24, ఫిబ్రవరి 2010, బుధవారం
మాయల మమత...
రైల్వే మాజీమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కన్నా రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు ప్రస్తుతం రైల్వే మంత్రి మమతా బెనర్జీ. దేశం మొత్తానికి ప్రాధాన్యం ఇస్తున్నాని చెబుతూనే.. అందరినీ నమ్మిస్తూనే.. పశ్చిమ బెంగాల్‌కే కేటాయింపులు ఎక్కువ చేసుకున్నారు. చివరకు.. మన రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తున్నట్లు అనిపించేలా మాయ చేశారు.. మమత బడ్జెట్‌ను పరిశిలిస్తే మన రాష్ట్రానికి దక్కింది ఇదే..
కొన్ని వరాలు
రైల్వే బడ్జెట్‌లో ఈసారి కొన్ని ఊహించని వరాలు రాష్ట్రంపై మమత కురిపించింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్న ఐదు స్పోర్ట్స్ అకాడమీల్లో సికింద్రాబాద్ కూడా ఒకటి. అంతేకాదు.. దేశంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మరో ఐదు వ్యాగన్ ఫ్యాక్టర్టీల్లో ఒకటి మన సికింద్రాబాద్‌లో ఏర్పాటు కానుంది. దీనివల్ల.. వేలాది మందికి ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను ఉపాధి లభించే అవకాశం ఉంది.
పాత సర్వేలు - కొత్త ప్రతిపాదనలు
గత బడ్జెట్‌తో పోల్చితే.. ఈసారి మనకు కాస్త ఎక్కువగానే ప్రాధాన్యం లభించినట్లు కనిపిస్తున్నా వాస్తవం మాత్రం వేరు. ఇప్పటికే పూర్తైన సర్వేలకు మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ మమత.. ఈ బడ్జెట్‌లో ఆదేశించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన పెద్ద లిస్టే ఉంది.
భద్రాచలం - కొవ్వూరు, భద్రాచలం- విశాఖపట్నం, కృష్ణ-వికారాబాద్, నిజామాబాద్-రామగుండం, పాండురంగాపురం-భద్రాచలం, మంత్రాలయం రోడ్ - కర్నూలు, పటాన్‌చెరు-ఆదిలాబాద్, హైదరాబాద్-గజ్వేల్-సిద్దిపేట-సిరిసిల్ల-జగిత్యాల, జగ్గయ్యపేట-మిర్యాలగూడ, కాచిగూడ-చిట్యాల, జహీరాబాద్-సికింద్రాబాద్ లైన్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసిన తర్వాత.. ప్లానింగ్ కమిషన్‌కు సమర్పిస్తారు. ప్రణాళికసంఘం ఆమోదిస్తే తప్ప ఈ లైన్ల నిర్మాణం సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ లైన్లలో ఇప్పటికిప్పుడు పనులు మొదలుకావన్నమాటే.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. కొత్తగా సర్వే చేయడానికి రాష్ట్రంలోని కొన్ని మార్గాలను రైల్వేమంత్రిత్వ శాఖ ఎంచుకొంది. .. గిద్దలూరు-బక్రాపేట్, బాపట్ల-నిజాంపట్నం-రేపల్లె, మేళ్లచెరువు-జాన్‌పహడ్, పగిడిపల్లి-శంకర్‌పల్లి, విజయనగరం-పలాస వయా రాజాం, నంగ్లి-చిత్తూరు, గడ్‌చందూరు-ఆదిలాబాద్, బోధన్-బీదర్ రూట్లలో సర్వే జరుపుతామని మమతాబెనర్జీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గుంటూరు- గుంతకల్ మధ్య.. డబ్లింగ్ సర్వేకు బడ్జెట్‌లో ఆమోదం తెలిపారు. ఇక 2010-11 నాటికల్లా పనులు పూర్తి చేసే లిస్టులో.. మన రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు కొన్నింటిని చేర్చారు. జగిత్యాల-పెద్దపల్లి-నిజామాబాద్, గద్వాల-రాయిచూర్, నోస్సామ్-బనగానపల్లి-ఎర్లగుంట్ల, జన్‌పహాడ్-విష్ణుపురం ప్రాజెక్టులను ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక ఈ బడ్జెట్‌లో చేపట్టే కొత్త మార్గాల్లో.. మన రాష్ట్రం నుంచి ఒకే ఒక్క రూట్‌కు స్థానం దక్కింది. భద్రాచలం రోడ్- సత్తుపల్లి మధ్య రైల్వే లైన్‌ను ఈ బడ్జెట్‌లో పొందుపరిచారు. మంచిర్యాల-పెద్దంపేట లైన్ డబ్లింగ్ పనులను ఈ బడ్జెట్‌లో పూర్తి చేస్తామని మమత ప్రకటించారు. కాస్ట్ షేరింగ్ పద్దతిలో కోటిపల్లి-నర్సాపూర్ లైన్‌ను నిర్మించడానికి ఎట్టకేలకు అంగీకరించారు.
ముందుగానే సిద్దమైనా...
గత బడ్జెట్అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచీ రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెచ్చింది. ప్రతిపాదనలను ఎప్పుడో పంపించింది. కొన్ని ప్రాజెక్టుల్లో వ్యయాన్ని పంచుకుంటామని.. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా లేఖ కూడా రాశారు. ఇంత కసరత్తు చేసినా.. చివరి బడ్జెట్‌కు వచ్చే సరికి మాత్రం.. అంతా శూన్యమే. ఎప్పటిలానే.. విదిలింపు. మన రాష్ట్రానికి దక్కిన కొత్త రైళ్లు వాస్తవానికి మూడు ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు ప్యాసింజర్లు మాత్రమే. పది దురంతో ట్రైన్లను ఈ సారి ప్రవేశపెడుతున్నా.. మన దగ్గర నుంచి ఒక్కటీ ప్రారంభం కావడం లేదు. ఈ బడ్జెట్‌లో 54 కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ప్రవేశపెడుతుండగా.. వీటిలో హైదరాబాద్ -అజ్మీర్ బైవీక్లీ ట్రైన్, మదనపల్లి మీదుగా వెళ్లే సికింద్రాబాద్-తిరుపతి బై వీక్లీ ట్రైన్ మాత్రమే దక్కాయి. రాయలసీమ, హరిప్రియ రైళ్లను రద్దు చేస్తూ.. వాటి స్థానంలో హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మినస్, తిరుపతి-ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మినస్ మధ్య సర్వీసులను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ - మణుగూరు మధ్య వారానికి మూడు సార్లు తిరిగేలా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు మమత అంగీకరించారు.
ఏడుకొండలవాడి సేవలో...
ప్రముఖ పర్యాటక కేంద్రం తిరుపతికి మాత్రం రైల్ కనెక్టివిటీని పెంచడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, మధురై-తిరుపతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కొత్తగా అందుబాటులో ఉంటాయి. ప్యాసింజర్ రైళ్ల విషయానికి వస్తే.. తిరుపతి-మదనపల్లి రోడ్ వరకూ ప్యాసెంజర్‌ను ఇచ్చారు. అయితే.. గేజ్ మార్పిడి తర్వాతే అంటూ మెలిక పెట్టారు. అంటే.. ఇప్పట్లో ఈ సర్వీసు అందుబాటులో ఉండదన్నమాట. తిరుపతి-నెల్లూరు-చెన్నై మధ్య, విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెము సర్వీసులు నడుపుతారు. కాచిగూడ-మహబూబ్‌నగర్, కాచిగూడ-మిర్యాలగుడ మధ్య డెము సర్వీసులు ఏర్పాటు చేస్తారు.
సర్వీసుల పొడగింపు
విశాఖ -నిజాముద్దీన్‌ల మధ్య వారానికి మూడు రోజులు నడిచే సమతా ఎక్స్‌ప్రెస్ ఇకపై ఐదురోజులు నడుస్తుంది. సికింద్రాబాద్-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్. కాకినాడ-మన్మాడ్‌ల మధ్య నడిచే రెండు రైళ్లు, విజయవాడ-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌లను .. షిర్డీ వరకూ పొడిగించారు. కాచిగూడ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను అకోలా వరకు, పార్లి-నిజామాబాద్ ప్యాసెంజర్‌ను పండరీపూర్ వరకూ పొడిగించారు. మహిళల ప్రత్యేక రైళ్లను ఇకపై మాతృభూమి స్పెషల్స్‌గా వ్యవహరిస్తామన్న మమతా బెనర్జీ.. లింగంపల్లి-ఫలక్‌నుమాల మధ్య.. ఓ ట్రైన్‌ను శాంక్షన్ చేశారు.
మనం అడిగిందేమిటి? మమత ఇచ్చిందేమిటి?
రాష్ట్రంలో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి.. రైల్వేమంత్రి మమతాబెనర్జీకి పంపించింది. ఎం.ఎం.టి.ఎస్ రెండోదశను ప్రారంభించాలని.. ప్రాజెక్టు అయ్యే ఖర్చులో మూడింట రెండొంతులు భరిస్తామని కూడా ఇందులో హామీ ఇచ్చింది. అయినా.. మమతకు MMTS పై దయ రాలేదు. అటు ముంబైకి 101 సబర్బన్ ట్రైన్లను, చెన్నై, కోల్‌కతాల్లో కొత్త సబర్బన్ రైళ్లను కరుణించిన దీదీ.. మన డిమాండ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రైల్వే బడ్జెట్‌లో అసలు ఎం.ఎం.టి.ఎస్ ప్రస్తావనే లేదు.
ఇక కచ్చితంగా కావాలంటూ అడిగిన డెమూ, మెమూ సర్వీసులకు మాత్రం రైల్వే మంత్రి పూర్తిగా ఆమోదముద్ర వేశారు. సికింద్రాబాద్- బెంగుళూరు, సికింద్రబాద్-ముంబై, సికింద్రాబాద్-ఆదిలాబాద్, సికింద్రాబాద్-అహ్మదాబాద్ వయా నిజామాబాద్, సికింద్రాబాద్-గోవా, విశాఖ-తిరుపతి, గుంటూరు-చెన్నై మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్లు, పుట్టపర్తి నుంచి షిర్డీ, హైదారాబాద్ నుంచి పూణే, విశాఖ-చెన్నై మధ్య ఓవర్‌నైట్ ఎక్స్‌ప్రెస్‌లు అడిగినప్పటికీ.. ఒక్కదాన్నీ మంజూరు చేయలేదు.
రాష్ట్రంలో నత్త నడకన సాగుతున్న 12 ప్రాజెక్టుల వివరాలను రైల్వేశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ బడ్జెట్‌లో అన్నింటికీ నిధులు మంజూరవుతాయని భావించారు. కానీ.. ఐదింటిని మాత్రమే ఈ బడ్జెట్‌లో పూర్తి చేయడానికి మమత అంగీకరించారు. ఎప్పటినుంచో మూలుగుతున్న మాచర్ల-నల్గొండ, కాకినాడ-పిఠాపురం,మునీరాబాద్-మహబూబ్‌నగర్ లైన్ల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం-కొవ్వూరు, మణుగూరు-రామగుండం మధ్య కొత్త లైన్లను మంజూరు చేయాలని కోరితే.. వీటిలో భద్రాచలం-కొవ్వూరు రూట్‌లో కొత్తగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని మాత్రమే మమత ఆదేశించారు. మిగిలిన రూట్లను పట్టించుకున్న పాపాన కూడా పోలేదు.
ఎలక్ట్రిఫికేషన్ విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయమే. విజయవాడ-నిడదవోలు మధ్య ఎలక్ట్రిఫికేషన్ చేయాలని రోశయ్య సర్కార్ కోరితే.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే బడ్జెట్‌లో పేర్కొన్నారు. సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య ఎలక్ట్రిఫికేషన్ పరిస్థితి కూడా ఇంతే. ఇలా ఎన్నో ఉన్నాయని కనిపించినా.. మనకు దక్కింది నామ మాత్రమే. అదే మమత మాయ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పాతవాల్లతో పోలిస్తే కొంచెం నయమే మమత. అయినా ఇక్కడ ఒకరితో ఒకరు కొట్టుక సస్తాఉంటే కేంద్రంలో ఎవ్వలు పట్టించుకుంటారు? ఊరికే ఊకదంపుడు విమర్శలు చేయటం వృధా.