8, జూన్ 2010, మంగళవారం
అరచేతిలో మద్యం
గుంటూరు జిల్లా నడికుడిలో రూ.5.21 కోట్లు..
విశాఖలో రూ.4.72 కోట్లు
హైదరాబాద్‌లో రూ.4.45 కోట్లు
ఒక్కో మద్యం దుకాణం కోసం వ్యాపారులు కురిపించిన కోట్ల వర్షం. అవును... కనీవినీ ఎరుగని రీతిలో.. ఎవరూ ఊహించని స్థాయిలో.. ఒక్కో మద్యం దుకాణం కోట్లల్లో పలికింది.
మద్యం దుకాణానికి కోటి రూపాయలకు పైగా టెండర్ పడిందన్న వార్తే రెండేళ్ల క్రితం కిక్కు ఎక్కిస్తే.. ఈసారి అలాంటి కిక్కులు చాలానే ఉన్నాయి. మద్యం లైసెన్సు టెండర్లలో ఈ సారి కోట్ల వర్షం కురిసింది. ప్రభుత్వం అంచనాలకు రెట్టింపు స్థాయిలో కొన్ని దుకాణాలకు టెండర్లు వచ్చాయి. 2008లో లక్షల్లో పలికిన దుకాణాలు ఈ సారి కోటి రూపాయలను దాటిపోయాయి. రాజధాని దగ్గర నుంచి మొదలుపెడితే రాష్ట్ర సరిహద్దుల వరకూ అన్నిచోట్లా.. ఒకే తరహా రెస్పాన్స్. మద్యాన్నే నమ్ముకున్న వ్యాపారులు కోట్లకు బెట్ కాశారు. విశాఖ జిల్లా పెదవాల్తేరులోని ఓ దుకాణం 4 కోట్ల 72 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. విశాఖ వేగంగా డెవలప్ అవుతుండడంతో.. ఇంత ఎక్కువమొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డాడో వ్యాపారి. ఇక హైదరాబాద్‌లో ఓల్డ్ అల్వాల్ మద్యం దుకాణం అత్యధిక విలువ దక్కించుకొంది. దాదాపు 4.45 కోట్ల రూపాయలు చెల్లించి ఈ దుకాణం లైసెన్సు దక్కించుకున్నాడు మైఖేల్ అనే వ్యాపారి.మూసాపేట్‌లోని దుకాణం మూడున్నర కోట్లు పలికింది. హైదరాబాద్‌లోని దుకాణాలన్నీ దాదాపు కోటిపైనే పలికాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెండు కోట్ల పైనే చెల్లించి వ్యాపారులు లిక్కర్ షాపులను సొంతం చేసుకున్నారు.
జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మద్యం విషయంలో గుంటూరు జిల్లా రికార్డులు సృష్టించింది. అత్యధిక మొత్తానికి బిడ్ గుంటూరు జిల్లాలోనే పడగా.. దాచేపల్లిలోని రెండు దుకాణాల్లో ఒకటి రూ. 4.96 కోట్లు, మరొకటి రూ.4.36 కోట్లు పలికాయి. ఇక నల్గొండ జిల్లా మేళ్లచెరువులో 3.74 కోట్లకు టెండర్ పడింది. హైదరాబాద్‌లోని వరంగల్ రంగశాయిపేటలో దుకాణం విలువ 3.46 కోట్లు. ఇక రాజధాని పక్క జిల్లా.. మెదక్‌లోనూ మద్యం దుకాణాలు కోట్లను దాటాయి. మెదక్‌లోని వైన్‌షాప్‌కు 3.33కోట్లకు టెండర్ వేశారు. కరీంనగర్లో 2.31 కోట్లు, విజయనగరంలో 2.22 కోట్లు.. కర్నూలులో 2.10 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. కోట్ల లెక్కలు చాలానే ఉన్నాయి.
రెండేళ్లకోమారు జరిగే ఈ టెండర్లలో లైసెన్సులను దక్కించుకోవడానికి వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎప్పుడూలేనంతగా ఈ సారి పోటీ ఉండడంతో.. భారీ మొత్తాలను కోట్ చేశారు. చాలావరకూ కోట్లల్లో టెండర్లు పలకడానికి కారణం ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపు ఉంటే.. భారీగా సంపాదించుకోవచ్చన్న అభిప్రాయంతోనూ ఎక్కువమంది టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. పైగా.. మాద్యంలో జోరుగా సాగుతున్న వ్యాపారమూ మద్యం ఒక్కటే. అందుకే.. ఈసారి లైసెన్సుల కోసం వేలాది మంది పోటీ పడ్డారు.
ప్రభుత్వం ఊహించనదానికన్నా ఎక్కువమొత్తాలనే అందిచాయి లైసెన్సు టెండర్లు. వేసవిలో ఖాళీఖజానాతో కొట్టుమిట్టాడుతున్న రోశయ్య సర్కార్ గొంతు తడిపాయి మద్యం టెండర్లు.
ఖజానా నిండింది
గల్లీ గల్లీకో వైన్ షాప్.. మంచినీళ్లు దొరకని చోట కూడా మద్యం దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. 6596 మద్యం దుకాణాలున్నాయి. నిబంధనలకు నీళ్లు వదులుతున్న వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. గుడి బడీ అన్న తేడా లేకుండా షాపులు ఏర్పాటు చేసేశారు. ఓ వైపు రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎక్కువైపోయాయన్న ఆందోళనలో జనం ఉంటే.. వ్యాపారులు మాత్రం ఈ దుకాణాల సంఖ్య చాలా తక్కువనుకుంటున్నారు. పైగా.. మద్యం వ్యాపారమే అన్నిటికన్నా మంచి బిజినెస్‌గా భావిస్తున్నారు. అందుకే.. టెండర్లకు ఎప్పుడూలేనంత స్పందన ఈసారి వచ్చింది. ఎవరికి వారు మద్యం లైసెన్సులు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. 2008లో ఈ దుకాణాలకు 19400 టెండర్లు మాత్రమే దాఖలైతే.. ఈ సారి వచ్చిన టెండర్లు 48602. కొన్ని కారణాలతో మరో 28 దుకాణాలు వేలం వాయిదా పడింది. రెండేళ్లక్రితంతో పోల్చితే రెండున్నర రెట్లకు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఒక్కో అప్లికేషన్‌కు పదివేల రూపాయలను ఎక్సైజ్‌శాఖ వసూలు చేయడంతో... ఈ రూపంలోనే 48.6 కోట్ల రూపాయలు ఖజానాకు జమయ్యాయి.
దరఖాస్తుల అమ్మకాలను బట్టి ప్రభుత్వ అంచనాలను మించే ఖజానాకు ఆదాయం అందవచ్చని తెలుస్తోంది. 2008-10 కాలానికి ప్రభుత్వానికి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజు రూపంలో 3182 కోట్ల రూపాయలు వచ్చాయి. దీనిపై ఈ సారి 15 శాతం అప్సెట్ ప్రైస్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. ఒక్కో దుకాణానికి ఇంతకు ముందు చెల్లించిన ధర కన్నా 15 శాతానికి మించి టెండర్ వేయాలన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 3590 కోట్ల రూపాయలు లైసెన్సు ఫీజుల రూపేణా రావచ్చని రోశయ్య సర్కార్ భావిస్తోంది. కానీ.. టెండర్లు పడ్డ తీరు చూస్తే.. 5 వేల కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం రావచ్చు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమపథకాలపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో.. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే గట్టెక్కించనుంది.
ఇక మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సర్కార్ అంచనావేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే అవుతున్నాయి. 2004-05లో మద్యం అమ్మకాల ద్వారా.. 3834 కోట్ల రూపాయలు వస్తే.. 2005-06 కల్లా అది 4668 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇలా ఏటా వెయ్యి కోట్లకు పైగానే ఆదాయం పెరుగుతూ.. 2008-09 నాటికి పదివేల కోట్లకు చేరుకుంది. ఇక 2009-10 ఆర్థిక సంవత్సరానికి 12 వేల కోట్ల రూపాయలను సర్కార్ మద్యం అమ్మకాల ద్వారా సంపాదించింది. ఈసారి లైసెన్సు ధరలు పెరగడంతో.. మద్యం అమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరిగే అంచనాలున్నాయి. అందుకే.. 15 వేల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ ఆదాయమే వచ్చే అవకాశాలే ఉన్నాయి.
ఎలా సంపాదిస్తారు?
ఒకప్పుడు లక్షల్లో సాగితే.. ఇప్పుడంతా కోట్ల మయం. చిన్న చిన్న పట్టణాలైనా... కోట్లు చెల్లించడానికి సిద్ధపడ్డారు మద్యం వ్యాపారులు. ఎలాగైనా మద్యం దుకాణాన్ని దక్కించుకోవడం కోసం అంచనాలను మించి కోట్ చేశారు. ఇందుకు ఉదాహరణ వరంగల్‌లోని ఓ మద్యం దుకాణమే. క్రితం సారి 70 లక్షలకు మాత్రమే పాడుకున్న సుధాకర్ అనే వ్యాపారి.. ఈసారి అదే దుకాణానికి 3 కోట్ల 45 లక్షల 68 వేల 444 రూపాయలకు టెండర్ వేశాడు. అంటే గతం కన్నా దాదాపు రెండున్నర కోట్లు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడ్డాడు. మరి అంత డబ్బు ఎందుకు పెడుతున్నాడు.. దాన్ని తిరిగి సంపాదించుకోగలడా.. ? ఒకవేళ సంపాదించుకుంటే.. ఎలా సంపాదించుకుంటాడు? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం వినండి..
మద్యం వ్యాపారుల ధైర్యానికి కారణం ప్రభుత్వమే. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ.. చూసీచూడనట్లుగా ఉండడం వల్లే ఎంత వ్యాపారమైనా చేయవచ్చన్న నమ్మకం వ్యాపారుల్లో ఉంది. పైగా.. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నికలూ రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. పైగా ఇవి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు కాబట్టి .. ప్రతీ చోటా మద్యం వ్యాపారం తారాస్థాయిలో సాగుతుంది. ప్రతీ దుకాణంలో కోట్లాది రూపాయల అమ్మకాలు జరుగుతాయి. ఒక్క దుకాణం ఉన్నా.. భారీగా సంపాదించుకోవచ్చు.. అందుకే.. లైసెన్సు కోసం కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా ఎవరూ వెనుకాడడం లేదు. దీనికి తోడు మద్యం అమ్మకాల్లో ఏటేటా అనూహ్య వృద్ధి నమోదవుతోంది. మద్యం తాగుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. 2006లో జరిగిన ఓ సర్వే ప్రకారం 20 ఏళ్లకే మద్యం రుచి మరుగుతున్నారని తేలుతోంది. కాలంతో పాటే పరుగులు పెడుతున్న యువతరం.. మందు విషయంలోనూ అంతే జోరును కనబరుస్తోంది. పార్టీల పేరుతో పెగ్గుల మీద పెగ్గుల లాగించేస్తున్నారు. వీరంతా ఇప్పుడు వ్యాపారుల పాలిట కాసులు కురిపించే యంత్రాలు.
అంతేకాదు... మద్యం విషయంలో ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న నిబంధన పాటించే అవకాశమూ తక్కువే. ఒక ప్రాంతంలో ఉన్న మద్యం వ్యాపారులంతా సిండికేట్ అవగలిగితే చాలు.. ఎమ్మార్పీపై 10 నుంచి 20 రూపాయలు ఎక్కువకే అమ్ముకోవచ్చు. దీన్ని అడిగేవారూ ఉండరు. ఎక్సైజ్ సిబ్బందికీ ముడుపులు టంచనుగా ముడతాయి కాబట్టి, దీనిపై వారు కూడా పెదవి మెదపరు. పైగా.. కొన్ని బ్రాండుల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి రెట్టింపు ధరకూ అమ్ముకోవచ్చు. మద్యం దుకాణాల్లో ఇటీవలి కాలంలో వరసగా అమలు చేస్తున్న విధానాలు ఇవే. మద్యానికి అలవాటు పడ్డవారు ఎంతకైనా కొనడానికి సిద్ధపడుతుండడమే.. వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. కోట్లకు టెండర్ వేసేలా ప్రేరేపించింది.
తాగండి బాబూ..తాగండి
తాగేవాడిని మరింత తాగమనేలానే ఉంది సర్కార్ తీరు. వాడవాడకో మద్యం షాపును ఏర్పాటు చేస్తూ.. అరచేతిలోకి మందును అందుబాటులోకి తెస్తోంది. గ్రామాలవైపు చూస్తే.. సరైన స్కూళ్లు ఉండవు.. హాస్పటల్స్ ఉన్నా సదుపాయాలు మాత్రం అరకొరే. రోగులకు ఇవ్వడానికి మందులూ ఉండవు.. అంతెందుకు గొంతెండితే తాగడానికి పరిశుభ్రమైన మంచినీళ్లు కూడా దొరకవు. ప్రజలకు అత్యవసరమైన వాటి పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోని సర్కార్.. మద్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మకాలు తగ్గకుండా చూడడానికి ఎక్సైజ్ శాఖను పరుగులు పెట్టిస్తోంది. టార్గెట్లు విధిస్తోంది. లైసెన్సుడు దుకాణాల్లోనే మద్యం అమ్మాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో అనధికారికంగా వెలుస్తున్న బెల్టు షాపులను ఏమాత్రం నియంత్రించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా లక్షకుపైగా బెల్డు షాపులు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. మనిషి మనిషికీ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి... తాగుబోతులుగా తయారు చేస్తోంది. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ.. ఖజానాలో కాసులు నింపుకొంటోంది. వీటినుంచే.. ప్రజల సంక్షేమం కోసమంటూ అరకొరగా నిధులు విదుల్చుతోంది. అసలు మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవాలన్న నీచమైన ఆలోచన నుంచి ఈ ప్రభుత్వం బయటపడుతుందా...?
ఇక ఇప్పుడు కోట్లల్లో లైసెన్సు ఫీజులు చెల్లించి టెండర్లు దక్కించుకున్నవాళ్లదీ ఇదే పరిస్థితి. చేసేది ఫక్తు వ్యాపారమే అయినప్పటికీ.. దానికీ సామాజిక కోణం అద్దుతున్నారు. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసమే.. ఇంతమొత్తం చెల్లిస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకొన్నప్పడే.. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోవడానికి మాత్రం మద్యపాన విమోచన కమిటీ అని ఏర్పాటు చేసింది. అయినా.. ఏటాటా మద్యం తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఎంతమంది చేత మద్యం మానిపించారు? పైగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న రోశయ్య సర్కార్ చేస్తున్నదేమిటి? జనాన్ని మద్యానికి బానిసలుగా మార్చడమే సంక్షేమమా? సామాన్యుడి ఆరోగ్యాన్ని హరించడమే ప్రభుత్వం చేస్తున్న మేలా?
మద్య నియంత్రణ సాధ్యమేనా?
దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్నది వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించాక చెప్పిన మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న పేరున్న వైఎస్.. ఈ మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. వైఎస్‌కు అత్యంత నమ్మకస్తుడైన రోశ్యయ్య ముఖ్యమంత్రి పీఠమెక్కినా.. వైఎస్ మాట అమలు కాలేదు. మద్య నియంత్రణ మాట అటుంచితే.. దశల వారిగా మద్యం అమ్మకాలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి.
రాష్ట్రంలో ఇక మద్య ప్రవాహం కొనసాగనుంది. కోట్లకోట్లు పోసి లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. ఆదాయమే లక్ష్యంగా విజృంభించనున్నారు. అడుగడుగుకో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తారు.. పిల్లలకూ మద్యాన్ని అలవాటు చేసినా ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే.. ఇప్పుడు లైసెన్సు ఫీజుగా కట్టిన మొత్తాన్ని సంపాదించాలంటే.. నీతిగా వ్యాపారం చేస్తే ఏ మాత్రం కుదరదు. ఎన్ని అక్రమమార్గాలు తొక్కితే అంతగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడూ లేనంత ఆదాయం వస్తుందని ప్రభుత్వం సంబరపడవచ్చు గానీ.. అంతకు రెట్టింపు ఆదాయాన్ని మద్యం వ్యాపారులు జేబుల్లో వేసుకుంటారు..
ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం కారణంగా ఎన్నో పచ్చని సంసారాల్లో చిచ్చు రగులుతోంది. ఇటీవలికాలంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంది. వీటన్నింటికీ కారణం.. మద్యమేనన్నది ఎన్నో పరిశీలనల్లో వెల్లడైన వాస్తవం. ఇది ప్రభుత్వానికీ తెలుసు. అయినా.. మద్యాన్ని ప్రోత్సహిస్తుందే తప్ప.. నియంత్రణకు మాత్రం ముందడుగు వేయదు. వేస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం చూపించదు.
మద్యం విషయంలో ప్రభుత్వం వైఖరి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కొన్నాళ్లుపోతే.. ఆదాయం కోసం పూర్తిగా మద్యాన్నే సర్కార్ నమ్ముకున్నా ఆశ్చర్య పోనక్కరలేదు. సామాన్య, మధ్యతరగతి జీవితాలను నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని పారద్రోలడానికి అంతా ముందుకు కదలాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది.
మరోసారి ప్రజాఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వం ఆలోచన మారకపోవచ్చు. అయితే.. మద్యం మత్తులో నిండా మునిగిపోయిన సర్కార్‌కు జనం వాణి వినిపిస్తుందా.. సామాన్యుల బాధలు చెవికెక్కుతాయా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Loved your article. Its sad to see these kind of things happening in our society.
Even the educated, media, organizations, politicians no body is caring about these developments.
Its sad to see shops next to schools and temples.
Only thing is no body cares, dont know who will change it and how they will change it.
If you see clearly, the politicians are very similar to those wineshop owners. They do spend crores and crores to get a seat and even a kid know how they will get that money back.
No body question the politicians when they are spending crores for the elections., now no one is questioning these shop owners how they recover the money beyond their sales limits.
Government having the targets on excise dept., is the worst situation possible. Shame on everyone who is involved with it.
There is an allegation on US govt., that they supply drugs to keep the economy steady.
Pray god... to take care of the counrty which boasts its sacredness, spirituality and humanity from these stupid politicians who wont care the comman man.
Thanks for the nice article.
It is absolutely possible to get rid of this dirty booze income, if government could levy direct taxes (even income tax) from every earning person including farmers and rural occupations. Think of this once. Only 30% of the state's total population, that is, only townsmen, are covered by income tax. The rest of the 70% (all rural people) are legally and totally exempt from that. So, where can government earn from ? As things stand now, there is no alternative to liquor.
ప్రజల ఆదాయం బాగా పెరిగింది కాబట్టే మద్యం దుకాణాలకు ఇంతగా గిరాకీ పెరిగిందనీ,కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకమనీ మంత్రిగారుచెబుతున్నారు. దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని,1995నాటి ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .
మద్యాన్ని నిషేధిస్తే సమాజానికి ఎన్నో మేళ్ళున్నాయిః
“చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”
“పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య.
“మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు.
‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సందేహిస్తుంటే,’రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు.
మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.శాంతిభద్రతలు కొరవడతాయి.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.