3, మే 2010, సోమవారం
కసబ్‌కు ఉరి?
కసబ్ ఫేట్ తేలిపోయింది. అన్ని ఆధారాలు పక్కాగా ఉండడంతో పాటు.. వీడియో సాక్ష్యాలు కూడా ఉండడంతో.. ముంబై మారణహోమంలో ప్రధాన దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే.. అతడికి సహాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి మాత్రం.. ఈ కేసుతో సంబంధం లేదని తీర్పునిచ్చింది... ఇప్పుడు అసలు ప్రశ్న.. పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులకు.. ముంబైలోని అన్ని ప్రాంతాల గురించి ఎవరు చెప్పారనే? మ్యాపులు ఎవరిచ్చారనే..
దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... కట్టుదిట్టమైన భద్రత మధ్య... ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ప్రత్యేక కోర్టు.. ముంబైపై టెర్రరిస్టుల దాడికి సంబంధించి తుదితీర్పును వెలువరించింది. ముంబైపై దాడి చేసిన టెర్రరిస్టుల్లో.. ప్రాణాలతో దొరికిన.. ఒకే ఒక్క తీవ్రవాది.. అజ్మల్ అమీర్ కసబ్పై.. పోలీసులు మోపిన అన్ని అభియోగాలు రుజువైనట్లు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తహిల్యాని తీర్పు చెప్పారు. ముంబై మారణహోమంలో కసబ్‌ను దోషిగా తేల్చారు. ఇక ఇప్పుడు మిగిలింది.. ఆ కరుడుగట్టిన ఉగ్రవాదికి శిక్ష పడడమే..
మార్చి 31నే విచారణ పూర్తి చేసిన ప్రత్యేక న్యాయస్థానం.. ముంబైపై దాడిని యుద్ధంగా వర్ణించింది. అయితే.. కసబ్‌తో పాటు.. ఈ దాడికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్సారీ, సహబుద్దీన్‌లను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది. వీరిద్దరే ముంబైకి సంబంధించిన మ్యాపులు తయారు చేసి.. లష్కరే తోయిబాకు ఇచ్చారని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. కోర్టు మాత్రం సాక్ష్యాలు నమ్మదగినవిగా లేవంది. దీంతో.. వీరిద్దరూ.. విడుదలకానున్నారు.
ఇక కేసు తీర్పు వెలువడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా విన్నాడు కసబ్. ఇంతకు ముందుతో పోల్చితే.. ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాడు. నేలచూపులు చూస్తూ.. తీర్పు విన్నాడు. కసబ్ దోషిగా తేలడంతో.. ఏ శిక్ష ప్రకటించేది మంగళవారం తేలనుంది. దాదాపు 86 అభియోగాలపై నేరారోపణలు నిర్దారణ కావడంతో.. మరణశిక్ష పడొచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అయితే.. ఉరిశిక్ష వేయడంపై.. మంగళవారం కోర్టులో వాదోపవాదనలు జరుగుతాయి. ఆ తర్వాతే.. శిక్షను ఖరారు అవుతుంది
బెనిఫిట్ ఆఫ్ డౌట్..
కసబ్ దోషని తేలాడు సరే.. కానీ.. ఈ దాడికి ప్లాన్ చేయడం, కావల్సిన సహాయం అందించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు మాత్రం.. శిక్షల నుంచి తప్పించుకోగలిగారు. ఇదే అత్యంత ఆందోళనకర అంశం. అన్సారీ, సబావుద్దీన్‌లు ఇద్దరూ ఇంతకు ముందు తీవ్రవాదులతో సంబంధాలున్నారని నిరూపణ అయినా.. ఈ కేసు నుంచి మాత్రం బయటపడ్డారు. కసబ్ విషయంలో ఎంతో పకడ్బందీగా వ్యవహిరించి.. సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీసులు.. వీరిద్దరి విషయంలో మాత్రం కాస్త మెతకవైఖరి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అందుకే.. అన్సారీ, సబావుద్దీన్‌లకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన సాక్ష్యాలు సరిపోవంటూ.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులని తేల్చింది న్యాయస్థానం. దీనిపై.. పైకోర్టులో అప్పీల్ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నిఖమ్ చెబుతున్నారు.
మరోవైపు.. మన భారత న్యాయవ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో చెప్పడానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం కితాబిస్తోంది. కసబ్‌ను దోషిగా తేల్చడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం. కానీ.. శిక్షపడాల్సిన వారు తప్పించుకోవడంపై మాత్రం కలవరపడడం లేదు.
లష్కరే తోయిబాకు.. అన్సారీ, సబావుద్దీన్‌లకు ఎప్పటినుంచే సంబంధాలున్నాయని వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ప్రత్యేక కోర్టు తీర్పే అంతిమం కాదంటున్నారు. దీనిపై పైకోర్టులకు వెళ్లి శిక్ష పడేలా చూస్తామంటున్నారు. వరసగా జరిగిన సంఘటనలు సాక్ష్యాలుగా చూపించినా.. ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికీ శిక్షలు వేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తీవ్రవాద దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉందని.. తొలిసారిగా కోర్టు నిర్దారించింది. అయినప్పటికీ.. ముంబైలాంటి అతిపెద్ద దాడి కేసు నుంచి.. ఇద్దరు నిందితులు.. బయటపడడం మాత్రం నిజంగా ఆక్షేపించతగిందే. అయితే.. ఇందుకు కోర్టును తప్పు పట్టాల్సిన పనిలేదు. పొరపాటంతా... పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించలేని పోలీసులదే.
మన దగ్గరే ఇలా!
కసబ్ తరపున వాదించడానికి ఏ న్యాయవాది రాలేదు. కానీ.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మరీ లాయర్ ను ఏర్పాటు చేసి.. తన దాతృత్వాన్ని చాటుకొంది. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు కసబ్‌కు శిక్షపడే సమయం. అది ఉరిశిక్షే కావాలని యావత్ భారతదేశం కోరుకొంటోంది. కసబ్‌పై మోపిన 86 అభియోగాలు రుజువయ్యాయి కాబట్టి మరణశిక్ష ఖాయంగానే కనిపిస్తోంది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఈ శిక్షను అమలు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలున్నాయి. ముంబైపై దాడి అత్యంత అరుదైన విషయమే కాబట్టి క్యాపిటల్ పనిష్‌మెంట్ తప్పకపోవచ్చు. కానీ.. ఉరిశిక్ష ప్రకటించినా.. ఇప్పటికిప్పుడు అమలు చేసే అవకాశాలు మాత్రం లేవు. కారణం చట్టంలో ఉన్న లొసుగులే. ముంబై దాడిపై విచారణ జరిపింది ప్రత్యేక కోర్టు మాత్రమే కావడంతో.. హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లవచ్చు. దీనికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా మరణశిక్షను సమర్థించినా.. క్షమాభిక్ష పెట్టమంటూ రాష్ట్రపతిని కోరవచ్చు.. ఓ రకంగా తక్షణం కసబ్‌ను ఉరితీసే అవకాశాలు మాత్రం లేవు.
ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఎన్నో క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. భారత పార్లమెంట్‌పైనే దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయాలంటూ సుప్రీంకోర్టు 2004లోనే తీర్పు చెప్పింది. అక్టోబర్ 20, 2006న ఉరితీయాల్సి ఉంది. కానీ.. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. ఇప్పటికీ ఆయన జైలులోనే ఉన్నాడు. 1992 నుంచి చూస్తే.. దాదాపు 29 పిటిషన్లు ఇలా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. గట్టిగా నిలదీస్తే.. ఒక్కొక్కటీ క్లియర్ చేస్తామంటున్నారు హోమంత్రి.
కసబ్‌కి ఉరిశిక్ష వేసినా.. దాన్ని అమలు చేయాలంటే.. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఎంతలేదన్నా పదేళ్ల సమయం పట్టొచ్చు. లేదంటే.. ప్రభుత్వం దాన్ని యావజ్జీవ శిక్షగానైనా మార్పు చేయవచ్చు. కానీ.. ఇలాంటి పద్దతులే తీవ్రవాదులు చెలరేగడానికి మరిన్ని అవకాశాలిస్తున్నాయన్న వాదనలూ ఉన్నాయి. ఉగ్రవాద కేసుల్లో తక్షణం శిక్షలను అమలు చేస్తే.. మనవైపు కన్నెత్తి చూడడానికీ ఎవరూ సాహసించరని మాజీ డీజీపీ రాములు చెబుతున్నారు.
భారీ ఖర్చు..
కసబ్ ప్రాణాలతో దొరకడంతో.. ముంబైలో టెర్రరిస్టు దాడులకు సంబంధించిన పాకిస్తాన్ ప్రమేయం బయటపడింది. కసబ్‌తోపాటు అతనికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు భారతీయులు ఫాహిమ్ అన్సారీ, సబాహుద్దీన్ అహ్మద్‌ల పాత్రపైనా పూర్తిస్థాయి విచారణ జరిగింది. ముంబై దాడుల విచారణ కోసం.. కసబ్‌ను ఉంచిన ఆర్థర్ రోడ్ జైలులోనే ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణకు ఎం.ఎల్.తహల్యానిని ప్రభుత్వం జడ్జిగా నియమించింది. జైల్లోనే విచారణ జరుగుతుండడంతో.. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జైలు చుట్టూ నిషేదాజ్ఞలను అమలు చేశారు. జైలుకు సమీపంలోనే జరగాల్సిన ముంబై మెట్రోరైల్వే ప్రాజెక్టు పనులనూ ఆపేశారు. ఏప్రిల్ 15, 2009న మొదలైన విచారణ.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. సెలవలను తీసివేస్తే.. దాదాపు ఏడునెలల పాటు.. కోర్టు పనిచేసింది. టెర్రరిస్టు దాడులకు సంబంధించి.. ఇంత వేగంగా విచారణ పూర్తి కావడం ఇదే తొలిసారి.
కసబ్‌పై పోలీసులు మోపిన దాదాపు 86 అభియోగాలపై కోర్టు విచారణ జరిపింది. దేశంపైకి యుద్దానికి దిగడం, హత్య,హత్యాయత్నం, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం, ప్రభుత్వాస్తుల ధ్వంసం, విదేశీచట్టం ఇలా ఎన్నో సెక్షన్లకింద విచారణ జరిగింది. 3192 పేజీల సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. 658 మంది సాక్షులను విచారించింది. ఇందులో.. కసబ్ పేల్చిన తూటా తగిలి కాలు కోల్పోయిన ఓ బాలిక కూడా ఉంది.
మొత్తం 30 మంది సాక్షులు కసబ్‌ను గుర్తించారు. తమపై కాల్పులు జరిపింది అతనేనని కోర్టులో సాక్ష్యం చెప్పారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ అధికారులూ ఈ విచారణకు సహకరించారు. జీపీఎస్ రికార్డుల ఆధారంగా.. పాకిస్తాన్ నుంచి కసబ్ వచ్చాడని కోర్టులో నిరూపించారు. దాదాపుగా అన్ని సాక్ష్యాలూ.. కసబ్‌కు వ్యతిరేకంగానే వచ్చాయి. కసబ్ తరపున వాదించడానికి ఏ న్యాయవాది ఇష్టపడకపోవడంతో.. సుప్రీంకోర్టే చొరవతీసుకొని లాయర్‌ను నియమించింది. అయితే.. వివిధ కారణాల వల్ల ఇద్దరు మధ్యలోనే వైదొలిగారు. చివరకు.. కె.పి.పవార్ కసబ్ తరపున వాదించారు.
ఇక దాడి సమయంలో ప్రాణాలతో చిక్కిన ఏకైక టెర్రరెస్ట్ కసబ్‌ను రక్షించడానికి ప్రభుత్వం చాలా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఆర్థర్‌రోడ్ జైలులో కసబ్‌కోసం ప్రత్యేకంగా బుల్లెట్,బాంబ్ ప్రూఫ్ సెల్‌ను నిర్మించారు. సెల్ నుంచి కోర్టుకు తరలించడానికి సొరంగం ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ఆహారం అందజేశారు. ఐటీబీపీకి చెందిన 200 మంది సిబ్బందితో జైల్లో భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పటివరకూ 35 కోట్ల రూపాయలను కసబ్ కోసం ఖర్చు పెట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి