1, జూన్ 2010, మంగళవారం
విశ్వం నుంచి సందేశం
Categories :
అనంత విశ్వం నుంచి మనపై ఎవరో కన్నేశారన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. మనిషి ప్రతీ కదలికనూ.. నిశితంగా గమనిస్తున్న ఆ విశ్వాంతర శక్తి.. ఇప్పుడు మనకు ఆటంకాలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తోంది. దీనికి రుజువు.. నాసా అంతరిక్షంలోకి పంపించిన ఓ స్పేస్‌క్రాఫ్ట్ కోడ్ సడన్‌గా మారిపోవడమే...
స్పేస్‌లో తనకు ఎదురు లేదనుకుంటున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు.. ఓ చిక్కు సమస్య ఎదురయ్యింది. ఎన్నో ఆశలతో అంతరిక్షంలోకి పంపించిన ఓ స్పేస్‌క్రాఫ్ట్ సడన్‌గా రూటు మార్చింది. ఎప్పటికప్పుడు రెడియో సిగ్నల్స్ ద్వారా సమాచారం అందించే వోయేజర్ 2 అనే అంతరిక్ష నౌక ఎవరికీ అర్థం కాని సిగ్నల్స్‌ను కొంతకాలంగా పంపడం మొదలుపెట్టింది. దాదాపు నెల రోజుల పాటు.. ఈ వింత సిగ్నల్స్ నాసాను కలవరపెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల్లోనూ ఏదో తెలియని భయం ఆవహించింది. అందరిలోనూ ఒకే అనుమానం.. స్పేస్‌క్రాప్ట్‌ను ఎవరైనా హైజాక్ చేశారేమోనని.. భూమికి సుదూరప్రాంతంలో ఉన్న ఈ వోయేజర్ 2ను హైజాక్ చేయడం మనుషుల వల్ల కాని పని. ఇక ఈ పని చేయగలగింది ఒక్కరే.. గ్రహాంతరవాసులు. అంటే ఈ వోయేజర్‌ను ఎలియన్స్ అపహరించాయా...
అంతరిక్షంలో ప్రస్తుతం 14 వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది వోయేజర్ టు. అంటే దాదాపు మన సౌరమండలం అంచుల్లో అన్నమాట. ఇంకొన్నాళ్లైతే.. పూర్తిగా దాటేస్తుంది. సరిగ్గా ఈ సమయంలోనే వోయేజర్ నుంచి భూమికి చేరే సిగ్నల్స్‌లో మార్పు వచ్చింది. విశ్వంలో సుదూర ప్రాంతాలకు పంపించిన ఈ అంతరిక్ష నౌకలో.. ముందు జాగ్రత్తగా సైంటిస్టులు 12 అంగుళాల డిస్క్‌ను అమర్చారు. ఇందులో 55 భాషల్లో రాసిన సందేశాలను నిక్షిప్తం చేశారు. మార్గమధ్యలో ఎక్కడైనా గ్రహాంతరవాసులు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను గుర్తిస్తే.. భూమిపైకి సందేశాన్ని పంపించడం కోసమే ఈ ఏర్పాటంతా. అయితే.. వీటిలో ఉన్న భాషలు కాకుండా.. గుర్తుతెలియని సంకేతాలు నాసాకు అందాయి. దీన్ని నాసా సైంటిస్టులు డీకోడ్ చేయలేకపోయారు. అందుకే.. ఏలియన్స్ హైజాక్ చేసి ఉండొచ్చన్న అనుమానాలు పెరిగిపోయాయి. దీనికి తోడు.. ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కూడా స్పేస్‌క్రాప్ట్ కోడ్‌ను ఏలియన్స్ రీప్రోగ్రామింగ్ చేసి ఉండొచ్చంటూ డౌట్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేశారు. దీంతో.. వోయేజర్ హైజాక్ అయ్యిందంటూ విపరీతంగా ప్రచారం సాగింది..
అయితే.. దాదాపు నెలరోజుల పాటు.. వోయేజర్ టు పంపిన సందేశాలపై పరిశోధనలు జరిపిన నాసా సైంటిస్టులు.. హైజాక్ వార్తలను కొట్టి పడేశారు. వోయేజర్ టులో సాంకేతిక లోపాల వల్లే ఈ వింత సిగ్నల్స్ అందాయంటున్నారు. ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించామని.. ఇకపై మామూలు సిగ్నల్స్‌నే వోయేజర్ పంపిస్తోందని చెబుతున్నారు. అయినా.. శాస్త్రవేత్తల్లో, ఖగోళ పరిశోధకుల్లో మాత్రం ఎక్కడో అపనమ్మకం. ఇంతకాలం చక్కగా పనిచేసిన స్పేస్‌క్రాఫ్ట్ సడన్‌గా సిగ్నల్స్‌ను మార్చుకొందంటే.. ఏదో జరిగే ఉంటుందన్న అనుమానం.
అసలీ వోయేజర్ ఏం చేస్తుంది?
గ్రహాంతరవాసులు హైజాక్ చేసి ఉండొచ్చని భావిస్తున్న వోయేజర్ స్పేస్‌క్రాఫ్ట్.. సౌరమండలపు అంచుల్లోకి ఎందుకు వెళ్లింది.. అంత సుదూర ప్రయాణం ఎందుకు చేసింది.. అసలు ఈ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా నాసా సాధించాలనుకొంటోంది ఏమిటి? ఈ ప్రశ్నలే మీరూ వేయాలనుకొంటున్నారా.. దీనికి సమాధానం కావాలంటే.. మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది..
సోవియట్ యూనియన్.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ప్రచ్చన్నయుద్ధం సాగుతున్న రోజులవి. భూమిపైనే కాకుండా అంతరిక్షంలోనూ ఆధిపత్యం కోసం రెండు దేశాలూ పోటీపడ్డాయి. అంతరిక్షంలోకి తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా పంపిస్తే.. ముందుగా మనిషిని చంద్రుడిపైకి చేర్చింది అమెరికా.
ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో అప్పుడప్పుడే అమెరికా ఆధిపత్యం మొదలయ్యింది. సోవియెట్ యూనియన్‌కన్నా ముందుగానే విశ్వ రహస్యాలను ఒడిసిపట్టాలన్న తపనతో ఓ మహా ప్రయోగానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధమయ్యింది. అందులో భాగంగానే.. రెండు జంట స్పేస్‌క్రాఫ్ట్‌లను సిద్ధం చేసింది. అవే.. వోయేజర్ వన్.. వోయేజర్ టు. భూమికి ఆవల.. సౌరమండలంలోని గ్రహాలపై పరిశోధనల కోసం వీటిని రూపొందించింది. వోయేజర్ వన్ కన్నా ముందుగా వోయేజర్ టూ అంతరిక్షంలోకి వెళ్లింది. ఆగస్టు 20, 1977న ఈ ప్రయోగం జరిగింది. మరో రెండు వారాల తర్వాత అంటే సెప్టెంబర్ 5న వోయేజర్ వన్ కూడా నింగిలోకి దూసుకెళ్లింది..
వోయేజర్ అంటే సుదూర ప్రయాణమని అర్థం. విశ్వాంతరాలను దాటుకొని వెళ్లే నౌకలు కాబట్టే వీటికి ఆ పేరు పెట్టింది అమెరికా. దాదాపు 32 ఏళ్లు దాటినా ఇవి ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. అంతరిక్షంలోని రహస్యాల ముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్నాయి. వాస్తవానికి మన భూమికి ఎగువన ఉండే జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల శోధన కోసమే వీటిని పంపించారు. ఐదేళ్ల కాలం పాటు పనిచేసేలా వీటి నిర్మాణం జరిగినా.. తొలి ఫలితాలు ఆసక్తికరంగా ఉండడంతో ఆ గడువును పన్నెండేళ్లకు పెంచారు. కానీ.. ఆ వ్యవధినీ దాటుకుని 33 ఏళ్లను పూర్తిచేసుకునే దిశగా వోయేజర్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. జూపిటర్‌కు చెందిన మూడో ఉపగ్రహాన్ని, యురేనస్‌కు చెందిన పది ఉపగ్రహాలను వోయేజర్ 2 కనిపెట్టి తనపై నాసా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది వోయేజర్ టు. ఈ గ్రహాలన్నింటినీ దాటుకొని ఇప్పుడు డీప్‌స్పేస్‌లోకి ప్రయాణిస్తోంది. ప్రస్తుతం సౌరమండల అంచుల్లో ఉన్న హీలియోహీత్ ప్రాంతంలో ఉంది. గ్రహాల శోధన పూర్తి కావడంతో.. సౌరమండలం ఆవల ఏముందో వీటిద్వారా కనిపెట్టాలన్నది నాసా ఆలోచన. అందుకే ఆ దిశగా పంపిస్తోంది.
వోయేజర్ టు కు విశ్వంలో నిర్దేశిత లక్ష్యం లేకపోయినప్పటికీ.. సూర్యుడికి చేరువలో ఉన్న సిరియస్ అనే నక్షత్రం వైపు గమనం సాగిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2025 వరకూ ఇది రేడియో సిగ్నల్స్‌ను భూమిపైకి పంపించగలదు. విశ్వంలో చీకటిమాటున ఉన్న రహస్యాలను వెలుగులోకి తెస్తుందనుకున్న తరుణంలోనే.. ఈ వోయేజర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు జూపిటర్, శని గ్రహాల శోధన సమయంలోనూ కొన్ని వింత శబ్దాలను భూమిపైకి చేరవేసింది వోయేజర్. వాటిని విశ్లేషించిన పరిశోధకులు.. అందులో గ్రహాంతర వాసుల మాటలూ ఉండొచ్చంటున్నారు. అందుకే.. ఇప్పటి సిగ్నల్స్ విషయంలోనూ కాస్త గందరగోళం కనిపిస్తోంది.
అయితే.. గ్రహాంతరవాసులు ఎక్కడోచోట స్పేస్‌క్రాఫ్ట్‌కు ఎదురు రావచ్చని నాసా ముందే ఊహించింది. అందుకే.. ప్రత్యేకమై సందేశాలను వోయేజర్ టు లో పొందుపరిచింది. కానీ భూమికి ఇప్పుడు చేరిన సిగ్నల్ మాత్రం మరోలా ఉంది. అంటే మన కోడ్.. ఏలియన్స్‌కు అర్థం కాలేదనుకోవచ్చా.. ఇప్పుడు అంతరిక్షం నుంచి వచ్చిన సిగ్నల్స్.. గ్రహాంతరవాసుల సందేశాలుగానే మనం భావించాలా.. తమ భాషలో భూమిపైకి సందేశాన్ని పంపించాయా.. అసలు ఆ సిగ్నల్స్‌లో ఏముంది.. మనతో దోస్తీకి.. ఏలియన్స్ సిద్ధంగా ఉన్నాయా.. లేక యుద్ధానికి సై అంటున్నాయా.. నాసా ఏమీ లేదని చెబుతున్నా.. ఇలాంటి అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. సూర్యమండలం అవతల ఏముందో వోయేజర్ తెలుసుకుంటుందో లేదో గానీ.. ఈ రాంగ్ సిగ్నల్స్ మాత్రం ఏలియన్స్ ఉనికి ఉందన్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి..
గ్రహాంతరవాసులా?
గ్రహాంతరవాసులు ఉన్నారా ? ప్రపంచవ్యాప్తంగా అతిఎక్కువ మంది వేసే ప్రశ్నఇది....
ఒకవేళ ఉంటే.. ఎక్కడ ఉన్నారు..?
ఎలా ఉన్నారు? మనుషుల రూపంలోనా.. జంతువుల రూపంలోనా...?
గ్రహాంతర వాసులు ఏం చేస్తారు..?
మనకైనా ఏలియన్స్ తెలివైనవా...?
మన భూమిపైకి ఎప్పుడైనా వచ్చాయా... లేక రాబోతున్నాయా.. .
భూమి మీద మాత్రమే కాకుండా.. ఈ విశ్వంలో ఎక్కడో చోట మనలాంటి జీవులున్నాయన్న నమ్మకం ఎంతోమందిది. ఇలా ఉన్నాయనుకుంటున్న గ్రహాంతరవాసుల విషయంలో మాత్రం రెండు భిన్నవాదనలు వినిపిస్తాయి. అందులో మొదటిది ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్ లైఫ్ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందన్న వాదన. మనతో స్నేహం కోసం పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు దాటి మనకోసం వస్తున్నారని చెబుతారు ఈ మొదటి కోవకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు.
ఇక రెండో పార్శ్వం అలజడి పుట్టించేది. గగనతలంలోనుంచి మనల్ని నిశితంగా గమనిస్తున్న విశ్వశక్తులు... ఒక్కసారిగా విరుచుకపడవచ్చన్న భయం కూడా ఎంతోమందిని వెంటాడుతోంది. మానవాళి వినాశనం కోసమే గ్రహాంతరవాసులు ఎదురు చూస్తున్నారన్న వాదనలూ మనకు వినిపిస్తాయి. మరి ఇందులో ఏ వాదన కరెక్ట్.. గ్రహాంతరవాసులు మంచివాళ్లా.. లేక మన ప్రాణాలు బలితీసుకునే వాళ్లా.. .
తాజాగా.. ఏలియన్స్‌పై సంచనల వ్యాఖ్యలు చేసి ప్రపంచవ్యాప్తంగా కలకలం పుట్టించారు ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిక్స్ సైంటిస్ట్.. స్టీఫెన్ హాకింగ్. ఈ అనంత విశ్వంలో భూమిపైనే మాత్రమే జీవరాశి ఉందనుకోవడం భ్రమే అవుంతుందన్నది ఆయన వాదన. యూనివర్స్‌లో సూర్యమండలాల లాంటివి ఎన్నో ఉన్నప్పుడు ఎక్కడో చోట జీవరాశి ఉండొచ్చని హాకింగ్ భావిస్తున్నారు. అంతేకాదు.. అనవసర ప్రయోగాలతో వాటిని రెచ్చగొడితే.. మన లోకాన్ని అంతం చేసుకున్నట్లేనని హెచ్చరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హాకింగ్ దృష్టిలో గ్రహాంతర వాసులు మనకన్నా ఎంతో శక్తిమంతులు.
అయితే.. హాకింగ్ మాటలను పట్టించుకోవద్దంటూ కొంతమంది చెబుతున్నారు. ముఖ్యంగా కెనడా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన హెల్లర్ మాటల్లో చెప్పాలంటే.. ఎన్నో దశాబ్దాలుగా ఏలియన్స్ మన భూమిని సందర్శిస్తూనే ఉన్నాయి. కంప్యూటర్ స్క్రీన్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మైక్రోచిప్‌ల వంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని మానవాళి సాధించిందంటే అది ఏలియన్స్ వల్లే. భూమిపై కూలిపోయిన గ్రహాంతరవాసుల స్పేస్ షిప్స్‌ను చూసిన తర్వాతే.. ఇలాంటి టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకున్నామంటున్నాడు హెల్లర్.
వీరిద్దరూ భూమిపై ఉండే తమ అనుభవాల ద్వారా ఈ కామెంట్లు చేశారనుకుందాం. కానీ... అంతరిక్షంలోకి వెళ్లి .. చంద్రుడిపై అడుగుపెట్టి వచ్చినవారు కూడా గ్రహాంతరవాసులున్నారని చెబితే నమ్మకుండా ఉండగలమా. చంద్రుడిపై ఎక్కువ సేపు గడిపి రికార్డు సృష్టించిన ఎడ్వర్డ్ మిచెల్ అనే సైంటిస్ట్... ఈ వ్యాఖ్యలు చేశాడు. యూఎస్ గవర్నమెంట్ కావాలనే.. వీటిపై సమాచారాన్ని బయటకు రానివ్వడం లేదనీ కొంతకాలం క్రితం ఆరోపించాడు.
ఇంతవరకూ గ్రహాంతర వాసుల వల్ల మనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు కాబట్టి... ఇక ముందు కూడా జరగకపోవచ్చు. కానీ.. అదే నిజమని మాత్రం నమ్మలేం. ఇక గ్రహాంతర వాసులు ఎక్కడుంటారన్న విషయం... వాళ్లు నేరుగా ఎదురుపడితే తప్ప తెలియకపోవచ్చు.
సైంటిస్టుల అనుమానం
గ్రహాంతర వాసులున్నారనడానికి ఆధారాలు లేవని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. వీటిపై ప్రయోగాలు చేస్తున్న ఎంతోమంది సైంటిస్టులు మాత్రం... ఉన్నాయంటున్నారు. ఎగిరే పళ్లాల రూపంలో ఎన్నో చోట్ల కనిపించిన ఏలియన్స్ స్పేస్ షిప్‌లను ఇందుకు ఆధారాలు చూపిస్తున్నారు. అంతేకాదు.. అంతరిక్షంలోనూ మన శాటిలైట్ల చుట్టూ ఈ ఏలియన్స్ స్పేస్‌షిప్స్ నిరంతరం తిరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెరుపువేగంతో దూసుకువచ్చి రెప్పపాటు కాలంలోనే మాయమై పోతూ.. గుర్తుతెలియని వస్తువులు అందరినీ ఆందోళనలో పడేశాయి. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ -UFO లుగా పిలుచుకున్నా.. గ్రహాంతరవాసుల వాహనాలుగా భావించే ఫ్లైయింగ్ సాసర్‌లు అనుకున్నా ఇవే. సాసర్ షేప్‌లో ఉండండతోనే వీటిని అలా పిలవడం మొదలుపెట్టారు. అయితే.. కాలక్రమేణా కొత్త తరహా ఆబ్జెక్ట్‌లు కనిపించడంతో వీటిని UFOలుగానే ఎక్కువశాతం పరిగణిస్తున్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ వీటిని అధికారికంగా గుర్తించలేదు. కాకపోతే.. రహస్యంగా మాత్రం చాలా దేశాలు పరిశోధనలను చేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు.. యూఎఫ్‌ఓల కోసమే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాయి.
ఇక అంతరిక్షంలోనూ మన శాటిలైట్స్ చుట్టూ గ్రహాంతరవాసులు తిరుగుతున్నారన్నది ఖగోళ శాస్త్రవేత్తల అనుమానం. నాసా తోపాటు ఇతర దేశాలు తీసిన వీడియోల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. శాటిలైట్ల కాస్త దూరంలో మిరిమిట్లు గొలుపుతూ ఏవో ఆబ్జెక్ట్స్ కదులుతున్నట్లు వీడియోల్లో రికార్డయ్యింది. అంతేకాదు.. భూమిపైనా ఎగురుతూ హఠాత్తుగా మాయమయ్యే వింత వస్తువులు చాలాసార్లు కనిపించాయి. ఫ్లైయింగ్ సాసర్లు చూశామంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మీడియా ముందుకు వచ్చారు. కొంతకాలం క్రితం కోల్‌కతా, చెన్నైల్లోనూ ఆకాశంలో ఈ తరహా ఫ్లైయింగ్ సాసర్లు కనిపించాయి. అయితే.. అవి నిజంగా గ్రహాంతరవాసుల వాహనాలేనా లేక.. తోకచుక్కలు, వాటి శకలాలా అన్నది తేలలేదు..
అసలు.. ఈ గ్రహాంతరవాసుల గురించి ప్రస్తావన వస్తే ముందుగా మెక్సికోలోని రాస్‌వెల్ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. రాస్‌వెల్‌లో జరిగిన యూఎఫ్‌ఏ క్రాష్ గురించి తెలుసుకోకపోతే.. గ్రహాంతరవాసుల గురించి పూర్తిగా తెలుసుకోనట్లే. ఫ్లైయింగ్ సాసర్ల ఉనికి.. గ్రహాంతరవాసులు ఫలానారూపంలో ఉంటారంటూ ఊహించుకోవడానికి ఈ ప్రాంతంలో జరిగన సంఘటనే కారణం. అమెరికాను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో.. 1947 జులై మొదటి వారంలో ఓ ఎయిర్ క్రాష్ సంభవించింది. ఓ అర్థరాత్రి మెరుపులు ఉరుములతో భారీ వర్షం కురిసింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే.. రెంచ్‌కు వెళ్లిన గొర్రెల కాపరి మాక్ బ్రెజిల్‌కు.. రాస్‌వెల్‌కు సమీపంలో విమానమేదో కూలిపోయినట్లు శిథిలాలు కనిపించాయి. ఓ గుండ్రని స్పేస్‌షిప్‌ను, నాలుగు గ్రహాంతరవాసుల మృతదేహాలను కూడా బ్రెజిల్ చూశాడని ఏలియన్స్‌పై పరిశోధనలు చేసే యుఎఫాలజిస్టులు చెబుతుంటారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రాస్‌వెల్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్- RAAF రంగంలోకి దిగింది. మరుసటి రోజు స్థానిక దినపత్రిక.. ఫ్లైయింగ్ సాసర్ కూలిపోయిందంటూ పెద్ద కథనాన్ని ప్రచురించింది. అయితే.. ఆ తర్వాత.. అది ఫ్లైయింగ్ సాసర్ కాదని, వెదర్ బెలూన్ అని అధికారులు మాట మార్చారు.. ఈ రాస్‌వెల్ సంఘటనలో కనిపించాయని చెబుతున్న ఏలియన్స్ మృతదేహాలకు శవపరీక్ష చేస్తున్న ఫోటోలు వీడియోలు.. బయటకు పొక్కినా.. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎంతో గుంభనంగా ఉంది. ఇప్పటివరకూ అధికారికంగా దీన్ని ఎక్కడా ఒప్పుకోలేదు.
రాస్‌వెల్ ఘటన తర్వాత.. ఫ్లైయింగ్ సాసర్లు కనిపించాయన్న వార్తలు మరింత ఎక్కువగా వెలువడ్డాయి. ఇప్పటికీ చాలామంది తమకు ఫ్లైయింగ్ సాసర్లు కనిపించాయని చెబుతూనే ఉన్నారు. కానీ.. అందులో నిజం ఎంతన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్‌లో వందలాది ఫోటోలు కనిపిస్తున్నా అవన్నీ.. గ్రాఫిక్స్ సృష్టేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏదేమయినా ఒక్కతి మాత్రం నిజం... ఇంతటి విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం మాత్రం కాదు. మానవ విజ్ఞానం బాగా అభివృద్ధి చెంది ఏదో ఒకనాటికి గ్రహాంతర బుద్ది జీవులతో సంబంధాలు పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. మంచి వ్యాసం ప్రచురించారు. ధన్యవాదములు.
గ్రేట్, చాలా చక్కగా రాశారు, ఆసక్తికరంగా విఙ్ఞానదాయకంగా ఉంది.