4, మే 2010, మంగళవారం
రక్తచరిత్ర
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌గోపాల్ వర్మ.. రక్తచరిత్ర విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవగాధల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలున్నాయి. అందులోనూ.. రాష్ట్రచరిత్రలో.. మహాశత్రువులుగా పేరొందిన.. పరిటాల రవి, మద్దెలచెర్వు సూరిల కథ కావడంతో.. సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.
రక్త చరిత్ర ట్రైలర్స్ విడుదలయ్యాయి.. గాంధీ మాటలను కోట్ చేస్తూ.. అనంతపురంలో ఫ్యాక్షన్ హత్యలను ప్రస్తావిస్తూ.. ట్రైలర్స్‌లో సుదీర్ఘమైన డైలాగే చెప్పాడు రామ్‌గోపాల్ వర్మ.
రక్త చరిత్రకు నేపథ్యం.. అనంతపురం ఫ్యాక్షన్ గొడవలే. ముఖ్యంగా.. పరిటాల రవి.. మద్దెలచెర్వు సూరి మధ్య సాగిన సంగ్రామమే ఈ సినిమాలో మనకు కనిపించనుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాలు.. ఇద్దరి మధ్యా నలిగిపోయిన పల్లెలు.. ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు.. ఇద్దరికీ రాజకీయనేతల అండదండలు.. ఇలా ప్రతీ అంశాన్ని వర్మ స్పృశించినట్లుగా తెలుస్తోంది.
అయితే.. రక్తచరిత్రను రెండు పార్టులుగా తీశాడు వర్మ. కేవలం రెండున్నర గంటల్లో మొత్తం సినిమాను చూపించలేమని భావించిన రామ్‌గోపాల్ వర్మ.. రెండు సినిమాలుగా మార్చాడు. ఫస్ట్ సినిమా ఆగష్టులో విడుదల కానుంది. ఇక సీక్వెల్‌గా వచ్చే సినిమాలను.. సాధారణంగా ఆర్నెల్లో.. ఏడాది తర్వాతో విడుదల చేయడం పరిపాటి. కానీ.. ఈ విషయంలో రామ్ మాత్రం సరికొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాడు. మొదటి సినిమాకు.. రెండో సినిమాకు మధ్య.. చాలా తక్కువ గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. వారం రోజుల తేడాతోనే.. రెండు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు సినీ హిస్టరీలోనే కాదు.. భారత సినీ ఇండస్ట్రీలోనే ఇదో సంచలన నిర్ణయం.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ షూటింగ్ చేశాడు వర్మ. కొద్దిపాటి ప్యాచ్ వర్క్‌లు మాత్రమే మిగిలిఉండడంతో.. విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆగస్టులో విడుదల చేస్తున్నట్లు ట్రయలర్స్‌ను చూస్తుంటే తెలుస్తుంది.
రక్త చరిత్ర ఎందుకోసం?
ఇంతకీ.. వర్మ రక్త చరిత్రను ఎందుకు తీస్తున్నారు.. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు.. ఇవి కాస్త ఆలోచనలో పడేసే ప్రశ్నలే. ముంబైలో ఉంటూ.. మాఫియా సినిమాలు.. దెయ్యాలు.. భూతాలు సినిమాలు తీసే వర్మ దృష్టి సడన్‌గా మనపై ఎందుకు పడింది.. అనంతపురం దాకా.. ఆయన్ను లాక్కెళ్లిన విషయమేమిటి?
ఇటీవలి కాలంలో చూస్తే.. హిందీలో ఫూంక్‌ను తీసి.. తెలుగులో రక్షగా విడుదల చేసిన వర్మ.. ఈ మధ్య దానికి సీక్వెల్‌గా ఫూంక్ టు ను నిర్మించాడు. తెలుగులో ఆవహంగా ఇది జనం ముందుకు వచ్చింది. జనాన్ని భయపెడదామని వర్మ అనుకుంటే.... టికెట్లు కొనకుండా.. ఆయన్నే భయపెట్టారు సినీ ప్రేక్షకులు.. ఇక సర్కార్ సిరీస్‌తో బాలీవుడ్‌లో కాస్తోకూస్తో పేరు తెచ్చుకున్నప్పటికీ.. మంచి హిట్‌ను వర్మ చవిచూసి చాలాకాలం అయిపోయింది. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యలను కలిసికట్టుగా వెండితెరపై చూపించినా.. సర్కార్ రాజ్ కాసులు కురింపించలేకపోయింది.
హిందీకి సరిపోయే సబ్జెక్ట్‌తో సినిమా తీయడం.. దాన్ని తెలుగులోకి అనువదించడం అలవాటైన రామ్‌గోపాల్‌వర్మ.. ఈసారి మాత్రం రూటు మార్చాడు. తెలుగులో అన్నా మంచి హిట్ కొట్టాలనుకొని.. కత్తిలాంటి స్టోరీని ఎన్నుకున్నాడు. అదే... పరిటాల రవి.. మద్దెలచెర్వు సూరిల శతృత్వం. వీరిద్దరి గురించి రాష్ట్రం మొత్తానికి తెలుసుకాబట్టి.. వర్మ సినిమా తీస్తాడనగానే ఆసక్తి మొదలయ్యింది. రవిని ఎలా చూపించారు.. సూరి క్యారెక్టర్‌ను ఎలా మలిచారన్న ఇంట్రెస్ట్ కొద్దీ థియేటర్‌కు వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే.. వాస్తవ కథల ఆధారంగానే సినిమాను రూపొందించినా.. కాస్త కల్పితాన్నీ జోడించాల్సి వచ్చిందంటున్నాడు రామ్‌గోపాల్ వర్మ..
పరిటాల రవికి.. మద్దెల చెర్వు సూరికి ఉన్న క్రేజ్‌ను ఓ రకంగా క్యాష్ చేసుకోవడమే వర్మ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇద్దరిమధ్యా వైరాన్ని.. అది సృష్టించిన పరిణామాలను కమర్షియల్ యాంగిల్‌లో చూసిన వర్మ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా తీసేశాడు. వర్మ మాటల్లో చెప్పాలంటే.. ప్రపంచంలోనే ఇంత గొప్ప సబ్జెక్ట్ మరొకటి ఉండదట. మరి ఈ సినిమా ఆయినా.. వర్మ ఫేట్‌ను మార్చుతుందా.. కొత్త లైఫ్‌ను అందిస్తుందా.. అదే సస్పెన్స్. సినిమా విడుదలైతే తప్ప చెప్పలేం.
ఎవరు హీరో.. ఎవరు విలన్..
ఒకరు పరిటాల రవి.. మరొకరు మద్దెలచెర్వు సూరి. ఇద్దరూ ఇద్దరే. ఎవరికీ ఎవరూ తక్కువ కాదు. అందుకే.. రవి పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను ఎంపిక చేసిన వర్మ.. సూరి పాత్రకు మాత్రం సౌత్‌స్టార్ సూర్యను ఎంపిక చేశాడు. అంతేకాదు.. భానుమతి పాత్రలో.. ప్రియమణిని ప్రవేశపెట్టాడు. ఓరకంగా... తెలుగువారందరికీ ఆ రెండు క్యారెక్టర్లనీ దగ్గర చేసే ప్రయత్నంలో వర్మ ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా.. సూరి పాత్రలో ఒదిగిపోయిన సూర్య చేత చెప్పించిన డైలాగ్‌లూ కాస్త ఘాటుగానే ఉన్నాయి.
ఇక పరిటాల రవి భార్య సునీత పాత్రలో రాధికా ఆప్టేను ఎంపిక చేశాడు వర్మ. ఫస్ట్‌పార్ట్‌లో పరిటాల రవి.. ఫ్యాక్షనిస్టుగా మారాడో చూపించనున్నారు. ఇందులోనే.. రాజకీయాల ప్రస్తావనా వస్తుంది. పరిటాలకు రాజకీయ అండదండలిచ్చిన ఎన్టీఆర్ పాత్రలో.. బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా కనిపిస్తారు. ఫ్యాక్షన్ లీడర్ కాస్తా.. పొలిటికల్ లీడర్‌గా మారిన పద్దతినీ ఈ సినిమాలో వర్మ చూపిస్తున్నారు. సింబాలిక్‌గా వివేక్ ఒబెరాయ్ గెటప్‌నూ మార్చారు..
రవి.. సూరిల వాస్తవ జీవితాలను పరిశీలిస్తే ఇద్దరూ ప్రశాంత జీవితాన్ని కోల్పోయారు. ఒకరు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోతే.. మరొకరు.. సుదీర్ఘ కాలంపాటు భార్యాబిడ్డలకు దూరమయ్యారు. ఇక వీరిద్దరినీ నమ్ముకొన్నవారూ.. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంతా చేస్తే.. వీరు సాధించింది ఏమిటి? దీన్నే సినిమా రూపంలో అందరికీ చెప్పనున్నారు వర్మ.. ఫస్ట్‌పార్ట్‌లో సూరి ఇంట్లో టీవీ బాంబు, జూబ్లీహిల్స్లో కారుబాంబు పేలుడు సంఘటనలు కనిపిస్తాయి. ఇక సీక్వెల్‌లో రవి హత్యోదంతాన్ని చూపిస్తారు. ప్రస్తుత పరిస్థితులకు.. ఇంతకు ముందు తరాలు ఎలా కారణమో కూడా.. వర్మ రక్తచరిత్రలో చూపించనున్నారు.
పరిటాల రవి మరణించి చాలాకాలమయ్యింది. సూరి కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా.. ఇప్పటికీ ఈ రెండు వర్గాల మధ్య కక్షలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి.. రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమాతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే ఇప్పుడు అందరి అనుమానం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సినిమా పేరు తప్ప దాని గురించి ఇంతకుమించి ఏమీ వినలేదు, ఇప్పుడు మీ పోస్ట్ చాలా ఉత్సుకత కలిగిస్తోంది....I am also waiting !
@sowmya
ఈ సినిమాతో చాలా సమస్యలున్నాయి. అనంతపురంలో ఫ్యాక్షన్ గొడవలను మరోసారి రెచ్చగొట్టే ప్రమాదమూ ఉంది. ఇక పరిటాల రవిని తక్కువగా చూపిస్తే.. దాడులు పెరుగుతాయి. సూరిని తక్కువగా చూపించినా అంతే. అయితే.. ఈ సినిమాను కంపెనీతో పోల్చుతున్నాడు వర్మ. అజయ్‌దేవ్‌గణ్, వివేక్ ఒబెరాయ్‌ల పాత్రలున్నట్లే.. ఈ సినిమాలో సూర్య,వివేక్‌ల పాత్రలుంటాయనంటున్నాడు. ఎలా ఉంటున్నదన్నది రీలీజ్ తర్వాతే తేలొచ్చు.