21, జూన్ 2010, సోమవారం
దొంగలబండి
రైల్లో ప్రయాణించడం చాలా మందికి సరదా. సుధూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలును మించినది లేదన్నది చాలా మంది నమ్మకం. కానీ ఇప్పుడు ట్రైన్ పేరు చెబితేనే టెన్షన్ పడాల్సి వస్తోంది. తప్పక ట్రైన్స్‌లో వెళుతున్నా.. చివరి వరకూ బితుకు బితుకు మనాల్సి వస్తోంది..
ఆనందంగా మొదలయ్యే రైలు ప్రయాణం భయంతో ముగుస్తోంది. సంతోషానికి బదులు.. చికాకును, టెన్షన్‌ను కలిగిస్తోంది. సమయానికి ఇంటికి చేరాల్సిన వారు.. పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇదంతా.. కేవలం రైలు ప్రయాణం వల్లే. బస్సులో ఎక్కితే ప్రయాణించడం ఇబ్బందనుకుంటున్న జనానికి.. రైలు ప్రయాణం చేదు జ్ఞాపకాలనే మిగులుస్తోంది. అటు ధనాన్ని.. ఇటు సమయాన్ని హరిస్తోంది. చివరకు సుఖం లేకుండా చేస్తోంది.
ఇప్పుడు ట్రైన్ ప్రయాణం ఏమాత్రం సేఫ్ కాదు. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే రైళ్లలో పరిస్థితి మరీదారుణం. ఎందుకంటే.. రైలుబళ్లు.. దొంగలబళ్లుగా మారిపోతున్నాయి. దోపిడీ దొంగల చేతుల్లో చిక్కుకుంటున్నాయి. అవును.. అత్యంత సులువుగా దొంగతనం చేయగలిగేవి మన రైళ్లు మాత్రమే. ఏ రైలుపైనైనా పడి .. ప్రయాణికుల సొత్తును క్షణాల్లో దోచుకుపోవచ్చు. అడ్డుకునే వాడూ.. ఎదురుతిరిగేవాడు.. పట్టుకునేవాడూ ఎవరూ ఉండరు. ఇదే దొంగలకు వరంలా మారింది. పైగా.. మన రైలును ఎవరైనా ఎక్కడైనా ఆపేయొచ్చు. స్టేషన్స్‌లోనే ఆగాల్సిన రైలు నిర్మానుష్య ప్రదేశాల్లో ఆగిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే.. దొంగలు దూసుకువస్తారు. ఆడాళ్ల మెడలో గొలుసులు తెంపుకుపోతారు. ఇక ప్రయాణీకులు చేయగలిగింది.. ఏ స్టేషన్‌కో చేరుకుని ఫిర్యాదు చేయడమే..
అందుకే.. రైలు జర్నీ అంటే భయపడాల్సి వస్తోంది. పైగా భారీగా నగలతో, డబ్బుకట్టలతో వెళ్లేవారికి సురక్షితం కానే కాదు. మీరు ట్రైన్ దిగే సమయానికి అవి మీ దగ్గర ఉండకపోవచ్చు. మీరెళ్లేది దొంగలబళ్లు కావడమే అందుకు కారణం. ప్రతీ ట్రైన్‌లోనూ భద్రతా సిబ్బంది ఉంటారని అధికారులు చెప్పినప్పటికీ.. దొంగలొచ్చే సమయానికి మాత్రం ఎవరూ కనిపించరు. అందుకే.. ట్రైన్ జర్నీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి..
పెరుగుతున్న దొంగతనాలు..
ఇటీవలికాలంలో రైళ్లలో దొంగతనాల సంఖ్య చాలా పెరిగిపోయింది. లక్షలాది రూపాయల ప్రజాధనం చోరుల పాలవుతోంది. తాజాగా.. ముంబై నుంచి విశాఖ వస్తున్న ఎల్టీ ఎక్స్‌ప్రెస్‌పై దొంగలు దాడి చేశారు. స్తంబల్పూర్ దగ్గర S-3 బోగీలో దోపిడీ చేశారు. దొంగలదాడిలో ప్రయాణీకులకు గాయాలు కూడా అయ్యాయి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు వస్తే.. అతిపెద్ద చోరీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగాయి. జూన్ 17న ఒకేరోజు రెండు రైళ్లలో దోపిడీ జరిగింది. చైన్నై నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ట్రైన్‌ను గుంటూరు జిల్లా నడికుడి దాటిన తర్వాత దోచుకున్నారు. కేవలం పది నిమిషాల్లోనే దోపిడీ పూర్తయ్యింది. చెయిన్ లాగి ప్రయాణీకులను దోచుకున్న దొంగలు.. కాసేపట్లోనే మాయమయ్యారు.
నడికుడి నుంచి సికింద్రాబాద్ వచ్చే వరకూ చెన్నై ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు భయంగానే గడపాల్సి వచ్చింది. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత గానీ.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు. ఇక నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ కూడా ఇలాంటిదే. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్.. నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వేస్టేషన్‌లో ఆగినప్పుడు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు దోచుకెళ్లారు. ఇదే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 11న కూడా చోరీ జరిగింది. గుంటూరు జిల్లా ధూళిపాల సమీపంలో దొంగలు ఈ ట్రైన్‌లో చొరబడి ఓ మహిళ నుంచి లక్షా యాభై వేల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. సికింద్రాబాద్ వస్తే తప్ప.. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి అవకాశం చిక్కలేదు.
జూన్ 12 న సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళుతున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఖమ్మం జిల్లాలో దొంగలు పడ్డారు. ఖమ్మం-మధిర మధ్య ట్రైన్‌ను ఆపి రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ట్రైన్‌లో ఉన్నవారి నగలను దోచుకున్నారు. నాగర్ కోయిల్ నుంచి ముంబై వెళుతున్న ఓ ట్రైన్ ఇటీవలే.. పెనుగొండ రైల్వేస్టేషన్ వద్ద దోపిడీకి గురయ్యింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణీకుడిని దొంగలు దారుణంగా పొడిచి పారిపోయారు. ఇలాంటి దోపిడీలు నిత్యకృత్యం అయ్యాయి.
లాభాలపైనే దృష్టి
దేశం మొత్తంమీద రైల్వేశాఖకు భారీగా లాభాలు ఆర్జించుపెడుతోంది దక్షిణమధ్య రైల్వే. ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించేది కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలోనే. భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణీకుల భద్రతపై మాత్రం రైల్వే అధికారులు దృష్టిపెట్టడం లేదు. అరకొర సౌకర్యాలతోనే ట్రైన్స్‌ను పంపించివేస్తున్నారు. ప్రతీ కోచ్‌కూ రక్షణగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఉండాల్సినప్పటికీ చాలా బోగీల్లో ఉండరు. కొన్నిసార్లైతే ట్రైన్ మొత్తానికి ఒకరు కూడా ఉండరు. ఇదేనా ప్రయాణీకులకు కల్పించాల్సిన భద్రత.
ఈ మధ్య వరసగా ట్రైన్స్‌లో దోపిడీలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒక్క సంఘటన జరగగానే అధికారులు మేల్కొంటారు. మరోసారి అలాంటి దోపిడీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. మొద్దునిద్ర పోతున్న మన రైల్వేశాఖకు దోపిడీల సంగతే పట్టడం లేదు. అందుకే.. ముంబై నుంచి విశాఖకు వస్తున్న లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్‌లో కనీసం ఒక్క ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. సుధూర ప్రయాణాలు చేసే ఈ ట్రైన్‌లో ఏమాత్రం భద్రత లేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోపిడీలు జరగగానే హడావిడి చేసే అధికార యంత్రాంగం.. క్రమంగా ఆ విషయాన్ని మర్చిపోతోంది.
నడికుడి-గుంటూరు మార్గంలో ఎక్కువగా దోపిడీలు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో 15 దొంగతనాలు జరిగాయి. అయినా.. ఈ రూట్‌లో ఎక్కడా సెక్యూరిటీని పటిష్టం చేయలేదు. పైగా మూడేళ్లుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చోరీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2008లో 454, 2009లో 601 దొంగతనాలు జరిగాయి. రాష్ట్రంలో ప్రధాన రైళ్లుగా భావించే నారాయణాద్రి, పద్మావతి, సింహపురి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలోనే దోపిడీలు జరగడంతో మిగిలిన ట్రైన్స్‌కూ దొంగలభయం ఉందంటున్నారు రైల్వే ప్రయాణీకులు.
మారుతున్న తీరు
బిస్కట్స్ ఇవ్వడం.. అంతా మత్తులో పడగానే చోరీ చేయడం పాతపద్దతి. అయినా.. ఇప్పటికీ ఎక్కువమంది దొంగలు దీన్నే ఫాలో అవుతున్నారు. ప్రయాణీకులను మాటల్లో పెట్టి.. మత్తుపదార్థాలు తినిపించి వారి సొమ్మును లూటీ చేస్తున్నారు. ఇక ప్రయాణీకులతోనే ఉంటూ.. వారికి తెలియకుండా చోరీ చేయడం రెండో పద్దతి.
అయితే.. ఇప్పుడు జరుగుతున్న చోరీలు ఈ రెండింటికి కాస్త భిన్నం. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యంత పకడ్బందీగా తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి. అందరు ప్రయాణీకుల్లాగానే స్టేషన్‌లో రైలు ఎక్కే దొంగలు.. అర్థరాత్రి సమయంలో చైన్ లాగుతారు. ప్రయాణీకుల నగలు, డబ్బు దొచుకొని.. ట్రైన్‌లో నుంచి దూకేస్తారు. ఎవరైనా అడ్డం రావడానికి ప్రయత్నిస్తే.. మారణాయుధాలతో గాయపరుస్తారు. చాలావరకూ ఇలా ఎక్కుతున్న దొంగల వద్ద టికెట్లు ఉండవు. చాలాసార్లు ఆకతాయులు కూడా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒకబోగీ నుంచి మరో బోగీకి మారుతూ.. జనాన్ని భయపెడుతున్నారు. అసలు రిజర్వ్‌డ్ బోగీల్లోకి కూడా టికెట్‌లేని ప్రయాణీకులు వస్తున్నారంటే.. అందుకు తప్పుపట్టాల్సింది ఎవరిని?
కాసుల కోసం కక్కుర్తి పడుతున్న టీటీలు, టికెట్ కన్‌ఫర్మ్ కాని వారిని కూడా రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కించేస్తున్నారు. టికెట్ లేకుండా రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కేవారినీ రైలు దింపడం టీటీలకు తెలియదు. ఇదే అన్ని సమస్యలకూ మూలం.
రైళ్లు ప్రయాణించే మార్గాల్లో చాలా ప్రాంతాల్లో తరచుగా దాడులు జరుగుతున్నాయి. రైలు రాగానే దుండగులు దానిపై రాళ్లవర్షం కురిపిస్తారు. ఒక్కసారిగా రాళ్లదాడికి కంగారుపడి ప్రయాణీకులు అరవగానే.. ఏం జరిగిందో అన్న అనుమానంతో ట్రైన్‌ను ఆపివేస్తారు. దీనికోసమే కాచుకుని ఉన్న దొంగలు ఒక్కసారిగా ట్రైన్‌పై పడి అందినంతా లాక్కెళతారు. ముంబై నుంచి వచ్చే ట్రైన్స్‌పై ఎక్కువగా ఈ తరహా దాడులే జరుగుతున్నాయి. ఇలా దాడులు జరుగుతున్న ప్రాంతాలు కొన్నే అయినా.. ఆ ప్రాంతాల్లో భద్రతపై రైల్వే శాఖ ఇంతవరకూ దృష్టి పెట్టలేదు.
బీహార్‌లో ఉన్నామా..
బీహార్‌లో ఎక్కువగా జరుగుతాయనుకునే రైలుదోపిడీలు ఇప్పుడు మన రాష్ట్రంలో సర్వసాధారణం అయిపోయాయి. వరసగా దొంగతనాలు జరుగుతున్నా.. ఒక్క కేసునూ ఛేదించకపోవడం.. దోపిడీలను అరికట్టలేకపోవడంతో రైల్వేశాఖ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీలు జరిగే రూట్‌లో కనీస పర్యవేక్షణ లేకపోవడాన్ని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతీ స్టేషన్‌లోనూ భద్రత మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం దోపిడీలే అని ఊరుకుంటే.. రేపు హత్యలకూ దారితీసే ప్రమాదమూ ఉంది. ట్రైన్‌లోకి చొరబడే దొంగలు నగల కోసం ప్రాణాలు తీయడానికీ వెనుకాడకపోవచ్చు. మరి ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత రైల్వేలకు లేదా..? అందుకే దోపిడీలు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. వీలైనంతవరకూ నగలు, డబ్బుతో ప్రయాణం చేయకండి. రాత్రిపూట ప్రయాణం చేస్తే.. కిటీకిలు వేయడం మరిచిపోకండి. బోగీ డోర్ కూడా వేసిఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక తోటి ప్రయాణీకులు ఇచ్చే ఆహార పదార్థాలను ఏమాత్రం తీసుకోకండి. ఒకవేళ ఎవరైనా దోపిడీకి పాల్పడుతుంటే.. అందరూ కలిసికట్టుగా ఎదుర్కోండి. అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట చైన్ లాగకండి. ఎక్కడపడితే అక్కడ చైన్ లాగే విషయంలోనూ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతీ కోచ్‌లోనూ రాత్రి పూట ఆర్పీఎప్ సిబ్బంది తిరిగేలా చూడాలి. ప్రమాదకర ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రైన్ నిలపకూడదు. అంతేకాదు.. ఆ ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడే ఈ దోపిడీలకు.. దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుంది. పట్టీపట్టనట్లు రైల్వేశాఖ వ్యవహరిస్తు.. రైళుబళ్లు పూర్తిగా దొంగలబళ్లుగా మారిపోతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి