30, ఏప్రిల్ 2010, శుక్రవారం
మరో అన్నమయ్య... శ్రీశ్రీ..
అన్నమయ్యకు శ్రీశ్రీకి పోలిక ఏమిటి అనుకుంటున్నారా? తరచిచూస్తే.. ఇద్దరిలోనూ మనకు ఎన్నో పోలికలు కనిపిస్తాయి. తొలిపదకవితా పితామహుడిగా పేరు పొందారు అన్నమయ్య. అప్పటివరకూ ఉన్న సంస్కృత పదాలను తెగనరికి..
అచ్చతెలుగులో.. అలతి అలతి పదాలతో అతిగొప్ప కీర్తనలను రచించారు. ఇప్పటికీ మనం అన్నమయ్య పాటలను పాడుకొంటున్నామంటే.. వాటిలో ఉన్న పదాల గొప్పదనమే.. వాటి అల్లిక గొప్పదనం.
ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే.. అన్నమయ్య తరహాలోనే శ్రీశ్రీ వ్యవహిరించాడు. కవితంటే ప్రేమగీతాలు.. విరహాగీతాలు.. అమోఘవర్ణనలు.. అభూత కల్పనలన్న భావాన్ని పోగొట్టాడు. సామాన్యుడి భాషతో కవితకు పట్టాభిషేకం చేశాడు. సూటి మాటలతో తూటాలు పేల్చాడు.
కుక్కపిల్లా..
అగ్గిపుల్లా..
సబ్బుబిల్లా..
హీనంగా చూడకు దేన్నీ..
కవితామయమేనోయ్ అన్నీ అన్నాడు.
శ్రీశ్రీ రాసిన ఈ కవితల్లో ప్రాసగానీ, ఛందస్సుగానీ మనకు కనిపించవు. అంతా భావోద్వేగమే.. అది కూడా.. పదాల పేరికతోనే వచ్చింది.
ఏడుకొండలపై నెలకొన్న శ్రీనివాసుడిని కీర్తిస్తూ.. అన్నమయ్య రచించిన కీర్తనలు.. సామాన్యులు సులువుగా పాడుకొనగలిగేవే..
కొండలలో నెలకొన్న
కోనేటి రాయుడు వాడంటూ.. అన్నమయ్య కీర్తిస్తే.. యావత్ ఆంధ్రదేశం ఆపాటను నేటికీ స్మరించుకొంటోంది. తిరుమల వెళుతూ పాడుకొంటోంది.
నేనుసైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను..
నేనుసైతం
విశ్వవృష్టికి
అశ్రవొక్కటి ధారపోశాను..
అంటూ.. జనంలో ఉత్తేజం కలిగించాడు శ్రీశ్రీ. నేనుసైతం పాడుకోని వారెవరైనా ఉంటారా. నిస్తేజంలో కూరుకుపోయినప్పుడు.. నీరసం ఆవహించనప్పుడు.. మన వల్ల ఇక ఉపయోగం ఏముంది.. చావడమే మేలనుకున్నప్పుడు.. ఒక్కసారి శ్రీశ్రీ రాసిన నేనుసైతం చదివితే.. మళ్లీ బతకాలనిపిస్తుంది. దేన్నైనా పోరాడి సాధించుకోవాలనిపిస్తుంది. అంత మహత్యం ఉంది.. శ్రీశ్రీ కవితల్లో.
ఇక అన్నమయ్యకు, శ్రీశ్రీకి విప్లవం విషయంలోనూ పోలికలున్నాయి. సామాజిక విప్లవానికి.. అంతరాలను తగ్గించడానికి ఇద్దరూ తమ కలం ద్వారా పాటుపడ్డారు. బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే.. అన్న అన్నమయ్య.. నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే.. చెండాలుండేటి సరిభూమి ఒకటే అన్నాడు. కులాల కుళ్లును చెండాడాడు. ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే..
ధనిక స్వామికి దాస్యం చేసే
యంత్రభూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణకణమండే
గలగలతొణికే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!
అంతేకాదు..
కమ్మరి కొలిమీ
కుమ్మరి చక్రం
జాలరి పగ్గం
సాలెలల మగ్గం
శరీరకష్టం స్పురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే..
నా విరుతించే..
నా వినుతించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి
భావం.. భాగ్యం.. ప్రాణం.. ప్రణవం ..
ఇలా తనకు శ్రామికుడెలా ప్రేరణో చాటి చెప్పాడు.
ఏ దేశ చరిత్ర చూసినా..
ఏమున్నది గర్వకారణం..
నరజాతి సమస్తం..
పరపీడన పరాయణత్వం.. అంటూ సమాజం ధోరణిని ఎత్తి చూపాడు.. సమాజంలో జరగుతున్న దగానూ తన కవితలతో శ్రీశ్రీ ఎండగట్టాడు..
బ్రదుకు వృథా, చదువు వృథా
కవిత వృథా, వృథా వృథా!
మనమంతా బానిసలం..
గానుగలం, పీనుగలం..
వెనుక దగా.. ముందు దగా..
కుడిఎడమల దగా దగా
మనదీ ఒక బతుకేనా
కుక్కలవలె, నక్కలవలే
మనదీ ఒక బతుకేనా
సందులలో పందుల వలే..
ఇక మరో విషయం.. ఇద్దరూ కాలపురుషులే. తెలుగుసాహిత్యంలో అన్నమయ్యకు ముందూ వెనకా అని చూచినట్లే.. శ్రీశ్రీ ముందూ వెనకా అని చూడాలి. పదకవితలకు అన్నమయ్య పునాది వేస్తే.. వాడుకభాషకు పట్టంకట్టాడు శ్రీశ్రీ. జనం మాట్లాడే పదాలనే వాడుకొంటూ.. అద్భుతమైన కవితలు సృష్టించాడు.
పతితులార
భ్రష్టులార
బాధాసర్పదష్టులార
బ్రదుకు కాలి
పనికి మాలి
శనిదేవత రథచక్రపు
టిరుసలలో పడి నలిగిన దీనులార
హీనులార
.
.
.
ఏడవకండేవకండి..
వస్తున్నాయొస్తున్నాయ్..
జగన్నాధ రథచక్రాల్ అంటూ.. ఊపిరిఅందిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నమయ్యకు శ్రీశ్రీకి ఎన్నో పోలికలు కనిపిస్తాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
bagundi... bhale polika pattav... maha nastikudaina maha kaviki.. eeswara vadito polustava...
మా నాస్తికుల తరపున నీ మీద కేసేస్తాను.
Kummari kolimi
kammari chakram kadandi..!!??
kammari kolimi
kummari chakram...
ఔను నిజం ..ఔను నిజం
మీరన్నది నిజం నిజం
@అజ్ఞాత గారూ.. థాంక్స్ అండి.. వేగంగా కంపోజ్ చేస్తున్నప్పుడు.. ఒకదానికొకటి వచ్చేసినట్లున్నాయి. సవరించాను. పొరపాటును గుర్తించి చెప్పినందుకు ధన్యవాదాలు.
@చెరశాల శర్మగారు..
నేను పదేళ్ల వయస్సునుంచే నాస్తికుడినండి. నేను పెరిగింది... గోరా గారి తనయుడు.. లవణం,హేమలతాలవణం నీడలో.. నేనింతవాడిని కావడానికి పరోక్షంగా వారిచ్చిన తోడ్పాటే కారణం. నేను ఇక్కడ శ్రీశ్రీని.. అన్నమయ్యతో పోల్చింది ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి కాదు. వారి రచనల్లో సారూప్యతను.. చరిత్రను మార్చిన తీరును చెప్పడానికి.
నేను కూడా గోరా గారి శిష్యుడినే. గోరా గారు, సమరం గారు, లవణం గారు గొప్ప నాస్తికులు. కన్నడ దేశ నాస్తికులకి హోసూరు నరసింహయ్య గారు ఎంతో, తెలుగు నాస్తికులకి గోరా గారు అంత.
శ్రీ శ్రీ - అన్నమయ్య ఈ విషయం నాకు తెలిదు కాని..
శ్రీ శ్రీ తన కుమారుడి ఉపనయనాన్ని తిరుమలలో శాస్త్రోక్తంగా జరిపించారు అని ఇంకా డిల్లిలో కన్నడ సాహిత్య పరిషత్తు వాళ్ళు బహుమతిగా ఇచ్చిన మురళి కృష్ణుడి విగ్రహాన్ని కళ్ళకు అద్దుకున్నట్టు'మహాకవి శ్రీశ్రీ' పుస్తకం లో బూదరాజు గారు రాసారు.
pittsburgh venkateshwarudi paina kuda srisri kavita raasaru...pittsburgh gudiloni book lo untundi aa kavita
చాలా బావుంది మీ పోలిక....బాగా రాసారు
సత్యం గారు. మీరు గోరా గారి శిష్యుడు కదా. ఒకసారి సాయిబాబా భక్తుల గురించి హరి గారు వ్రాసినది చదవండి http://supportloksatta.blogspot.com/2010/05/blog-post.html
@శర్మ గారూ..
చదివానండి. తమ స్వయంశక్తి మీద నమ్మకం లేక.. జనం దేవుళ్లను.. బాబాలను, స్వాములను.. సన్యాసులను నమ్మడం వల్లే ఈ పరిస్థితి. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని మన పిచ్చిజనం అర్థం చేసుకోరు. వీలైతే.. ఇంకా కొంతమంది దేవుళ్లనూ సృష్టించి పూజలు మొదలుపెడతారు. లేదంటే.. సత్యసాయికి, బాలసాయి, చివరకు కాళేశ్వరబాబాకు, కల్కికి వేలల్లో భక్తులు ఎలా వస్తారు చెప్పండి..
మీ సొంతూరు విజయవాడా? మీరు గోరా గారి కుటుంబ సభ్యులతో ఉన్నారని చెప్పారు కదా. అందుకే డౌట్ వచ్చింది. గోరా గారు మచిలీపట్నంలో ఉద్యోగం పోయిన తరువాత ముదునూరుపాడులో, ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు.
@చెరశాల శర్మ,
విజయవాడ కాదండి.. నిజామాబాద్‌లోని వర్ని గ్రామం. లవణంగారు పెట్టిన సంస్కార్ సంస్థ మా ఊరిలోనే ఉంది. వారి స్కూల్లోనే నేను చదువుకున్నాను. హేతువాదదృక్పథం అక్కడే అలవడింది. ఇక విజయవాడతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. నాస్తికకేంద్రం పక్కనే ఉన్న ఈనాడు-ఈటీవీలో రెండేళ్లపాటు పనిచేశాను.
సమరం గారు విజయవాడ నాస్తిక కేంద్రం నిర్వాహకునిగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాస్తిక పత్రికలలో సమరం గారి గురించి చదువుతుంటాను. అందుకే గోరా, సమరం గార్ల శిష్యులంటే విజయవాడ చుట్టుపక్కల ఉంటారనుకున్నాను. చదువుకున్నవాళ్ళలో కూడా మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకతని ఫ్రెండ్ కి నరాల పటుత్వం పోయిందట, చేతబడి చెయ్యడం వల్ల పటుత్వం పోయిందని అనుమానంగా ఉందట. దీని గురించి సమరం గారికి ఉత్తరం వ్రాసాడు.