27, ఏప్రిల్ 2010, మంగళవారం
అలజడి..
హైదరాబాద్‌పై తీవ్రవాదుల కన్నుపడింది.
మరో విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారు..
రద్దీగా ఉండే ప్రదేశాలే టార్గెట్
మన రాష్ట్రంపై తీవ్రవాదుల దృష్టి మరోసారి పడింది. రాష్ట్ర రాజధానిలో భారీవిధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే.. తమ పని సైలెంట్‌గా చేసిపెట్టే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఇప్పటికే సమాచారం అందింది. హైదరాబాద్‌లో గానీ, దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గానీ.. విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ప్రణాళికలు వేస్తున్నారు..
ముంబై తరహాలో.. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఈ సారి రాకపోవచ్చు. మనమధ్యే ఉంటూ దాడులు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెర్రరిస్టు సంస్థల కార్యకలాపాలపై దృష్టి పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వారి కొత్త వ్యూహాలను పసిగట్టాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని స్లీపర్‌సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్నారంటూ సమాచారాన్ని మన పోలీసులకు అందించాయి. ఘర్షణలతో ఉద్రిక్తంగా ఉన్న సమయంలో.. ఈ స్లీపర్‌సెల్స్ ఏం చేయబోతున్నాయన్నది... అలజడిని సృష్టిస్తోంది. అందుకే.. నగరంలో ఒక్కసారిగా భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
బెంగళూరు నుంచి
ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా బెంగుళూరులో తక్కువ తీవ్రత గల బాంబు పేలుళ్లు సంభవించాయి. వీటి వెనక ఎవరున్నారన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ ముఠాలు చేశాయని కొంతమంది భావిస్తుంటే.. లష్కరే తోయిబా మిలిటరీ కమిటీ ఛైర్మన్ ఇలియాస్ కాష్మిరీ హస్తం ఉందన్న అనుమానమూ ఉంది. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందే.. ఓ ఆన్‌లైన్ పత్రిక ఇలియాస్ ఇంటర్వ్యూను ప్రచురించింది. భారత్‌పై దాడులు చేస్తామని అందులో పేర్కొన్నాడీ లష్కరే ఉగ్రవాది. బెంగుళూరులో తక్కువ తీవ్రత బాంబులను వాడడమూ.. వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.
దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా.. ఉగ్రవాద దాడులు జరిగినా.. దానికి లింకులు మన హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడింది. పోలీసులకు అందిన తాజా సమాచారం ప్రకారం.. రెండుసార్లు కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాది వికారుద్దీన్... మరోసారి నగరంలోకి వచ్చాడు. వికారుద్దీన్ మళ్లీ నగరంలోకి ఎందుకు వచ్చినట్లు? స్లీపర్‌సెల్స్.. మళ్లీ ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి..? ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే.. టెర్రరిస్టులు మరో వ్యూహం ఏదో పన్నుతున్నారన్న విషయం అర్థమవుతుంది.
హైదరాబాద్‌పై నెత్తుటి మరకలు
హైదరాబాద్‌లో ఎన్నో విద్రోహక చర్యలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. 2007లో వరస దాడులతో బెంబేలెత్తించారు. మే 18, 2007న మక్కామసీదులు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో సెల్‌ఫోన్ బాంబును పక్కాప్లాన్‌తో పేల్చారు. 11 మందిని చంపారు. హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నించారు.
ఆగష్టు 25, 2007న గోకుల్‌ఛాట్‌లోనూ, లుంబినీ పార్క్‌లోనూ బాంబులు పెట్టారు. రద్దీగా ఉన్న సమయంలో అవి పేలడంతో.. నలభైమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో టెర్రరిస్టుల టాప్‌లిస్ట్‌లో హైదరాబాద్ ఉందన్న విషయం అర్థమైపోయింది.
ఈ పేలుళ్లకు ముందు కూడా కొన్ని విద్రోహ చర్యలకు టెర్రరిస్టులు పాల్పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కారుబాంబు ఘటన దగ్గర నుంచి ఇటీవల వికారుద్దీన్ జరిపిన కాల్పుల వరకూ ఉగ్రవాదుల ఆచూకీకి సంబంధించి నగరంలో ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. అయితే.. మూడేళ్లుగా టెర్రరిస్టులు దాడులకు దూరంగానే ఉన్నారు. ముంబైని టార్గెట్ చేసుకుని.. ప్లాన్ అమలు చేసిన టెర్రరిస్టులు.. ఇప్పుడు మిగిలిన నగరాలపైకి దృష్టి మళ్లించారు. అడపదడపా దాడులు చేస్తూ.. నిఘా వర్గాల సామర్థ్యాన్ని, పోలీసుల వేగాన్ని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు లష్కరే, హిజ్బుల్ దాడులు చేస్తే.. ఇప్పుడాపనిని ఇండియన్ ముజాహిదీన్ చేస్తోంది. పేరు వేరు గానీ, సహాయం అందేది మాత్రం పాక్ సరిహద్దుల్లోని తీవ్రవాద సంస్థల నుంచే. హైదరాబాద్‌ను బేస్ చేసుకుని.. మనదేశంలో వీలైనంత విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ ఇండియన్ ముజాహిదీన్ కదులుతోంది. అందులో భాగంగానే.. ఇప్పుడు హైదరాబాద్‌లో స్పీపర్ సెల్స్‌ను మళ్లీ యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
నగరంలో కొన్ని వందల స్లీపర్‌సెల్స్ ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే.. వీరెవరు? ఏం చేస్తుంటారన్నది మాత్రం తెలియదు. ఇందులో ఎంతమంది యాక్టివ్ అయ్యారన్నదీ సస్పెన్సే. ఈ గుట్టును ఛేదించే పనిలో పడ్డారు హైదరాబాద్ పోలీసులు. అందుకే.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ఈ సెల్స్ ఉన్నాయని అనుమానించే ప్రాంతాల్లో.. సడన్‌గా చెకింగ్‌లకు చేస్తున్నారు. పూర్తిగా అలర్ట్‌గా ఉన్నామన్న సంకేతాలు పంపిస్తున్నారు. హైదరాబాద్‌పై స్పెషల్‌గా కాన్‌సన్‌ట్రేషన్ చేసిన సెంట్రల్ ఇంటెలిజెన్స్.. ఓల్డ్ సిటీలో ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేస్తోంది. దీనికోసం ముంబై తరహా వ్యవస్థనూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కాల్స్‌ను విశ్లేషిస్తున్న సమయంలోనే స్లీపర్స్‌సెల్స్ గురించి సమాచారం అందింది.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దంటూ.. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులను హెచ్చరించాయి. భారత్‌పై తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదముందంటూ హెచ్చరికలు కూడా జారీచేశాయి. అమెరికా వార్నింగ్.. మన ఇంటెలిజెన్స్‌కు వచ్చిన ఇన్‌ఫర్‌మేషన్ రెండూ దాడులకు సంబంధించినవే కావడంతో.. పోలీసులు ఈ విషయంపై చాలా సీరియస్‌గా దృష్టి పెట్టారు.
వీరెక్కడ?
అబ్దుల్ బారీ అలియాస్ అబు హంజా.. యాకుత్‌పురాకు చెందిన ఇతను పదిహేనేళ్లుగా కనిపించడం లేదు. అబ్దుల్ అహద్.. వయస్సు 28 ఏళ్లు.. 2004 లో మాయమయ్యాడు. సయ్యద్ అమ్జద్, సంతోష్‌నగర్‌లో ఎంబ్రాయిడరీ చేసుకునే 23 ఏళ్ల ఈ యువకుడు 2007 నుంచి కనిపించడం లేదు. మహ్మద్ సాజిద్, లారీ క్లీనర్, సైదాబాద్‌కు చెందిన సాజిద్.. 1998 నుంచి కనిపించడం లేదు. వీరు మాత్రమే కాదు.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన చాలామంది సడన్‌గా మాయమవుతున్నారు. ఇలా మాయమైనవారిలో దాదాపు 33 మంది పాకిస్తాన్ గుఢాచారసంస్థ ఐఎస్ఐ ద్వారా టెర్రరిస్టులుగా మారినట్లు సమాచారం. ఇవి బయటకు వచ్చిన వివరాలే.. బయటకు రాని పేర్లు మరెన్నో ఉండొచ్చు..
పాతబస్తీలో మాయమవుతున్న వారిలో 18 ఏళ్ల కుర్రాళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యవయస్సుల వారి వరకూ ఉన్నారు. ఏజ్‌ను బట్టి చూస్తే.. వీరు మిస్ అయ్యారని చెప్పలేం. ఉద్దేశపూర్వకంగానే మాయమయ్యారని చెప్పొచ్చు. పైగా.. ఇందులో చాలామంది సౌదీలోనో, దుబాయ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే.. తమ పరిచయాలను ఉపయోగించుకుని ఇక్కడ విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా.. ఇలా మాయమవుతున్నవారిలో... పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువ. ఓల్డ్‌సిటీలో పేద యువకులను ఆకర్షించడానికి ఐఎస్‌ఐ రకరాల ఎత్తుగడలు వేస్తోంది. డబ్బు ఎర వేసి.. రెచ్చగొట్టే ప్రసంగాలు చూపించి మనసు మార్చుతోంది. మన దేశంపైనే యుద్ధానికి పురిగొల్పుతోంది.
మనల్ని మనమే కాపాడుకోవాలి
భిన్నత్వంలో ఏకత్వాన్ని స్పురింపజేసే సంస్కృతి మన హైదరాబాద్‌ది. దేశంలో ఉన్న సర్వజాతులు.. మతాల వారు మనకు హైదరాబాద్‌లో కనిపిస్తారు. అంతేకాదు.. ఆఫ్రికన్స్ నుంచి అమెరికన్స్ వరకూ ఎంతోమంది కనిపిస్తారు. కలిసికట్టుగా ఉండే మన మధ్య కొన్ని ఉగ్రవాద సంస్థలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. స్లీపర్ సెల్స్ లక్ష్యం ఇదే. దీన్నే ఇప్పుడు మనం అడ్డుకోవాలి..
గ్రేటర్ హంగు పొందాక.. హైదరాబాద్ జనాభా 70 లక్షలకు చేరువయ్యింది. హైదరాబాద్, సైబరాబాదుల్లో కలిపి మనకున్న పోలీసు బలం 12 వేల లోపే. దీనికి తోడు నిరంతరం నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టడం సాధ్యమేనా అంటే.. కచ్చితంగా కాదనే చెప్పొచ్చు. మరి ఉగ్రవాద దాడులు పొంచి ఉన్న సమయంలో ఈ మాత్రం పోలీసులు సరిపోతారా.. టెర్రరిస్టుల గుట్టు రట్టు చేయగలరా?
నయా ఇన్‌ఫార్మర్స్ పేరుతో.. కొత్త నెట్‌వర్క్‌ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అయితే.. దీనివల్ల కూడా పూర్తిస్థాయిలో విధ్వంసాలను అడ్డుకోలేకపోవచ్చు.. మరి పరిష్కారమేమిటి?
హైదరాబాద్‌లో తిరిగే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గం. తీవ్రవాదులగానే.. ఏకే -47లు పట్టుకుని తిరగరు. ముఖ్యంగా రాజధానిలో యాక్టివేట్ అయిన స్లీపర్‌సెల్స్ మరీనూ.. ఏదో వ్యాపారం చేసుకుంటూనో.. ఏ మెకానిక్ షాపులో పనిచేస్తూనో.. తమ అసలు పని కానిచ్చేస్తాయి. మన మధ్యే ఉంటూ.. మనలా జీవిస్తూ.. భారీ విధ్వంసాలను సృష్టిస్తాయి. అందుకే.. మనకెందుకులే అనుకోకుండా.. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలపై ఓ కన్నేసి ఉంచండి. వారి కదలికల్లో.. వ్యవహారంలో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ముష్కరమూకల ఆట కట్టించండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి