24, ఏప్రిల్ 2010, శనివారం
సచిన్ ఎందులో గొప్ప?
Categories :
సచిన్ టెండుల్కర్.. ఈ ప్రపంచంలో క్రికెట్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ ఈ పేరు సుపరిచతమే. రెండు దశాబ్దాల క్రితం మొదలైన.. సచిన్ క్రికెట్ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో అతిగొప్ప క్రికెటర్‌గా ఖ్యాతిగడించిన టెండుల్కర్.. 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దేశమంతా సచిన్ నామ జపం చేస్తోంది. ఇంతకీ సచిన్ ఎందులో గొప్ప.. ఎందుకు గొప్ప?
ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రికెట్ సచిన్.... సచిన్‌ను మించిన మొనగాడు మరొకరు లేరు.. ఇలా ఎన్నో చెప్పుకుంటాం.. మరి ఇందుకు ఆధారం.. సచిన్ సృష్టించిన రికార్డులే. వన్డేల్లో.. 46 సెంచరీలు.... 17598 పరుగులు... టెస్టుల్లో 47 సెంచరీలు.. 13447 పరుగులు.. క్రికెట్ పుట్టిన తర్వాత సచిన్ తప్ప మరెవరైనా చేశారా.. కనీసం సచిన్ చేరువలోకి వచ్చిన వారు కూడా లేరు. ఇక వన్డేల్లో ఎవరికీ అందని డబుల్‌సెంచరీ కూడా సాధించి.. తన రికార్డుల హారంలో మరో మణిపూసను చేర్చుకున్నాడు సచిన్.. అందుకే.. అందరికన్నా గొప్ప ప్లేయర్..
ఇరవై ఒక్క సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా.. అలుపన్నది ఏనాడూ ఎరగడు సచిన్. తనకు తెలిసిందల్లా.. క్రికెట్ ఆడటమే. మ్యాచ్‌లు లేవు కదా అని పార్టీలకో పబ్‌లకో వెళ్లడు... అప్పుడే కెరీర్ మొదలెట్టినవాడిలా ప్రాక్టీస్‌కి వెళ్లిపోతాడు.. నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు. అదే లిటిల్ మాస్టర్ గొప్పదనం. అందుకే.. క్రికెట్ మాస్టర్ అవ్వగలిగాడు. చప్పగా సాగిపోతున్న ఇండియన్ క్రికెట్‌కు ఊపు వచ్చింది సచిన్ ఎంట్రీ తర్వాతే. సిక్స్‌లు.. ఫోర్లు.. సెంచరీలతో ఇండియాను క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన ఘనత టెండుల్కర్‌దే. ఇండియన్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిందీ మన సచినే. అందుకే.. ఆల్ టైం ఫేవరేట్ ప్లేయర్ సచిన్ టెండుల్కర్..
బౌలర్ కాబోయి..
సచిన్ క్రికెటర్ కావడం వెనుక ఎంతోమంది కృషి ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నయ్య అజిత్ టెండుల్కర్, కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌ల గురించే. వీరిద్దరూ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే.. ఇంతవాడినయ్యానని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాడు సచిన్.
వాస్తవానికి సచిన్ బ్యాట్స్‌మెన్ అవ్వాలనుకోలేదు. ఫాస్ట్‌బౌలర్ అవుదామని MRF ఫౌండేషన్‌కూ వెళ్లాడు. కానీ, బౌలింగ్‌కి పనిరావని.. బ్యాటింగ్‌మీద శ్రద్ధ పెట్టమని ఫౌండేషన్ నిర్వహించే.. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ సూచించాడు. అదే సచిన్ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. సీరియస్‌గా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టిన సచిన్.. వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయ్యాడు. ఇంకో విషయం రంజీల్లో ఆడేటప్పుడు సచిన్ మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వచ్చాకే స్టైల్ మార్చుకున్నాడు.
విజయ సోపానాలు
సచిన్ కెరీర్‌లో తొలి రోజుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్కూల్‌డేస్‌లో తన మిత్రుడు వినోద్ కాంబ్లీతో కలిసి.. 664 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ రికార్డు తర్వాతే.. బొంబేలో క్రికెటర్లకు అతనేంటో తెలిసింది. దీని తర్వాత.. బొంబే టీంలో సచిన్‌కు చోటు కూడా దక్కింది. అప్పటికి సచిన్ వయస్సు 15 ఏళ్లు. అప్పట్లో సచిన్‌ను అంతా తెండిల్యా అంటూ ముద్దుగా పిలిచేవారు.. జాతీయ స్థాయికి క్రికెట్ కోసం గ్రౌండ్‌లో అడుగుపెట్టిన సచిన్ తొలిమ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. అంతేకాదు.. దేశీయ క్రికెట్‌లో అత్యున్నత టోర్నీలైన రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. అప్పటికే బలమైన టీంగా పేరుతెచ్చుకున్న బొంబే టీంలో చోటును సుస్థిరం సచిన్ ఆటకు ముగ్దులైన సెలెక్టర్లు.. టెస్ట్ జట్టులో స్థానమిచ్చారు. నవంబర్ 15, 1989న ఇలా తొలిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు టెండుల్కర్. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే ఔట్ అయిన సచిన్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ.. టెస్ట్ సిరీస్ తర్వాత పెషావర్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్ ఏంటో పాక్ క్రికెటర్లకు చూపించాడు సచిన్. 18 బాల్స్‌లో 53 పరుగులు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టి.. తానెంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌నో చాటిచెప్పాడు.
దిగ్గజాల నీడలో..
సచిన్ క్రికెట్ రంగ ప్రవేశం చేసే నాటికి భారత క్రికెట్ స్వరూపం చాలా వరకూ మారింది. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌ల హవా క్రికెట్‌పై ఎంతో ఉంది. సిద్దు, సంజయ్‌మంజ్రేకర్, అజహరుద్దీన్, రవిశాస్త్రి లాంటి కీలక ప్లేయర్లు అప్పటికే జట్టులో ఉన్నారు. వారందరి నీడలోనే ఎదుగుతూ.. టీంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని రిజర్వ్ చేసుకోగలిగాడు సచిన్ టెండుల్కర్.
సచిన్ తన తొలి టెస్ట్ సిరీస్‌లోనే.. సుదీర్ఘ కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. సియాల్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో వకార్ యూనిస్ వేసిన బంతి ముక్కుకు తగిలి రక్తం కారుతున్నా.. క్రీజ్ వదలకుండా 57 పరుగులు చేశాడు. ప్రత్యర్థిని ఎంత ధృడంగా ఎదుర్కోగలనో ఆనాడే చాటిచెప్పాడు. ఇక 1990 ఆగస్టులో ఇంగ్లాండ్‌లో జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ మ్యాచ్ సచిన్ కెరీర్‌కు బలమైన పునాది వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 119 నాటౌట్‌గా నిలిచి ఓటమి కోరల నుంచి టీంని కాపాడాడు. ఇక 1994-99 మధ్య అసలైన సచిన్ ఏమిటో.. అభిమానులకు తెలిసింది. క్రికెట్ ప్రపంచం టెండుల్కర్ నామాన్ని జపించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఎన్నో.. సచిన్ బ్యాట్ నుంచి జాలువారాయి. ఇక 1996 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు.
సచిన్ కన్నా ముందు భారత క్రికెట్‌లో ఇద్దరు యోధానుయోధులున్నారు. ఒకరు గవాస్కర్ అయితే.. మరొకరు కపిల్ దేవ్. గవాస్కర్‌ది డిఫెన్సివ్ స్టైల్ అయితే.. కపిల్‌ది అగ్రెసివ్‌నెస్. వీరిద్దరినీ కలిపితే సచిన్ టెండుల్కర్. అవును, డిఫెన్సివ్‌తో పాటు విరుచుకుపడగల సామర్థ్యం సచిన్ సొంతం.
దాదాపు రెండుదశాబ్దాల కెరీర్‌లో సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌నే సచిన్ ఆడాడు. కొంతకాలం క్రితమే సచిన్‌కు వయసైపోయిందని.. ఇక రిటైర్ కావాల్సిన సమయం వచ్చేసిందంటూ.. ఎంతోమంది ఎన్నో రకాల ప్రకటనలు చేశారు. కానీ, అన్నింటినికీ సచిన్ ఆటతోనే సమాధానం చెప్పాడు. చెప్పాలంటే అదే సచిన్ స్టైల్. ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో తలపెట్టని సచిన్.. తనను ఎవరైనా ఏమన్నా అంటే.. దానికి ప్రతీకారం క్రికెట్ గ్రౌండ్‌లోనే తీర్చుకుంటాడు. పరుగుల వరద పారించి.. తన సత్తా చూపిస్తాడు. ఇదే సచిన్‌కు తెలిసింది. ఇరవైఏళ్లుగా టీంలో కొనసాగుతున్నా.. సెహ్వాగ్, యువరాజ్,గంభీర్ లాంటి ప్లేయర్లు పోటీగా వస్తున్నా.. ఏమాత్రం కలవరపడడు. పైగా.. కొత్తవారికి మరిన్ని సవాళ్లను తన బ్యాటింగ్‌తో విసురుతాడు. అదే సచిన్ స్పెషాలిటీ.
గర్వం లేని మనిషి
క్రికెటర్ అంటే.. దేశంలో విపరీతమైన క్రేజ్. ఒకటీ రెండేళ్లు ఆడితేనే..నానా హంగామా చేసే క్రికెటర్లు ఎందరో. సెంచరీ కొట్టగానే.. గాల్లోకి ఎగిరిపోయే క్రికెటర్లు ఈనాటి కాలంలో మరెందరో. మరి ఇరవైఏళ్లుగా ఆడుతున్న సచిన్‌లో మాత్రం.. ఇలాంటి లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. సచిన్‌కన్నా ముందు.. సచిన్‌తో పాటు.. సచిన్ తర్వాత కూడా ఎంతో మంది గొప్పప్లేయర్లు భారత టీంలోకి వచ్చారు. కాంబ్లీ దగ్గర నుంచి చూస్తే.. ఇలా వచ్చినవారెవరూ ఎక్కువకాలం నిలదొక్కుకోలేదు. వీరంతా క్రేజ్ మాయలో కొట్టుకుపోయారు.
భారత క్రికెట్ వల్ల సచిన్‌కు గుర్తింపు వచ్చిందా.. లేక సచిన్ వల్ల భారత క్రికెట్‌కు గుర్తింపు వచ్చిందా అన్నది చాలామంది సందేహం. ఓ రకంగా.. రెండూ నిజమే. ఎందుకంటే.. భారత క్రికెట్ లేకపోతే సచిన్ వచ్చి ఉండేవాడు కాదు. ఇక సచిన్ లేకపోతే.. ఇప్పుడున్న సెహ్వాగ్, ధోని, యువరాజ్‌లాంటి చిచ్చర పిడుగులూ ఉండవారు కాదు.. ప్రపంచ క్రికెట్‌పై మన ఆధిపత్యం ఉండేదీ కాదు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన టెండుల్కర్‌కు రెండు విషయాలు మాత్రం కలవరపెడుతూనే ఉంటాయి. ఒకటి.. తన హయాంలో ప్రపంచకప్‌ను గెలవకపోవడం అయితే.. రెండోది టీంఇండియా కెప్టెన్‌గా రాణించలేకపోవడం. అయితే ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్-3లో ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా మంచి కెప్టెన్ అనిపించుకున్నాడు సచిన్.
ఇక మరో సందేహం.. ఇండియన్ క్రికెట్‌లో ఎవరు గొప్ప.. గవాస్కరా.. టెండుల్కరా... దీనికి సమాధానం గవాస్కరే చెప్పాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని డబుల్‌టన్‌ను సచిన్ సాధించాక.. గవాస్కర్ శిరస్సు వంచి సలామ్ కొట్టాడు.. క్రికెట్ అభిమానుల దృష్టిలో సచిన్ ఓ దేవుడు. సచిన్ ఆడుతున్న సమయంలో మనం ఉండడం.. అతని ఆటను ఆస్వాదించడం.. ఆ మెరుపు బ్యాటింగ్‌ను చూడడం మన అదృష్టం. 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సచిన్.. మరిన్ని రికార్డులను సృష్టించాలని కోరుకుందాం.. హ్యాపీ బర్త్‌డే సచిన్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి