5, ఆగస్టు 2010, గురువారం
డిసెంబర్ ఫోబియా..
మూడు రిలీజ్‌లు.. ఆరు షూటింగ్‌లతో కళకళలాడుతూ ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇక దసరానో, సంక్రాంతో వస్తుందంటే ఆ ఉత్సాహం మరింత పెరుగుతుంది. భారీబడ్జెట్‌తో తీసే సినిమాలన్నీ దాదాపుగా ఇలా పండగలకే ముస్తాబవుతాయి. టాప్‌హీరోలందరూ సంక్రాంతి కోసం ఎదురు చూస్తుంటారు.. కానీ.. ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.. కారణం.. డిసెంబర్ ఫోబియా...
తెలుగు సినిమా ఇండస్ట్రీ కలవరపడుతోంది.. వీలైనంత త్వరగా భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేయాలనుకొంటోంది. అందుకే.. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న సినిమాలతో పాటు.. రెండుమూడు నెలల క్రితమే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేయడానికి దూసుకువస్తున్నాయి. ఈ రెండు మూడు నెలలూ తెలుగు సినీ అభిమానులకు పండగే..
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆ సమయంలో రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల వర్షం భారీగా కురుస్తుందన్న నమ్మకం నిర్మాతలది. అందుకే.. ఓ నెలరోజుల ముందే సినిమా సిద్ధమైపోయినా.. సంక్రాంతిదాకా ఆగి మరీ రిలీజ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ.. ఈసారి మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. సంక్రాంతికి రావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ దాదాపు రెండు మూడు నెలల ముందే ప్రేక్షకులను పలకరించనున్నాయి. కారణం.. ఇండస్ట్రీలో నెలకొన్న భయం.
చెప్పాలంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇప్పుడో భయం వెంటాడుతోంది. ఆ భయంతోనే షూటింగ్‌ల స్పీడు పెరిగింది. ఓ సినిమా హిట్ అయితేనే.. మరో సినిమాకు మంచి పునాది పడుతుంది కాబట్టి హీరోల దగ్గర నుంచి నిర్మాతల దాకా ప్రతీ ఒక్కరూ.. తమ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పైగా.. ప్రస్తుతం కొంతమంది నిర్మాతల అంచనా ప్రకారం టాలీవుడ్‌కు మిగిలింది మరో నాలుగు నెలలు మాత్రమే. ఈ లోగా సినిమా రీలీజ్ అయితేనే.. కలెక్షన్లు కురుస్తాయి. లేదంటే.. ఆశలు వదులుకోవాల్సిందే.. అందుకే కాబోలు.. పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి..
టాలీవుడ్‌కు నాలుగు నెలల సమయమేమిటీ అనుకుంటున్నారా.. అవును.. టాలీవుడ్‌ను ఇప్పుడు ఇయర్ ఎండ్ ఫోబియా వణికిస్తోంది. డిసెంబర్ 31 తర్వాత సినిమాల పరిస్థితి ఏమిటో తెలియక కంగారు పడుతోంది... డిసెంబర్‌కు ముందుగానే సినిమాలు విడుదల చేస్తే తప్ప.. లాభాలు రావన్న భయం పట్టుకొంది.
సినిమాలే..సినిమాలు
జల్సా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు కొమరం పులిగా అభిమానులను పలకరించనున్నాడు. దాదాపు రెండేళ్లుగా సాగిన కొమరం పులి నిర్మాణం ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇంకా ఆలస్యం చేస్తే లాభం ఉండదనుకున్న పవర్‌స్టార్.. ఈ నెలలోనే తన సినిమాను రీలీజ్‌కు ప్లాన్ చేశాడు. పెద్ద సినిమాలు లేకపోవడం కొమరం పులికి ప్లస్ పాయింటే అని చెప్పాలి. కథ,కథనం బాగుంటే.. కొమరం పులికి కలెక్షన్ల వర్షం ఖాయమే.. దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమైన ఈ సినిమా హిట్ చేసుకోవడం పవన్‌కు చాలా ముఖ్యం. అందుకే.. డిసెంబర్ చాలా ముందుగానే సినిమాను రిలీజ్ చేశాడు. సినిమా రిలీజ్ దాకా ఆగకుండానే మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టేశాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన లవ్ ఆజ్ కల్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కూడా ఇయర్ ఎండ్‌లోగానే కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు పవన్.
ఇక డిసెంబర్ ఫోబియాతోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది మహేశ్ సినిమా ఖలేజా. ఈ సినిమా కూడా దాదాపు రెండేళ్ల సమయాన్ని షూటింగ్‌కోసం తీసుకుంది. ఖలేజాకు కూడా సుమారు 40 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఇటీవలే లోగోను విడుదల చేసిన మహేశ్.. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే శ్రీనువైట్ల డైరెక్షన్‌లో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. అటు పవన్ కళ్యాణ్, ఇటు మహేశ్‌బాబులు ఇద్దరూ ఓ సినిమాను పూర్తి చేస్తే తప్ప మరో సినిమా మొదలుపెట్టరు. కానీ, ఈ సారి మాత్రం ఇద్దరూ ఒకేసారి రూట్ మార్చారు. కొమరంపులి, ఖలేజాలు రిలీజ్ కాకుండానే కొత్త సినిమాలు మొదలుపెట్టారు. పరిస్థితి చూస్తుంటే.. ఏదో భయం వీరిని వెంటాడుతుందన్న అనుమానం కలగకమానదు.
అదుర్స్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ సారి బృందావనమంటూ అభినవకృష్ణుడిగా కనిపించనున్నాడు. క్రేజీ హీరోయిన్లు కాజల్, సమంతలను ఎన్టీఆర్‌కు జోడీగా పెట్టి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో బృందావనం రూపుదిద్దుకొంటోంది. లాభాలు దక్కించుకోవడం కోసం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయాలన్నది దిల్‌రాజు వ్యూహంగా కనిపిస్తోంది. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉండడంతో వచ్చే నెలలలోనే బృందావనం అందరి ముందుకూ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
మగధీర తర్వాత కూల్‌గా ఉన్న మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్.. ఒక్కసారిగా వేగం పెంచాడు. ఆరెంజ్ షూటింగ్‌ను ఇంతవరకూ చాలా స్లోగా చేసినా.. డిసెంబర్ గండం ముంచుకొస్తుండడంతో ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చింది. త్వరత్వరగా షూటింగ్‌ను పూర్తి చేయడానికి ఆరెంజ్ యూనిట్ అంతా కష్టపడుతోంది. దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాస్త అటూ ఇటూ అయినా.. డిసెంబర్ వరకూ ఆగే అవకాశాలు మాత్రం లేవు.
డార్లింగ్‌గా మంచి హిట్ కొట్టిన ప్రభాస్.. మరోసారి దిల్‌రాజుతో జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సిద్ధమవుతున్న సినిమా సెప్టెంబర్ చివరికల్లా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఏమాయ చేశావే అంటూ హిట్ దక్కించుకున్న నాగచైతన్య నెక్ట్స్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కావచ్చు. సుకుమార్ డైరెక్షన్‌లో సిద్ధమవుతున్నఈ సినిమాను డిసెంబర్ ఫోబియా వణికిస్తోంది. పైగా.. గీతాఆర్ట్స్ సినిమా కావడంతో డిసెంబర్‌ను ఫేస్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. సేఫ్‌సైడ్‌గా డిసెంబర్ 31 కన్నా ముందుగానే రిలీజ్ చేసి కలెక్షన్లు దక్కించుకోవచ్చు.
యంగ్ హీరోలు మాత్రమే కాదు.. ఇటీవల సక్సెస్ లేక డీలాపడ్డ నాగార్జున కూడా తన లక్‌ను డిసెంబర్‌కు ముందే మరోసారి టెస్ట్ చేసుకోనున్నాడు. నాగ్ నటించిన గగనం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై రిలీజ్‌కు రెడీ అయింది. దసరా కానకగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
డిసెంబర్, 2009...
ఈనెల రాష్ట్ర గతిని మార్చేసింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టడం.. ఆయన అరెస్టు.. ఆ పై వెల్లువెత్తిన ఆందోళనలు కలవరపెట్టాయి. చివరకు కేంద్ర హోమంత్రి ప్రకటనతో పరిస్థితి సద్దుమణుగుతుందనుకుంటే.. సీమాంధ్రలో వెల్లువలా ఎగసిపడిన సమైక్య ఉద్యమం రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాయి. రెండు ప్రాంతాల్లోనూ అన్ని వర్గాలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి.
ఈ ఆందోళనల ప్రభావం అన్ని రంగాలపైనా పడినప్పటికీ.. ఎక్కువగా నష్టపోయింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. ఇండస్ట్రీలోని కొంతమంది చేసిన ప్రకటనలకు నిరసనగా.. వారికి సంబంధించిన సినిమాలను టార్గెట్ చేసుకున్నారు ఉద్యమకారులు. టాలీవుడ్ షూటింగ్‌లను అడ్డుకున్నారు. ముఖ్యంగా మోహన్‌బాబు సమైక్యవాదానికి నిరసనగా .. తెలంగాణవాదులు ఝమ్మందినాదం సినిమా షూటింగ్‌పై దాడి చేశారు. సలీమ్ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు.
ఇక మహేశ్‌బాబు సినిమాకోసం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌పైనా తెలంగాణవాదులు విరుచుకుపడ్డారు. సెట్ మొత్తాన్నీ అగ్నికి ఆహుతి చేశారు. దీనివల్ల భారీ నష్టమే జరిగింది. టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఈ సంఘటన ప్రకంపనలు సృష్టించింది. ఆందోళనల కారణంగా చాలామంది తాత్కాలికంగా అప్పట్లో షూటింగ్‌లను కూడా పక్కన పెట్టేశారు. కొంతమంది తమ సినిమాలను విడుదల చేయకుండా ఆగిపోయారు. ఒకరో ఇద్దరో తెగించి సినిమాలను విడుదల చేసినా.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి పార్టీ పీఆర్పీపై తెలంగాణ వాదుల్లో ఉన్న అసంతృప్తికి అల్లు అర్జున్ బలయ్యాడు. ఆయన నటించిన ఆర్య-2 సినిమాను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. థియేటర్లపై దాడులు చేసి భీభత్సం సృష్టించారు. వరుడు షూటింగ్‌కూ ఆటంకాలు కల్పించారు.
ఇక ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. దానిపైనా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎఫెక్ట్ పడింది. సినిమా రిలీజ్‌కు మార్గం సుగమం చేయడానికి స్వయంగా ఎన్టీఆరే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఎవరెటు పోయినా.. తాను మాత్రం హైదరాబాద్‌ను వదిలేది లేదంటూ ప్రకటించడంతో రిలీజ్‌కు మార్గం సుగమమయ్యింది.కానీ.. అదుర్స్ నిర్మాతల్లో ఒకరైన కొడాలినాని సమైక్యవాదాన్ని ఎత్తుకోవడంతో.. అదుర్స్‌కు ఆటంకాలు మొదలయ్యాయి. తెలంగాణలో చాలా చోట్ల సినిమా ప్రదర్శనను నిలిపివేయడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి.
చాలా సినిమాల షూటింగ్‌కు అంతరాయం తప్పలేదు. లీడర్ సినిమాకు సింగరేణి గనుల వద్దకు వెళ్లిన రానాను అడ్డుకున్న తెలంగాణ వాదులు జై తెలంగాణ అనిపించాక గానీ వదల్లేదు.ఇటీవల మర్యాదరామన్న షూటింగ్ కోసం కరీంనగర్‌కు వెళ్లిన రాజమౌళి, సునీల్ బృందానికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
ఓ వైపు సినిమా ప్రదర్శనలకు అడ్డంకులతో పాటు.. సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగడంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు దూరంగానే ఉండిపోయారు. దీంతో సినిమాలకు ఆశించినంత కలెక్షన్లు కూడా రాలేదు. రాష్ట్రంలో చాలావరకూ థియేటర్లు ఉద్యమం తీవ్రంగా సాగిన సమయంలో ప్రేక్షకులు లేక బోసిపోయాయి.
ఇక శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం.. రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు తగ్గడంతో మళ్లీ తెలుగు సినిమాకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. క్రమంగా సినిమాలను చూసే వారి సంఖ్య కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చింది. సినిమా ఏమాత్రం బాగున్నా.. కలెక్షన్లు భారీగా రావడం మొదలుపెట్టాయి. దీనికి సింహా సినిమానే ఓ ఉదాహరణ. ప్రాంతీయ తేడాలు లేకుండా.. తెలంగాణ, సీమాంధ్రల్లో అన్నిచోట్ల సినిమాను హిట్ చేశారు.
అయితే.. మళ్లీ డిసెంబర్ వస్తుండడంతో.. ఏం జరుగుతుందోనని టాలీవుడ్‌లో టెన్షన్ మొదలయ్యింది.
భయం భయం
డిసెంబర్ 31 తర్వాత ఏదో జరగొచ్చని టాలీవుడ్ భయపడుతోంది. అందుకే.. వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలనుకొంటోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావం ఎంత పడుతుందన్నది స్వయంగా అనుభవించారు కాబట్టి ఈ సారి జాగ్రత్త పడుతున్నారు. నష్టాలు కొనితెచ్చుకోకూడదంటే.. వీలైనంత త్వరగా సినిమాలు రిలీజ్ చేయడమే మేలనుకుంటున్నారు.
డిసెంబర్ 31తో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన గడువు పూర్తవుతుంది. నివేదిక కూడా అప్పటికల్లా ఇచ్చేస్తామని కమిటీ కూడా హామీఇస్తోంది. ఈ రిపోర్ట్ ఇవ్వడంపైనా తెలుగు చిత్ర పరిశ్రమ కలవరపడుతోంది. కమిటీ నివేదిక ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నా.. మళ్లీ వివాదం మొదటికి రావచ్చన్న అనుమానాన్ని చాలా మంది నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలు, ఆందోళనలు ఎటుపోయి ఎటు వచ్చినా చివరకు నష్టపోయేది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీనే అన్న అనుమానం క్రమంగా పెరుగుతోంది. కోట్లల్లో పెట్టుబడి.. నెలల తరబడి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారొచ్చంటూ నిర్మాతలు, హీరోలు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా ఇప్పుడు విడుదలకు సిద్ధమైన సినిమానాల్లో ఒక్కోదాని బడ్జెట్ దాదాపు 20 కోట్ల పైమాటే. కొమరంపులి, ఖలేజాలు చెరో 40కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారయ్యాయి. బృందావనానికి 30 కోట్ల దాకా ఖర్చవుతోంది. దిల్‌రాజు, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు 25 కోట్లు, ఆరెంజ్‌కు దాదాపు 30 కోట్ల రూపాయలను నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు. ఇంత భారీ మొత్తాలు కాబట్టే.. ధైర్యం చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు.
పైగా.. ఒకప్పటిలా తెలుగుసినిమాలు వందరోజులు ఆడే సీన్ ఇప్పుడు లేదు. ఫలితం ఫస్ట్ రోజే తేలిపోతోంది. పదిరోజుల్లోనే లాభమో నష్టమో తేలిపోతుంది. అందుకే.. వీలైనన్ని ఎక్కువ ప్రింట్లు వేసుకొని తొలిరోజు కలెక్షన్లను సంపాదించుకోవడానికి నిర్మాతలు ట్రై చేస్తుంటారు. సూపర్ హిట్ అయ్యిందనుకుంటే.. అతి కష్టంమీద 50 రోజుల ఫంక్షన్‌ను తెలుగు సినిమాలు జరుపుకుంటున్నాయి. అందుకే.. కనీసం డిసెంబర్31కన్నా ఓ నెల ముందుగానే సినిమాలన్నీ విడుదల చేయాలన్నఆలోచన టాలీవుడ్‌ది.
ఏవో ఒకటీ రెండు సినిమాలు మాత్రమే సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. అది కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటేనే రావచ్చు. లేదంటే.. షూటింగ్ కంప్లీట్ అయినా రిలీజ్ కాకపోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే.. డిసెంబర్ 31 తర్వాత ప్రతీరోజు ఓ గండమే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో తెలియదు.. ఇచ్చిన నివేదికలో ఏముంటుందో తెలియదు. ఆ నివేదిక ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. ఒకవేళ బయటపడితే.. ఏం జరుగుతుందో అంతకన్నా తెలియదు. అందుకే.. సినిమా ఇండస్ట్రీకి డిసెంబర్ ఫోబియా పట్టుకొంది. సినిమా బాగున్నా.. మంచి టాక్ ఉన్నా.. ఆందోళనలు, ఉద్యమాలతో ఎక్కడ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందోనన్న భయం నిర్మాతలది. ఈలోగానే సినిమా విడుదల చేసుకుంటే ఆ టెన్షన్ ఉండదు. ఇదే ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవడానికి అసలు కారణం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి