12, అక్టోబర్ 2010, మంగళవారం
ఆకలి భారతం
'అగ్రరాజ్యంగా అవతరిస్తాం. అమెరికా సరసన నిలబెడతాం' అంటూ మన నేతల మాటలు కోటలు దాటుతున్నా... చేతలు మాత్రం జానెడు కడుపు ఆకలి కూడా తీర్చడంలేదు. మన నేతలు ఘనంగా చాటి చెప్పుకొంటున్న వృద్ధి రేటు అభాగ్యుల కడుపు నింపడంలేదు. అన్నపూర్ణ, దానకర్ణల నేలగా చెప్పుకుంటున్న మన నేల ఆకలి మంటలకు నిలయంగా మారింది. ప్రపంచ ఆకలి సూచీలో 67వ స్థానంలో నిలిచి.. దయనీయమైన చూపులు చూస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆహారం సమృద్ధిగా అందుతుందా లేదా అంటూ అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇఫ్‌ప్రి) అనే సంస్థ ఓ సర్వేను చేసింది. దీనికి సంబంధించి 84 దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో మన స్థానం 67. అంటే కిందనుంచి 17వ స్థానమన్నమాట. అట్టడుగున ఉన్న దేశంలో ఆకలికేకలు ఎక్కువగా ఉన్నట్లు ఇన్ ఫ్రి సంస్థ పేర్కొంది. దీన్ని బట్టి, మన దేశంలో ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పొరుగునే ఉన్న చైనా, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ మనకంటే మెరుగైన స్థానంలో ఉండటం చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇఫ్‌ప్రి) 2010 ఏడాదికి 'ఆకలి సూచీ'ని తయారు చేసింది. పిల్లల్లో పౌష్టికాహార లోపం, శిశు మరణాలు, తక్కువ కేలరీలు లభిస్తున్న జనాభా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. దీనిని ఇఫ్‌ప్రి ఆసియా డైరెక్టర్ అశోక్ గులాటీ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు.
"చైనాలో వృద్ధిరేటు పెరుగుతోంది. ఆకలి కూడా తగ్గుతోంది. కానీ... భారత్‌లో వృద్ధి రేటుతో పాటు ఆకలీ పెరుగుతోంది'' అని అశోక్ పేర్కొన్నారు. మన దేశంలో పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారని, ధనికులు మరింత ధనికులవుతున్నారని దీంతో స్పష్టమవుతోంది. ప్రపంచంలో పోషకాహార లోపం తో బాధపడుతున్న చిన్నారుల్లో 42 శాతం మంది మనదేశంలో ఉన్నారని ఇఫ్రి తెలిపింది.
మనకంటే అధిక జనాభా ఉన్న చైనాలో ఆకలి బాధితుల సంఖ్య చాలా చాలా తక్కువ. ఈ జాబితాలో చైనా 9వ స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. చివరకు శ్రీలంక కూడా మనకంటే మెరుగ్గా.. 39వ స్థానంలో ఉంది. ఆఫ్రికాలోని అనేక అభాగ్య దేశాల సరసన మన దేశం నిలిచింది. "రెండేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తితే... ఆ ప్రభావం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. మానసిక, శారీరక ఎదుగుదల దెబ్బతింటుంది'' అని ఇఫ్‌ప్రి పేర్కొంది.
దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఆకలి బాధలు అధికంగా ఉన్నట్లు ఇఫ్‌ప్రి తేల్చింది. పాలకుల అసమర్థత, రాజకీయ అస్థిరత, నిత్య సంఘర్షణలే ఆఫ్రికా దేశాల ఆకలికి కారణమని ఇఫ్రి తెలిపింది. ఆకలి బాధితుల సంఖ్యను 2015 నాటికి సగానికి తగ్గించాలని ప్రపంచ దేశాల నేతలు 1990లో ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. అయితే.. 1990 లో 'ప్రపంచ ఆకలి' 19.8 పాయింట్లు ఉండగా, ఈ పదేళ్లలో అది 15.1 పాయింట్లకు తగ్గింది.
* భారత్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, తైమోర్‌లలోనూ తలసరి ఆదాయం పెరుగుతోంది. ఆకలి బాధితుల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది.
* చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కంటే నాలుగు రెట్లు బలమైనది. ఆర్థిక వృద్ధితోపాటు ఆకలి బాధితుల సంఖ్యను తగ్గించడంలోనూ చైనా విజయవంతమైంది.
* వ్యవసాయం, ఉత్పత్తి, సర్వీస్ సెక్టార్లలో చైనా చేపట్టిన సంస్కరణల ఫలాలు నిరుపేదలకు అందాయి. భారత్ మాత్రం ఐటీ, టెలికాం వంటి సర్వీస్ సెక్టార్లపైనే దృష్టి సారించింది. వ్యవసాయంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టలేదు.
* వ్యవసాయ రంగంలో ఒక్కశాతం వృద్ధి నమోదైతే... ఆకలి బాధను రెండు మూడు రెట్లు సమర్థంగా ఎదుర్కోవచ్చు. కానీ... వ్యవసాయరంగం భారత్‌లో ఇప్పటికీ సంస్కరణలకు దూరంగా, ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కోట్లాది టన్నుల ధాన్యాన్ని మన ప్రభుత్వాలు గోడౌన్లలోనే మగ్గబెడుతున్నాయి. సంవత్సరాల తరబడి దాటి, కుళ్లబెట్టి.. ఆ తర్వాత తీరిగ్గా సముద్రంలో పారబోస్తున్నాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు .. ఈ ధాన్యాన్ని ఉచితంగా పేదలకు పంచాలంటూ ఆదేశించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం ఇది సాధ్యమయ్యే పనే కాదని తేల్చి పడేశారు. అంటే, కుళ్లబెట్టి సముద్రంలో అయినా పారబోస్తామే గానీ, పేదలకు పంచడానికి మాత్రం ఒప్పుకోమని ప్రకటించారన్నమాటే. ఇదీ మన పరిస్థితి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి