విశాఖ జిల్లా నర్సీపట్నం...
14 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్...
కిడ్నాప్ చేసింది ఎందుకో తెలుసా... ?
మైక్రో ఫైనాన్స్ వాయిదాను ఆ అమ్మాయి తల్లి కట్టకపోవడమే..
వరంగల్
ఆటో డ్రైవర్ ఆత్మహత్య ..
ఎందుకో తెలుసా..?
వాయిదా కట్టలేదని మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధించినందుకు..
ప్రకాశం జిల్లా
సింగరాయ కొండ
15 మంది ఊరు వదిలి వెళ్లిపోయారు
ఎందుకో తెలుసా..?
మైక్రో ఫైనాన్స్ వాయిదాలు కట్టలేక....
రంగారెడ్డి జిల్లా
వికారాబాద్‌లో ముగ్గురు బలవన్మరణం
ఎందుకో తెలుసా..?
ఇక్కడా మైక్రోఫైనాన్స్ వాయిదాలు కట్టలేకే..
రాజమండ్రి సమీపంలోని కాతేరు..
అర్థరాత్రి బావిలో దూకి 50 ఏళ్ల మహిళ ఆత్మహత్య
ఎందుకో తెలుసా..?
మరొకరి బాకీ చెల్లించలేక..
ఇలాంటి సంఘటనలు ఇప్పుడు నిత్యకృత్యం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా ఇలాంటి వార్తలే. ఆత్మహత్యలు, వేధింపులు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. మైక్రోఫైనాన్స్ మహమ్మారికి భయపడి తనువు చాలిస్తున్న వారి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతుంది. ప్రతీ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కనీస నియమాలు పాటించక అతి దారుణంగా వ్యవహరిస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థలు పేదలను పొట్టనపెట్టుకుంటున్నాయి. ఒక్క వాయిదా ఆలస్యం అయితే చాలు.. వేధింపులు పెరిగిపోతాయి. రుణగ్రహీతల పరిస్థితిని కానీ, కుటుంబ సమస్యలను గానీ ఏమాత్రం పట్టించుకోవు. ఈ మైక్రో భూతాలకు కావాల్సింది.. డబ్బు మాత్రమే. దానికోసం ఎంతకైనా తెగిస్తాయి.
ఇలా బతికి బయటపడ్డవారు కొంతమందే. సూక్ష్మరుణ సంస్థల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారే ఎక్కువ. పసివాడని పిల్లలతో కలిసి జీవితాలను బలిస్తున్నవారు చాలామంది ఉన్నారు. పదిరోజులుగా చూస్తే.. రాష్ట్రంలో ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య రెండు పదులు దాటిపోయింది.. అప్పు తీసుకున్నందుకు అకాల మరణమే దిక్కవుతోంది. ఇక అప్పు చెల్లించకపోతే.. కిడ్నాప్‌లకూ పాల్పడుతుండడం మైక్రో మహమ్మారి ఆగడాలకు అద్దం పడుతోంది. విశాఖలో దారాలమ్మ అనే మహిళ ఓ మైక్రోఫైనాన్స్ సంస్థ నుంచి 14 వేల రూపాయలు అప్పు తీసుకొంది. ఇందులో 7 వేలు చెల్లించేసింది. ఇటీవల కట్టాల్సిన వాయిదాను చెల్లించలేనందుకు, ఆమె కుమార్తె అనూషను మైక్రోఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు కిడ్నాప్ చేసుకెళ్లారు. అప్పుకడితే వదిలిపెడతామని హెచ్చరించారు. అప్పు చెల్లించకపోతే.. ఇలా కిడ్నాప్ చేయమని ఏ చట్టం చెబుతోంది..?
ఇదీ మైక్రోఫైనాన్స్ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు. అప్పివ్వడం వరకూ బాగానే ఉన్నా... ఆ తర్వాత మాత్రం రకరకాలుగా హింసిస్తూ జనం ప్రాణాలను కొల్లగొడుతున్నారు.
ఆత్మహత్యలెందుకు?
ఈ మరణాలు ఊరికే సంభవించినవి కాదు.. ఏదో అప్పును ఎగ్గొట్టడానికి చేసుకున్నవి కాదు. మైక్రోఫైనాన్స్ సంస్థల దోపిడీకి బలై.. అవమానాల పాలై.. బతుకుపై విరక్తి చెంది చేసుకున్నవి. చెప్పాలంటే.. ఈ ఆత్మహత్యలన్నీ.. మైక్రోఫైనాన్స్ సంస్థలు చేస్తున్న హత్యలుగానే భావించాలి. మరి వీటికి శిక్షలు లేవా...?
విశాఖలో కిడ్నాప్ సంగతి పక్కన పెడితే.. అంతకన్నా దారుణమైన పనులకు ఒడిగుడుతున్నారు మైక్రోఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు. వాయిదాలు వసూలు చేసుకునే విషయంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తారు. శారీరక దాడులు మాత్రమే కాదు.. మానసిక దాడులు చేయడంలోనూ వీరిని మించినవారు ఉండకపోవచ్చు. అప్పు తీసుకొని వాయిదాలు కట్టకపోతే వీరంగం సృష్టిస్తారు. అప్పు తీసుకున్న వారి ఇంటికి వెళ్లి గొడవచేస్తారు. అంతటితో ఆగదు.. నలుగురి ముందూ నిలెబెట్టి పరువు తీస్తారు. చెప్పాలంటే.. నరకాన్ని చూపిస్తారు. వాటిని తట్టుకోలేకే ఈ ఆత్మహత్యలు..
కూలీనాలీ చేసుకునే వారికి, ఒకేలా ఆదాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పనులు దొరక్కపోయినా.. ఆరోగ్యం పాడై ఆస్పత్రి పాలైనా.. ఆదాయం ఉండదు. అలాంటప్పుడు టంచనుగా వాయిదా చెల్లించడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో వాయిదాకు కాస్త సమయం ఇవ్వమని కోరడం సహజం. కానీ.. మైక్రోఫైనాన్స్ సంస్థల ముందు ఇలాంటి విజ్ఞప్తులు పనికిరావు. చచ్చైనా డబ్బు కట్టాల్సిందేనంటారు. కాస్తో కూస్తే తీసుకువస్తే.. నోటికి వచ్చిన బూతులు తిడతారు. మొత్తం కట్టమంటూ ఒత్తిడి తెస్తారు.
ఇలా తిట్టడంతో వీరి ఆగడాలు ఆగిపోవు. ఆ తర్వాత మరిన్ని మార్గాల్లో వత్తిడి తెస్తారు. అప్పు తీసుకున్న వారి బంధువుల ఇళ్లకూ వెళ్లి బెదిరిస్తారు. కుటుంబ సభ్యులను కొడతారు. డబ్బిస్తేనే వదిలిపెడతామంటూ తమతో పాటు వారిని తీసుకుపోతారు. అప్పు తీసుకోక పోయినా.. తీసుకున్న వారితో సంబంధాలు ఉన్నందుకు హింసిస్తారు. ఇక పొరపాటున ష్యూరిటీగా ఎవరైనా సంతకం చేసి ఉంటే, వారి పరిస్థితి మరీ ఘోరం.
మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్న విషయం.. ఈ మైక్రోఫైనాన్స్ సంస్థలు మరోలా అర్థం చేసుకున్నట్లున్నాయి. అందుకే.. తమ దగ్గర అప్పులు తీసుకున్న మహిళలకు ట్రీట్‌మెంట్ ఇవ్వడంలోనూ విలువలను వదిలిపెట్టేస్తున్నాయి. రాత్రి వేళల్లో వచ్చి డబ్బు కట్టమని ఒత్తిడి చేయడంలో మహా ముదిరిపోయారు మైక్రోఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు. ఎంత అసభ్యంగా ప్రవర్తించాలో అంత దారుణంగా వ్యవహరిస్తారు.
ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థలను ఏమనాలి.. ? ఇవి ఫైనాన్స్ సంస్థలా.. లేక రౌడీ సంస్థలా..?
ఏమిటీ మైక్రో ఫైనాన్స్ ?
మైక్రో ఫైనాన్స్.. పేరులోనే ఉంది మర్మమంతా. పెద్దగా ఆదాయం లేని వారికి, అవసరానికి అప్పులు ఇవ్వడానికి పుట్టుకొచ్చిన సంస్థలు ఇప్పుడు.. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. ఒక్కసారి మైక్రోఫైనాన్స్ వలలో పడితే.. ఇక బయటపడడం కష్టమే. అందులోనే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఆర్థిక సహాయం పేరుతో.. ఈ సంస్థలు అడ్డంగా సంపాదించుకుంటున్నాయి. ఊహించని వడ్డీలు వసూలు చేస్తూ.. కోట్లకు పడగలెత్తుతున్నాయి. వీటి బారిన పడుతున్న సామాన్యుడు మాత్రం.. అప్పులపాలై అర్థాంతరంగా తనువు చాలించుకుంటున్నాడు.
వ్యవసాయ అవసరాలు కావచ్చు.. పిల్లల చదువు కావచ్చు.. పెళ్లి ఖర్చులు కోసం కావచ్చు.. వ్యాపారానికి పెట్టుబడి కావచ్చు.. ఆరోగ్య సమస్యలు కావచ్చు.. ఏదో అవసరం పడింది.. అర్జెంట్‌గా డబ్బులు కావాలి... ఆస్తులున్నవారికైతే ఏదో ఓ బ్యాంక్ టక్కున ఇస్తుంది. కానీ, రోజూ కూలీ చేసుకునే వారి పరిస్థితి ఏమిటి? వారికి డబ్బులు ఎవరందిస్తారు..? ఏ బ్యాంకు ముందుకొస్తుంది..?
పెద్దగా ఆదాయంలేని ప్రతీ ఒక్కరికీ ఇలాంటి అవసరాలు నిత్యం వస్తూనే ఉంటాయి. ఈ కారణమే మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రారంభానికి పునాది వేసింది. ప్రభుత్వం గానీ, బ్యాంకులు గానీ ఇవ్వలేని చోట్లకూ చేరుతూ మైక్రోఫైనాన్స్ సంస్థలు రుణాలను అందిస్తున్నాయి. డబ్బుతో ఎవరికి అవసరం ఉన్నా.. ఎక్కడ అవసరం ఉన్నా... అక్కడ మైక్రోఫైనాన్స్ సంస్థలు చేరిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలన్న తేడానే వీటికి లేదు. వీటికి కావల్సిందల్లా.. డబ్బు అవసరం ఉన్నమనుషులు మాత్రమే. ఎంత అవసరం ఉంటే అంత డబ్బును అందజేస్తాయి. సులభ వాయిదాలంటూ ఊరిస్తాయి. అవసరానికి అందివస్తుంటే.. ఎవరైనా రుణం తీసుకోకుండా ఉండగలరా.. అందుకే.. మైక్రోఫైనాన్స్ సంస్థలకు అంత గిరాకీ. అయితే... రుణం అన్నాక వడ్డీ లేకుండా ఉంటుందా.. ఆ వడ్డీనే అసలు సమస్యకు కారణం. ఈ వడ్డీని ఎలా విధిస్తున్నాయో తెలుసా...?
వడ్డీ ఎంత?
30 వేల అప్పు.. పది వారాల సమయం.. వారానికి కట్టాల్సింది 3,750 రూపాయలు. అంటే.. పది వారాల్లో చెల్లించాల్సింది 37,500 రూపాయలన్నమాట. పది వారాల్లో వడ్డీ రూపంలోనే 7,500 రూపాయలను మైక్రో ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసుకుంటున్నాయి. మామూలుగా రెండు రూపాయల వడ్డీకి అప్పు తీసుకుంటే.. 30 వేలకు నెలకయ్యే మొత్తం కేవలం 600 రూపాయలు. అదే మూడు రూపాయల చొప్పున చూస్తే.. నెలకు 900 రూపాయలు. నాలుగు రూపాయల చొప్పున తీసుకుంటే 1200. అదే ఐదురూపాయలు చొప్పున వసూలు చేస్తే 1500 కట్టాలి. కానీ.. నెలకు వీరు వసూలు చేసేది మూడు వేల రూపాయలు. అంటే.. నెలకు పదిరూపాయల వడ్డీ. ఈ లెక్కన చూస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 120 శాతం. కానీ, ఇక్కడే మరో మెలిక కూడా ఉంది. ప్రతీ వారం వాయిదాను వసూలు చేస్తారు. అంటే.. అసలు తగ్గుతూ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ వడ్డీ ఎంత లేదన్నా 200 శాతానికి తేలుతుంది. ఇదే అసలు సమస్యకు కారణం. తీసుకునే మొత్తం కొంతే అయినా.. వదిలించుకునేది మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది.
ఇక పెద్ద పెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థలు వసూలు చేసుకునేది మరోరకం. 10 రూపాయల రుణం కావాలంటే.. అవి 9 వేలను మాత్రమే ఇస్తాయి. వడ్డీ పేరుతో వెయ్యి రూపాయలను ముందుగానే తీసేసుకుంటాయి. ఇక ఇచ్చిన మొత్తాన్ని కూడా వారానికి 220 రూపాయల చొప్పున 50 వారాల్లో చెల్లించాలి. ఇలా చెల్లిస్తే.. 50 వారాలకు 11 వేలు కట్టాల్సి ఉంటుంది. అదనంగా రెండు వేల రూపాయలు తీసుకుంటారన్నమాట. చూడడానికి ఇది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది. వడ్డీ రూపంలో పన్నెండున్నర శాతమే అని మైక్రోఫైనాన్స్ సంస్థలు లెక్కలు చూపిస్తాయి. కానీ ప్రతీవారమూ వసూలు చేసుకుంటారు కాబట్టి.. అసలు తగ్గుతూ వస్తుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీ 30 శాతంతో సమానం.
ఈ అప్పును ఊరికే ఇచ్చేయవు మైక్రో ఫైనాన్స్ సంస్థలు. వాటిని వసూలు చేసుకోవడానికి వీలైనన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే డబ్బు చేతికి ఇస్తాయి. ఇందులో మొదటిది గ్రూప్ ఫైనాన్స్. ఒక్కొక్కరికి విడి విడిగా కాకుండా.. కొంతమంది కలిపి అప్పును ఇస్తాయి. గ్రూప్‌లో ఏ ఒక్కరు డబ్బు కట్టకపోయినా.. దాన్ని మిగిలిన సభ్యులంతా భరించాల్సిందే. అలా ఒప్పుకుంటేనే రుణం అందుతుంది. ఎవరైనా, కట్టకపోతే.. కట్టించే బాధ్యత గ్రూపులోని మిగతా సభ్యులదే. ఈ లిటిగేషన్ వల్లే.. రుణగ్రహీతలపై విపరీతమైన భారం పడుతుంది. ఏదో జరిగి ఎవరో ఒకరు కట్టకపోతే వారిని హింసించడమే కాకుండా.. మిగిలిన సభ్యుల నుంచి డబ్బు గుంజుతున్నాయి మైక్రో సంస్థలు.
నియంత్రణ ఎలా?
అప్పు.. ఎటు చూసినా అప్పు. రుణం తీసుకోందే.. రోజు గడవడం లేదు. మనరాష్ట్రంలో పరిస్థితి ఇది. ఊకదంపుగా చెబుతున్న విషయం కాదిది. స్వయంగా నాబార్డ్ చేయించిన సర్వే చెబుతున్న నిజం. గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఎంతగా అవసరమవుతాయన్నదానిపై నాబార్డ్ ఇటీవలే ఓ సర్వే చేయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 93 శాతం మంది పూర్తిగా రుణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీకే రుణాలిస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా.. ఆచరణలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. కేవలం 53శాతం మందే ప్రభుత్వం నుంచి రుణాలను పొందగలుగుతున్నారు. మిగిలిన వారిలో దాదాపు 11 శాతం గుర్తింపు పొందిన మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి, 17 శాతం మంది వడ్డీవ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 83.7 శాతం కుటుంబాలు.. రెండు కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నట్లు ఈ సర్వేలో తేలింది. దీన్ని బట్టి అప్పులపై జనం ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు. మైక్రోఫైనాన్స్ సంస్థల విస్తరణకూ ఇదే ఊతం ఇస్తోంది.
అయితే.. వసూళ్ల విషయంలో మిగిలిన సంస్థల్లా కాకుండా, ఇవి దౌర్జన్యాలకు ఒడిగట్టడంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం.. కేంద్రం వైపు చూస్తోంది. వాస్తవానికి 2006లోనే మైక్రోఫైనాన్స్ సంస్థల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ సంస్థలు కొంతకాలంపాటు కార్యకలాపాలను నిలిపివేశాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ చాపకింద నీరులా విస్తరించాయి. ఇప్పుడు మరోసారి తమ చర్యలతో అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలు మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. జనం ఆత్మహత్యలకు తమకు ఏమాత్రం సంబంధం లేదంటున్నాయి. నిబంధనల ఆధారంగానే పనిచేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టడానికి రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది జులైలో ఓ చట్టాన్ని చేసింది. కానీ, ఆర్థిక బిల్లులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండడంతో దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. నెలలు గడుస్తున్నా దానికి ఇంకా ఆమోదముద్ర పడలేదు. ఈలోగానే ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. అందుకే, వెంటనే ఓ ఆర్డినెన్స్‌ను తయారు చేసింది.
మైక్రోఫైనాన్స్ వేధింపులను అరికట్టే బాధ్యతను పోలీసులపై మోపింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ, ఈ సూక్ష్మరుణాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి మైక్రో దోపిడీ ఎలా జరుగుతుందో పూర్తిగా కనిపెట్టాలి. ఈ సంస్థలు వసూలు చేసే వడ్డీపై నియంత్రణ విధించాలి. దీంతో పాటు.. ప్రభుత్వ రుణసాయాన్ని కూడా పెంచాలి. అప్పుడే లక్షలాది మంది ఊపిరి తీసుకోగలుగుతారు. మైక్రో మహమ్మారి కోరల్లో చిక్కుకుపోకుండా ఉండగలుగుతారు.
14, అక్టోబర్ 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి