12, నవంబర్ 2010, శుక్రవారం
జై బోలో
రూటు మారింది..
సీన్ మారింది..
వేషం మారింది...
తెలుగు హీరోలందరిదీ అదే దారి..
అదే తెలంగాణ దారి
అడుగడుగునా ఆవేశం... ప్రతీ క్షణం పోరాటం. తెలంగాణ సాధనే ధ్యేయం. ఉద్వేగం.. ఉద్రిక్తభరితం. జైబోలో తెలంగాణ సినిమాలో హీరో జగపతిబాబు పోషిస్తున్న క్యారెక్టర్ స్వరూపమిది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు జగపతి. సినిమాలో ఇదే కీలకపాత్ర. వరంగల్‌లో జరుగుతున్న షూటింగ్‌లో జగపతి పాల్గొంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు తెలంగాణ సాధన కోసం ఆత్యత్యాగం చేస్తారన్న ప్రచారమూ ఉంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేస్తున్న జైబోలో తెలంగాణ సినిమాను డిసెంబర్ చివరికల్లా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిత్రసీమలోని ప్రముఖలంతా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవని, అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని చాటిచెప్పారు.
అంతా సానుకూలం
తెలంగాణ అనే పదాన్ని తెలుగు సినిమా దరిదాపుల్లోకి కూడా రానివ్వని సినీ సామ్రాజ్యవాదులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. ఇంతకాలం తెలుగు సినిమాలకే జైకొట్టిన హీరోలు ఇప్పుడు తెలంగాణాకు జై కొడుతున్నారు. ఇంతవరకూ బతుకమ్మ, ధూంధాం వంటి చిన్న చిన్న సినిమాలు మాత్రమే తెలంగాణ కథాంశంతో రూపుదిద్దుకోగా, ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. శంకర్ రూపొందిస్తున్న జైబోలో తెలంగాణ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉండగా, నాగార్జున కథానాయకుడిగా మరో తెలంగాణ సినిమా రెడీ అవుతోంది.
కమర్షియల్ సినిమాలతో పాటు, భక్తిప్రాధాన్య చిత్రాలతోనూ ఆకట్టుకున్న నాగార్జున ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో రాజన్నగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రాజన్న సినిమాలో తెలంగాణ యువకుడిగా నాగార్జున్న కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో ఫైట్స్‌ను రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఓ యదార్ధగాథ ఆధారంగా తయారవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్న అంచనాలో ఉంది సినిమా యూనిట్.
కొమరం భీమ్‌గా బాలయ్య
సింహా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటోంది పరమవీరచక్ర. దాసరి-బాలయ్యల కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. పైగా ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులికి రీమేక్ అన్న ప్రచారమూ పరమవీరచక్రపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ వేస్తున్న ఓ గెటప్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బాలకృష్ణ పోషిస్తున్న ఆ గెటప్ మరోమిటో కాదు.. గోండు వీరుడు, నైజాంపై తిరుగుబాటు చేసిన అడవిబిడ్డ కొమరం భీమ్. పరమవీరచక్రలో కొమరం భీం పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఓ పాటను కూడా ఇప్పటికే స్వరపరిచారు. కొమరంభీమ్‌ను వీరోచితగాధను ప్రస్తుతిస్తూ ఈ పాట సాగుతుంది.
సినీగేయరచయత సుద్దాల అశోక్‌తేజతో ప్రత్యేకంగా ఈ పాటను రాయించారు. కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుంది. దాదాపు 6 నిమిషాల పాటు ఉండే కొమరం భీం పాట, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దాసరి భావిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్ర బాలకృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలుస్తుందన్న భావనా వ్యక్తమవుతోంది.
ఉద్యమ ప్రభావమే..
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడింది తెలుగు చిత్ర పరిశ్రమ. రాష్ట్ర విభజనపై ఆందోళనలు తారాస్థాయిలో సాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు సమైక్యవాదాన్ని వినిపించడంపై రగడ మొదలయ్యింది. తెలంగాణలో చాలా సినిమాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. థియేటర్లపై దాడులు జరిగాయి.
దాదాపు ఏడాది కాలంగా ఈ చిచ్చు రగులుతూనే ఉంది. ఇటీవలి కాలంలో కొమరం పులి అంటూ పవన్ కళ్యాణ్ తీసిన సినిమా కూడా తీవ్ర వివాదాస్పదమయ్యింది. సమైక్యవాదులన్న ముద్ర పడడంతో సినిమాలో కొమరంపులి పేరు పెట్టుకుని తెలంగాణలో సానుకూల పరిస్థితులను సృష్టించుకోవాలని పవన్ ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలే చిరంజీవి ఫ్యామిలీ సమైక్యవాదం వినిపించడంపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణవాదులు, ఈ సినిమా పేరుపై తీవ్రంగా స్పందించారు. చివరకు సినిమా టైటిల్ నుంచి కొమరం పదాన్ని తొలగించాల్సి వచ్చింది.
తెలంగాణ విషయంలోనూ ఇలా వ్యవహరిస్తే స్థానికులు ఏమాత్రం అంగీకరించన్న విషయం ఈ సినిమాతో ఇండస్ట్రీకి అర్థమయ్యింది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇకపై వ్యవహరించకూడదన్న అభిప్రాయానికి ఇండస్ట్రీ వచ్చింది. అందుకే, ప్రాంతీయ తేడాలు చూపించకుండా సినీ ఇండస్ట్రీకి అంతా సమానేమనని చాటిచెప్పాలనుకొంది. తెలుగు హీరోలు వరసగా తెలంగాణ చారిత్రక సినిమాల్లో, తెలంగాణ పాత్రల్లో నటించడానికి ఇదే ప్రధాన కారణం. ఇలా నటించడం వల్ల తెలంగాణ ప్రేక్షకులకు మరింత దగ్గర కావచ్చు.
తెలుగు హీరోలు తెలంగాణ వైపు దృష్టి పెట్టడంపై అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అన్ని రకాల క్యారెక్టర్లు వేయడమే ఆర్టిస్టు లక్షణమైనప్పుడు.. తెలంగాణ పాత్రల్లో నటించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదంటున్నారు సినీరంగ ప్రముఖులు. ఇంతకాలం తెలుగు ఇండస్ట్రీ వ్యవహరించిన తీరు వేరు.. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు వేరు. అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ, ఏ ప్రాంతాన్ని వదులుకోవాలని భావించడం లేదు. రాష్ట్రం కలిసి ఉన్నా, విడిపోయినా, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ఒకటిగానే ఉండాలని కోరుకుంటోంది.
వ్యాపారసూత్రమూ అదే..
సినీ ఇండస్ట్రీ మనసు మార్చుకోవడం వెనుక కీలకమైన మరో అంశమూ ఉంది. అవే కలెక్షన్లు. తెలంగాణ వాదాన్ని వ్యతిరేకిస్తే, కీలకమైన నైజాం ఏరియాలో కలెక్షన్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీబడ్జెట్ సినిమాలకు ఓపెనింగ్సే కీలకం. ఆందోళనలతో సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురైతే, కలెక్షన్లు తగ్గిపోతాయి. లాభాలు తెచ్చి పెట్టే సినిమా కూడా నష్టాల పాలవుతుంది. ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే, నిర్మాతలు,దర్శకులు, హీరోలు.. ప్రాంతీయతత్వాలను వదిలివేస్తున్నారు.
అంతేకాదు ఇక్కడ గమనించాల్సిన మరో కీలకాంశం.. కథ తెలంగాణది, కథానాయకులు ఆంధ్రాహీరోలు. ఇదే అసలు కమర్షియల్ ఫార్ములా. ఈ సూత్రంతోనే రెండు ప్రాంతాల్లోనూ సినిమాను అమ్ముకోవచ్చు. అంతేకాదు, ఇలా తెలంగాణ సినిమాల్లో నటించడం వల్ల హీరోలకూ మేలు జరుగుతుంది. వారు తీసే ఇతర సినిమాలకూ తెలంగాణలో అడ్డంకులు ఉండవు. అందుకే, తెలంగాణ సినిమాల నిర్మాణం ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఊపందుకొంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నేనేమీ ప్రత్యేక తెలంగాణాకి వ్యతిరేకం కాదు. కానీ రోశయ్య & కంపెనీ మాత్రం ప్రత్యేక తెలంగాణా రాకుండా వెనుక నుంచి పావులు కదుపుతున్నారు. కోస్తా ఆంధ్ర హీరోలు తెలంగాణా సినిమాలలో నటించడానికి కారణం ఉంది. ఒకవేళ తెలంగాణా రాకపోతే హైదరాబాద్ లో కోస్తా ఆంధ్ర వారి ఆస్తుల పై దాడులు జరుగుతాయి. అప్పుడు తమ ఆస్తులకి నష్టం రాకూడదంటే తాము తెలంగాణాకి అనుకూలంగా ఉన్నట్టు నటించాలి. అందుకే కోస్తా హీరోలు జై తెలంగాణా అంటున్నారు కానీ వీళ్లు నిజంగా తెలంగాణావాదం వైపు ఇంక్లైన్ అవ్వలేదు.
@Praveen Sarma
మీరు చెప్పేది నిజమే. ఇహ ప్రత్యేక వాదాల విషయానికొస్తే ప్రజలలో నాయకులపై బ్రమలు తొలగించుకొని తమను తాము సంస్కరించుకుంటూ, ప్రభుత్వాధినేతల్ను నిలదీస్తూ తమ సంపదకు తామే వాచ్‌డాగుల్లాగా ఉండగలమని తెలియజెప్పలేనంతవరకూ ఎన్ని ప్రత్యేక రాష్ట్రాలేర్పడినా సామాన్యునికి ప్రత్యేకంగా ఒరిగేదేం ఉండదు.
అసలు ప్రత్యేక వాదాల తప్పొప్పుల విషయానికొస్తే ఈ దేశాని ఓ యాబయ్యో, వందో ముక్కలుగా విడగొటినంతమాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదు. ఒక భాష ఒకే రాష్ట్రం లాంటి పనికిరాని సెంటిమెంట్లు అవసరంలేదు. ఒకే భాష మాట్లాడే వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినంతమాత్రాన ఆ ప్రాంతానేమీ ఎత్తుకుని వేరే దేశానికేమీ తీసుకుపోరుగా?