9, ఆగస్టు 2010, సోమవారం
చిరుగాలి మళ్లింది
మెగాస్టార్ మారిపోతున్నారు. రోజురోజుకూ మారిపోతున్నారు. ఒకరోజు చెప్పిన మాటను మరోరోజు చెప్పడం లేదు. చెప్పాలంటే చిరంజీవి మనసు ఏమాత్రం కుదురుగా లేదు.. అందుకే.. రాజకీయాల్లో స్థిరపడాలని వచ్చిన ఆయన.. ఇప్పుడు మళ్లీ సినీప్రపంచంలోకి వెళ్లిపోవాలనుకుంటున్నారు
చిరంజీవి మనసు మారింది..
రాజకీయాల నుంచి విశ్రాంతి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది..
మార్పుతెస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. చివరకు తానే మారాలని డిసైడ్ అయిపోయినట్లుంది.
అందుకే.. మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టారు.. త్వరలోనే సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన రోబో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌నే ఇందుకు చిరంజీవి వేదిక చేసుకున్నారు. అసలు రోబో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన మాటల్లో ఎంతో ఆవేదన కనిపిస్తుంది. సినిమా ఫీల్డును అనవసరంగా వదిలిపెట్టానే అన్న భావమూ వ్యక్తమయ్యింది. సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో.. రోబోఫంక్షన్‌లో మరోసారి బయటపెట్టారు మెగాస్టార్. ఇంతవరకూ సినిమాలు చేయనంటూ వచ్చిన చిరంజీవి.. ఇక ఆమాటను చెప్పలేనంటూ ప్రకటించడమూ విశేషం.
ఓ వైపు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తూనే.. మరోవైపు, సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు చిరంజీవి. రోబో ఆడియో ఫంక్షన్‌లోనూ అదే విషయాన్ని బయటపెట్టారు. పైగా.. రజనీకాంత్ లాంటి సీనియర్లే, సినిమాల విషయంలో సీరియస్‌గా ఉంటే.. తానెందుకు దూరంగా ఉండలనుకున్నారో ఏమో, మనసు మార్చుకున్నట్లున్నారు. అందుకే.. ఇక సినిమాలు చేయనని ప్రకటించిన చిరంజీవే.. ఒక్క ఛాన్స్ అంటూ రోబో డైరెక్టర్ ఎన్.శంకర్‌ను రిక్వెస్ట్ చేశారు. తనతో ఒక్క సినిమా తీయమని ప్రాధేయపడ్డారు.
రెండుమూడేళ్లుగా సినిమాలు చేయకున్నా.. మెగాస్టార్ హోదా మాత్రం చిరంజీవికి దూరం కాలేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఆయనే నెంబర్‌వన్ అన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది. అలాంటి మెగాస్టార్.. ఒక్క అవకాశం ఇవ్వమంటూ డైరెక్టర్ శంకర్‌ను అంతగా రిక్వెస్ట్ చేయాలా..? పైగా.. ఆ ఛాన్స్ ఇప్పించడానికి రజినీని రికమండ్ చేయమని అడడగడమూ కరెక్టేనా? తెలుగు సినీ డైరెక్టర్లను కాదని.. శంకర్ వెనుక అంతగా చిరంజీవి ఎందుకు పడుతున్నాడు.. మెగాహిట్‌తోనే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడా..? అందుకే శంకర్‌ను ఎంచుకున్నాడా..? శంకర్‌తో తప్ప మరొకరితో చిరంజీవి సినిమా చేయడా.. ? రాజకీయాల్లో తలమునకలై ఉన్నప్పుడు సడన్‌గా మళ్లీ సినిమాలపైకి గాలెందుకు మళ్లింది. రాజకీయాల్లో నెగ్గుకు రాలేకే.. మళ్లీ సినిమాల వైపు చిరంజీవి దృష్టి పెడుతున్నారా... ఇవే ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్న ప్రశ్నలు.
మార్పెందుకు?
ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి ఇప్పుడు మనసెందుకు మార్చుకున్నారు?.. రాజకీయవర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌అయ్యింది. చెప్పాలంటే .. చిరంజీవి పొలిటికల్ కెరీర్ అనుకున్నంత హైరేంజ్‌లో సాగడం లేదు. ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా పీఆర్పీ దక్కించుకోలేకపోవడంతో పాలనపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. యాత్రలు చేస్తున్నా, పార్టీ ప్రతిష్ట పెరుగుతుందో లేదోనన్న అనుమానం. పైగా.. చిరంజీవి చేస్తున్న యాత్రల్లో తరచుగా అపశ్రుతులు. మెగాస్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఆయన జనంలోకి వెళ్తున్నప్పటికీ రాజకీయబలం మాత్రం పెరగడంలేదు. ఖాళీగా ఉండేకన్నా.. సినిమాలు చేసుకుంటే.. మళ్లీ పబ్లిక్‌లో క్రేజ్ పెరిగి.. పార్టీకి ఉపయోగపడుతుందేమోనన్న ఆశ చిరంజీవిది. ఆయన అభిమానుల అంచనా కూడా అదే.
అలా అని.. అంతా సాఫీగా ఉందా అంటే లేదు. చిరంజీవి ప్రకటనపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. రాజకీయాలను మార్చుతానని వచ్చిన చిరంజీవి.. ఏమార్చాడని మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారని అడిగుతున్నవారూ ఉన్నారు.చిరంజీవి సినిమాలకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చేది నైజాం ఏరియాలోనే. కానీ, సామాజిక తెలంగాణ నుంచి.. సమైక్యాంధ్రవైపు మళ్లడంతో తెలంగాణలో చిరంజీవి వ్యతిరేకులు పెరిగిపోయారు. ఆ ప్రభావం ఆయన సినిమాలపైన కూడా పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిరంజీవి సినిమాల్లోకి రావాలంటూ అందరూ ఆహ్వానిస్తున్నా... ఆయనతో సినిమాతీసే సాహసం ఎవరు చేస్తారన్నదే ఇప్పుడు సందేహం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి