4, జూన్ 2010, శుక్రవారం
ప్రమోషన్ ఫీట్లు
Categories :
టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. షూటింగ్ అయిపోయిన తర్వాత.. ఏసీ గదులు దాటి బయటకు రాని స్టార్లు.. మండుటెండల్లో ఫీట్లు చేయాల్సి వస్తోంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన వేదం సినిమా... ప్రమోషన్‌లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకొంటోంది. ముఖ్యంగా.. డైరెక్టర్ క్రిష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు సినిమా ప్రమోషన్‌లో తమ మార్క్ చూపించారు..
వేదం.. టాలీవుడ్‌లో లేటెస్ట్ మూవీ. గమ్యం సినిమాతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ క్రిష్ తీసిన రెండో సినిమా. చాలా డిఫరెంట్ స్టోరీని ప్లాన్ చేసుకున్న క్రిష్.. ఆర్టిస్టులను కూడా అంతే సెలెక్టెడ్‌గా తీసుకున్నాడు. వెరైటీ సినిమాలతో దూసుకెళుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న మనోజ్‌ను.. హీరోయిన్లలో టాప్ రేంజ్‌కు వెళ్లిపోయిన అనుష్కను మెయిన్ రోల్స్‌కు ఎంచుకున్నాడు. అంతేకాదు.. అనుష్కకు ఓ వేశ్య పాత్రను ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విడుదలకు ముందే.. ఇంత ఆసక్తిని క్రియేట్ చేసుకున్న వేదంపై.. క్రిష్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.
మా సినిమా కాస్త డిఫరెంట్ అంటున్న వేదం టీం.. సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఇప్పుడు బిజీగా ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతవరకూ చేయని ప్రయోగాలన్నింటినీ ఈ సినిమా కోసం చేస్తోంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ యాక్టివ్ పార్టిసిపేషన్‌తో.. సరికొత్తగా పబ్లిక్‌లోకి వెళ్లి వేదం ప్రమోషన్. సినిమాలో కేబుల్ రాజుగా నటించిన అల్లు అర్జున్ ప్రమోషన్ కోసం అదే రోల్‌ని రియల్‌లైఫ్‌లో ఎత్తాడు. వైర్ భుజాన తగిలించికొని.. కేబుల్ రిపేర్లు చేస్తామంటూ.. రోడ్డెక్కాడు.. కేబుల్ రావడం లేదని కంప్లైట్ వచ్చిందో లేదో.. అలా ఎలక్ట్రిక్ పోల్ ఎక్కేసి రిపేర్ చేసేశాడు. అక్కడితోనే అయిపోలేదు టీవీ సరిగ్గా వస్తుందా లేదా అన్నది చెక్ చేసి మరీ కెబుల్ సెట్ చేశాడు. సినిమాతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ను ఇలా ఉపయోగించాడు బన్నీ. వేదం సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగిన ఫిలింనగర్‌లోని బస్తీలోనే ఈ వెరైటీ ప్రమోషన్ మొదలయ్యింది. అల్లు అర్జున్‌ను చూడడానికి... జనం కూడా భారీగానే వచ్చారు.
ప్రమోషన్‌కు పెద్దపీట
వెరైటీగా సినిమాను ప్రమోట్ చేయడంలో సరికొత్త మార్గాన్ని చూపించింది వరుడు సినిమా. వధువు ఎవరన్నది చెప్పకుండా.. చివరి వరకూ సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో గుణశేఖర్.. అండ్ అల్లు అర్జున్ టీం సక్సెస్ అయ్యింది. వధువు ఎవరై ఉండొచ్చన్న టాక్..సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అయితే.. వధువు పాత్రలో నటించిన భానుశ్రీ మెహ్రా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. ప్రమోషన్ ప్లాప్ అయ్యిందనే చెప్పొచ్చు..
సినిమాకు క్రేజ్ పెంచడం కోసం.. వరుడు టీం మరో ప్రయత్నాన్ని చేసింది. పెళ్లిళ్లకు హాజరై.. అందరినీ ఆకట్టుకుంది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, డైరెక్టర్ గుణశేఖర్‌లు మెహదీపట్నంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై... వధూవరులను ఆశీర్వదించారు. సినిమా స్టోరీ పెళ్లి గురించే కాబట్టి.. పనిలో పనిగా తమ వరుడునూ ప్రమోట్ చేసుకున్నారు.
ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే.. జనం మధ్యకు వెళ్లాల్సిందేనన్న సత్యాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారు టాలీవుడ్ హీరోలు. అందుకే.. యావరేజ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు పెంచుకోవడానికి.. సక్సెస్‌టూర్‌లు నిర్వహిస్తున్నారు. థియేటర్లకు జనాన్ని రప్పించడం కోసం.. ఈ మధ్యే.. రామరామ కృష్ణ కృష్ణ యూనిట్.. హైదరాబాద్ థియేటర్లన్నింటినీ చుట్టేసింది.
ఇక సింహాతో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ కూడా ప్రమోషన్ కోసం వెరైటీగానే ప్రయత్నించారు. సినిమాపై ముందుగానే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న బాలయ్య... సెకండాఫ్ కథను.. మెయిన్‌రోల్స్ ఫొటోలను బయటకు రానివ్వలేదు. రిలీజ్ టైంకి టీవీ ప్రోమోల్లోనే బాలకృష్ణ కొత్త గెటప్ కనిపించింది. సినిమాకు కలెక్షన్లను రాబట్టడంలో ఈ సీక్రెట్ బాగానే పనిచేసింది. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత.. సినిమా బిజినెస్‌లో బాలకృష్ణ జోక్యం చేసుకోరన్నది ఇండస్ట్రీలో టాక్. కానీ.. సింహా తర్వాత ఆయన స్టైల్ మార్చారు. రాష్ట్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తూ.. సింహా సక్సెస్‌టూర్‌ను వెరైటీగా నిర్వహించారు. అభిమానుల్లోకి వెళ్లడం ద్వారా.. సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టారు.
మొత్తం మీద సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో.. కాస్త ఆలస్యంగా తెలుసుకున్న తెలుగు ఇండస్ట్రీ, ప్రమోషన్ వర్క్‌లో ఇప్పుడు బిజీగా మునిగిపోతోంది.
బాలీవుడ్ బాటలో..
బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్షేషన్.. రాజ్‌నీతి. అందాల హొయలతో.. ప్రేక్షకులకు కిక్ ఎక్కించే గ్లామర్ గర్ల్ కత్రీనా కైఫ్ ఈ సినిమాలో పొలిటికల్ లేడీగా కనిపిస్తోంది. కత్రీనా పోషించిన పాత్రకు సోనియాగాంధీని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారన్న టాక్.. ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచింది. దీనికి తోడు.. ప్రమోషన్‌ను కూడా కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు దర్శక నిర్మాత ప్రకాశ్ జా. సోనియా తనయుడు.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని ఇందుకు రోల్‌మోడల్‌గా ఎంచుకున్నాడు. రాజ్‌నీతిలో నటించిన రణబీర్ కపూర్‌కు రాహుల్ గాంధీ తరహాలో.. లాల్చీ పైజమా వేయించి ముంబై లోకల్ ట్రైన్స్ ఎక్కించాడు. ఎన్నికల సమయంలో ముంబైలో రాహుల్ తిరిగినట్లుగానే.. రణబీర్ కూడా లోకల్ ట్రైన్స్‌లో సందడి చేశాడు.
ఇక జెనీలియా, షాహిద్ కపూర్ జంటగా నటించిన ఛాన్స్ పే డ్యాన్స్ సినిమాకూ ప్రమోషన్ వర్క్ వెరైటీగానే సాగింది. సినిమా రిలీజ్‌కు ముందు.. ఓ రాత్రంతా మారుతి-800లో హీరోహీరోయిన్లిద్దరూ హాయిగా గడిపేశారు. అర్థరాత్రి వరకూ అందరితో సరదాగా మాట్లాడుతూ.. సినిమాను ప్రమోట్ చేసి.. ఆ తర్వాత మాత్రం కారులో నైటవుట్ చేశారు. రాత్రంతా కారులో గడిపినందుకు ఈ సినిమాకు భారీగానే ప్రచారం జరిగింది.
కండల వీరుడు సల్మాన్ నటించిన.. వీర్ సినిమాకు పబ్లిసిటీ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాను ప్రమోట్ చేయడం కోసం... సల్మాన్ రకరకాల విన్యాసాలు చేశాడు. సినిమాలో నటించినట్లే రియల్‌గానూ హార్స్ రైడింగ్ చేశాడు. స్టార్ హీరో అయినప్పటికీ.. ఏమాత్రం మొహమాట పడకుండా FM రేడియో స్టేషన్‌లకు వెళ్లాడు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో టూర్ కూడా చేశాడు. ఇలా కష్టపడ్డందుకు.. అనుకున్న ఫలితమే సల్మాన్‌కు దక్కింది.
పాఠాలు నేర్పిన అమీర్
బాలీవుడ్ మొదలుపెట్టింది.. టాలీవుడ్ ఫాలో అవుతోంది. అయితే.. ఇలా బాలీవుడ్‌కు.. టాలీవుడ్‌కు పాఠాలు నేర్పిన వ్యక్తి ఒకరున్నారు. హిందీ సినిమాల ట్రెండ్‌నే మార్చేసి.. వరసగా మెగా హిట్‌లతో దూసుకెళుతున్న ఆ హీరోనే.. అమీర్‌ఖాన్. కళాత్మక విలువలున్న సినిమాను కమర్షియల్‌గా ఎల్ హిట్ చేసుకోవచ్చో చూపించాడు అమీర్‌ఖాన్. ఆయన చూపిన బాటనే.. ఇప్పుడందరూ ఫాలో అవుతోంది.
గజిని ... బాలీవుడ్ వరకూ చూస్తే.. ఓ రీమేక్ సినిమా. మామూలుగా అయితే.. సినిమా షూటింగ్ అయిపోయాక, ఓ ప్రెస్‌మీట్ పెట్టి, ఓ టీవీ షోలో కనిపిస్తే.. పబ్లిసిటీ అయిపోతుంది. అంతవరకే ఆలోచిస్తే.. అతన్ అమీర్‌ఖాన్ కానట్లే. సినిమా సీక్రెట్లను తన గుప్పిట్లో ఒడిసిపట్టిన ఈ క్రేజీ హీరో.. దానికి మించి ఆలోచించాడు. ఓ దక్షిణాది సినిమాకు రీమేక్‌గా మాత్రమే ప్రేక్షకులు భావించకుండా ఉంచడానికి సరికొత్త ట్రిక్ ప్లే చేశాడు. గజిని కోసం తన బాడీషేప్‌ను ఎలా మార్చుకున్నాడో.. వీడియోలు రిలీజ్ చేశాడు.. వీటికి ఊహించని ఆదరణే లభించింది. సినిమాపై క్రేజ్ పెరిగింది. అక్కడితోనే ఆగలేదు. సినిమా తీయడం ఎంత కష్టమో.. నిర్మాత ఎంత ఖర్చుపెట్టాలో తెలుసుకాబట్టి.. సినిమా ప్రమోషన్‌ను తన భుజాలపై వేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పర్యటించాడు. పిల్లలకు గజిని స్టైల్లో కటింగ్ చేయించాడు. ఎంతోమందిని గజినీల్లా తయారు చేసి.. మీడియా ముందుకు వచ్చాడు. థియేటర్ల దగ్గర గజిని బొమ్మలు పెట్టించాడు. ప్రేక్షకులతో కలిసిపోయాడు.. ఒక్కటేమిటి.. ఇలా చెప్పుకుంటూ వెళితే.. ప్రమోషన్ కోసం అమీర్‌ఖాన్ చేయని పనిలేదు. రోటీన్‌కు భిన్నంగా అమీర్ చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. గజినీ మూవీ మెగా హిట్ అయ్యింది.
ఇక త్రీ ఇడియట్స్. సినిమాలో నటించిన ముగ్గురి హీరోల్లో ఒకడైనా.. ప్రచార భారాన్నంతా మోసింది అమీర్‌ఖానే. గజినీతో పోల్చితే.. మరికాస్త డిఫరెంట్‌గా ఈసారి జనంలోకి ఎంటరయ్యాడు. హంగూ ఆర్భాటాలు లేకుండా సామాన్యుల ముందు సడన్‌గా ప్రత్యక్ష మయ్యాడు. యమహాపురి కోల్‌కతాలోకి ఇలానే వచ్చిన అమీర్‌ను ముందు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. వీధుల్లో నడుస్తూ.. సరదాగా గడిపాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికీ వెళ్లాడు.
ఆ తర్వాత మారువేషంలో వారణాసికి వెళ్లాడు. అక్కడ మాయమై ఓ పంజాబీ పెళ్లిలో ప్రత్యక్షమయ్యాడు. ఓ క్లాస్‌మేట్ కోసం అతని స్నేహితులు వెతుకుతారన్న సినిమా కాన్సెప్ట్‌ను జనంలోకి ఇలా వెరైటీగా పంపించాడు.
అమీర్ ప్రమోషన్‌కు రిజల్ట్‌గా బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించింది త్రీ ఇడియట్స్. అటు యాక్టింగ్‌లోనూ.. ఇటు ప్రమోషన్‌లోనూ అదరగొడుతూ.. బాలీవుడ్ మార్కెటింగ్ గురు గా ఎదిగాడు అమీర్‌ఖాన్.
ఎన్ని సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు.. చేసిన సినిమా ఎంత హిట్ అయ్యిందీ.. ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందన్నదే ముఖ్యం. అందుకే.. లగాన్ తర్వాత.. పూర్తిగా రూటు మార్చేశాడు. సెలెక్టడ్ మూవీలే చేస్తూ... వాటినీ ప్రమోట్ చేసుకుంటూ.. అగ్రస్థానానికి ఎదిగాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో నిర్మాతలకు కావల్సిన ఏకైక హీరో అమీర్‌ఖాన్ మాత్రమే. ఇంత ఇమేజ్ రావడానికి కారణం.. అమీర్ అమలు చేస్తున్న మార్కెటింగ్ సూత్రాలే.
ప్రమోషన్ తప్పనిసరి
సినిమాలో కథ, కథనం ఎంత బాగున్నా.. ఆ సినిమా గురించి ప్రచారం జరగకపోయినా.. ప్రేక్షకుల్లో ఆసక్తి కలగించలేకపోయినా.. హిట్ అవడం చాలా కష్టం. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా దక్కదు అందుకే... సినిమా పబ్లిసిటీపై నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కొన్నాళ్ల క్రితం సినిమా పబ్లిసిటీ అంటే కేవలం సినీపత్రికల్లో ఇంటర్వ్యూలు.. కటౌట్లు.. పోస్టర్లు. ఈ మధ్య కాలంలో చూస్తే.. టీవీల్లో ప్రోమోలు.. హీరో హీరోయిన్లతో స్పెషల్ ఇంటర్వ్యూలు.. అయితే.. ఇవి మాత్రమే జనాన్ని ఆకర్షించలేకపోతున్నాయి. పైగా.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. మంచి మంచి విజయాలు వరసగా వస్తే తప్ప.. పరిశ్రమ మళ్లీ కుదుటపడడం కష్టం. అందుకే... పబ్లిసిటీ విషయంలో అమీర్‌ఖాన్ ఫాలో అవుతున్న చిట్కాలను టాలీవుడ్‌లో అమలు చేస్తున్నారు.
హైక్లాస్ ప్రచారానికి తప్ప మాస్‌లోకి వెళ్లి హీరోలు ప్రచారం చేసిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా విడుదలకు ముందైతే అలాంటివి అసలు లేవనే చెప్పాలి. కానీ.. వేదం ప్రమోషన్‌తో అల్లు అర్జున్ ఓ కొత్త మార్గాన్ని టాలీవుడ్‌కు చూపించాడనే చెప్పొచ్చు. ఈ తరహా ప్రచారం వల్ల సినిమాకు ఎక్కువగా పబ్లిసిటీ వచ్చి.. ఓపెనింగ్స్ పెరిగే అవకాశాలున్నాయి. టాప్ హీరోలు కూడా ప్రచారానికి వస్తే.. వారి సినిమాలు మరో పదికోట్లు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. వ్యక్తిగతంగానూ ఆ హీరోల ఇమేజ్ పెరుగుతుంది.
సినిమా తీయాలంటే.. కొన్ని కోట్లు కావాలి. పెట్టిన పెట్టుబడికి లాభం ఎంతో కొంత వచ్చినప్పుడు ఆ నిర్మాత మరో సినిమాను ధైర్యంగా తీయగలుగుతాడు. దానికి సినిమాలో నటించిన హీరోలు హీరోయిన్లు సహకరించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమీర్‌ఖాన్‌లాంటి నమ్మకమైన హీరో తెలుగు నిర్మాతలకు కావాలి. ఆ ప్లేస్‌లో నేనున్నానంటూ ఇప్పటికే అల్లు అర్జున్ రోడ్డుపైకి వచ్చేశాడు. మరి మిగిలిన హీరోలు ఇంకా ఏసీ రూమూల్లోనే ఉంటారా.. లేక .. ప్రచారం కోసం జనం మధ్యకు వస్తారా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి