11, మార్చి 2010, గురువారం
బాలయ్య మంత్రాంగం..
అన్నగారి కుటుంబం ఏకమవుతోందా...? చూస్తుంటే...అదే జరుగుతన్నట్టుంది. బుధవారం జరిగిన పరిణామం ...ఆ సంకేతాల్నే ఇస్తోంది. పెద్ద ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతీ....ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణను కలవడం .... హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ....ఓ అమ్మా, ఓ కొడుకు ...ఏం మాట్లాడుకున్నారు.
ఎన్టీఆర్ మరణించిన 14 ఏళ్ళ తర్వాత ఆయన కుమారుడు, ప్రముఖ సినీ హీరో అయిన నందమూరి బాలకృష్ణ స్వయంగా లక్ష్మీపార్వతి నివాసానికి వచ్చి దాదాపు గంటసేపు గడపారు.
లక్ష్మీపార్వతి మాట
''నా కొడుకు బాలయ్య స్వయంగా వచ్చి ఎలా ఉన్నారమ్మా అని పలకరించి యోగక్షేమాలు అడగడం మరచిపోలేకపోతున్నా. ఇళ్ళంతా కలియతిరిగి, వాళ్ళ నాన్నకు సంబంధించిన ప్రతీ జ్ఞాపకాన్ని గుర్తుకుతెచ్చుకుని తన పితృప్రేమను చాటుకున్నారు. జీవితంలో ఇదొక మరిచిపోలేని రోజు. కొన్ని సందర్భాలలో మేము ముఖాముఖి తారసపడినప్పుడు పొడిపొడి పలకరింపులు తప్ప ఇంత ఆత్మీయంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. మా బాలయ్య విజ్ఞుడు, సౌమ్యుడు. మావారి కుటుంబంలో బాలయ్య అంటే నాకు ప్రత్యేకమైన ఆప్యాయతానురాగాలున్నాయి.
త్వరలోనే మేమంతా ఎన్టీఆర్ పేరిట ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఆ విషయాలన్నింటిని అందరం కలిసే మీడియాకు వెల్లడిస్తాం.'' అంటూ లక్ష్మీపార్వతి ఉద్వేగంతో చెప్పారు.బాలకృష్ణ కూతుర్లు తేజు, బ్రాహ్మీణీలు చిన్నప్పుడు తన భుజాలపైకి ఎక్కి ఆడుకునేవారని, ఊహించని కొన్ని పరిస్థితుల వల్ల మేము కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ ఓ మంచి కార్యక్రమంతో మా అనుబంధాన్ని పెంచుకోబోతున్నామని లక్ష్మీపార్వతి తెలిపారు. బాలకృష్ణ తన ఇంట్లో ఉన్నంతసేపు కుటుంబానికి సంగతులే మాట్లాడుకున్నామని, ఎలాంటి వివాదాస్పద విషయాలు మా మధ్య చర్చకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. బాలకృష్ణ కుటుంబాన్ని ఉగాదికి ఇంటికి రమ్మని ఆహ్వానించానని, అలాగే ఆయన కూడా తనను వారింటికి రమ్మని పిలిచారని చెప్పారు. చంద్రబాబునాయుడు కూడా మా కుటుంబ సభ్యుడేనని, మేమంతా కలసి ఓ మంచి కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తామని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
బాలయ్య మాట
చాలా రోజులుగా అమ్మను కలసి మాట్లాడాలనుకుంటున్నానని, సమయం చిక్కకపోవడం వలన రాలేకపోయానని బాలకృష్ణ తెలిపారు. నా రాకలో ఎలాంటి మర్మం లేదని, ఈ విషయంపై పెద్దగా రాద్ధాంతం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మ యోగక్షేమాలు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉందని, ఈ కలయిక మరిన్ని మంచి మార్పులకు దారి తీస్తుందని, మా కుటుంబాల మధ్య రాకపోకలు కూడా పెరుగుతాయని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే చర్యలను తీవ్రస్థాయిలో చేస్తున్న చంద్రబాబునాయుడు తెలుగుమహిళ స్థానాన్ని ఎవరికివ్వాలోనని ఆలోచిస్తున్న సమయంలో బాలకృష్ణ - లక్ష్మీపార్వతిల పలకరింపులు గుసగుసలకు శ్రీకారం చుట్టాయి. తెలుగుమహిళ అధ్యక్ష పదవినుంచి రోజా తప్పుకున్న తర్వాత ఆ స్థానం అలాగే ఉంది. తెలుగుమహిళ అధ్యక్ష పదవిని దేవరకద్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యురాలు సీతా దయాకరరెడ్డికి అప్పగించినప్పటికీ ఆమె తిరస్కరించారు. ఈ విషయం బుధవారం నాటి పత్రికలలో స్పష్టంగా ప్రచురితమైన నేపధ్యంలో బాలకృష్ణ-లక్ష్మీపార్వతిల ముచ్చట్లు చర్చనీయాంశ మయ్యాయి. తెలుగుమహిళ అధ్యక్ష పదవిని లక్ష్మీపార్వతికి కట్టబెట్టడం ద్వారా అన్ని రకాలుగా లబ్ధిపొందాలనే యోచనలో చంద్రబాబు వ్యూహం రచించినట్టు రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.కానీ, లక్ష్మీపార్వతిని అనవసరంగా అందలం ఎక్కించే ప్రయత్నం మాత్రం చంద్రబాబు చేయకపోవచ్చు. ఎందుకంటే.. లక్ష్మీపార్వతి పొలిటికల్ ఇమేజ్ గానీ, ఆమె చెబితే.. కనీసం వెయ్యి ఓట్లు పడతాయన్న గ్యారెంటీ గానీ లేకపోవడమే. పైగా.. మహిళా అధ్యక్ష పదవి చేపడితే.. మళ్లీ పార్టీలో కుట్రలు కుతంత్రాలు పెరిగిపోవచ్చు.
మరి బాలయ్య ఎందుకు కలిసినట్లు?
గత కొన్నేళ్ళుగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు, లక్ష్మీపార్వతికి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. లక్ష్మీపార్వతి నివాసానికి సమీపంలోనే ఉన్న ఎన్టీఆర్ మ్యూజియంపై ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన రామకృష్ణ ఆమెపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, అందుకు ప్రతిగా లక్ష్మీపార్వతి కూడా తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదే విధంగా ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న నివాసం కూడా ఎన్టీఆర్ చిన్నకూతురు పేరిట ఉందనే వాదనలు కొన్ని సందర్భాలలో వినిపించాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎన్టీఆర్ కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచి, ఎన్నికల సందర్భంలో ఆయనను ప్రచారానికి రప్పించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన తాత కుటుంబసభ్యులందరితో మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. తాజాగా లక్ష్మీపార్వతి యోగక్షేమాల పేరిట ఆమె ఇంట అడుగుపెట్టిన బాలకృష్ణ కోర్టులో ఉన్న ఆస్తుల వివాదాల గురించి మాట్లాడారా? లేక జూనియర్ ఎన్టీఆర్ వలనే ఆమెను కూడా తమ కుటుంబంలో కలుపుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఏదైమైనా ఎంతో పెద్ద మంత్రాంగం లేకపోతే.. బాలయ్య.. పినతల్లి ఇంట్లో కాలుపెడ్డడన్న విషయం అందరికీ తెలిసిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
balayya do right thing. babu is dangerous. లక్షిం పార్వతి meet with balayya is good.
indulo edo pedda mathalabu undi vuntundi