రాజకీయ నేతలు జనానికి కనిపించేది.. ఎలక్షన్లప్పుడే.. సభలు.. యాత్రలతో హడావిడి చేస్తుంటారు. కానీ.. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు లేవు.. అయినా.. రాజకీయ నేతల దగ్గర నుంచి సినిమా హీరోల దాకా అందరూ జనం బాట పట్టారు. నలువైపులా యాత్రలతో రాష్ట్రాన్ని యాత్రాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. ఈ యాత్రలు జనం కోసమా లేక.. స్వప్రయోజనం కోసమా..
రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ వేరువేరుగా సాగిన తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఇకపై కలిసికట్టుగా సాగనున్నాయి. రాష్ట్రం ఎందుకు విడిపోవాలో ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్న రెండు పక్షాలూ.. సమైక్యంగా ఉద్యమాన్నిముందుకు తీసుకువెళ్లనున్నాయి. దీనికి సంబంధించి.. జైఆంధ్ర ఉద్యమ నేత కత్తి పద్మారావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాథమికంగా ఓ అంగీకారానికి వచ్చారు. అందులో భాగంగానే ఈనెల 29న విజయవాడలో జైఆంధ్ర సభను నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరవుతున్నారు.
జైఆంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే.. తెలంగాణ నేతలను కలుపుకొని వెళుతున్నారు. పైగా.. కేసీఆర్‌తో పాటు.. తెలంగాణ గాయకులకు కూడా విజయవాడ జైఆంధ్రా సభకు ఆహ్వానం పలికారు. అయితే.. జగన్ తెలంగాణ పర్యటనపై ముసిరిన వివాదం కేసీఆర్ టూర్‌కు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్‌ను అడుగుపెట్టనివ్వమ్మని తెలంగాణ వాదులు తేల్చి చెప్పినప్పుడు కేసీఆర్‌ను విజయవాడ ఎలా రానిస్తామంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే.. జగన్ టూర్‌తో పోల్చితే.. కేసీఆర్‌కు వచ్చే ఇబ్బందులు తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. కేసీఆర్‌ను పిలిచింది జైఆంధ్రా ఉద్యమనేతలు కాబట్టి వారి నుంచి ఎలాంటి ఇబ్బందీలేదు. ఇక టీడీపీ,కాంగ్రెస్‌లు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాయి కాబట్టి.. కేసీఆర్‌ను పర్యటించవద్దని ప్రకటించలేవు. అందుకే.. సమైక్య వాదుల్లో ఈ విషయంపై కాస్త గందరగోళం నెలకొంది. తెలంగాణలో ఎవరికీ అడ్డుచెప్పమని ప్రకటించిన తర్వాతే.. కేసీఆర్ విజయవాడకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ ఎంపీ లగడపాటికి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మధ్య ఎప్పటినుంచో రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా విజయవాడలోనే జరిగే సభకు కేసీఆర్ హాజరైతే.. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆటంకాలు కల్పించవచ్చు.
కేసీఆర్ ఆంధ్రా టూర్ ఎందుకు?
కలిసి పోరాడదామంటూ జైఆంధ్ర నేతల నుంచి ఇలా సూచన రాగానే.. అలా ఒప్పేసుకున్నారు కేసీఆర్. దీంతో రాష్ట్రంలోని రెండో ప్రాంతం నుంచి కూడా టీఆర్‌ఎస్ అధినేతకు బలం అందివచ్చినట్లయ్యింది. కేసీఆర్ మనసులో చాలా పెద్ద వ్యూహామే ఉంది. ఓ వైపు సమైక్యాంధ్ర నేతలు తెలంగాణలోకి పర్యటనల నేపథ్యంలో చొచ్చుకువస్తున్న తరుణంలో.. అదే స్థాయిలో తాను కూడా వెళ్లాలనుకొంటున్నారు. అందుకే.. కేవలం బెజవాడ మీటింగ్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. సీమాంధ్రల్లో మరికొన్ని సభలను కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
సీమాంధ్రలో ఇంతవరకూ కేసీఆర్ పర్యటించక పోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది టీఆర్‌ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితం కావడం. సీమాంధ్రల్లో ఎక్కడా పార్టీ శ్రేణులు లేవు. సభలు నిర్వహించాలంటే.. జనసమీకరణ చాలా కీలకం. తెలంగాణలో కేసీఆర్ పబ్లిక్‌ను ఆకర్షించినట్లు.. సీమాంధ్రలో ఆకర్షించకపోవచ్చు. దీనికి తోడు.. అవకాశం ఉన్నప్పుడల్లా సీమాంధ్ర నేతలపైనా,వ్యాపారులపై వాడివేడి విమర్శలు చేస్తూ వైరం పెంచుకున్నారు కేసీఆర్. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వయంగా జైఆంధ్రా నేతలే వచ్చి అడిగేసరికి, ఆంధ్రాలో తొట్టతొలి టూర్‌కు చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు. సభలకు అవసరమైన వనరులన్నీ అక్కడి నేతలే సమకూర్చుతారు కాబట్టి కేసీఆర్‌కు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇదే సమయంలో తమ వాదాన్ని సీమాంధ్రలో కూడా వినిపించే అవకాశం ఉంటుంది.
ఇక కేసీఆర్‌నే జైఆంధ్రా నేతలు ఎన్నుకోవడానికీ ప్రత్యేక కారణం ఉంది. జైఆంధ్రా ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారిలో రాజకీయంగా బలమైన నేతలు పెద్దగా లేరు. ఛరిష్మా ఉన్నవారూ తక్కువే. జైఆంధ్రా ఉద్యమానికి ఊపు రావాలంటే.. అందరినీ ఆకర్షించగల నేత కావాలి. ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రచారం రావాలన్నా ఆ స్థాయి నేతలు ఉండడం తప్పనిసరి. కాంగ్రెస్,టీడీపీ, పీఆర్పీల్లో ఉన్న పెద్దపెద్ద నేతలంతా సమైక్యవాదాన్నే బలపరుస్తున్నారు. వారు జైఆంధ్ర ఉద్యమానికి మద్దతివ్వడం అసాధ్యమే. కేసీఆర్ సభకు హాజరైతే.. విశేషమైన ప్రచారం లభిస్తుందన్న అంచనా ప్రత్యేకాంధ్ర నేతలది. పైగా.. ఇరు పక్షాలు చెప్పే విషయం రాష్ట్రం విడిపోవాలనే. సైద్ధాంతిక పరమైన విబేధాలు లేవుకాబట్టే.. కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతున్నారు ఆంధ్రా నేతలు.
సీమాంధ్రలో భారీగా సభలను నిర్వహించి.. జైఆంధ్రా , తెలంగాణ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని ఇరువర్గాలు భావిస్తున్నాయి. మొత్తంమీద చూస్తే ఒకరి అవసరాలను మరొకరు తీర్చుతున్నారు. మరి కలిసికట్టుగా నిర్వహించే ఈ సభలకు జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది విజయవాడ మీటింగ్‌రోజే తెలుస్తుంది.
అంతా రాజకీయం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిగా తెరపైకి వచ్చిన జగన్.. జనంలో పేరు సంపాదించుకోవడానికి ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి ఆకస్మిక మరణానంతరం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాలతోపాటు కడపలోనూ పర్యటించిన జగన్.. ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే.. జగన్ పర్యటనపై తెలంగాణ వాదులు తొలినుంచి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు కూడా ఇచ్చారు.
జగన్ యాత్రపై కాంగ్రెస్‌లోనే భిన్నస్వరాలు వినిపించాయి. వైఎస్ అనుచరులుగా పేరుపొందిన కొండామురళి, సురేఖ దంపతులు ఈ యాత్రను సమర్థిస్తే.. తెలంగాణ సీనియర్లు మాత్రం ఖండించారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున ఎర్రబెల్లి సంచనల ప్రకటన చేసి పెద్ద వివాదానికే తెరతీశారు. వైఎస్ వల్ల తెలంగాణ బీడు బారిందన్న ఎర్రబెల్లి.. జగన్ యాత్రను అడ్డుకోవాలన్నారు. అయితే.. హరికృష్ణ ఈ ప్రకటనను ఖండిస్తూ బహిరంగ లేఖరాయడం.. దానిపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చజరిగింది. చివరకు పార్టీ అధినేత చంద్రబాబుకు ఎర్రబెల్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ నెల 28న అంటే.. విజయవాడలో కేసీఆర్ సభలో పాల్గొనడానికి ఒక్కరోజు ముందు జగన్ వరంగల్‌కు వస్తున్నారు. ఆంధ్రాలో పర్యటించడానికి కేసీఆర్ సిద్ధమైనప్పుడు.. తెలంగాణలో తిరిగే తప్పేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకూ కాస్తోకూస్తో జగన్ యాత్రను విమర్శించిన నేతలు కూడా.. కేసీఆర్ బెజవాడ టూర్‌తో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. జగన్ యాత్రను సమర్థిస్తున్నారు.
మొత్తంమీద జగన్ టూర్‌ను అడ్డుకోవడానికి రెడీ అయిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. జగన్ యాత్రను అడ్డుకుంటే.. విజయవాడలో కేసీఆర్‌కు చుక్కెదురవుతుంది. అడ్డుకోకపోతే.. జగన్‌కు బలం పెరుగుతుంది. మొత్తంమీద వరంగల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇరకాటంలో పడేశారు కేసీఆర్.
చిరంజీవిది అదే దారి..
పనులు మొదలుకాకుండా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టును ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు చిరంజీవి. ఆరు జిల్లాల్లో 17 రోజుల పర్యటన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అవసరాన్ని.. ప్రాజెక్టు వల్ల కలిగే లబ్దిని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
పబ్లిక్‌ను ఆకట్టుకోవడానికి ఈ యాత్రలో రకరకాల విన్యాసాలనూ చిరంజీవి చేస్తున్నారు. వైఎస్‌ను అనుకరిస్తూ.. పంచెకట్టు తలపాగాతో రైతుబిడ్డలా కనిపించే పోస్టర్లను విడుదల చేశారు. పర్యటనలో భాగంగా జనంతో మమేకమవుతున్నారు. హీరోయిజాన్నీ ప్రదర్శిస్తూ.. గుర్రపుస్వారీ కూడా చేశారు. పోలవరం సాధించినా సాధించకపోయినా.. ఈ యాత్రతో ప్రజాసమస్యలపై పోరాడతారన్న ఇమేజ్‌ను దక్కించుకోవాలన్నది చిరంజీవి ప్రయత్నం.
జూలు విదిల్చిన సింహా
చాలా గ్యాప్ తర్వాత సింహా సినిమాతో మంచి హిట్‌ను దక్కించుకున్న బాలకృష్ణ కూడా జనంలోకే పయనమయ్యారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పబ్లిక్‌లోకి వెళితే.. పెద్దగా ఉపయోగం ఉండదన్న విషయం బాలయ్యకు కొంతకాలం క్రితమే తెలిసివచ్చింది. బాలకృష్ణ ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు పెద్దగా విజయం సాధించలేదు. దీంతో పొలిటికల్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు. అందుకే.. సింహా టూర్‌కు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ.
రాష్ట్రంలోని లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలను కలుపుతూ ప్లాన్ చేసిన బాలకృష్ణ టూర్‌కు భారీ స్పందనే వస్తోంది. ఎక్కడకు వెళ్లినా జనం బాలయ్యను చూడడానికి ఎగబడుతున్నారు. దీనికి తోడు.. తెలుగుదేశం పార్టీకి సర్వం తానే అన్న సంకేతాలూ ఈ సింహా టూర్‌తో పంపించారు. పాలిటిక్స్‌లోకి డైరెక్ట్‌గా ఎంటర్ కావడానికి ఈ టూర్ తొలిమెట్టన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అటు చిరంజీవి.. ఇటు బాలకృష్ణ పర్యటనల నేపథ్యం వేరైనప్పటికీ.. ఇద్దరూ ఆశిస్తోంది మాత్రం ఒక్కటే. రాజకీయంగా తమ బలాన్ని పెంచుకోవాలనే.
యాత్రలు అవసరమా?
ఓ వైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు ప్రాంతాల మధ్య విభేదాలు.. ఈ రెండింటి మధ్యా నేతల రాజకీయ పర్యటనలు. ఇదే ఇప్పుడు అసలు సమస్య. చిరంజీవి, బాలకృష్ణల యాత్రలు పక్కన పెడితే.. జగన్, చిరంజీవి, కేసీఆర్ చేసేవి పూర్తిగా రాజకీయ యాత్రలే. అవి కూడా ఇబ్బందులు సృష్టించేవే. ఓ వైపు డిసెంబర్ 31 కల్లా ఏదో ఒకటి తేల్చడానికి శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తున్నప్పుడు ఈ తరహా యాత్రలు ఇప్పుడు అవసరమా..
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విబేధాలు నెలకొన్న ఈ తరుణంలో నేతలు చేస్తున్న పర్యటనలు తీవ్ర ఇబ్బందులను సృష్టించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సీమాంధ్ర నేతల కార్యక్రమాలకు తెలంగాణ వాదులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. చివరకు చంద్రబాబు మిర్యాలగూడ పర్యటనను, రోశయ్య సభను కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సంయమనంతో వ్యవహరించాల్సిన నేతలు.. మరింత రెచ్చగొట్టేలా పర్యటనలు చేయడం అవసరమా.. వీటి ద్వారా సాధించాలనుకొంటోంది ఏమిటి? ఇక పేరుకు ఓదార్పు యాత్రంటున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం జగన్ టూర్‌ను రాజకీయం చేస్తున్నారు. జగన్‌ను అడ్డుకుంటామని తెలంగాణ నేతలు చెబుతున్నా.. ఆయన ఆగే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
ఇక కేసీఆర్ విషయానికొస్తే... సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రంగా ఉన్న విజయవాడకు వెళ్లడమూ సమస్యలను సృష్టించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. అవి రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలను మరింతగా పెంచే ప్రమాదం ఉంది.
రాజకీయంగా ఎంతో ఎదిగిన నేతలు... ఇలాంటి సున్నిత సమయంలో సునిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ.. ఆధిపత్యం కోసం ఆరాటపడితే నలిగిపోయేది మాత్రం సామాన్యులే. రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా నివేదికను ప్రభుత్వానికి అంద జేయనుంది. అప్పటివరకూ వేచి ఉండకుండా.. ముందుగానే ఇలా తొందర పడడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. పైగా నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
19, మే 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి