26, మే 2010, బుధవారం
ల్యాబుల్లో మనుషుల తయారీ..
దేవుడు ఉన్నాడా.. లేడా అన్నది పక్కన పెడదాం.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విశ్వాసం ప్రకారం ఈ సృష్టిని దేవుడు సృష్టించాడనుకుందాం. కులమతాలుగా ఈ ప్రపంచం ఎన్ని ముక్కలుగా ఉన్నా.. జీవుల జననమరణాలనూ శాసించేది దేవుడు మాత్రమే అన్నది అందరి నమ్మకం. కానీ.. ఆ నమ్మకం ఇప్పుడు వమ్ము కాబోతోంది..
పాలపుంతలు, ఎన్నో నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే మరెన్నో గ్రహాల సముదాయమే ఈ అనంత విశ్వం. మన కంటికి కనిపించేది ఇందులో కేవలం ఐదు శాతమే. అయితే.. ఈ విశ్వం ఎలా ఏర్పడింది.. అందులో మన భూమికి స్థానం ఎలా దక్కిందన్నది.. ఇప్పటికీ అంతుబట్టని ప్రశ్నే. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నా.. అసలైన కారణాన్ని మాత్రం ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు. విశ్వం ఆవిర్భవానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలున్నప్పటికీ.. అవి ఎంతవరకూ నిజమన్నది ఎవరికీ తెలియదు.
ఇక విశ్వం నుంచి మన ఆవాసమైన భూమిపైకి వద్దాం. మనుషులతో పాటు కొన్ని కోట్ల జీవరాశుల మనుగడకు ఈ భూమే ఆధారం. ఇప్పటివరకూ ఈ జీవుల పుట్టుకను సృష్టిరహస్యంగానే భావిస్తూ వచ్చారు. జీవి ఎలా ప్రాణం పోసుకుంటుందన్న దానికి శాస్త్రపరమైన ఆధారాలు ఉన్పప్పటికీ.. అందుకు కచ్చితంగా ప్రకృతిలోని శక్తుల తోడ్పాటు కావాల్సి ఉంటుంది. అది మరో ప్రాణి కావడమే అందులోని విశేషం. మనిషుల విషయాన్ని తీసుకుంటే... స్త్రీ,పురుషులిద్దరి సహకారం లేనిదే మరో ప్రాణి పురుడు పోసుకోదు. ఇదే సృష్టి రహస్యం.
కానీ.. స్త్రీ,పురుషుల అవసరం లేకుండా మరో మనిషిని పుట్టించవచ్చా... అసలు ఒక ప్రాణి పుట్టడానికి మరో ప్రాణి అవసరం ఉందా.. కృత్రిమంగా ఓ ప్రాణిని సృష్టించవచ్చా.. ఈ ప్రశ్నలే.. కొత్త పరిశోధనలకు బీజం వేశాయి. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయోగాలు.. ఇప్పుడు సరికొత్త విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ప్రకృతితో పనిలేకుండా.. పూర్తిగా లాబొరేటరీల్లో.. అసహజ ప్రకియల ద్వారా ఓ కణాన్ని సైటింస్టులు సృష్టించారు. ఇది కృత్రిమంగా తయారు చేసిన తొట్టతొలి కణం.
జీవశాస్త్ర పరిశోధనల్లో ఇలాంటి విజయం ఇంతకుముందెప్పుడూ సాధ్యం కాలేదు. ఇదే తొలి విజయం. అంతేకాదు.. ఈ కృత్రిమ కణజాలం సృష్టించడంతో.. మనుషుల అవసరం లేకుండానే.. కృత్రిమంగా మరో మనిషిని ప్రయోగశాలల్లో.. రసాయనాల ఆధారంగా తయారుచేయవచ్చన్న భావనలకు బలం చేకూరుతోంది. బహుశా అది మరెంతో దూరంలో లేకపోవచ్చు. అంటే.. సృష్టి రహస్యాన్ని ఛేదించే దిశలో మన ప్రయాణం దూసుకువెళుతోందని చెప్పవచ్చు. నమ్మకాల ఆధారంగా చెప్పాలంటే.. మనిషిని సృష్టించడంలో దేవుడితో పోరాడటానికి మానవుడు సిద్ధమయ్యాడు.
క్రెగ్ వెంటర్ కృషి
మానవ ఆవిర్భావం తర్వాత అతిపెద్ద శాస్త్రీయ ఆవిష్కరణ కృత్రిమ కణ సృష్టనే చెప్పాలి. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో ఇలాంటి విజయం ఇంతవరకూ మనకు దక్కలేదు. అందుకే.. ఒక్క చిన్న కణాన్నే సృష్టించినప్పటికీ.. క్రెగ్ వెంటర్ బృందం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ విజయం క్రెగ్‌కు అనుకున్నంత సులువుగా అందలేదు. దీనికోసం అహోరాత్రులు శ్రమించాల్సి వచ్చింది. ఇప్పటివరకూ జరిగిన జన్యు ప్రయోగాలను ఆధారం చేసుకొని... కృత్రిమకణాన్ని సృష్టించగలిగారు క్రెగ్ వెంటర్.
సింథటిక్ సెల్‌ను సృష్టించడం కోసం.. ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు క్రెగ్ వెంటర్. జన్యు ప్రయోగాల్లో ఎంతో అనుభవం సంపాదించిన వెంటర్.. అందరిలా ఆలోచిస్తే లాభం లేదనుకున్నాడు. జన్యుమార్పిడి ప్రయోగాలు ఎన్నో జరుగుతుండడంతో... తన దృష్టిని సింథటిక్ సెల్స్‌పై పెట్టాడు. తన ప్రయోగాలకు మైకోప్లాస్మా బ్యాక్టీరియాకు చెందిన రెండు జాతులను ఎంచుకున్నారు. ముందుగా మైకోప్లాస్మా మైకాయిడ్స్ అనే బ్యాక్టీరియాను పోలిన డీఎన్ఏను కృత్రిమంగా సృష్టించారు. ఆ తర్వాత.. మరో మైకోప్లాస్మా బ్యాక్టీరియాలోని జన్యుసమాచారాన్ని కలిగి ఉన్న డీఎన్ఏను పూర్తిగా తొలగించారు. అందులోకి.. కృత్రిమంగా సృష్టించిన మైకాయిడ్స్ డీఎన్ఏను ప్రవేశపెట్టారు. దీంతో.. కొత్త కణం సిద్ధమయ్యింది. అంతటితోనే ఆగలేదు. కృత్రిమ డిఎన్ఏ నుంచి ఉత్పత్తి అయిన ప్రొటీన్లను ఉపయోగించుకుని ఆ కణం పునరుత్పత్తి ప్రారంభించింది. తనలాంటి దాదాపు పదిలక్షల కణాలను అది సృష్టించగలిగింది.
చెప్పడానికి సులువుగానే ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రయోగం ద్వారా కృత్రిమ కణాలను సృష్టించవచ్చన విషయాన్ని కనిపెట్టడానికి వెంటర్ బృందానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. కృత్రిమ డీఎన్ఏను తయారు చేయడానికి నాలుగు రకాల రసాయనాలను, బ్రెడ్‌ను తయారు చేయడానికి వాడే ఈస్ట్‌ను ఈ ప్రయోగంలో ఉపయోగించుకున్నారు. కృత్రిమ డీఎన్ఏను సృష్టించి.. బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పటికీ తొలిఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు. కణంలోకి ప్రవేశపెట్టిన కృత్రిమ DNA క్రియారహితంగానే ఉండిపోయింది. జన్యుపటంలోనే లోపం ఉందని తెలుసుకున్న వెంటర్ బృందం.. దాన్ని సరిచేసి.. ఈ కొత్త సింథటిక్ సెల్‌ను సృష్టించగలిగింది. దీనికోసం.. మైకోప్లాస్మా బ్యాక్టీరియానే క్రెగ్ వెంటర్ ఎంచుకోవడానికీ ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు.
ఇక కృత్రిమ మనుషులు?
శాస్త్రప్రయోగాలను చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ మనిషికున్న అసలు సిసలు లక్ష్యం ఒక్కటే. కృత్రిమంగా.. అంటే.. స్త్రీపురుషుల సహకారం లేకుండా ప్రయోగాశాలలోనే ఓ మనిషిని సృష్టించడం. దీనికోసం.. కొన్ని వందల ఏళ్ల నుంచి రకరకాల ప్రయోగాలను ఎంతోమంది చేస్తున్నారు.
అయితే.. క్రెగ్ వింటర్ కణాన్ని కృత్రిమంగా సృష్టించానని చెబుతుండడంతో.. లాబ్స్‌లో మనిషిని తయారుచేయవచ్చన్న ఆలోచనలకు మంచి మద్దతు దొరికినట్లయ్యింది. క్రెగ్ సాధించిన విజయంతో.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మరికొంత కాలానికైనా మనిషి తయారుచేయవచ్చు. అయితే.. కణాన్ని సృష్టించామన్నదానికి శాస్త్రీయపరమైన నిర్దారణ జరిగినప్పుడు.. కొన్ని కోట్ల కణాలను ఏకకాలంలో సృష్టించగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది.
మనిషిని కృత్రిమంగా తయారు చేయవచ్చని భావించడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మానవ శరీరం కణజాల నిర్మితం. కొన్ని కోట్ల కణాలు కలిస్తేనే మన శరీరం. అవయవాన్ని బట్టి, అవసరాన్ని బట్టి.. మన శరీరంలోని కణాల్లో మార్పులుంటాయి. ఈ తరహా కణాలను సృష్టించి.. ఒక్కచోట చేర్చితే.. మనిషిని తయారు చేయడం సాధ్యమేనన్నది శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
కణాన్ని కృత్రిమంగా సృష్టించారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా షికారు చేస్తున్నప్పటికీ.. ఈ ప్రయోగ ఫలితాలను విశ్వసించని వారికీ కొదవే లేదు. కారణం.. ఇంతవరకూ మన శాస్త్రాల్లో పేర్కొన్న సూత్రాలే. సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యం కానే కాదని తెల్చిచెబుతున్నారు. పైగా.. శూన్యం నుంచి జీవిని సృష్టించడమనే వాదనే సరికాదంటున్నారు.
సింథటిక్ సెల్‌ను సృష్టించామంటూ.. క్రెగ్ బృందం చేసిన ప్రకటన సైన్స్ ప్రపంచంలో సునామీనే సృష్టించింది. ఏదైనా నిర్దారణకు లోబడిన వాటినే శాస్త్రం నమ్ముతుంది కాబట్టి.. క్రెగ్ వెంటర్ ప్రయోగమూ అందుకు మినహాయింపు కాదు. ఈ ప్రయోగాన్ని బహిరంగం చేయడంతో పాటు.. .. అదే తరహాలో మరిన్ని కణాలను సృష్టించగలిగితేనే కృత్రిమ కణాన్ని తయారు చేసినట్లు భావించవచ్చు. అప్పుడే.. లాబొరేటరీ మ్యాన్ వైపు దృష్టి పెట్టవచ్చు.
కృత్రిమ కణాల సృష్టితో మనకు కలిగే లాభమేమిటి?
ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి.... మనకు అవసరమైన బ్యాక్టీరియాలను ఈ పద్దతుల ద్వారా సృష్టించుకోవచ్చు. ఇంకాస్త ముందుకువెళ్లి.. మొక్కలను, జీవులను కూడా కృత్రిమంగా తయారు చేయవచ్చు. అన్నింటికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది.. మనిషి సత్తా ఏమిటో... ఈ సువిశాల విశ్వంలో మన స్థానం ఏమిటో.. ఈ పరిశోధనతో తెలిసివచ్చింది. దైవంతో పోటీ పడుతూ.. మరో జీవిని సృష్టించగలమన్న ధైర్యం మనిషికి వచ్చింది.
గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలను, గ్రీన్హౌస్ వాయువులను ఎక్కువగా పీల్చుకోగల మొక్కలను సృష్టించవచ్చు. బయో రసాయనాల సృష్టి కూడా ఇకపై సులువే. నీటిని శుద్ధి చేయడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. అంతే కాదు... కొత్త రకం ఆహరం కూడా తయారు చేసుకోవచ్చు.
మరో ముఖ్యమైన విషయమేంటంటే...ఈ కృత్రిమ బ్యాక్టీరియాతో పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించవచ్చు. మనకు కావాల్సిన అనేక వస్తువులను రూపొందించుకోవచ్చు. ఆర్థికమాంద్యం, నిరుదోగ్య సమస్య వెంటాడున్న ప్రస్తుత తరుణంలో యువతకు భారీ స్థాయిలో ఉపాధి మార్గాలు చూపించనుంది ఈ కృత్రిమ కణం. ఇక ఈ కణం సృష్టికర్త క్రెగ్ మాటల్లో చెప్పాలంటే.. భవిష్యత్తులో సైన్స్‌కు సంబంధించిన ప్రతీ ప్రయోగమూ ఇది లేకుండా జరగదంట.
నష్టాలూ ఉన్నాయి..
మనిషి తయారు చేసిన జీవే.. మానవాళిని అంతం చేస్తే.. ఈ ఊహే వెన్నులో వణుకుపుట్టిస్తోంది కదూ.. క్రెగ్ వింటర్ పరిశోధనల వెనుకా ఇలాంటి భయం వెన్నాడుతోంది. ముఖ్యంగా జీవరసాయన ఆయుధాలను కృత్రిమ కణాల ద్వారా సృష్టించవచ్చు. ఒక్కసారి టెర్రరిస్టుల చేతుల్లోకి ఈ పరిజ్ఞానం వెళ్లిందంటే.. ప్రపంచం ప్రమాదపుటంచుల్లో పడినట్లే. ఎలాంటి వైరెస్‌ను సృష్టిస్తారో.. ఎంతటి వినాశనాన్ని కలిగిస్తారో అంచనా వేయడమే కష్టం. అందుకే.. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రయోగంపై లోలోపల కలవరపడుతున్నాయి.
అయితే.. కణాలపై జరుగుతున్న ప్రయోగ రహస్యాలు... సంఘవ్యతిరేక శత్రువుల చేతుల్లో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అణుపరిజ్ఞానం విషయంలో ఉన్న కఠిన నిబంధనలకన్నా.. మరింత కఠినంగా ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ప్రభుత్వాల నియంత్రణలో ఈ ప్రయోగాలు సాగినంత కాలం ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అయితే.. ప్రమాదకర కణాలను సృష్టించడం.. వాటి ద్వారా మానవాళిని నాశనం చేసే జీవులను తయారు కాకుండా.. అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పటినుంచే తీసుకోవాల్సి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కణం లో ఉన్న DNA తీసివేసి కృత్రిమ DNA ని పెట్టారు. కృత్రిమ DNA తో కణం పని చేస్తోంది ప్రోటిన్స్ వగైరా తయారు చేసి. ప్రోటిన్స్ తయారు చేసే పద్ధతి అంతా పాత కణం లో ఉన్న దే కదా. ఎ ప్రోటీన్స్ చెయ్యలి అనేది మాత్రం కొత్త DNA నుంచి వస్తుంది. ఇది కూడా తప్పే ఎమినో ఆసిడ్ వరుస మాత్రమె కొత్త DNA నుండి వస్తుంది. కణం లో ఉన్న DNA మాత్రమె కొత్తది కణం పాతదే కదా. ఎందుకని అందరూ కొత్త కణం అంటున్నారు? ఈ సందేహం కొంచము తీరుస్తారా.
పయిన నా సందేహానికి ఉదాహరణ: Heart transplant లో దేహము లో కొత్త గుండె పెట్టటము మూలంగా మనిషిని కొత్త మనిషని అనటము లేదు కదా.
Butg if you change the brain, then its a new person.
మీ సందేహాలకు ఇదిగో సమాధానం..
ఆర్టిఫిషియల్‌గా ఓ డీఎన్ఏను తయారు చేశారు. దాన్ని మరో డీఎన్ఏ తీసేసిన కణంలోకి ప్రవేశపెట్టారు. అంటే.. డీఎన్ఏకు ఓ కణాన్ని అందించారన్నమాట. అప్పుడు ఆ డీఎన్ఏ..మరిన్ని కొత్త కణాలను తయారు చేసింది. అలా తయారైన కొత్త కణాలే.. కృత్రిమ కణాలుగా పరిగణిస్తున్నారు, ఆర్టిఫిషియల్ డీఎన్ఏ నుంచి తయారయ్యాయి కాబట్టి.
satyam గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.