4, జూన్ 2010, శుక్రవారం
బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ అమ్మకాలతో ఒడ్డున పడ్డామనుకున్న వ్యాపారులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణమిది. పసిడి పండుగ తర్వాత.. పరిస్థితి మారవచ్చని అంతా అంచనా వేశారు. బంగారం ధర కాస్త తగ్గితే.. వ్యాపారం మరింత జోరందుకుంటుందనీ ఊహించారు. దీనికి తోడు.. పెళ్లిళ్ల సీజన్ మొదలువుతుంది కాబట్టి అమ్మకాలు పెరగవచ్చని భావించారు. ఇదే సమయానికి బంగారం ధర మరింత పెరిగింది. ఇప్పుడు తులం బంగారం ధర 20 వేలకు చేరువ అవుతోంది. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు పెద్ద ఎత్తున గోల్డ్ కొందామనుకున్నవారు కాస్తా.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో.. అమ్మకాలు పడిపోతున్నాయి. మ్యారేజ్ సీజన్‌లో కస్టమర్లతో కళకళలాడాల్సిన జ్యూయలరీ షాపులు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సిన వారు మాత్రమే ఇప్పుడు నగల దుకాణాల మెట్లు ఎక్కుతున్నారు.
ధర ఇంకా పెరగవచ్చన్న అంచనాలు కస్టమర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుత ధరలకే కొనలేని పరిస్థితులున్నాయంటున్న జనం.. ఇంకా పెరిగితే.. బంగారాన్ని మర్చిపోవాల్సిందేనంటున్నారు. నగలు కొనుగోలు చేయడానికి ఇంతకాలం వెయిట్ చేసిన వారికి మాత్రం.. ఈ ధరలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొనలేక.. మరికొంత కాలం ఆగలేక తిప్పలు పడుతున్నారు. ధరలు తగ్గితే తప్ప.. బంగారం కొనలేమంటున్నారు.
ఐదేళ్ల క్రితంతో పోల్చితే దాదాపు 200 శాతం దాకా బంగారం ధరలు పెరిగాయి. ఇది ఊహించని పరిణామం. ఎప్పటికప్పుడు బంగారం కొనడాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్న వారికి మాత్రం తాజా గోల్డ్ రేట్స్.. చుక్కలు చూపిస్తున్నాయి.
ధర ఎందుకు పెరుగుతోంది..?
వరల్డ్ వైడ్‌గా జరిగే గోల్డ్ బిజినెస్ ఒకెత్తైతే.. మన దేశంలో జరిగే వ్యాపారం మరో ఎత్తు. ప్రపంచ వినియోగంలో దాదాపు 30 శాతం ఇండియాలోనే జరుగుతోంది. పైగా.. మన దేశంలో విభిన్న మతాలు.. సంస్కృతులు.. సంప్రదాయాలు కాబట్టి.. దేశంలో ఏదో ఓ అవసరం పేరుతో బంగారాన్ని కొంటూనే ఉంటారు. ఇక మన మగువల సంగతి సరేసరి. మిడిల్ క్లాస్ నుంచి హైక్లాస్ దాకా స్వర్ణాభరణం ఒక్కటన్నా లేనివారు ఒక్కరూ ఉండరు. పెళ్లిళ్లకూ.. ఫంక్షన్లకంటూ ఏదో ఓ పేరుతో ఎప్పటికప్పుడు తమ సింగారానికి బంగారంతో మెరుగులు పెట్టుకుంటూనే ఉంటారు. అందుకే.. పసిడికి ఇంత డిమాండ్.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారం ఎక్కువగా అమ్ముడైంది మనదేశంలోనే. నిరుడితో పోల్చితే.. పసిడి అమ్మకాల్లో 698 శాతం వృద్ధి నమోదయ్యింది. అంటే.. దాదాపు 193.5 టన్నుల బంగారాన్ని జనవరి నుంచి మార్చి మధ్యలోనే మనవాళ్లు కొనేశారు. ఇంతగా బంగారంపై మోజు చూపిస్తున్నారు కాబట్టే.. ఆకాశాన్నంటుకొంటోంది.
దేశీయంగాఉన్న డిమాండ్ పుత్తడి ధరల పెరుగుదలకు ఓ కారణమైతే.. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులు మరో కారణం. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో.. యూరప్ స్టాక్ మార్కెట్లు వరసగా పతనం చెందుతున్నాయి. ఆ ప్రభావం మన స్టాక్‌మార్కెట్లపైనా పడింది. భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. షేర్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా.. ఇప్పుడు బంగారంవైపు దృష్టి మళ్లించారు. షేర్ ట్రేడింగ్‌కు బదులు గోల్డ్ ట్రేడింగ్ చేస్తుండడంతో .. డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డిమాండ్ సప్లై సూత్రాన్ని ఫాలో అయ్యే ధరలు.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రూపాయి ధర కూడా పతనమవుతోంది. మంగళవారం నాడు.. 18 నెలల కనిష్టస్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ఇది కూడా పుత్తడి విలువ పెరగడానికి కారణం.
పసిడి ధర దిగుతుందా?
బంగారం ధరలు కాస్త దిగివచ్చినా కొనుక్కోవాలన్న ఆలోచనలో ఎంతోమంది ఉన్నారు. పసిడి ధరలు నిలకడగా లేకపోవడంతో.. కొనాలా వద్దా అన్న నిర్ణయాన్ని చాలామంది తీసుకోలేకపోతున్నారు. ఇలా ఊగిసలాడుతుండగానే.. రెక్కలు విప్పుకొని అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది బంగారం.
ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధర మరో రెండు వారాల్లోగా 20 వేల చేరువలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. మన మార్కెట్‌లో పదిగ్రాముల బంగారం ధర 19800 వద్ద ఆగిపోవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. స్టాక్‌మార్కెట్లు, గోల్డ్ రేట్స్ అనూహ్యంగా పెరిగినప్పుడు ఎంతో కొంత కరెక్షన్ రావడం సహజం. ఈసారి కూడా బంగారం ధర విషయంలో ఇలానే కరెక్షన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా.. 17 నుంచి 18 వేల మధ్యకు త్వరలోనే దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు బంగారం కొనాలనుకునే వారు కొంతకాలం ఎదురుచూస్తేనే మంచిది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ అయిపోతే.. బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. పైగా వచ్చేది ఆషాఢం కాబట్టి ఆభరణాలు కొనడానికి ఎవరూ మొగ్గు చూపరు. బిజినెస్ పెంచుకోవడం కోసం కస్టమర్లకు రకరకాల ఆఫర్లను జ్యూయలరీషాపులు ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇంటర్నేషనల్ మార్కెట్ కాస్త కుదుట పడితే.. గోల్డ్ ట్రేడింగ్ నుంచి స్టాక్‌మార్కెట్లవైపు ఇన్వెస్టర్లు దృష్టి మళ్లిస్తారు. డిమాండ్ తగ్గుతుంది కాబట్టి, ధరలూ తగ్గుతాయి. అత్యవసరం అయితే తప్ప.. ఇప్పుడు బంగారం కొనకపోవడమే శ్రేయస్కరం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి