17, మే 2010, సోమవారం
హరికృష్ణకు ఉలుకెందుకు?
గాలినపోయే కంపను మెడకు తగిలించుకోవడమంటే ఇదే కావొచ్చు. ఈ విషయం ఇప్పుడు టీడీపీ నేతలకు బాగా అర్థమవుతోంది. తమ పార్టీకి సంబంధంలేని విషయంలోకి చొచ్చుకువెళ్లి కలహించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్.. తెలంగాణలోనూ అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే టీడీపీలో వివాదాన్ని సృష్టించింది. జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవాలంటూ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ ప్రకటన ఇచ్చారు. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలు మొదలయ్యాక.. ఇలాంటి హెచ్చరికలు.. రాజకీయ నేతల ప్రసంగాల్లో కామన్‌గానే ఉన్నాయి. అంతేకాదు.. జగన్ పర్యటించకూడదంటూ కాంగ్రెస్‌లోని చాలామంది తెలంగాణ నేతలూ ఇదివరకే హెచ్చరించారు. వాటితో పోల్చితే.. ఎర్రబెల్లి మాటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం తక్కువనే చెప్పాలి. ఇక దీనికి కౌంటర్ స్టేట్మెంట్ వస్తేగిస్తే.. కాంగ్రెస్ నేతల నుంచి రావాలి. కానీ.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. చాలాకాలంగా రాజకీయ తెరపై కనిపించని టీడీపీ నేత, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఎర్రబెల్లి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పర్యటనను అడ్డుకోవడం సరికాదంటూ ఓ బహిరంగ లెటర్‌ను విడుదల చేశారు. ఎర్రబెల్లి వ్యవహారశైలిని తీవ్రంగా దుయ్యబట్టారు.
సీమాంధ్ర, తెలంగాణ నేతలెవరైనా ఇతర ప్రాంతాల వారి మనోభావాలను దెబ్బతీయటం సరికాదని లేఖలో హరికృష్ణ పేర్కొన్నారు. అంతేకాదు.. గాంధీ నెహ్రూలను, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌నూ ప్రస్తావించారు. గాంధీ, నెహ్రూల యాత్రలను అడ్డుకుంటే స్వాతంత్ర్య వచ్చేదా? ఎన్టీఆర్‌ను అడ్డుకుంటే తెలుగు జాతి ఖ్యాతి విస్తృతమయ్యేదా అని లేఖలో ప్రశ్నించారు. అయితే.. హరికృష్ణ విడుదల చేసిన లేఖలో వాడిన పదజాలమూ.. వేసిన ప్రశ్నలే టీడీపీ నేతల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. లేఖలోని కొన్ని విషయాలను చూస్తే..
పరామర్శలను అడ్డుకోవడం అప్రజాస్వామికం...
ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు...
సీనియర్ నేతలు రొచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తగదు...
ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవ్యవస్థకు అవమానం...
ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు...
తాత్కాలిక ఆవేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు..
కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందంగా వ్యవహరించవద్దు...
దుందుడుకు వైఖరి మానండి.....
ఇలా తన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు హరికృష్ణ. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగాలని భావించేవారు ప్రజలను రెచ్చగొట్టరని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడమూ రాజ్యాంగ విరుద్ధమని కూడా ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ విడుదల చేసిన లేఖలో హరికృష్ణ పేర్కొన్నారు. ఈ లేఖ తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఎర్రబెల్లి మాత్రం తన ప్రకటనకే కట్టుబడి ఉన్నానంటున్నారు.
తేల్చుకోలేకపోతున్న తెలంగాణ తమ్ముళ్లు
ఎర్రబెల్లి, హరికృష్ణల వివాదం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిలా మారింది. అటు ఎర్రబెల్లి.. ఇటు హరికృష్ణ ఎవరి మాటమీద వారే ఉండడంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య హరికృష్ణ లేఖ మరింత దూరం పెంచేదిలా కనిపిస్తోంది. ఎర్రబెల్లి ప్రకటనలు.. పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించడమేనంటూ హరికృష్ణ పేర్కొనడమూ దుమారం లేపుతోంది. పార్టీకి సంబంధం లేని విషయంపై హరికృష్ణ ఇంత తీవ్రంగా స్పందించడాన్నీ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. లేఖ రాసింది హరికృష్ణ కావడంతో నోరు మెదపడం లేదు. నేరుగా ప్రకటనలు చేయడానికి సాహసించడం లేదు. ఎర్రబెల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరికృష్ణకు పార్టీలో మద్దతు బాగానే ఉంది. సీమాంధ్ర నేతలు హరికృష్ణ చర్యలను సమర్థిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరినీ ఎవరికీ అడ్డుకునే హక్కు లేదని బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకుంటామంటూ ఎర్రబెల్లి ప్రకటన, దానికి హరికృష్ణ స్పందనపై తెలుగుదేశం పార్టీలో జోరుగానే చర్చ జరుగుతోంది. అయితే.. హరికృష్ణ కామెంట్లను సూచనలుగానే భావించాలని టీడీపీ సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో కొంతకాలంగా సీమాంధ్ర నేతలకు, తెలంగాణ నేతలకూ ఏమాత్రం సఖ్యత లేదు. రెండు ప్రాంతాలూ తనకు రెండు కళ్లవంటివంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వర్గాలనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ అంశంపై నేరుగా స్పందించకుండా పార్టీ శ్రేణులతోనే మాట్లాడిపిస్తున్నారు. ఈ సమయంలో చెలరేగిన జగన్ ఓదార్పు యాత్ర వివాదం.. మరిన్ని సమస్యలను సృష్టించవచ్చన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే.. ఈ మొత్తం వివాదాన్ని మీడియాపైకి తోసేసే ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. హరికృష్ణకు పూర్తిగా సమాచారం లేకపోవడం వల్లే.. ఇలాంటి లేఖ రాసి ఉంటారని భావిస్తున్నారు. హరికృష్ణ లేఖ సీమాంధ్ర నేతల్లో మరింత ఉత్సాహం నింపితే.. తెలంగాణ నేతలను మాత్రం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. మొత్తంమీద టీడీపీలో మరోసారి ముసలాన్ని జగన్ ఓదార్పు యాత్ర సృష్టించింది.
సీతయ్య వెనుకున్నది ఎవరు?
ఒకే ఒక్క లేఖతో దుమ్ములేపాడు సీతయ్య. జగన్ యాత్రను అడ్డుకొంటామన్న ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు హరికృష్ణ. అయితే.. ఆయనకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? లేఖలో అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు కాంగ్రెస్ నేత జగన్‌ను అంటే.. టీడీపీ నేత హరికృష్ణ ఉలిక్కి పడాల్సిన అవసరం ఉందా.. వాస్తవానికి లేకపోయినా.. కొన్ని కారణాల వల్ల హరికృష్ణ లేఖను విడుదల చేయాల్సి వచ్చింది.
హరికృష్ణ ఈ లేఖను స్వయంగా రాశారా? లేక ఎవరైనా రాయించారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. పార్టీలో విభేదాలపై ఇటీవల కాలంలో హరికృష్ణ చురుగ్గా పాల్గొనడం లేదు. పైగా.. టీడీపీ కార్యకలాపాలకు కూడా చాలావరకూ దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా ఎర్రబెల్లిపై కస్సుమనడంపైనే సందేహమంతా. తరచి చూస్తే.. హరికృష్ణ వెనుక ఎవరో ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు అర్థమవుతుంది. పైగా, చంద్రబాబు కనుసన్నల్లో నడిచే హరికృష్ణ, తనంతతానుగా, పార్టీలో విభేదాలకు దారితీసే ప్రకటనను ఇవ్వరన్న వాదనా ఉంది. అంటే.. హరికృష్ణతో లేఖ రాయించింది చంద్రబాబేనా?
ఒకవేళ చంద్రబాబే ఈ లెటర్ రాయించారనుకుంటే.. అందుకు కారణాలేంటన్నదీ పరిశీలించాల్సి ఉంటుంది. జగన్ సీమాంధ్ర నేత. ఇప్పుడు జగన్ యాత్రను టీడీపీ నేతలు అడ్డుకుంటే.. భవిష్యత్తులో చంద్రబాబుకూ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే పరిస్థితి ఎదురుకావచ్చు. పైగా, తెలంగాణలో పర్యటించడానికి ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణ కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ యాత్రను తమ కార్యకర్తలతో ఆటంకాలు సృష్టిస్తే... అంతకు అంత సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ నేతలు రెడీగా ఉంటారు. అందుకే.. చంద్రబాబు నేరుగా కాకుండా హరికృష్ణను రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. జగన్ పేరు ప్రస్తావిస్తే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినట్లవుతుంది కాబట్టి.. ఆ పేరు వాడకుండా లేఖ రాశారు హరికృష్ణ. అయితే.. ఎర్రబెల్లిని విమర్శించడం ద్వారా.. ఆ పనినే చేశారని చెప్పాలి.
ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఖండించడానికి హరికృష్ణనే ఎంచుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చింది? దీనికీ ఎన్నో కారణాలున్నాయి. ఆంధ్ర,తెలంగాణలు రెండు తనకు రెండు కళ్లలాంటివన్న చంద్రబాబు.. ఏదో ఓ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడలేరు. పైగా.. జగన్ విషయం ఆయన దృష్టిలో చాలా చిన్నది. అందుకే హరికృష్ణ ద్వారా ప్రకటన చేయించారు. పైగా హరికృష్ణను పార్టీ నేతగా కన్నా.. ఎన్టీఆర్ తనయుడిగానే తెలుగుదేశం నేతలు చూస్తారు. రెండు ప్రాంతాల్లోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హరికృష్ణను నేరుగా విమర్శించే సాహసాన్ని ఎవరూ చేయరు. అదే మరో సీమాంధ్ర టీడీపీ నేత ఇలా బహిరంగ లేఖ విడుదల చేస్తే.. వెంటనే తెలంగాణ నేతల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన వస్తుంది. అది పార్టీని చీలిక దిశగా నడిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే.. చంద్రబాబు పర్యటనలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. ఇప్పటికే మిర్యాలగూడలో ఆ అనుభవం చంద్రబాబుకు ఎదురయ్యింది. అందుకే.. ఈ విషయంలో జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
హరికృష్ణ కూడా ఈ విషయంలో తొందరపడడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే సింహా టూర్‌తో రాష్ట్రంలో బాలకృష్ణ దూసుకుపోతున్నాడు. అవకాశం ఉన్నచోటల్లా పార్టీకి తానే ఆక్సిజన్నంటున్నాడు. సింహా విజయంతో బాలయ్యకు ఫాలోయింగ్ మరింత ఎక్కువయ్యింది. నందమూరి ఫ్యాన్స్, టీడీపీ నేతలూ ఎక్కడికి వెళ్లినా నీరాజనం పడుతున్నారు. అందుకే.. మరోసారి టీడీపీలో క్రియాశీలకం కావాలనుకుంటున్నారు హరికృష్ణ.
హరికృష్ణ పై యాక్షన్ ఉంటుందా?
తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యే నన్నపనేని కామెంట్లు పెద్ద వివాదాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, టీడీపీలో ఉండదంటూ ఏప్రిల్‌లో నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ఈ మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆమె కామెంట్లపై విచారణకు ద్విసభ్య కమిటీని కూడా పార్టీ వేసింది. రాజకుమారి నుంచి వివరణ కూడా తీసుకున్నారు. చంద్రబాబును నేరుగా కలిసి ఆమె సారీ చెబితే తప్ప వివాదం సద్దుమణగలేదు. ఇదే సమయంలో పార్టీ గురించి, నేతల గురించి బయటమాట్లాడకూడదని సీరియస్‌గానే నన్నపనేనికి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
ఇది నన్నపనేని రాజకుమారి కథ. ఇప్పటి విషయానికి వస్తే.. ఎర్రబెల్లి చంద్రబాబును కానీ, టీడీపీ నేతలను కానీ, పార్టీ తీరును కానీ విమర్శించలేదు. ఆయన చేసిందల్లా మరో పార్టీకి చెందిన ఎంపీని రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో అడుగుపెట్టవద్దన్నారు. అంతమాత్రానికే.. హరికృష్ణ హడావిడిగా బహిరంగ లేఖ రాయడం కరెక్టేనా.. తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ సాధారణ నేత ఏమాత్రం కాదు. ఆయన కావాలనుకుంటే ఎర్రబెల్లిని పిలిపించుకొని మాట్లాడగలరు. లేదంటే.. పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నేరుగానే ఎర్రబెల్లికి విషయం చెప్పొచ్చు. అదీ కుదరదనుకుంటే.. ఫోన్లో చెప్పినా సరిపోతుంది. కానీ, బహిరంగ లేఖ విడుదల చేయడంలోనే అసలు ఆంతర్యం బోధపడుతుంది. జగన్ యాత్రను అడ్డుకోవద్దంటూ ఒక్క ఎర్రబెల్లికి మాత్రమే కాక.. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియాలని భావించినట్లు కనిపిస్తోంది. మరి నేరుగా ఎర్రబెల్లిని విమర్శించిన హరికృష్ణపై నన్నపనేని తరహాలోనే చంద్రబాబు చర్యలు తీసుకుంటారా.. వీరిద్దరి మధ్యా వివాదానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారా? లేదంటే, నన్నపనేనికో న్యాయం.. హరికృష్ణకు మరోన్యాయమని సరిపెడతారా?
హరికృష్ణ లేఖ తప్పని టీడీపీలో ధైర్యంగా బయటకు చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎర్రబెల్లిది తప్పుకాదంటూనే.. హరికృష్ణ లేఖనూ సమర్థిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో టీడీపీ వ్యూహం ఫలించినట్లుగానే కనిపిస్తోంది. హరికృష్ణ లేఖకు కాంగ్రెస్ పార్టీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎర్రబెల్లిని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హరికృష్ణ చర్యలను మెచ్చుకుంటున్నారు. క్రమశిక్షణపై ఎక్కువగా దృష్టి పెట్టే చంద్రబాబు.. హరికృష్ణ లేఖ విషయంలో మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయకుండా.. వదిలివేయాలన్న ఆలోచనలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... తెలంగాణ టీడీపీ నేతల్లో మాత్రం.. హరికృష్ణ లేఖ తీవ్ర అసంతృప్తిని నింపింది. ఈ వివాదం చాపకింద నీరులా పాకే ప్రమాదమూ కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
good article.
Lets see CBN takes action on Harikrishna or not?
తెలుగు రాజకీయాలు ఎంత దగుల్భాజీ రాజకీయాలో తెలంగాణా అంశం తేల్చేసింది.
మన రాజకీయ నాయకుల నగ్న స్వరూపాలను బట్టబయలు చేసింది.
మరీ ముఖ్యంగా ఆంద్ర రాజకీయనాయకుల ఆధిపత్యం, ఐకమత్యం, అర్ధబలం, అహంభావం ...
అట్లాగే తెలంగాణా నాయకుల లొంగు బాటు తనం, అమ్ముడుబోయే తత్త్వం, ఆత్మాభిమానం లేని పిరికితనం ప్రజలకు బాగా అర్ధమయ్యాయి.
తెలంగాణా నాయకులు తెలంగాణా ప్రజలకు దొరలు .... కానీ ఆంధ్ర నేతలకు బానిసలు.
వాళ్ళ అడుగులకు మడుగులోత్తుకుంటూ కూర్చునే వెన్నెముక లేని వాజమ్మలు అని పదే పదే రుజువయింది.
హరికృష్ణ ఉదంతాన్ని మీరు చాల చక్కగా విశ్లేషించినందుకు అభినందనలు.
తెలంగాణా పై పార్టీలు మనిఫెస్తోల్లో ఒకటి పెట్టి , ప్రజలకు ఒకరకం హామీ ఇచ్చి బయట మరోరకంగా వ్యవహరించడం అప్రజాస్వామికం కాదా?
మీరు తెలంగాణా బిల్లు పెట్టండి మేం సమర్దిస్తాం అని తర్వాత ప్లేటు ఫిరాయించడం అప్రజాస్వామికం కాదా?
జగన్ తన పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పార్లమెంటులో తీ డీ పీ సభ్యుల అక్కున చేరి తెలంగాణా ప్రకటనను నిరసిస్తూ తన పార్టీనే అవహేళన చేయడం అప్రజాస్వామికం, అనైతికం కాదా?
తెలంగాణా యువత పిట్టల్లా రాలిపోతుంటే కిక్కురు మనకుండా తెలంగాణా వాదం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల నినాదం అంటూ పదే పదే గేలి చేయడం, తెలంగాణా ప్రజల ప్రాణాలను, ఆకాంక్షలనూ బాధ్యతాయుతమైన పార్తీలేవి పట్టించుకోక పోవడం, రెండు కళ్ళంటూ నాటకాలాడటం అప్రజాస్వామికం కాదా?
ప్రజల మనో భావాల పేరుతొ ఒకే పార్టీ రెండు నాలుకల ధోరణి అనుసరించడం అప్రజాస్వామికం కాదా.
థూ.... ఎం బట్టేబాజి రాజికీయ లఫంగులు దాపురిం చారురా తెలుగు ప్రజలకు!!
మీరు హరికృష్ణ చేత చంద్రబాబు చేయించాడు అంటున్నారు... ఎర్రబెల్లి తో కూడా ఆ వ్యాఖ్యలు చంద్రబాబే చేయించి ఉండొచ్చుకదా తెలంగాణ లో కొంచెం sympathy కోసం...ఇలాంటి విషయాల్లో చంద్రబాబు మహా ముదురు. నా ఉద్దేశం లో రెండు కళ్ళ చంద్రబాబే ఈ గేమ్ ఆడాడు.
ఇంక తెలుగు దేశం పార్టీ లో చీలిక వస్తుంది అనుకుంటే మనం అందరికన్నా వెర్రి పప్పలం అయినట్లే. ఒక వేల వచ్చేదుంటే తెరాస 10 మంది MLA లు రాజీనామా చేసినప్పుడే వచ్చుండాలి. ఈ రోజుల్లో వ్యక్తులకన్నా పార్టీలు చాలా గొప్పవి అని తెదేపా నాయకులకు తెలుసు. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు స్వయంగా దాన్ని పరీక్షించి మరీ తెలుసుకున్నారు.