ఎదురుగా ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటారు.. వెనక్కితిరిగి ఆడిపోసుకుంటారు. ఒకర్ని ఎలా అణగదొక్కాలా అని నిరంతరం ఆలోచిస్తుంటారు.. ప్రత్యర్థి నాశనం చేయడమే లక్ష్యంగా ప్లాన్లు వేస్తుంటారు.. ఇలా చెబుతూ ఉంటే ఏదో తెలుగు టీవీ సీరియల్ గుర్తుకు వస్తోందా.. మీ ఊహ కరెక్టే.. కానీ.. ఇప్పుడు మాత్రం.. నిజజీవితంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.. అదీ బుల్లితెరపై అద్భుతంగా నటిస్తూ.. జనాన్ని టీవీలకు కట్టిపడేస్తున్న ఆర్టిస్టుల జీవితాల్లోనే..
మూడు సార్లు ఒకే తరహా మాట మాట్లాడడం.. డింపుల్‌ను కొడితే.. తన భర్త పడే బాధ తెలుస్తుందని... దాడి చేసిన మహిళ అరవడం... టీవీ ఆర్టిస్ట్ డింపుల్‌పై దాడిని సెన్షేనల్ చేశాయి. ఇంతకీ ఈ దాడి చేసింది ఎవరు? తోటి నటీనటీలేనా? డింపుల్‌పై దాడి ఎందుకు జరిగింది? డింపుల్‌ను గాయపరచడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు?
టీవీ ఆర్టిస్ట్ డింపుల్‌పై దాడి వెనుక ఎన్నో కారణాలు కనిపిస్తాయి. తెలుగు సీరియళ్లలో ఇటీవలి కాలంలో బిజీ ఆర్టిస్టుగా మారింది డింపుల్. అదం.. అభినయం ఉండడంతో అవకాశాలు ఆమెకు అందివస్తున్నాయి. టీవీ ఇండస్ట్రీలో ఒక్కోమెట్టూ ఎదుగుతున్న ఈ టీవీ నటికి.. శత్రువులు ఎవరైనా ఉన్నారా?
డింపుల్ దృష్టిలో తనకు శత్రువులు ఎవరూ లేరు.. మరి దాడి చేసింది ఎవరు..? తరచి చూస్తే.. ఈ దాడికి మరో దాడికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. జూన్ 8న టీవీ ఆర్టిస్ట్ శ్రీధర్‌పై కూకట్‌పల్లి మలేషియా టౌన్‌షిప్ వద్ద స్పిరిట్ ఎటాక్ జరిగింది. ఆ మరుసటి రోజునే.. డింపుల్‌ను గుర్తుతెలియని మహిళ గాయపరిచింది. ఈ రెండు సంఘటనలూ వరసగా జరగడం వెనుక ఏదో ఓ బలమైన కారణం ఉండవచ్చని ఎవరికైనా అనుమానం కలగక మానదు.
వర్ధమాన టీవీ ఆర్టిస్ట్‌పై జరిగిన ఈ దాడి.. టీవీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో ఆధిపత్య పోరే.. ఈ దాడికి కారణమా? వృత్తిపరమైన విబేధాలే.. దాడులకు పురికొల్పుతున్నాయా? టీవీస్క్రీన్‌పై కనిపించే దృశ్యాలు.. ఇప్పుడు ఆర్టిస్టుల నిజజీవితాల్లోకి చొరబడుతున్నాయా..? డింపుల్‌పై దాడి ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతుంది.
లోబరుచుకుంటున్న క్యారెక్టర్లు
ఆడాళ్లను ఏడ్పించడం.. ఎవరో ఒకరిని చంపడానికి ప్లాన్ వేయడం.. దాడి చేయడానికి కుట్ర పన్నడం.. ఇలాంటి సీన్లు తెలుగు టీవీ సీరియళ్లలో చాలా కామన్. సాధారణంగా ఏ సీరియల్ చూసినా.. ఎవరో ఒకరిని నాశనం చేయడానికి తెగ ట్రై చేసే క్యారెక్టర్లు కోకొల్లలు. కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన సీరియల్స్‌లో... పాత్రలను పండించడంలో నటీనటులంతా ఆరితేరిపోయారు. పాత్రల్లో జీవిస్తూ... ఆ స్వభావాలను నిజజీవితానికీ ఆపాదించుకుంటున్నారు. సీరియల్స్ చూసి జనం మారడం సంగతేమో గానీ.. నటించి నటించీ.. యాక్టర్లే మారిపోతున్నారు.
ఇక డింపుల్‌పై జరిగిన దాడికి టీవీ ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులే కారణమన్నది చాలామంది అనుమానం. డింపుల్ చెబుతున్న మాటలు కూడా దీన్నే రుజువు చేస్తున్నాయి. అయితే.. నేరుగా ఎవరి పేరూ చెప్పకపోయినా... టీవీ ఆర్టిస్ట్ సెల్వరాజే దాడి చేయించి ఉంటాడన్న అనుమానాలను.. డింపుల్ వ్యక్తం చేస్తోంది. శ్రీధర్‌పైనా.. ఆతర్వాత తనపైనా జరిగిన దాడికి సెల్వరాజ్‌కూ సంబంధం ఉండవచ్చేమోనన్నది ఆమె సందేహం.
ఆరాధన అనే సీరియల్‌లో లీడ్‌రోల్‌లో నటిస్తున్న సెల్వరాజ్‌ను పక్కనపెట్టి.. ఆ అవకాశాన్ని శ్రీధర్‌కు ఇచ్చారు. ఈ మార్పును తట్టుకోలేకే.. సెల్వరాజ్ ఈ దాడి చేయించి ఉండవచ్చన్నది డింపుల్ అనుమానం. అయితే.. ఈ ఆరోపణలను మాత్రం సెల్వరాజ్ ఖండిస్తున్నాడు. ఆరాధనలోని ఓ చిన్న క్యారెక్టర్ పోయినందుకు ఫీల్ అయ్యే అవకాశమే లేదంటున్నాడు. పైగా తన ఎదుగుదలను ఓర్వలేకే.. ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నాడు.
మొత్తంమీద ఇద్దరు యాక్టర్ల మధ్య సాగుతున్న ఈ వివాదం డింపుల్‌పై దాడితో తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు చేస్తున్న పనులతో అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీవీ ఆర్టిస్టులు.
సెల్వరాజ్ పనేనా?
డింపుల్‌పై దాడి సెల్వరాజ్ చేయించాడా? లేక సెల్వరాజ్ పేరును కావాలనే ఎవరైనా ఇరికించారా? ఈ రెండింటి విషయంలో కాస్త క్లారిటీ లేదనే చెప్పాలి. ఎవరి వాదన వారిది.. ఎవరి అనుమానం వారిది.
అయితే.. ఆరాధన సీరియల్ విషయంలో జరిగిన మార్పులు.. సెల్వరాజ్ స్థానాన్ని శ్రీధర్ ఆక్యుపై చేయడం.. శ్రీధర్‌పై దాడి చేయడం.. ఇవన్నీ ఒకదానికొకటి లింకు ఉన్నట్లు కనపడతాయి. అయితే.. ఇక్కడ డింపుల్‌పై దాడి జరగడానికీ కారణం ఉంది. శ్రీధర్, డింపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. డింపుల్‌ను హింసిస్తే..శ్రీధర్ ఫీలవుతాడనే భావం వచ్చేలా.. దాడిచేసిన మహిళ చెప్పడమూ అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనికి తోడు.. శ్రీధర్‌పై దాడి జరగగానే... ముందుగా బయటకు వచ్చిన పేరు సెల్వరాజ్. వాస్తవానికి సెల్వరాజ్‌పై పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయలేదు. అయినా.. సెల్వరాజ్ కంగారు పడ్డాడు. మీడియా ముందుకు వచ్చి హడావిడి చేశాడు. కానీ.. విషయం అర్థమయ్యే సరికి సైలెంట్ అయ్యాడు. తన పేరు బయటకు తీసుకువచ్చిన వారిపై చర్యలు తీసుకుంటానంటున్నాడు.
తెలుగు సీరియల్స్‌లో తరచుగా యాక్టర్లు మారిపోతుంటారు. ఓ క్యారెక్టర్ పోషిస్తున్న యాక్టర్‌ను మార్చేసి మరో యాక్టర్‌ను ఆ ప్లేస్లో ప్రవేశపెడతారు. ఇప్పుడు ఆరాధన విషయంలో జరిగింది కూడా ఇదే. అయితే.. వ్యక్తిగత కారణాలతోనే ఇలా తమను తప్పిస్తున్నారని ఫీలవుతున్న నటులు కుమిలిపోతున్నారు. డైరెక్టర్లపైనా, ఆర్టిస్టులపైనా కక్షను పెంచుకుంటున్నారు. అయితే.. ఇది అంత మంచి పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా బాగానే ఉందని చెప్పుకుంటున్నప్పుడు.. క్యారెక్టర్ మారగానే.. ఆర్టిస్టులు ఎందుకు ఫీలవుతున్నారు? వ్యక్తిగతంగా కక్షలు ఎందుకు పెంచుకుంటున్నారు.. దీనికి కారణం.. ఆ క్యారెక్టర్లతో అనుబంధం పెంచుకోవడమే. ఇంతకాలం తాము చేసిన క్యారెక్టర్‌లో.. మరొకరు కనిపిస్తారన్న విషయాన్ని బాధిత ఆర్టిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే.. ఆర్టిస్టులపై దాడులకు పాల్పడిన సంఘటనలు చాలా అరుదు. ఇప్పుడు డింపుల్, శ్రీధర్‌లపై జరిగిన దాడి కూడా ఇలాంటిదేనా? అంటే కచ్చితంగా చెప్పలేం. శ్రీధర్‌కు, సెల్వరాజ్‌కు మధ్య చోటు చేసుకున్న సంఘటనలను పావుగా వాడుకొని.. ఇండస్ట్రీలో కలతలు సృష్టించడానికి ఎవరో ఒకరు ప్రయత్నించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే.. అది ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్. అసలు ఇలా కలతలు రేపాల్సిన అవసరం ఎవరికుందన్నదీ తేలాల్సి ఉంది.
గాడి తప్పుతోందా..?
తెలుగు టీవీ ఇండస్ట్రీ గాడి తప్పుతోందా? నటీనటులకు అన్యాయం జరుగుతోందా? దర్శక నిర్మాతలు చేసే పనికి ఆర్టిస్టులు బలవుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి డింపుల్,శ్రీధర్‌లపై వరస దాడులు. తెలుగు టీవీ సీరియళ్లలను ఆర్టిస్టులను మార్చడం కొత్తదేమీ కాదు. ఒకప్పుడు ఎంతో పద్దతిగా, క్రమశిక్షణతో ఉండే టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు గ్రూపురాజకీయాలు నడుస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్టిస్టుల మధ్య సత్సంబంధాలకు బదులు ఆధిపత్యపోరు నడుస్తోందన్న వాదనా ఉంది. అయితే.. జనరేషన్ ఛేంజ్‌తో కొద్దిపాటి మార్పులే తప్ప.. పెద్దగా సమస్యలు లేవని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఆర్టిస్టుల వైఖరి కూడా చాలా సమస్యలను సృష్టిస్తోంది. ఒకటీ రెండు సీరియళ్లు చేయగానే.. బిల్డప్ పెంచేస్తున్న ఆర్టిస్టులతో దర్శకనిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవకాశాలు వచ్చేవరకూ ఎంతో ఒద్దికగా కనిపించే నటులు.. ఆ తర్వాత మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత ప్రవర్తనా చికాకులను తెప్పిస్తోంది. సీరియల్స్‌లో ఆర్టిస్టులను మార్చడం వెనుకే వ్యక్తిగత ప్రవర్తనే అసలు కారణం.
అయితే.. కొన్నిరకాల ఒత్తిడుల కారణంగానూ ఆర్టిస్టులను తొలగిస్తున్నారు. మంచి క్యారెక్టర్ కోసం రాజకీయాలు చేస్తున్న కొంతమంది నటుల కారణంగా.. అప్పటివరకూ ఆ పాత్రలో జీవిస్తున్న వారికి ఒక్కసారిగా మరణశిక్ష పడుతోంది. ఇలాంటి పద్దతి అరికట్టాలంటే.. ఇండస్ట్రీ స్వరూపంలోనూ మార్పురావాలి. టీవీ ఆర్టిస్టుల సంఘాలు ఇలా అన్యాయాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఏదైనా సమస్య వస్తే. .సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప.. వ్యక్తిగత దాడులకు తెగబడితే మాత్రం. అందరి పరువూ రోడ్డున పడుతుంది. అంతేకాదు ప్రేక్షకుల దృష్టిలోనూ చులకన అవుతారు.
11, జూన్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి