5, జూన్ 2010, శనివారం
వద్దు సరోజా వద్దు..
Categories :
అరుంధతిగా ఆరాధించిన వారే.. ఇప్పుడు అనుష్కను చీదరించుకుంటున్నారు.. వద్దు సరోదా వద్దంటున్నారు.. అనుష్క పేరు మార్చుకుంటే మంచిదంటున్నారు.. ఇంతకీ ఎవరు వారు... ఎచటి వారు.. ఎందుకంటున్నారు...?
అరుంధతిలో తన నటనతో శభాష్ అనిపించుకొన్న అందాల తార అనుష్క ఇప్పుడు మరో గెటప్ ఎత్తింది. వేదం సినిమాలో అమలాపురం సరోజగా మారింది. రాజసాన్ని పక్కనపెట్టి.. రాసలీలలు సాగించే పాత్రలో ఒదికిపోయింది. వేదంలో అనుష్కది ఓ వేశ్య పాత్ర. సరోజ వరకూ ఏ ఇబ్బంది లేదు కానీ.. దానికి ముందు అమలాపురం అతికించడమే ఇబ్బందులు సృష్టిస్తోంది. ముఖ్యంగా.. అమలాపురం వాసులైతే.. వేదం సినిమా దర్శకనిర్మాతలపై కస్సుమంటున్నారు.
సరోజ క్యారెక్టర్‌తో.. తమ ప్రాంత పరువు పోయిందంటున్నారు అమలాపురం వాసులు. ముఖ్యంగా బయటిప్రాంతం వారు.. ఈ క్యారెక్టర్ చూసి.. అమలాపురంలో అంతా వేశ్యలే ఉంటారేమో అని అనుకుంటారన్నది స్థానికుల భయం. పైగా.. అసలు రెడ్‌లైట్ ఏరియాగా ముద్రపడని తమ ప్రాంతంపై ఇలా చెడు ప్రచారం చేయడమూ సరికాదంటున్నారు. పైగా.. వేదం లాంటి మంచి పేరు పెట్టుకున్న సినిమాలో.. అమలాపురాన్ని కించపరిచేలా వేశ్య పాత్రను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురం అనగానే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ. గోదావరి పరవళ్లు.. కొబ్బరిచెట్ల అందాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రా కేరళ.. కోనసీమ. టూరిజం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. పచ్చని పైర్లతో ప్రకృతి అందాలతో పరవశాన్ని కలిగించే ప్రాంతానికి.. అమలాపురం సరోజ క్యారెక్టర్ బ్యాడ్ ఇమేజ్ తెస్తుందని సామాజికవేత్తలూ వాపోతున్నారు. అసలు సరోజ క్యారెక్టర్‌కు అమలాపురం అని తగిలించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద క్రిష్ సృష్టించిన ఓ వేశ్య పాత్ర.. అమలాపురం ఇమేజ్ను చెడగొట్టేలా ఉందన్నది స్థానికుల ఆగ్రహం.
అమలాపురం అంటే అలుసా?
అల్లు అర్జున్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చి పెట్టిన ఆర్యలోని ఐటెం సాంగ్‌లో అమలాపురం ప్రస్తావన వస్తుంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక్క ఊపు ఊపింది ఈ సాంగ్. ఈ పాటతో అమలాపురం పేరు ప్రతీ ఒక్కరినోట్లోనూ నానింది. తమ ఊరికి స్పెషల్ క్రేజ్ వచ్చిందని అమలాపురం వాసులూ సంతోషపడ్డారు. అయితే.. ఈ సంబరం ఎంతో కాలం ఆగలేదు.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అమలాపురాన్ని ఎలా చూపించకూడదో అలాగే చూపించారు.
సినిమాల్లో రోజురోజుకూ దిగజారిపోతోంది అమలాపురం పరువు. పైగా.. అమలాపురం అంటే అందమైన అమ్మాయిలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా తెలుగు సినిమాల్లో చూపించడమూ.. వివాదాస్పదమవుతోంది. ఇది క్రమంగా శృతిమించి.. ఇప్పుడు వేదం సినిమాలో వేశ్య పేరుకు ముందు అమలాపురం తగిలించేదాకా వెళ్లిపోయింది.
ఓ ప్రాంతాన్ని మంచిగా చూపించకపోయినా పర్వేలేదు కానీ.. పేరు చెడొగొట్టేలా మాత్రం ఉండకూడదు. పైగా ఊరుకునే కొద్దీ.. అమలాపురం ఇమేజ్ను తెలుగుసినిమాలు మరింతగా దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే.. తమ పేరును చెడుగా వాడితే ఊరుకోమంటున్నారు. అవసరమైతే న్యాయపోరాటమూ చేస్తామంటున్నారు. అసలు సరోజకు అమలాపురం పేరు పెట్టాలనుకోలేదు. కాకినాడ సరోజ అని పెట్టాలనుకున్నాడట వేదం డైరెక్టర్ క్రిష్. అమలాపురం అయితే.. మరింత క్యాచీగా ఉంటుందనుకుని దానికి ఫిక్స్ అయిపోయాడు. ఎవరినీ కించపరచాలని ఈ పేరు పెట్టలేదంటున్నాడు.
పెద్దాపురం కష్టాలే..
రాష్ట్రంలో అందరికీ ఏ ప్రాంతమైనా తెలియకపోవచ్చు గానీ.. పెద్దాపురం అంటే మాత్రం టక్కున అర్థమైపోతుంది. సినిమా ఏదైనా సెక్స్ వర్కర్లు.. వ్యాంపు క్యారెక్టర్లుంటే వారికి కేరాఫ్ అడ్రస్‌ను పెద్దాపురంగానే చూపిస్తారు. ఇక మరీ ముదురు సినిమాలు.. చాలా వరకూ పెద్దాపురం పేరుతోనే వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. బయటప్రపంచానికి పెద్దాపురం ఓ రెడ్‌లైట్ ఏరియాగానే పరిచయం. దీనికి కారణం సినిమాలే అంటారు స్థానికులు. చివరకు తమ ఊరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి కూడా జనం భయపడేస్థాయికి పెద్దాపురం ఇమేజ్ పడిపోయింది. ఎక్కడికి వెళ్లినా.. పక్కగ్రామాల పేర్లే చెప్పుకునేవారు పెద్దాపురం వాసులు.
పెద్దాపురానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రాజులు.. రాజ్యాలు.. వ్యాపారాలు.. ఇలా ప్రతీదానితోనూ పెద్దాపురానికి అవినాభావ సంబంధం ఉంది. మహాభారతకాలం నాటి ఆనవాళ్లూ ఇక్కడ ఉన్నాయి. కానీ.. ఇవేవీ ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా.. పెద్దాపురం అంటే రెడ్‌లైట్ ఏరియానే. గమ్యం తీసిన క్రిష్ కూడా.. కోస్తా విషయంలోనూ ఇదే సామాజిక సమస్యను ఎంచుకున్నాడు. సెక్స్ వర్కర్ల పరిస్థితిని కళ్లకు కట్టాడు. అందుకే కాబోలు.. వేదంలో అనుష్క క్యారెక్టర్‌కు అమలాపురాన్ని అలంకారం చేశాడు.
పెద్దాపురం పేరు ఇప్పుడు A గ్రేడ్ సినిమాలకు వెళ్లిపోయింది. పైగా.. ఎప్పుడూ ఒకే పేరు చెబితూ ఉంటే చూసేవారికీ బోర్ కొడుతుంది. ఇదే సమయంలో అమలాపురం పేరు సినీజనానికి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ.. పెద్దాపురం నుంచి అమలాపురానికి మళ్లింది. చెప్పాలంటే.. సినిమాల్లో పెద్దాపురం ప్లేస్‌ను అమలాపురం భర్తీ చేస్తోంది. పెద్దాపురం కష్టాలు ఇప్పుడు అమలాపురానికి వస్తున్నాయన్నమాట. ఇదే అమలాపురం వాసులకు గుబులు పుట్టిస్తోంది. ఇంతవరకూ మాది అమలాపురం అని చెప్పుకున్నవాళ్లు.. ఇక సిగ్గుపడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.
సినిమా సినిమాకో వివాదం
ఈ మధ్య కాలంలో అతిపెద్ద వివాదం అదుర్స్ సినిమాను వెన్నాడింది. ఈ సినిమాలోని పాటలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ వివాదం చెలరేగింది. సినిమాపై ఎఫెక్ట్ పడేలా కనిపించడంతో.. చివరకు పాటను మార్చాల్సి వచ్చింది.
ఇక అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 సినిమా కూడా ఇదే రకంగా వివాదాల్లో చిక్కుకుంది. రింగ రింగ అంటూ యూత్‌ను షేక్ చేసినా.. పాటలో దొర్లిన అసభ్య పదాలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో.. పాటను మార్చారు.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మంచిహిట్ కొట్టిన రెఢీ సినిమా కూడా వివాదాల బారిన పడింది. ముఖ్యంగా కూడిపూడి డ్యాన్స్‌ను అసభ్యంగా చిత్రీకరించడంపై.. కళాకారులు భగ్గుమన్నారు.
మహాత్స సినిమాలో గాంధీ గొప్పదనాన్ని వర్ణిస్తూ రాసిన పాట కూడా.. రాజకీయ సుడిగుండంలో చిక్కుకొంది. ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ అనడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పాటను కొద్దిగా మార్చాల్సి వచ్చింది.
నటీనటులు.. షూటింగ్ లొకేషన్లు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకునే డైరెక్టర్లు.. ఇలా కొన్ని విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అవికాస్తా పెద్ద సమస్యగా మారుతున్నాయి. కొంతమంది చేసిన తప్పులను సరిదిద్దుకుంటుంటే.. చాలామంది మాత్రం అలాగే వదిలేస్తున్నారు. కానీ.. ఓ ప్రాంతాన్నో.. ఓ సామాజికవర్గానో.. విమర్శించడం మాత్రం సరికాదని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు తెలుసుకోవాలి. ఎవరినీ నొప్పించకుండా సినిమా తీసినప్పుడే.. మంచి పేరు దక్కుతుందని అర్థం చేసుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బ్రిటిష్ వాళ్ళ టైమ్ లో పెద్దాపురం జమీందార్ల రాజధాని కావడం వల్ల భోగం కులంవాళ్ళు పెద్దాపురం వచ్చి సెటిల్ అయ్యారు. భోగంవాళ్ళు రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఉన్నారు. ఒక్క పెద్దాపురాన్నే వాళ్ళకి నిలయంగా సినిమాలలో చూపించడం ఎందుకు?
మీరు పడుపు వృత్తిని భోగం కులానికే అంట గట్టడం ఎందుకు ?
baasu,mari nuvv antha baadhapadi poku, ikkada maa amalapuram lo evaru anta badapadipovatam ledu. just okka cinemalo peru vunnata matrana aa prrantamanta ala vundaani evaru ee rojullo anta feel avvaru kaani, nuvvu mari TV valla kanna ekkuva chestunnav.Lite teesuko :-)
చాలా సినిమాలలో అమలాపురం, అనకాపల్లివాళ్ళని పల్లెటూరివాళ్ళుగా చూపించారు. అమలాపురం జనాభా 50,000 అనకాపల్లి జనాభా 80,000. ఈ రెండూ మునిసిపల్ పట్టణాలే. ఇలా ఊర్ల పేర్లుతో కించపరచడం బాగాలేదనే ఈ బ్లాగ్ రచయిత అభిప్రాయం కాబోలు. ఈ బ్లాగ్ రచయిత గారి ఊరి నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం. సినిమావాళ్ళకి పట్టణాలు పల్లెటూర్లలా కనిపిస్తే మండల కేంద్రాలు అడవుల్లా కనిపిస్తాయా?