయత్‌సాగర్ వద్ద హజీ అనే రౌడీషీటర్‌ను ఇదే తరహాలో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. హఫీజ్‌పేటలో నాంపల్లి రౌడీషీటర్ ఫిరోజ్‌ను మర్డర్ చేశారు. టీడీపీ నేత, బెజవాడ రౌడీ షీటర్ చలసాని పండు కూడా హైదరాబాద్‌లో అనుచరుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఫజల్‌ను మరో వర్గం హత్య చేసింది. ఇన్ని హత్యలు జరుగుతున్నా.. రౌడీషీటర్ల మధ్య వార్ తీవ్రస్థాయిలో సాగుతున్నా.. పోలీసులు ఏం చేస్తున్నారు. నగరంపై అనుక్షణం నిఘా ఉంచాల్సిన వారు... నిద్రపోతున్నారా...? రౌడీషీటర్లపైనే నిఘా లేకపోతే.. గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి వచ్చే మాఫియాముఠాలు, టెర్రరిస్టుల ఉనికిని ఎలా పసిగడతారు..?
మృగానందం
శాడిజానికి పరాకాష్ట, క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన నల్గొండ జిల్లాలో జరిగిన హత్య. ఓ మనిషిని ఎంత దారుణంగా చంపొచ్చో.. అంత క్రూరంగా హత్య చేశాడు ఓ నరరూప రాక్షసుడు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అప్పల నాయుడిని కిడ్నాప్ చేసిన యూసఫ్.. అతన్ని నల్గొండ తీసుకెళ్లాడు. అక్కడ చంపిన తర్వాత నాయుడు శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. తలను నల్గొండలోని ప్రకాశం బజార్లో, ఓ చెయ్యిని బస్టాండ్ సమీపంలో, దేవరకొండ ప్రభుత్వ కళాశాల సమీపంలో మొండెం...వీటీ కాలనీలో రాజీవ్ విగ్రహం వద్ద కాలు...చిట్యాల వద్ద మరో చేయి..నార్కట్ పల్లిలో మరో కాలు పడేశాడు. వందకిలోమీటర్ల పరిధిలో అప్పల నాయుడు శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఒక్కో చోట ఒక్కో శరీర భాగాన్ని చూసి జనంలో కలకలం మొదలయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి అన్నింటిని ఒక్కచోటకి చేర్చే సరికి అసలు విషయం అర్థమయ్యింది.
ఈ హత్యకు కారణం ఓ వివాహేతర సంబంధం. యూసఫ్ బంధువుతో నాయుడుకి సంబంధాలున్నాయన్న అనుమానంతోనే ఈ హత్యకు ఒడిగట్టాడు యూసఫ్. ఐదు రోజుల క్రితమే నాయుడ్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి చివరకు ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. నాయుడి విషయంలోనే కాదు.. ఇంతకు ముందుకూడా యూసఫ్ ఎన్నో నేరాలకు ఒడిగట్టాడు. ఎన్నో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఏ సంబంధం లేకపోయినా, రోడ్డుపై కనిపించిన వారిపై దాడి చేసి, వారిపై కత్తులతో దాడి చేసి మృగానందం పొందేవాడు. ఈ విషయం తెలిసినా పోలీసులు పెద్దగా పట్టించుకున్నది లేదు. యూసఫ్‌పై నిఘా పెట్టామని చెప్పుకున్నారే తప్ప.. అతన్ని నియంత్రించలేకపోయారు. దాని ఫలితమే.. ఘోరాతిఘోరమైన నాయుడి హత్య.
హత్యలు చేయడంలోను... జనాన్ని భయపెట్టడంలోనూ హంతకులు ఆరితేరిపోయారు. అందుకే.. ఎక్కడో హత్య చేసి మరీ.. శవాలను జనం మధ్యలోకి తెచ్చి పడేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఇలాంటి సంఘటనే జరిగింది. హైదరాబాద్‌లోని మెహదీపట్నం బస్‌స్టాండ్‌లో పట్టపగలే ఓ పెద్ద సూట్‌కేస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. సూట్‌కేస్ గురించి సమాచారం అందడంతో పోలీసులు సీన్లోకి ఎంటరయ్యారు. తీరా సూట్‌కేస్ తెరిస్తే.. అందులో మహిళ శవం కనిపించింది. ఎక్కడో హత్య చేసి.. నగరం మధ్యలో ఎందుకు పడేశారు..? గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసే పద్దతి మానుకొని.. శవాన్ని అందరికీ తెలిసేలా పడేయడానికి కారణం ఏమిటి? ఈ మర్డర్ జరిగి మూడునెలలు గడుస్తున్నా.. ఆ శవం ఎవరిదన్న విషయం ఇంతవరకూ తేలలేదు.
దొంగతనాలు, దోపిడీల రూపంలో జరుగుతున్న హత్యాకాండకు లెక్కేలేదు. మనుషుల మధ్య తగాదాలు ఒకప్పుడు ఎక్కువగా శారీరక దాడులకు పరిమితమైతే.. ఇప్పుడు మాత్రం ప్రాణం బలికొనేదిశలో సాగుతున్నాయి. పక్కాగా ప్లాన్ చేసి, ముగ్గులోకి దింపి చేస్తున్న హత్యల సంఖ్యా ఎక్కువే. రాజేంద్రనగర్‌లో గౌస్ అనే క్యాబ్ డ్రైవర్‌ను ఇలానే హత్య చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌస్‌ను మసీదు సమీపంలో గొంతు కోసి చంపేశారు. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు.
హత్యలే హత్యలు..
క్రైమ్‌రేట్ అంచనాలు దాటిపోతోంది. నేరమయ సంస్కృతి పెరిగిపోతోంది. నేరాలను అరికట్టడానికి నియమించిన పోలీసులు ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అందుకే, రాష్ట్రం మర్డర్లకు మారుపేరుగా మారిపోయింది. మనరాష్ట్రంలో నమోదవుతున్న హత్యల లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఈ ఏడాది తొలి అర్థభాగానికే అంటే.. జనవరి నుంచి జూన్ వరకూ 1288 మంది హత్యకు గురయ్యారు. వీటిల్లోనూ రాజధానిదే అగ్రస్థానం. హైదరాబాద్‌లో ఇదే కాలంలో జరిగిన హత్యల సంఖ్య 173. దీనిబట్టి ఎంత జోరుగా మర్డర్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అసలు ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి..? తప్పు చేసిన వారిని శిక్షించడానికి పోలీసులు, చట్టం, కోర్టులు ఇలా ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ హత్యలు ఎందుకు ఆగడం లేదు.? దీనికి సమాధానం చట్టమంటే ఎవరికీ భయం లేదు. హత్య చేస్తే చట్టానికి చిక్కుతామన్న భయం లేదు. ఏవో కొన్ని కేసుల్లో మినహాయిస్తే... అసలైన హంతకులు దొరికిన సంఘటనలూ తక్కువే. ఒకవేళ పోలీసులకు దొరికినా, శిక్ష పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదే హత్యలు చేసే తెగింపును తెచ్చిపెడుతోంది. నడిరోడ్డుపై ప్రత్యర్థిని నరకడానికి పురిగొల్పుతోంది.
మర్డర్లపై పోలీసుల దర్యాప్తు పక్కాగా జరగడం లేదు. తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. అసలు హంతకులను పట్టుకోలేక అమాయకులను ఇరికించేస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో వరసగా జరిగిన మూడు హత్యల్లో.. ఇద్దరు అమాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. వారే హంతకులని ప్రకటించి, కేసును త్వరగా పరిష్కరించామని భుజాలు చరుచుకున్నారు. మరో మర్డర్‌ను యాక్సిడెంట్‌గా చిత్రీకరించి ఫైల్ మూసేశారు. కానీ, ఓ కేసులో అరెస్టైన వ్యక్తే అసలైన సైకోకిల్లర్‌గా తేలింది. ప్రతీ హత్యను వివరాలతో సహా చెప్పి నేనే చేశానంటూ సైకో చెబితే తప్ప పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇదీ మన రక్షకభటుల తీరు. చట్టాన్ని పరిరక్షిస్తూ, అమాయకులను రక్షించాల్సిన పోలీసులే.. సామాన్యుల పాలిట విలన్లవుతున్నారు. ఇక పోలీసులే ఇలా తప్పుదారుల్లో పరుగులు పెడుతుంటే.. హంతకులకు అడ్డేముంటుంది.
మర్డర్ జరగగానే హడావిడి చేయడం.. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ప్రకటించడమే తప్ప.. దాన్ని ఆచరణలో మాత్రం చూపించలేకపోతున్నారు. అందుకే, వందలాది మంది తమ ప్రాణాలను హంతకుల చేతుల్లో వదులుతున్నారు. మరి ఈ రౌడీరాజ్యానికి అంతం ఎప్పుడు? ఈ మారణకాండ ఆగేది ఎప్పుడు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
First, let them kill each other then the remaining can be handled by the Police :)