23, జూన్ 2010, బుధవారం
ప్రకృతి 10 శత్రువులు
మనకున్న గడువు వందేళ్లే..
వందేళ్ల తర్వాత మనిషి ఉండకపోవచ్చు..
భూమి నాశనం కావచ్చు
జీవరాశి మాయం కావచ్చు
పది ప్రమాదాలు పొంచి ఉన్నాయి
ఇలా కనీవినీ ఎరుగని ఉత్పాతాలకు భూమి వేదిక కాబోతోంది. మానవజాతి సమస్తాన్ని తుడిచికుపెట్టేసే మహాఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. మరికొన్ని సంవత్సరాల తర్వాత.. భూమి పచ్చగా కళకళలాడకపోవచ్చు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో భగభగ మండుతుండొచ్చు. ప్రకృతంతా మాయమై.. స్మశానంగా మారిపోవచ్చు.
ఈ ఊహే భరించడం కష్టం. కానీ.. మరికొన్నేళ్లలో భూమికి ఆయుష్షు తీరిపోతోందనిపిస్తోంది. ప్రమాదాలు విలయ తాండవం చేస్తూ భూమిని ముంచెత్తడానికి వస్తున్నాయి. కొన్ని మనం కొనితెచ్చుకుంటున్నవైతే.. మరికొన్నింటిని ప్రకృతి పంపిస్తోంది. భూమికొచ్చే ప్రమాదాలపై ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. పది మహా ప్రమాదాలను గుర్తించారు. ఈ పదీ భూమిని నాశనం చేసేవే. పైగా.. మరో వందేళ్లలోపే ఇవన్నీ మన భూమిపై విరుచుకుపడొచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఒకేసారి విరుచుకపడినా.. వేరువేరుగా ముంచెత్తినా.. భారీ విధ్వంసం మాత్రం ఖాయం. చెప్పాలంటే.. భూమి స్వరూపాన్నే మార్చేసే మహా ప్రమాదాలు. మరి ఆ ప్రమాదాలు ఏమిటి? భూమిపైకి ఎలా వస్తున్నాయి..?
తొలి శత్రువు
సముద్రంలో పట్టణాలు మునిగిపోవచ్చు...
రాష్ట్రాలు సముద్రం పాలు కావచ్చు..
దేశాలు మునిగిపోవచ్చు
భూమంతా నీటితో నిండిపోవచ్చు..
అవును.. నిన్నటి భయం.. ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ భూగోళంపై మనిషి ఉండడానికి ఉన్న కొద్దిపాటి నేలను కూడా మింగేయడానికి రాకాసి సముద్రం ముందుకొస్తోంది. తన పరిణామాన్ని పెంచుకుంటూ నేలపైకి విరుచుకుపడబోతోంది.
దీనికి ఏకైక కారణం.. గ్లోబల్ వార్మింగ్. ప్రకృతి పది శత్రువుల్లో మొదటిది గ్లోబల్ వార్మింగ్. అంటే భూమండలం వేడెక్కడం. భూవాతావరణం.. ఒక్కో సెంటీగ్రేడ్ వేడెక్కేకొద్దీ.. ఊహించని ఉత్పాతాలు విరుచుకుపడుతుంటాయి. భూమిపై వాతావరణం సమతుల్యంగా ఉండడంలో గ్లేసియర్ల పాత్ర ఎంతో ఉంది. అంటార్కిటికా, ఆర్కిటికా మంచు ఖండాలపైనుంచి వస్తున్న శీతల గాలులే.. భూమిని నిత్యం చల్లబరుస్తున్నాయి. అయితే.. ఈ గ్లేసియర్లు క్రమంగా కరిగిపోతున్నాయి. మరో 25 సంవత్సరాల్లో ఆర్కిటికా మాయం కావచ్చన్నది పర్యావరణవేత్తల అంచనా. గ్లేసియర్లు కరగడం వల్ల ప్రధానంగా రెండు సమస్యలు ఏర్పడతాయి. మంచు కరిగి నీరుగా మారిపోవడం వల్ల.. సముద్రనీటిమట్టాలు పెరిగిపోతాయి. దీనివల్ల తీరప్రాంతాలు మునుగుతాయి. ముంబై, విశాఖ లాంటి నగరాలు.. వెనిస్‌లా మారిపోతాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల ఇప్పటికే చాలా దేశాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. మరో తొంభై ఏళ్లలో మన పక్కనే ఉన్నమాల్దీవులు మాయం కానుంది. పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్‌లో ఇప్పటికే రెండు దీవులు సముద్రంలో మునిగిపోయాయి. తీరప్రాంతం ఎక్కువగా ఉన్న మనరాష్ట్రం గ్లోబల్‌వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండొచ్చు.
జీవనదులకు ప్రాణం పోసేది గ్లేసియర్లే. అలాంటి గ్లేసియర్లు కరిగిపోతే.. నదుల్లో నీటి ప్రవాహం ఉండదు. అంటే మంచినీటికి.. సాగునీటికి తీవ్రకొరత ఏర్పడుతుంది. గ్లేసియర్లు మాయం కావడం వల్ల వచ్చే రెండో సమస్య ఉష్ణోగ్రతలు పెరగడం. భూవాతావరణాన్ని చల్లబరిచే గాలులు ఆర్కిటికా నుంచి రావు కాబట్టి.. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. మరో పదేళ్లలో నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. ఇప్పటికే దాదాపు 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను టెంపరేచర్ తాకుతోంది. ఇక 55 డిగ్రీలకు చేరిందంటే జీవించడం చాలా కష్టం. చాలాప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి.
కాలాలు మారిపోవడం... అనూహ్యంగా వర్షాలు కురవడం.. అనావృష్టి ఏర్పడడం.. ఇలా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది గ్లోబల్ వార్మింగ్. ప్రపంచం నలుమూలలా పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషవాయుల పరిమాణం వాతావరణంలో పెరిగిపోతే.. ఆమ్ల వర్షాలు కూడా కురవొచ్చు. ఇలా ఏ రకంగా చూసుకున్నా.. గ్లోబల్ వార్మింగ్ మానవాళి పాలిట మహమ్మారిగానే చెప్పుకోవాలి. భూమి నాశనం కావడంలో దీనిపాత్రే ఎక్కువగా ఉండనుంది.
రెండో శత్రువు
నగరాలు..పట్టణాలు.. పల్లెలు.. ఎటూ చూసినా జనం. భూగోళం జనగోళంగా మారుతోంది. అంచనాలకు అందకుండా జనసంఖ్య పెరుగుతోంది. ఇదే ఇప్పుడు మహాప్రమాదాన్ని తెచ్చిపెట్టనుంది. పది శత్రువుల్లో రెండోది జనాభానే.
తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా.. దాదాపు 680 కోట్లు. 1960 నాటికి ఈ సంఖ్య కేవలం 300 కోట్లు మాత్రమే. అంటే.. యాభై ఏళ్లలోనే రెట్టింపు అయ్యింది. ఈ లెక్కన చూస్తే.. 2040 కల్లా ఈ సంఖ్య 900 కోట్లను దాటే అవకాశాలున్నాయి. వచ్చే ముప్పైఏళ్లలో 200 కోట్లకు పైగా జనాభా అదనంగా భూమిపై చేరతారన్నమాట. ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభా అన్ని దేశాలకు సమస్యాత్మకమే. జనాభా పరంగా అతిపెద్ద దేశాలైన చైనా, భారత్‌లకు ఎక్కువ ప్రమాదం ఉంది. వ్యవసాయక్షేత్రాలు క్రమంగా నివాసప్రాంతాలకు మారిపోతుండడంతో ఆహారధాన్యాల ఉత్పత్తి అనూహ్యంగా తగ్గిపోనుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది మొదటిదశ మాత్రమే. ఇప్పటికే మన దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్రమంగా అందరికీ ఆహారం అందడం కష్టమవుతుంది. ఆకలిచావులు పెరుగుతాయి. అంతుచిక్కని రోగాలు విజృంభిస్తాయి. వీటన్నింటినీ తట్టుకోవడం చాలా కష్టం. ఇది ఏ ఒక్కదేశానికో పరిమితం కాదు.. అన్ని దేశాలకూ ఈ జనాభా పెరుగుదల ఊహించని ఉత్పాతాన్ని తెచ్చిపెట్టనుంది.
మూడోశత్రువు
ఇక మూడో శత్రువు అణుయుద్ధం. ఒకప్పటిలా ప్రపంచదేశాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకునే పరిస్థితి అయితే లేదు కానీ.. వచ్చే యాభై ఏళ్లలో అణుయుద్ధం తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య విద్వేషాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటి మధ్య అణుయుద్ధం తప్పకపోవచ్చు. ఇదే సమయంలో ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య కూడా అణుయుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత్ - పాకిస్తాన్‌ల గురించే. ఈ రెండు దాయాది దేశాల మధ్య కూడా భవిష్యత్తులో అణుయుద్ధం తప్పకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సాధారణ యుద్ధాలతో పోల్చితే.. అణుయుద్ధాల తీవ్రత చాలా ఎక్కువ. ఒకచోట అణుబాంబు వేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మొత్తం భూగోళాన్నే నాశనం చేస్తుంది. ఏ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగినా.. ప్రపంచమంతా నష్టపోవడం ఖాయం.
నాలుగో శత్రువు.. సైంటిఫిక్ జీవులు...
మనిషి ఆలోచలు పరిధులు దాటుతున్నాయి. సృష్టి రహస్య మూలాలను మరిచిపోయి.. ప్రతిసృష్టి చేయడానికి మనిషి తపిస్తున్నాడు. శతాబ్దాల నుంచి మరణాన్ని అధిగమించడానికి.. కొత్త జీవిని సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు. కృత్రిమ జన్యువును సృష్టించడంతో.. సృష్టి రహస్యాన్ని ఛేదించడం సులువుగానే కనిపిస్తోంది. శాస్త్రప్రయోగాలు ఇదే దిశలో ముందుకు సాగితే.. కృత్రిమ జీవులు ఈ భూమిపై పరుగులు తీస్తాయి. అయితే.. ఇలా తయారయ్యే కృత్రిమ జీవులే మనిషిని అంతం చేయవచ్చని శాస్త్ర ప్రపంచమే ఆందోళన చెందుతోంది.
అంతేకాదు.. ఇప్పుడు వచ్చేదంతా రోబో యుగం. శారీరక శ్రమను తగ్గించుకోవడానికి మనిషులు తయారు చేస్తున్న మరమనుషులు చరిత్ర గతిని మార్చేసే ప్రమాదం ఉంది. వచ్చే యాభై ఏళ్లలో సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే రోబోలను మనం తయారు చేసుకోగలం. సొంతగా ఆలోచించే పరిజ్ఞానం రోబోలకు వచ్చిందంటే.. అది మనిషిపై పెత్తనం చేయడానికే పూనుకొంటుంది. అదే జరిగితే.. ఈ ప్రపంచమంతా.. రోబోల చేతుల్లో చిక్కుకుపోతుంది. ఇలా సైంటిఫిక్ జీవుల నుంచి వచ్చే ప్రమాదాలను మనం కాదనలేం.
ఐదో శత్రువు ఏలియన్స్
భూమిపై తయారయ్యే జీవులే కాదు.. ఇతర గ్రహాల నుంచి వచ్చే జీవులూ భూమి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమికి ఉన్న ఐదో శత్రువు గ్రహాంతరవాసులు. ఈ సువిశాల రోదసీలో మనల్ని పోలిన.. లేదంటే.. మనల్ని మించిన బుద్ధి జీవులు ఉన్నాయన్నది శాస్త్రవేత్తల అంచనా. విశ్వంలో మనలాంటి జీవులను కనిపెట్టడానికి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే.. గ్రహాంతరవాసులపైన జరపుతున్న ప్రయోగాలు మంచికన్నా కీడు చేసే అవకాశాలే ఎక్కువే అంటున్నారు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఈ భూమిపై ఏలియన్స్ దాడిచేసి మానవాళిని సమూలంగా నాశనం చేసే ప్రమాదం ఉందంటున్నారు.
ఆరో శత్రువు.. భారీ ఉల్క
ప్రతీ పదిలక్షల ఏళ్లకోమారు.. అతిపెద్ద ఉల్కలు భూమిని ఢీకొట్టవచ్చన్నది శాస్తవేత్తల అంచనా. భూమిపైన డైనోసార్లు అంతం కావడానికి ఇలాంటి ఉల్కాపాతమే కారణం కావచ్చన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2036లో మళ్లీ ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టవచ్చని ఖగోళపరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఉల్క భూమి ఢీకొడితే.. భూమిపై పెను ఉత్పాతమే సంభవిస్తుంది. జీవరాశి నాశనం అవుతుంది. భూమి స్వరూపం కూడా మరిపోవచ్చు.
ఏడో శత్రువు సూర్యుడు
సమస్త జీవకోటికీ ప్రాణాధారం సూర్యుడు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిచ్చే వెలుగే.. జీవరాశి మనుగడకు ఆధారమవుతోంది. అయితే.. ఈ సూర్యుడే ఇప్పుడు భూమికి శత్రువు కాబోతున్నాడు. భూమికున్న ఏడో శత్రువు సౌరతుఫానులు.
నాసా తాజా అంచనాల ప్రకారం 2013లో సూర్యుడు మహాకల్లోలాన్ని సృష్టించనున్నాడు. నాలుగేళ్లుగా సుదీర్ఘ నిద్రలోఉన్న సూర్యుడు..ఇప్పుడు తన మొద్దునిద్రను వీడనున్నాడని నాసా పరిశోధనల్లో తేలింది. సూర్యుడిపై ఇటీవలికాలంలో లెక్కకుమిక్కిలిగా స్పాట్‌ల ఏర్పడుతున్నాయి. ఇవి వెదజల్లే సౌరజ్వాలల వల్ల రేడియో ధార్మిక తుఫాన్లు పుట్టుకొస్తాయి. వీటివల్ల సౌరమండలంలో ఎక్కువ నష్టపోయేది భూమండలమే. మన ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోతాయి. భూమంతా మాడి మసయ్యే ప్రమాదమూ ఉంది.
ఎనిమిదో శత్రువు అగ్నిపర్వతాలు
ఇక అగ్ని పర్వతాలు.. భూమికి ఎనిమిదో శత్రువు. ప్రతీ 50 వేల ఏళ్లకోసారి.. భారీ అగ్నిపర్వతాలు భూమికి ముప్పుతెస్తూనే ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం వచ్చే 70 ఏళ్లలో భారీ అగ్నిపర్వతం ఒకటి పేలవచ్చు. దీనివల్ల భూమిపై లావా ఎక్కువగా ప్రవహించి.. సల్ఫ్యూరిక్ యాసిడ్ పొరను ఏర్పరుస్తుంది. ఇంతకుముందు అగ్నిపర్వతాల వల్ల మానవాళికి పెద్దగా ప్రమాదం జరగకపోయినా.. ఇటీవల ఐస్‌లాండ్‌లో సంభవించిన పేలుడుతో యావత్ యూరప్ స్తంభించిపోయింది. గాలిలో ధూళిపేరుకుపోవడంతో.. ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. అందుకే.. అగ్నిపర్వతాల వల్ల కూడా పెనుప్రమాదమే ఉంది.
తొమ్మిదో శత్రువు సునామీ
భూమికి పొంచిఉన్న శత్రువుల్లో సునామీది తొమ్మిదో స్థానం. 2004లో వచ్చిన సునామీలో ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి విరుచుకుపడే సునామీ మరింత భీకరంగా ఉండనుంది. ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దీవుల నుంచి... ఆస్ట్రేలియా దాకా సునామీ వచ్చే అవకాశం ఉంది. ఇది రెండు ఖండాలకూ ప్రమాదకరమే.
పదో శత్రువు భూకంపం,తుఫాను
చివరిగా అయినా.. ప్రమాదకరమైన శత్రువు భూకంపం, తుఫానులు. తరచుగా వస్తున్న తుఫానులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. లక్షలాది ప్రాణాలను బలికొంటున్నాయి. వరదలు కూడా వినాశనంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక భూకంపాల తీవ్రత కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారి భూమికంపిస్తే చాలు.. ప్రపంచమంతా అల్లకల్లోలం కావడం ఖాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రకృతికి అసలు సిసలు శతృవుని వదిలేసారు ... అతనే మనిషి. మీరు చెప్పిన 10 శతృవులకి(దాదాపుగా) ఇతనే కారణం.