29, ఏప్రిల్ 2010, గురువారం
డాలర్ పతనం..
అసలు పేరు.. పి.శేషాద్రి. కానీ ఆ పేరు చెబితే ఎవరికీ ఆయన తెలియదు. ఆ పేరుతో ఆయన్ను గుర్తుపట్టడమూ అసాధ్యం.. కానీ.. డాలర్ శేషాద్రి అంటే మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశ విదేశాల్లోనూ ఆయన తెలుసు. అంతగా పేరు ప్రతిష్టలు సాధించుకున్నారు డాలర్ శేషాద్రి. స్వామి వారి ఉత్సవ విగ్రహాల పక్కన నిత్యం కనిపిస్తూ.. ఆయన దర్శనమిస్తారు..
డాలర్ శేషాద్రి ఇప్పుడు స్వామి వారి సేవకు దూరం కానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవీ విరమణ చేసినా.. పదవీకాలాన్ని పొడగించుకొని మరీ కొనసాగుతూ హవా చెలాయించారు శేషాద్రి. దీనిపైనే.. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలయ్యింది. 2006లో పదవీ విరమణ చేసినా.. ప్రత్యేక అధికారిగా ఎలా నియమించారంటూ.. గోపాలరెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం శేషాద్రి పదవీకాలాన్ని పొడగించాలని టీటీడీ జారీ చేసిన ఉత్తర్వులను సెప్టెంబర్ 2009లోనే సస్పెండ్ చేసింది. అయితే.. దీనీపై సుప్రీంకు వెళ్లి మరీ స్టే తొలగించుకున్నారు శేషాద్రి.
అయితే.. ఇప్పుడు తాజాగా ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. శేషాద్రిని విధులకు దూరంగా ఉంచాలంటూ టీటీడీని ఆదేశించింది. దీంతో.. కోర్టు ఉత్తర్వుల మేరకు.. శేషాద్రిని శ్రీవారి సేవలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకూ.. టీటీడీ విధుల నుంచి శేషాద్రి తప్పుకోవాల్సి ఉంటుంది.
స్వామి వారి సేవలో తరిచడం డాలర్ శేషాద్రికి అందిన వరం. నియమనిబంధనలు.. అధికారిక హోదాలు.. ఆలయ పద్దతులు ఇవేవీ ఆయనకు అడ్డురావు. కనీసం శేషాద్రికి అడ్డుచెప్పేవారు కూడా తిరుమలలో ఎక్కడా కనిపించరు. శ్రీవారి ప్రధార అర్చకులు ఎవరన్నది తెలియకపోవచ్చు కానీ.. శేషాద్రి మాత్రం వెంకన్న స్వామి భక్తులకు బాగా తెలుసు..
ఏ ఉత్సవం జరిగినా హడావిడి అంతా శేషాద్రిదే. స్వామి వారి ఉత్సవవిగ్రహాలకు ముందుండి నడిచినా.. పవళింపు సేవలో పాల్గొన్నా.. పవిత్రస్నానాలు చేయించినా... డాలర్ శేషాద్రి మాత్రం తప్పనిసరిగా ఉంటారు. అందరిదృష్టిలోనూ పడతారు. శ్రీవారి హారతులను పడుతూ సందడి చేస్తారు.. అవసరమైతే అర్చకుల చేతుల్లోంచి లాక్కుని మరీ భక్తులకు హారతి ఇస్తారు..
ఇక, వీఐపీలెవరైనా స్వామివారి దర్శనానికి వచ్చారంటే.. ముందుగా దర్శనమిచ్చేది.. డాలర్ శేషాద్రే. తనకు సంబంధం లేకపోయినా.. వీఐపీలకు రాచమర్యాదలు చేస్తూ.. గర్భగుడిలోకి తీసుకెళ్లడంలో ఆయన్ను మించిన వారు తిరుమలలో మరొకరు కనిపించరు.
ఏడుకొండలవాడికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా.. డాలర్ శేషాద్రి ఎందుకు కనిపిస్తారు..? ఆయనేమైనా స్వామివారి ప్రధాన అర్చకులా?
కానే కాదు.. మూలవిరాట్టునుంచి.. ఉత్సవ విగ్రహాల వరకూ జరిగే పూజలు,పునస్కారాల్లో డాలర్ శేషాద్రి అవసరమే లేదు. అర్చకత్వంతో సంబంధంలేని సాధారణ ఉద్యోగి. దాదాపు 34 సంవత్సరాలుగా టీటీడీలో శేషాద్రి విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీలో సాధారణ క్లర్క్‌గా శేషాద్రి జీవితం ప్రారంభమయ్యింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. అంచెలంచెలుగా ఎదిగిన శేషాద్రి ఆలయ పారుపత్తేదారుగా చాలాకాలం పనిచేశారు. శ్రీవారి నగలకు సంబంధించిన బొక్కసమూ.. ఈయన అధీనంలోనే ఉండేది. అంతేకాదు.. స్వామివారికి సంబంధించి ఏఏ ఆభరణాలు.. ఏఏ రోజుల్లో అలంకరించాలన్న విషయంతో పాటు.. ఉత్సవ విగ్రహాలకు అలంకరించే ఆభరణాల వివరాలూ.. శేషాద్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నది తిరుమల వినిపించే మాట. అందుకే కాబోలు.. ఆయన హడావిడి.. ప్రతీ ఉత్సవంలోనూ కొట్టొట్టినట్లు కనిపిస్తుంది.
విరమణ చేసినా వీడని బంధం
ఉద్యోగిగా రిటైర్ అయినప్పటికీ.. టీటీడీ మాత్రం 2006 నుంచి అతని పదవీకాలాన్ని పొడిగిస్తూనే ఉంది. టీటీడీ పాలకమండలితోనూ, ప్రభుత్వ పెద్దలతోనూ ఉన్న సన్నిహిత సంబంధాలే.. శేషాద్రిని ఉద్యోగంలో కొనసాగేలా చేశాయనీ చెప్పొచ్చు. తన పలుకుబడితో ఆలయంలో కొనసాగుతూనే ఉన్నారు శేషాద్రి.
పి. శేషాద్రి కాస్తా డాలర్ శేషాద్రిగా మారడం వెనుక ఎంతో పెద్ద హిస్టరీ ఉంది. శ్రీవారికి కానుకలుగా వచ్చే బంగారాన్ని కరిగించి.. దాన్ని డాలర్లుగా మార్చి అమ్మాలన్న ప్రతిపాదనను శేషాద్రి చేసిందే అంటారు. శ్రీవారి బొక్కసానికి ఇంఛార్జిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారమంతా జరిగింది. డాలర్ల తయారీ, అమ్మకాలు ఆయనే పర్యవేక్షించేవారు. అప్పటినుంచి ఆయన పేరు కాస్తా డాలర్ శేషాద్రిగా మారిపోయింది. దీనికి నిదర్శనంగా... ఆయన మెడలో ఎప్పుడూ ఓ డాలర్ ఉంటుంది..
అయితే... 2006లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం టీటీడీపై మాయని మచ్చగా మిగిలిపోయింది. దాదాపు 305 డాలర్లు మాయమయ్యాయన్న విషయం.. తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు.. శేషాద్రి తో పాటు మరో నలుగురు ఉద్యోగులనూ సస్పెండ్ చేసింది. విచారణకూ ఆదేశించింది. అయితే.. ఈ విచారణంతా.. ఓ డ్రామా అని కొంతకాలానికే తేలిపోయింది. కిందిస్థాయి ఉద్యోగులను బలిచేస్తూ... పై స్థాయిలో ఉన్న శేషాద్రికి క్లీన్ చిట్ ఇవ్వడంపై తీవ్ర నిరసనలే వెల్లువెత్తాయి. లైన్ క్లియర్ కాగానే మళ్లీ విధుల్లో చేరిపోయారు శేషాద్రి.
శేషాద్రిపై ఆరోపణలు పక్కన పెడితే.. తన శాఖలోనే జరిగిన అవినీతిని అడ్డుకట్ట వేయలేని వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించటం వెనుక మతలబు ఏమిటి? శ్రీవారి భాండాగారానికి సంబంధించిన రెండు తాళాలూ డాలర్ శేషాద్రి దగ్గరే ఉండటం అన్నింటికంటే మరో విచిత్రం. మామూలుగా ఏ చిన్న బ్యాంకులోనైనా స్ట్రాంగ్‌రూమ్ తాళాల్లో ఒకటి క్యాషియర్ దగ్గర, మరొకటి మేనేజర్ దగ్గర ఉంటాయి.. కానీ, తిరుమలలో డాలర్ శేషాద్రే శ్రీవారికి సర్వ రక్షకుడు... ఆయన చెప్పిందే వేదం... ఉన్న బంగారాన్ని కరిగించి భక్తులకు విక్రయించటానికి పూనుకోవటంలోనూ ఆయన పాత్ర ప్రశ్నార్థకమైంది. డాలర్ స్కాంకు అదే మూలం... అన్ని నిబంధనలకు అతీతంగా వెల కట్టలేని విలువైన నగల రక్షణ భారం ఒక్కరి చేతులో ఎలా పెట్టారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. కానీ, కొంతకాలం క్రితం మాత్రం.. మీడియా ముందుకు వచ్చి తనకే పాపమూ తెలియదన్నారు శేషాద్రి. 2006 నుంచి తన దగ్గర రెండు తాళాలు లేవంటున్నారు. కానీ, డాలర్ల స్కాంపై విచారణ తరువాత అధికారులు సమర్పించిన నివేదిక విస్పష్టంగా ఆయన దగ్గరే రెండు తాళాలు ఉన్నాయని పేర్కొంది. ఆయన నిజాయితీపరుడే అయితే, నిబద్దతే కలిగి ఉంటే.. విలువలకు కట్టుబడి ఉండేవాడే అయితే రెండు తాళాలు ఎందుకు తన దగ్గరే ఉంచుకున్నారు?
ఓ రకంగా శేషాద్రి పోస్టు ఇప్పుడు కాంట్రాక్టు పద్దతిలో ఉంది. టీటీడీ పర్మినెంట్ ఉద్యోగి అయితే.. ఏ అవకతవకలు జరిగినా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉన్న ఉద్యోగిపై ఏ రకంగా చర్యలు తీసుకుంటారు.. ఇదే ప్రశ్నను ఉద్యోగ సంఘాలు వేస్తున్నాయి.
ఇందుకలడందు లేదన్న సందేహమ్ము వలదంటూ.. శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తూ ప్రహ్లాదుడు చెప్పాడు కానీ.. అది డాలర్ శేషాద్రికి అతికినట్లు సరిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రికి ఉన్న పలుకుబడే వేరు. అవసరం అనుకుంటే ఏ విభాగంలో అయినా.. ఆయన జోక్యం చేసుకోగలరు. ఎక్కడైనా ప్రత్యక్షం కాగలరు. ఏ పనైనా చేయగలరు..
నిబంధనలకు విరుద్ధంగా శేషాద్రి పదవీకాలాన్ని నాలుగేళ్లపాటు ఎందుకు పొడిగించాల్సి వచ్చిందన్నదానికి టీటీడీ నుంచి సమాధానమే లేదు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పదవిని సృష్టించి.. శేషాద్రి సేవలను వాడుకోవాల్సిన అవసరమూ అంతుబట్టదు. అంతేకాదు.. ఇటీవల చినజీయర్ స్వామి పదవి కోసమూ డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రయత్నించారన్న వార్తలు వెలువడ్డాయి. వై ఆకారంలో ఉండే నామాన్ని ధరించే తెంగళై వర్గానికి చెందినవారే ఆ పదవికి అర్హులని నియమాలు చెబుతున్నా... వడగళై వర్గానికి చెందిన శేషాద్రి కూడా పోటీపడ్డట్లు తెలుస్తోంది. టీటీడీలో ప్రస్తుతం ఉన్న పోస్టులో కొనసాగడానికి చట్టబద్ధమైన అడ్డంకులు ఉండడంతో.. చిన్నజీయర్ పదవి కోసం పోటీపడ్డారు. అదే దక్కిఉంటే.. మరింత క్రియాశీలకంగా వ్యవహరించవచ్చని ఆయన భావించినట్లున్నారు.
అర్చకేతర అధికారెవరైనా టీటీడీలో.. శేషాద్రిలా వ్యవహరించగలరా.. వీఐపీలను ఆహ్వానించి గర్భగుడిలోకి తీసుకెళ్లగలరా.. ప్రభుత్వాధినేతలకూ స్వాగతం పలకడంలో ముందుండగలరా?.. మరెవరూ ఆపని చేయలేరు. ఎందుకంటే నిబంధనలు అడ్డుగా వస్తాయి. కానీ శేషాద్రి స్టైలే వేరు. ఇప్పుడు హైకోర్టు జోక్యంతో దానికి బ్రేక్ పడింది. శేషాద్రికి వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు రావడంతో.. చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో రోజురోజుకూ భ్రష్టుపట్టుకుపోతున్న టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పైగా పదవీకాలం అయిపోయినా.. దాదాపు 30కి పైగా ఉద్యోగులు ఇప్పటికీ విధుల్లో కొనసాగడాన్నీ ఆక్షేపిస్తున్నారు. వీరందరినీ సాగనంపితే తప్ప.. ఆలయ నిర్వహణ సరైన దారిలో నడవకపోవచ్చు. శేషాద్రి వ్యవహారంలో హైకోర్టు మొట్టికాయలతో నైనా టీటీడీ మేలుకొంటుందో లేదో చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి