19, మే 2010, బుధవారం
ఒక్కమగాడు.. ఎన్టీఆర్..
నందమూరి హీరో అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. ముందు బాలకృష్ణ.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్. వరసగా సినిమాలతో కెరీర్ గోల్స్ దాటేస్తున్న జూనియర్.. అటు లైఫ్ గోల్స్‌ను అందుకోవడంలోనూ దూసుకెళుతున్నాడు. పేరుకు జూనియర్ ఎన్టీఆరే అయినా.. వ్యవహారం మాత్రం అంతా సీనియర్ పోలికే. ఇప్పుడు 27 ఏళ్లు పూర్తి చేసుకొని.. 28 వ ఏట అడుగు పెడుతున్నాడు తారక్. అన్నగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావుకు అసలైన వారసుడననిపించుకున్నాడు. ఆ ఎన్టీఆర్ పేరు చెబితే.. ఈ ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేలా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించాడు.
కోరిక నెరవేరింది..
ఎన్టీఆర్‌కు చిరకాలంగా ఉన్నఅతిపెద్ద కోరిక ఒక్కటే. నందమూరి కుటుంబంలో ఒక్కడవ్వాలని. అందుకోసం ఎంతో శ్రమించాడు. తన టాలెంట్‌తో అందరినీ దగ్గర చేసుకున్నాడు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత అంతటి ఛరిష్మా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే. అందుకే.. ఇప్పుడు నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్ పేరు కలవరిస్తోంది. చంద్రబాబు బంధువుల అమ్మాయితో ఎన్టీఆర్ పెళ్లి ఫిక్స్ కావడంతో మరింత సాన్నిహత్యం ఏర్పడింది. నందమూరి, నారా కుటుంబాలతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏకమైంది. నిశ్చితార్థానికి నందమూరి కుటుంబమంతా తరలివచ్చి తమ మధ్య అనుబంధాన్ని అందరికీ చాటిచెప్పారు.
ఈ బర్త్‌డేకి ముందే తన తల్లికి మరిచిపోలేని గిఫ్ట్‌ను అందించాడు తారకరాముడు. నందమూరి కుటుంబం సమక్షంలో తన తల్లిదండ్రుల చేతుల మీదుగా నిశ్చితార్థాన్ని జరిపించుకున్నాడు. ఇప్పుడు నందమూరి కుటుంబం ఎక్కడ ఉంటే.. ఎన్టీఆర్ కూడా అక్కడే ఉంటున్నాడు. జూనియర్ కలగన్నది కూడా అదే. బాలయ్యది కావచ్చు.. ఎన్టీఆర్‌ది కావచ్చు.. మరో సినిమా ఫంక్షన్ కావచ్చు.. నందమూరి కుటుంబంతో పాటే ఎన్టీఆర్ కూడా ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆరే సెంటరాఫ్ అట్రాక్షన్.
వంశంతో పాటు..
తనకు ప్రేరణ అయిన తాత సీనియర్ ఎన్టీఆర్‌ను.. బాబాయ్ బాలకృష్ణను నిత్యం స్మరించుకుంటూనే ఉన్నాడు. ప్రతీ సినిమాలో తాత,బాబాయ్‌లు, వంశాల ప్రస్తావన ఏదో రూపంలో డైలాగ్స్‌లో బయటపడుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ తరహా డైలాగ్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. నందమూరి ఫ్యామిలీ అంటే తనకు ఎంతిష్టమో.. ఇలా ఎన్నోసార్లు వెండితెరమీద చూపించాడు తారక్.. బ్యాక్‌గ్రౌండ్‌లో పోస్ట్రర్లు, కటౌట్లు... తమవారివి ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు.. బ్లడ్ కూడా ఒకటేనన్న సంగతీ బాబాయ్‌కు గుర్తుచేశాడు.
అంతేకాదు.. నటనలోనూ వీలైనంతగా తాతను.. బాబాయ్‌ను అనుకరించడానికి ప్రయత్నించాడు. డ్యాన్స్ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్నప్పటికీ.. తాతలా స్టెప్పులు వేసి అభిమానులను మురిపించాడు. తాత ఆశీస్సులు తనకున్నాయన్న విషయం ఎన్టీఆర్‌కు బాగా తెలుసు. అందుకే.. ఎవరూ చేయలేని ధైర్యం చేశాడు. యమదొంగ సినిమాలో స్వర్గం నుంచి సీనియర్ ఎన్టీఆర్‌ను రప్పించి యమలోకాన్ని షేక్ చేశాడు.
చెప్పాలంటే.. అటు ఎన్టీఆర్.. ఇటు బాలయ్యల ఇమేజ్‌లను తన పయనానికి ఇరుసులుగా చేసుకొని కెరీర్‌ను మొదలుపెట్టాడు జూనియర్. స్టార్ ఇమేజ్ వచ్చినా తమవాళ్లను మరిచిపోలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ.. బాబాయ్ మనసులో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించాడు. మొత్తంమీద ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. దూరంగా ఉంచినా.. తమ కోసం తారక్ పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్న నందమూరి ఫ్యామిలీ.. చివరకు బెట్టు వీడింది. జూనియర్‌ను తమవాడిని చేసుకుంది.
పేరుకే నందమూరి వాడు..
జూనియర్ ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం.. అందరి వారసులుగా అట్టహాసంగా.. ఆడంబరంగా జరగలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా మద్దతు దొరకలేదు. కానీ.. మనవడిలోని టాలెంట్‌ను చిన్ననాడే గుర్తించారు.. నందమూరి తారక రామారావు. అందుకే బ్రహ్మర్షి విశ్వామిత్రలో తొలిసారి బాలనటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బాలరామాయణం చేసి, కొంతకాలం పాటు తెరకు దూరంగా ఉన్నాడు జూనియర్. పిల్లాడి నుంచి కుర్రాడిగా మారగానే.. నిన్నుచూడాలని సినిమాతో 2001లో హీరోగా తెరంగేట్రం చేశారు. కానీ.. నందమూరి ఫ్యామిలీ నుంచి మద్దతు లేకపోవడం.. హీరోగా తొలిసినిమా కావడంతో సక్సెస్‌ను అందుకోలేకపోయారు. ఎన్టీఆర్ మనవడిగా జనంలో పేరు రావడం.. ఆ తర్వాత సినిమాకు ప్లస్సయ్యింది. స్టూడెంట్ నెంబర్ వన్ గా.. రికార్డులు సృష్టించాడు జూనియర్.
టాలీవుడ్ రికార్డులను తిరగరాసే అవకాశం ఏడాదిలోనే అందివచ్చింది. ఆది సినిమాలో తన యాక్షన్‌తో రికార్డుల సునామీ సృష్టించాడు. యంగ్‌టైగర్‌గా మాస్ ఇమేజ్‌ను కూడా ఈ సినిమాతో అందిపుచ్చుకున్నాడు. ఆదిలో డైలాగ్‌లకు.. ఎన్టీఆర్ యాక్షన్‌కు జనం జయహో అన్నారు. అల్లరిరాముడు, నాగ సినిమాలు కాస్త నిరాశ పరిచినా.. సింహాద్రితో మరో సక్సెస్ అందుకున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు.. అప్పటివరకూ తెలుగు సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది సింహాద్రి.
సింహాద్రి తర్వాత... వరసగా పరజయాలు ఎన్టీఆర్‌ను వెక్కిరించాయి. అప్పటివరకూ ముద్దుగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ఓవర్ వెయిట్ అయ్యాడన్న కామెంట్లూ వినిపించాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జూనియర్.. రాజమౌళి చిత్రం యమదొంగ కోసం సడన్‌గా స్లిమ్ అయ్యారు. కొత్త గెటప్‌తో యముడి పాత్రలో ఒదిగిపోయాడు. తాతను తలపిస్తూ.. భారీ డైలాగ్‌నూ సినిమాలో కొట్టి సూపర్భ్ అనిపించుకున్నాడు.
కంత్రి, అదుర్స్ కూడా మంచి విజయాలనే సొంతం చేసుకోవడంతో.. ఉత్సాహంగా ఉన్నాడు ఎన్టీఆర్. చెప్పాలంటే.. అతి తక్కువ సమయంలో మెగాహిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్‌కు పోటీగా కొంతమంది ఎంట్రీ ఇచ్చినా... దీటుగా నిలబడలేకపోయారు. బాలయ్య తర్వాత తారక్‌ను మాత్రమే ఎన్టీఆర్ వారసుడిగా ఫ్యాన్ గుర్తిస్తున్నారు. కుటుంబ గౌరవం, ప్రతిష్టలన్నీ ఎన్టీఆర్‌తోనే ముడిపడి ఉండడమూ.. కుటుంబ విబేధాలను పక్కన పెట్టడానికి కారణంగా చెప్పొచ్చు. అదే హీరోగా రాకపోయినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయినా.. ఎన్టీఆర్ పరిస్థితి మరోలా ఉండేది.
తాతబాటలో..
తాత రూపాన్ని పుణికి పుచ్చుకొని సినిమాల్లోకి వచ్చిన జూనియర్.. ఆయన బాటలో పయనిస్తూ రాజకీయాల వైపూ మొగ్గుచూపారు. అసెంబ్లీ ఎన్నికల కోసం.. తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో ప్రచారం చేశాడు. ప్రచారరథాన్ని సిద్ధం చేసుకొని... తాతలానే ఖాకీ దుస్తులను ధరించి జనంలోకి దూకాడు తారక రాముడు. జూనియర్ అంటూ రాజకీయ నేతలు చిన్నవాడిగా చూసినా.. తన మాటలతో ఉద్ధండులనే ముప్పుతిప్పలు పెట్టాడు ఎన్టీఆర్. అశువుగా ప్రసంగించడంలో తాతకు తానే సాటని నిరూపించుకున్నాడు.
శ్రీకాకుళం నుంచి ఖమ్మం దాకా ఏకబిగిన ప్రచారం చేశాడు జూనియర్. ఎక్కడికివెళ్లినా... జనం బ్రహ్మరథం పట్టారు. అయితే.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరగడంతో మళ్లీ ప్రచారంలోకి వెళ్లలేకపోయాడు. అయినా.. చివరి నిముషంలో మంచంపై నుంచే ఆవేశంగా ప్రసంగించాడు. వాస్తవానికి ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయాల్సిన పనిలేదు. కానీ.. తాత స్థాపించిన పార్టీ కావడంతో.. ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో సినిమాలను పక్కనపెట్టి ప్రచారానికి వెళ్లాడు. ఈ విషయంలో చంద్రబాబు పాత్ర గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. సినిమాల్లో నిలదొక్కుకుంటున్న ఎన్టీఆర్‌ను ప్రోత్సహించడంలో బాబుది ముందునుంచీ ప్రధాన పాత్రే. బాలయ్యతో వియ్యం అందుకున్నాక.. ఎన్టీఆర్‌ను, బాలయ్యను కలపడానికి చంద్రబాబు మరింతగా కృషి చేశారు. నందమూరి కుటుంబమంతా కలిసిఉంటే ఎంత లాభమో వివరంగా చెప్పినట్లు సమాచారం.
మనుషులను బంధాలతో బందీచేయడంలో దిట్టైన చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను కూడా తన కుటుంబంతో బంధుత్వాన్ని కులుపుకున్నారు. తన సోదరి మనవరాలితో వివాహం నిశ్చయించి... జూనియర్‌కు పెళ్లి చేయిస్తున్నారు. ఫ్యామిలీ కలపడం నేరుగా చంద్రబాబే జోక్యం చేసుకుంటుండడంతో.. నందమూరి కుటుంబ సభ్యులంతా.. జూనియర్‌కు చేరువయ్యారు. బాబు చేసిన మేలును జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ మరిచిపోకపోవచ్చు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి